
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు (మెట్రో): ఎన్నో సెక్యూరిటీ ఆంక్షలు.. పూర్తి స్థాయి బందోబస్తు.. ఎటూ చూసినా పోలీసుల నిఘా కన్ను.. ఇంతటి భద్రతా వలయం మధ్య ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుండగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద శుక్రవారం రోడ్డు పక్కన ఓ కుటుంబం కాగితం పట్టుకుని నిలుచుంది. వారు సీఎం కంట పడాలని ప్రయత్నిస్తుంటే భద్రతా విభాగం సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని కాన్వాయ్‌లో వెళ్తున్న సీఎం వైఎస్ జగన్ గమనించి.. కాన్వాయ్‌ని ఆపించారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం కాస్త ముందుకెళ్లి ఆగింది.
(చదవండి :గోరుముద్ద నాణ్యతకు ప్రత్యేక యాప్)
వెంటనే కారు దిగి ఆ పేపర్ పట్టుకున్న వాళ్లను తన వద్దకు పంపాలంటూ భద్రతా సిబ్బందిని ఆదేశించారు. దీంతో వారు ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘సార్.. మాతో పాటు మా ఊళ్లో మరికొన్ని కుటుంబాలు స్థానికంగా నివాసం ఉంటున్నా, అందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింప చేయలేదు. మాకు మాత్రమే ఇచ్చినందున మేము తీసుకోలేదు. అందరికీ ఈ ప్యాకేజీ ఇచ్చేలా చూడండి. ఇటీవల వరద సమయంలో కూడా మా కుటుంబాలకు రూ.5 వేల సాయం అందలేదు’ అని పాతపైడిపాకకు చెందిన బొత్తా త్రిమూర్తులు కుటుంబం సీఎంకు విన్నవించింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజును ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని వారికి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment