
సాక్షి, అమరావతి: అవినీతిపై పోరాటం చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో టెండర్ల ప్రక్రియ మొదలు తీసుకువచ్చిన అప్పుల వరకు పై స్థాయిలో ఏది చూసినా వందలు.. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇళ్ల నిర్మాణంలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అవినీతి లేకుండా ఉండి ఉంటే అవే ఇళ్లు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చేవి కావా అని ప్రశ్నించారు. బుధవారం అర్బన్ హౌసింగ్ (టిడ్కో)పై మంత్రివర్గ ఉప సంఘంతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, అయినా దేనికీ లొంగే ప్రసక్తే లేదన్నారు. ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలా? లేక అవినీతి చేసిన వారిని వదిలేయాలా? అని ప్రశ్నించారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతి రహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి గట్టిగా సహకరించాలని కోరారు. రివర్స్ టెండరింగ్ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. దీని వల్ల మిగిలే ప్రతి పైసా ప్రజలకే చెందుతుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు.
ధరలు ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి
పట్టణాల్లో అర్హులైన మిగిలిన 4 లక్షల మంది లబ్ధిదారులకు ఫ్లాట్లు కట్టించడానికి భూమిని గుర్తించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు తక్కువ ధరలో దీర్ఘకాలం నిలిచే విధంగా ఫ్లాట్లు నిర్మించాలన్న ప్రభుత్వ ఉద్దేశం మేరకు అధికారులు పనిచేయాలన్నారు. ముఖ్యంగా ఏ పని చేపట్టినా అందులో స్కాం లేకుండా చూసుకోవాలన్నారు. మార్కెట్‌లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి.. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు ఏ విధంగా ఉన్నాయి.. అనే విషయాలపై ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని ఆదేశించారు. రేట్లు ఖరారు చేసే సమయంలో నిర్మాణ రంగానికి చెందిన నిపుణులతో సంప్రదించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా అంచనాలు రూపొందించాలని చెప్పారు. ఇప్పుడున్న ఎస్‌ఎస్‌ఆర్‌లను ప్రామాణికంగా తీసుకుని అంచనాలు తయారు చేయాల్సిన అవసరం లేదని, వాస్తవ రేట్లను పరిగణనలోకి తీసుకుని రివర్స్ టెండర్లు ఖరారు చేయాలన్నారు. ప్రభుత్వం ఇసుక, స్థలం ఉచితంగా, సబ్సిడీపై సిమెంట్ సరఫరా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రేట్లు తగ్గాలన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందిస్తూ.. ఈనెఖారుకు కొత్త రేట్లు ఖరారు చేస్తామని, వచ్చేనెలాఖరులో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
1.02 లక్షల ఇళ్లకు రివర్స్ టెండరింగ్
ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో పునాదుల లోపు 65 వేల ఇళ్లు, బేస్‌మెంట్ లెవెల్‌లో 37 వేల ఇళ్లు ఉన్నాయని, వీటిన్నింటికీ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మరో 1.75 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఇవిపోగా మిగిలిన 4 లక్షల ఫ్లాట్ల కోసం భూమిని చూడాలన్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్‌కల్లాం, సలహాదారులు శామ్యూల్, సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడి కృష్ణమోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment