సీఎం వైఎస్‌ జగన్‌: మన లక్ష్యం ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ | YS Jagan Guides Officials to Provide Nutritional Food For Women and Children - Sakshi
Sakshi News home page

మన లక్ష్యం ఆరోగ్యాంధ్రప్రదేశ్‌

Published Thu, Oct 24 2019 4:27 AM | Last Updated on Thu, Oct 24 2019 11:06 AM

CM YS Jagan comments in the Review of Mid day meals and Nutrition - Sakshi

సాక్షి, అమరావతి : మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్‌ప్లాన్‌ ప్రాంతాల్లోని గర్భిణులు, 6 ఏళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్‌ అమృత హస్తం, వైఎస్సార్‌ బాల సంజీవని కింద గర్భవతులు, పిల్లలకు మరింత పౌష్టికాహారం అందజేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గర్భవతులు, బాలింతలకు నెలకు రూ.1062 విలువైన, 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు నెలకు రూ.600 విలువైన, 3 – 6 ఏళ్ల లోపు పిల్లలకు నెలకు రూ.560 విలువైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనత అధికంగా ఉన్న 77 గిరిజన, సబ్‌ప్లాన్‌ మండలాల్లో డిసెంబర్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఇస్తున్న గుడ్లు, పాలతో పాటు బలవర్థకమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

మధ్యాహ్నం మంచి భోజనం పెట్టండి
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో తీవ్రంగా బాధపడుతున్నారని, ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని అనేక నివేదికలు వెల్లడిస్తున్న నేపథ్యంలో మహిళా, శిశు సంక్షేమం, విద్యాశాఖల పరిధిలో అమలవుతున్న కార్యక్రమాలు, వాటిలో మార్పులపై అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమైన ముఖ్యమంత్రి.. బుధవారం మరోసారి  సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమం, విద్యా శాఖ మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, అధికారులతో  సమావేశమయ్యారు. రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్‌ప్లాన్‌ ప్రాంతాల్లో మరింత పోషక విలువలున్న ఆహారాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేశాక, మిగతా ప్రాంతాలకూ విస్తరించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.

మరోవైపు మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి.. పిల్లలు ఏం తింటున్నారన్నది గమనించి, తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయాలన్నదానిపై ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. పిల్లలకు మంచి మెనూతో భోజనం పెట్టాలని, దీనిపై అధ్యయనం చేయాలని  సూచించారు. పిల్లలకు తగిన పోషక విలువలు యాడ్‌ అయ్యేలా ఉన్న ఆహారాన్ని ఇవ్వాలన్నారు. ఇందుకోసం పోషకాహార నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలని చెప్పారు. 


– పైలట్‌ ప్రాజెక్టు అమలు కోసం శ్రీకాకుళం జిల్లాలో 1, విజయనగరంలో 7, విశాఖపట్నం 11, తూర్పుగోదావరి 11, పశ్చిమగోదావరి జిల్లాలో 6 గిరిజన మండలాలతో పాటు మొత్తం 36 మండలాలు ఎంపిక చేశారు. సబ్‌ప్లాన్‌ ఏరియాకు సంబంధించి శ్రీకాకుళంలో 19, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 4, పశ్చిమగోదావరి 3, ప్రకాశం 3, కర్నూలు 3, గుంటూరు జిల్లా నుంచి 3 మండలాలు కలిపి మొత్తం 41 మండలాలు ఎంపిక చేశారు. మొత్తంగా 77 మండలాల్లో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. 

కొత్త విధానమిది..
గర్భిణులు, బాలింతలకు నెలకు రూ.1,062 విలువైన ఆహారం లభిస్తుంది. 25 రోజుల పాటు రోజూ భోజనం, గుడ్డు, 200 మి.లీ పాలు అందిస్తారు. రూ.500 విలువ చేసే వైఎస్సార్‌ బాల సంజీవని కిట్‌ కింద మొదటి వారం 2 కేజీల మల్టీ గ్రెయిన్‌ ఆటా, రెండోవారం అరకేజీ వేరుశనగలతో చేసిన చిక్కీ, మూడోవారం అరకేజీ రాగి ఫ్లేవర్, అరకేజీ బెల్లం.. నాలుగోవారం అరకేజీ నువ్వులుండలు ఇవ్వనున్నారు. 

6 నెలల నుంచి 3 ఏళ్లలోపు 
పిల్లలకు నెలలో ప్రతిరోజూ గుడ్డు, 200 మి.లీ పాలతో పాటు వైఎస్సార్‌ బాలామృతం కిట్‌ కింద రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులు బలవర్థకమైన ఆహారం 2.5 కేజీలు ఇస్తారు. మొత్తంగా నెలకు రూ.600 విలువ చేసే పౌష్టికాహారాన్ని అందిస్తారు. 

3–6 సంవత్సరాల్లోపు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నెలకు 25 రోజులు పౌష్టికాహారం అందిస్తారు. ఇందుకు నెలకు రూ.560 ఖర్చు చేయనున్నారు.నెలలో 25 రోజులపాటు భోజనం, గుడ్డు, 200 మి.లీ పాలు, పోషకాలు ఉండే మరో అల్పాహారం ఇస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement