
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ పనుల్లో గత ఐదేళ్లలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సమావేశమయ్యారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ), రహదారులు, భవనాల శాఖ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు చేపట్టిన ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై విచారణ కోసం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 8 మంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ జూన్ 14న జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ జరిపి, 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీకి నిర్దేశించారు.
జలవనరుల శాఖ చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్(సీటీఈ) కన్వీనర్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీలో రిటైర్డు సీఈ అబ్దుల్ బషీర్, రిటైర్డు ఈఎన్‌సీ ఎల్.నారాయణరెడ్డి, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు పి.సూర్యప్రకాశ్, రిటైర్డు ఈఎన్‌సీ సుబ్బరాయశర్మ(రహదారులు, భవనాల శాఖ), రిటైర్డు ఈఎన్‌సీ ఎఫ్‌సీఎస్ పీటర్(రహదారులు, భవనాలశాఖ), ఏపీ జెన్‌కో రిటైర్డ్ డైరెక్టర్ ఆదిశేషు, సీడీవో రిటైర్డు సీఈ ఐఎస్‌ఎన్ రాజును సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. విచారణకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌తో అదే రోజున సమావేశమైంది. నిర్దేశిత గడువులోగా విచారణను పూర్తి చేసేందుకు నిపుణుల కమిటీ మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది.
గతంలో చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించి అంచనాలపై అధ్యయం చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్టు నిపుణుల కమిటీ సభ్యుడు సూర్యప్రకాశ్ సమావేశం అనంతరం తెలిపారు. 15 రోజుల్లో మళ్లీ కమిటీతో సీఎం జగన్ సమావేశం కానున్నారని చెప్పారు. వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ పనుల లోపాలను పరిశీలించనున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment