‘‘రాయలసీమ కరువు నివారణ కోసం పలు ప్రాజెక్టులు చేపడితే ఎలా వివాదాస్పదం చేస్తున్నారో మీకు తెలుసు. మన యుద్ధం ఒక్క తెలుగుదేశం, చంద్రబాబుతో మాత్రమే కాదు.. ఒక ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం. ఒక టీవీ–5తో యుద్ధం చేస్తున్నాం, ఒక ఏబీఎన్‌తో చేస్తున్నాం. ఒక చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం’’
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. కరువు ప్రాంతం రాయలసీమకు నీటిని సరఫరా చేస్తామంటే వివాదాస్పదం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో మనం కూడా 800 అడుగుల నుంచే 3 టీఎంసీలను తీసుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నామని, రూ.27 వేల కోట్ల వ్యయంతో ఈ ఏడాదే టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఇరు రాష్ట్రాలు తమ వాటా ప్రకారమే నీటిని వాడుకుంటాయని, తద్వారా రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందన్నారు.
రాయలసీమ ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తున్నారని, పోతిరెడ్డిపాడుపై అనవసరంగా రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణతో సమానంగా శ్రీశైలం నుంచి నీరు తీసుకుంటామని, దీనివల్ల ఇద్దరికీ సమన్యాయం జరుగుతుందని, ఎవరికీ అన్యాయం జరగదని సీఎం స్పష్టం చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మిగతా ప్యాకేజీలకు ఈ ఏడాదే టెండర్లు పిలుస్తామని తెలిపారు. ‘మన పాలన– మీ సూచన’లో వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో మేధోమథన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాగునీటి గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ..మంగళవారం క్యాంపు కార్యాలయంలో అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఆర్థిక సాయం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదిస్తున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు
రూ.వెయ్యి కోట్లకుపైగా ప్రజాధనం ఆదా..
వ్యవసాయం బతకాలంటే నీటి అవసరాలు తీరాలి. అందుకోసం ప్రాజెక్టులు పూర్తి కావాలి. ప్రాజెక్టుల్లో అవినీతిని పూర్తిగా తొలగించి సరైన మార్గంలో పెట్టేందుకు సంవత్సరం పట్టింది. జలవనరుల శాఖలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.1,095 కోట్లు ఆదా చేశాం. దీన్ని పట్టించుకోకుంటే నాయకుల జేబుల్లోకి వెళ్లిపోయేది. ఇకపై యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తవుతాయి.
ఈ ఏడాదే వీటిని ప్రారంభిస్తాం..
వంశధార ఫేజ్ –2, వంశధార–నాగావళి అనుసంధానం పూర్తిచేయాలి, వెలిగొండ టన్నెల్–1, నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తిచేయాలి. అవుకు టన్నెల్ కూడా పూర్తి కావాలి. ఈ ఏడాది వీటిని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. పూర్తిచేసి జాతికి అంకితం కూడా చేస్తాం. కోవిడ్ వల్ల పోలవరం పనులు కాస్త నెమ్మదించాయి. కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లారు. అయినా సరే వేగవంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. పోలవరాన్ని 2021 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక పనులు పరుగులెత్తిస్తాం.
నిండేదెప్పుడు?... కరువు తీరేదెన్నడు?
ఇవాళ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు రాని పరిస్థితి నెలకొంది. కారణం.. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 881 అడుగులు ఉండాలి. అప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకోగలం. నీటి మట్టం 854 అడుగులకు పడిపోతే 7 వేల క్యూసెక్కులను మాత్రమే తరలించగలిగే పరిస్థితి మన కళ్ల ముందే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాయలసీమ ప్రాజెక్టులు ఎప్పుడు నిండుతాయి? కరువు ఎప్పుడు తీరుతుంది? మరోవైపు కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతూ పోతోంది. అటూ ఇటూ ప్రాజెక్టులు కడుతున్నారు. మన దగ్గర వరద కేవలం 10 నుంచి 12 రోజులు మాత్రమే ఉంటుంది. మరి అలాంటప్పుడు మన ప్రాజెక్టులు ఎప్పుడు నిండాలి?’ పక్కన తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు వారికి 800 అడుగుల్లోనే ఉన్నాయి.
కాబట్టి దీనికి పరిష్కారం..
శ్రీశైలం నుంచి తెలంగాణ 800 అడుగుల ఎత్తులోనే నీరు డ్రా చేస్తోంది. మనం కూడా అదే ప్లాట్‌ఫామ్ మీద పంపులు పెట్టి, 3 టీఎంసీలు డ్రా చేసుకోవచ్చు. ఆ విధంగా వారు 800 అడుగుల్లో, మనమూ 800 అడుగుల్లో ఉంటాం. ఎవరికి కేటాయించిన నీటిని వారు వినియోగించుకుంటారు. ఎవరికీ నష్టం, కష్టం ఉండదు. న్యాయం అనేది సమానంగా జరుగుతుంది.
ఈ ఏడాది కృష్ణమ్మ కరుణించడంతో..
ఈ ఏడాది రికార్డు స్థాయిలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలకు దేవుడి దయతో నీళ్లు వచ్చాయి. 12 ఏళ్ల తర్వాత కృష్ణా నదిలోకి ఇంత భారీగా నీరు వచ్చింది. రాయలసీమ ప్రాజెక్టులకు ఎప్పుడూ లేని విధంగా నీటిని పంపించగలిగాం. 45.77 టీఎంసీల గరిష్టస్థాయిలో పులిచింతలను నింపాం. సోమశిలలో కూడా 78 టీఎంసీలతో గరిష్టస్థాయిలో నింపాం. కండలేరులో 59.75 టీఎంసీల నీరు నింపగలిగాం.
రాష్ట్రం సుభిక్షం
► రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ కింద రూ.27 వేల కోట్లతో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పోలవరం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం పెంచబోతున్నాం. ఆ కాలువ ప్రస్తుత సామర్థ్యం 17,500 క్యూసెక్కులు కాగా 50 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచి ప్రకాశం బ్యారేజీ వరకు నీటిని తీసుకొస్తే చాలా ప్రాంతాలకు నీరు అందుతుంది. ఎందుకంటే అక్కడ అవసరాలు 25 వేల క్యూసెక్కులే కాబట్టి మిగిలిన నీటిని రాయలసీమకు తరలించవచ్చు. రాష్ట్రం అన్ని విధాలా బాగు పడుతుంది. ఆ విధంగా రైతులకు తోడుగా ఉంటాం. ఆ టెండర్లు కూడా పిలుస్తాం.
► ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వ్యయం రూ.17 వేల కోట్లు. ఈ ఏడాది కొన్ని ప్యాకేజీలకు టెండర్లు పిలుస్తాం. ఇప్పటికే ఒక ప్యాకేజీకి టెండర్లు పిలిచాం.
కష్టకాలంలో ఆదుకున్నారు
లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ రూ.5 వేలు ఇచ్చి ఆదుకున్నారు. కష్టకాలంలో ఈ డబ్బు రావడం ఎనలేని సంతోషాన్నిస్తోంది.
– మహబూబ్ తాహెర్, జామియా మసీదు మౌజన్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా
మహదానందంగా ఉంది
కరోనా కారణంగా ప్రభుత్వాదేశాలతో ఆలయాన్ని మూసేశాం. భక్తులు లేకపోవడంతో ఆదాయం లేకుండాపోయింది. ధూప, దీప నైవేద్యాలకు కూడా ఇబ్బందిగా మారింది. అయినాసరే స్వామివారికి క్రమం తప్పకుండా పూజలు నిర్వహిస్తున్నాం. 10 రోజుల క్రితం వలంటీర్ మా ఆలయానికి వచ్చి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందంటూ బ్యాంకు ఖాతా నెంబర్, ఇతర వివరాలు రాసుకెళ్లారు. నమ్మలేదు. ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వం ఎక్కడ సాయం చేస్తుందిలే అనుకున్నాం. కానీ, ఊహించని రీతిలో ఈరోజు మా ఖాతాల్లోకి రూ.5వేలు జమయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. ఆ లక్ష్మీనారాయణస్వామి ఆశీస్సులతో ఆయన మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయాలి.
– డి. సారంగపాణి అయ్యంగార్, అర్చకులు, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం, అవనిగడ్డ, కృష్ణా జిల్లా
ఏ ప్రభుత్వం ఇలా పట్టించుకోలేదు
ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం కూడా ఇలా ఇమామ్‌లు, మౌజన్‌లు, పూజారులు, పాస్టర్లకు ఆర్థిక సహాయం అందించిన దాఖలాల్లేవు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటోంది. రెండు నెలలుగా చర్చిలు, దేవాలయాలు, మసీదులు మూతపడ్డాయి, దీంతో పేద పాస్టర్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. సీఎం అందించిన ఆర్థిక సాయం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. లబ్ధి పొందిన వారంతా ఆయనకు రుణపడి ఉంటారు.
– రెవరెండ్ పిట్టా మల్లిరాజు, ప్రభువైన ఏసుక్రీస్తు సంఘం, రాజమహేంద్రవరం
జగన్‌కు అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి
వక్ఫ్‌బోర్డు ద్వారా నెలవారీ జీతాలు పొందని ఇమాం, మౌజన్‌ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజల పక్షాన నిలబడి వారిని ఆదుకుంటున్న సీఎంకు అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment