శంకుస్థాపన చేసిన 4 వారాల్లోగా పనులు ప్రారంభం | CM YS Jagan Mohan Reddy Comments In Review With Officials | Sakshi
Sakshi News home page

శంకుస్థాపన చేసిన 4 వారాల్లోగా పనులు ప్రారంభం

Published Sat, Nov 23 2019 3:35 AM | Last Updated on Sat, Nov 23 2019 8:17 AM

CM YS Jagan Mohan Reddy Comments In Review With Officials - Sakshi

ముఖ్యమంత్రి ఏదైనా హామీ ఇస్తే అది ప్రభుత్వం ఇచ్చే హామీనే. మాట ఇస్తే కచ్చితంగా చేయాలి. ఇచ్చిన మాట నెరవేర్చలేదన్న మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. విశ్వసనీయతే నా బలం, దానికి భంగం కలగకూడదు. శంకుస్థాపన చేసిన నాలుగు వారాల్లోగా ఏ పనులైనా ప్రారంభం కావాలి.
– ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం తరహాలో ప్రజలను మభ్య పెట్టేందుకు పనులకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకోవడం ఇక కుదరదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లోగా పనులు ప్రారంభం కావాల్సిందేనని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి స్పష్టత ఇచ్చారు. విశ్వసనీయతే నా బలం, దానికి భంగం కలగకూడదని స్పష్టం చేశారు. నవరత్నాలే ప్రభుత్వ ప్రాధాన్యం అని పునరుద్ఘాటించారు. పరిపాలనా మార్గదర్శక సూత్రాలపై శుక్రవారం వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తాను ఇచ్చిన హామీలు, అమలుపై క్షుణ్ణంగా చర్చించారు. జనవరి లేదా ఫిబ్రవరిలో ‘‘రచ్చబండ’’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు.

అనవసర వ్యయం వద్దు...
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్లిపోయిందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. రూ.నాలుగు వేల కోట్లో ఐదు వేల కోట్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టిందంటే సరేలే అనుకునేవాళ్లమని, కానీ ఏకంగా రూ.40 వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టారని అధికారులతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. కార్పొరేషన్ల పేర్లతో రూ.వేల కోట్లు అప్పులు తేవడమే కాకుండా పౌరసరఫరాలు లాంటి కీలక కార్పొరేషన్ల మనుగడనే గత సర్కారు ప్రశ్నార్థకం చేసిందని, అలాంటి తరుణంలో అధికారంలోకి వచ్చామంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సీఎం వివరించారు. గత ఆర్నెల్లుగా ఆర్థికపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నామని, కఠిన పరిస్థితులనుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ సమయంలో అనవసర వ్యయాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టాలని, ఒక్కపైసా కూడా ఎక్కడా వృథా కాకూడదని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులను ఆదేశించారు. ప్రాధాన్యతాంశాలపై దృష్టి సారించకుంటే ప్రయోజనం ఉండదన్నారు.  

చేపట్టే ప్రతి పని 100 శాతం పూర్తవ్వాలి
ఈ ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేసినా సంతృప్త స్థాయి (శాచ్యురేషన్‌)లో అమలు చేస్తుందనేది నిర్వివాదాంశం కావాలని సీఎం స్పష్టం చేశారు. ఉన్న నిధులను సరైన దృష్టి లేకుండా అక్కడ కొంత ఇక్కడ కొంత వ్యయం చేస్తే  ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. చేపట్టే ప్రతి పనిని ఈ ప్రభుత్వం నూటికి నూరుశాతం చేస్తుందన్నదే మార్గదర్శక సూత్రం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఎన్నిక కావడమన్నదే మైలురాయి అవుతుందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి వారికి మేలు చేసినప్పుడే అది నెరవేరుతుందని సీఎం చెప్పారు. 

జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ‘‘రచ్చబండ’’
జనవరి 1 నాటికి గ్రామ, వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయని సీఎం చెప్పారు. జనవరి లేదా ఫిబ్రవరిలో ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించడంతోపాటు ప్రజల నుంచి వచ్చే  విజ్ఞప్తులు, వినతులపై హామీలు ఇవ్వాల్సి వస్తుందని, అక్కడికక్కడే చేపట్టాల్సిన పనులపై ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మాట ఇస్తే తాత్సారం చేయకూడదన్నారు. సీఎం హోదాలో జిల్లాల పర్యటన సందర్భంగా తానిచ్చిన హామీల అమలుపైనా సీఎం సమీక్షించారు. తదుపరి సమీక్ష నాటికి హామీల అమలు క్షేత్రస్థాయిలో ప్రారంభం కావాలని ఆదేశించారు.

సమన్వయంతో నిధులు సాధించాలి
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా అందే నిధులపైనా సీఎం సమీక్ష చేశారు. ఈ పథకాల నుంచి వీలైనన్ని నిధులు తెచ్చుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖకు చెందిన కార్యదర్శి లేదా విభాగాధిపతి వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి, ఏపీ భవన్‌ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. వీరి సహకారంతో కేంద్ర ప్రభుత్వ అధికారులను క్రమం తప్పకుండా కలుసుకుంటూ నిధులు తెచ్చుకోవడంపై దృష్టిపెట్టాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీతోపాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నవరత్నాలే తొలి ప్రాధాన్యం
ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నవరత్నాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని సీఎం స్పష్టం చేశారు. అధికారులంతా మేనిఫెస్టోను దగ్గర పెట్టుకుని అమలు చేయడంపై దృష్టిపెట్టాలన్నారు. 14 నెలలపాటు 3,648 కిలోమీటర్లు సాగిన తన పాదయాత్రలో వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తులను అధ్యయనం చేసి మేనిఫెస్టో రూపొందించామన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని ఏదో ఒకటి పెడదాంలే అన్నరీతిలో మేనిఫెస్టోని తయారు చేయలేదన్నారు. క్షేత్రస్థాయిలో గమనించిన పరిస్థితులు, వెనకబడ్డ వర్గాల వేదనల నుంచి ఈ మేనిఫెస్టో వచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నవరత్నాలతోపాటు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ప్రతి అంశాన్నీ అమలు చేయాలన్నారు. 

సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు
- జనవరి లేదా ఫిబ్రవరిలో ‘‘రచ్చబండ’’ కార్యక్రమం ప్రారంభం
- నవరత్నాలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం 
- చేపట్టే ప్రతి పనిని ఈ ప్రభుత్వం నూరుశాతం చేస్తుందన్నదే మార్గదర్శక సూత్రం కావాలి.
- అనవసర వ్యయాలకు కళ్లెం వేసి సామాన్యులపై భారం మోపకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలి.
- ఎన్నికల హామీలు, జిల్లా పర్యటనల సందర్భంగా చేసే వాగ్దానాలను కచ్చితంగా అమలు చేయాలి.
- సమన్వయంతో కృషి చేసి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను వీలైనంత ఎక్కువగా సాధించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement