
సాక్షి, అమరావతి : అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక చర్య తీసుకుంది. పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14400 కాల్ సెంటర్‌ను సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ‘ఎప్పుడైనా ఎక్కడైనా అవినీతి మీ దృష్టికి వస్తే వెంటనే గళం ఎత్తండి.. 14400 నంబర్‌కు ఫోన్ చేయండి’ అనే నినాదం ఉన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నేరుగా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి, ఫిర్యాదులను స్వీకరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకునే చర్యలు, కాలవ్యవధి, తదితర విషయాల గురించి కాల్ సెంటర్ ఉద్యోగితో మాట్లాడారు. కొన్ని సూచనలు కూడా చేశారు. ఫిర్యాదు అందిన 15 రోజుల నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి దానిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బాధితుల ఫిర్యాదులపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం తగదని, కచ్చితంగా జవాబుదారీతనంతో పని చేయాలన్నారు. వ్యవస్థపై నమ్మకం కలగాలంటే కాల్‌సెంటర్‌కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతోపాటు సంబంధిత శాఖల అధికారులు కూడా వాటిని పరిష్కరించడంలో చొరవ తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీ కుమార విశ్వజిత్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్‌కుమార్‌రెడ్డి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణమూర్తి, ఏసీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అవినీతి నిర్మూలనకు పలు చర్యలు
పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. ప్రజలకు నేరుగా సత్వరమే పనులు జరిగేలా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను.. గ్రామాల్లో, పట్టణాల్లో వలంటీర్లను నియమించింది. ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసేందుకు జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇసుక అక్రమాలపై 14500 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తప్పిదాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంది. ఇసుక అక్రమాలను అరికట్టడానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని తగ్గించడానికి అధ్యయనం, సిఫార్సుల కోసం ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ సంస్థ అహ్మదాబాద్ ఐఐఎంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment