implementation of government schemes
-
ఐక్యతకు బలం చేకూర్చిన తీర్పు!
ఆర్టికల్ ‘370, 35ఎ’ల రద్దుపై భారత సర్వోన్నత న్యాయస్థానం డిసెంబరు 11న ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలను నిర్ద్వంద్వంగా సమర్థించింది. ఈ మేరకు 2019 ఆగస్టు 5 నాటి నిర్ణయం రాజ్యాంగ సమగ్రతను మరింత పటిష్ఠం చేసేదే తప్ప దెబ్బ తీసేది ఎంతమాత్రం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతే కాకుండా ఆర్టికల్ 370కి స్వాభావిక శాశ్వతత్వం లేదనే వాస్తవాన్ని కూడా కోర్టు గుర్తించింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుతో ‘ఒకే భారతం–శ్రేష్ఠ భారతం’ స్ఫూర్తి మరింత బలోపేతమైంది. ఐక్యతా బంధం, సుపరిపాలనపై ఉమ్మడి నిబద్ధతకు నిర్వచనం ఇదేనని గుర్తు చేసిన ఈ తీర్పు ప్రతి భారతీయుడూ గర్వించదగినది. జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు ప్రకృతి సౌందర్యానికి నిలయాలు. నిర్మలమైన లోయలు, గంభీర పర్వతాలతో కూడిన ప్రాకృతిక వైభవం అనాదిగా కవులు, కళాకారులను ఉత్తేజితం చేయడమే కాకుండా సాహసికుల హృదయాలను కూడా దోచుకుంది. ఆకాశాన్నంటే హిమాలయ సోయగం నడుమ సౌందర్య–అద్భుతాల సంగమంగా ఈ ప్రదేశం అలరారేది. కానీ, ఈ స్వర్గం ఏడు దశాబ్దాలపాటు అత్యంత దారుణ హింస, అస్థిరతలకు ఆలవాలమై ప్రకృతి ప్రేమికులకు, సౌందర్య ఆరాధకులకు నరకంగా పరిణమించింది. దురదృష్టవశాత్తూ శతాబ్దాల పాటు సాగిన వలసపాలన వల్ల... ముఖ్యంగా మానసిక, ఆర్థిక అణచివేత ఫలితంగా మనం ఒక రకమైన అస్తవ్యస్త సమాజంగా మారిపోయాం. అనేక ప్రాథమిక అంశాలపై సుస్పష్ట వైఖరి కొరవడి, ద్వంద్వత్వాన్ని అనుమతించడంతో అది మనల్ని మరింత గందరగోళంలోకి నెట్టింది. ఈ దురదృష్టకర పరిణా మాలకు జమ్మూ కశ్మీర్ ప్రధాన బాధితురాలుగా మిగిలింది. స్వాతంత్య్రం సిద్ధించిన వేళ జాతీయ సమైక్యత దిశగా నవ్యారంభాన్ని ఎంచుకునే అవకాశం మనకు దక్కింది. కానీ, మనం దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలకు బదులు అస్తవ్యస్త సమాజ విధానాల కొన సాగింపునకే నిర్ణయించుకున్నాం. నా జీవితంలో చిన్న వయసు నుంచే జమ్మూ–కశ్మీర్ సమస్యతో నేను ఒకవిధంగా ముడిపడి ఉన్నాను. కానీ, దీన్ని కేవలం రాజకీయ సమస్యగా కాకుండా సామాజిక ఆకాంక్షలు తీర్చే అంశంగా పరిగణించే సైద్ధాంతిక చట్రంలో నేనొకడిని. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో జరిగిందంతా అక్కడి ప్రజానీకానికి, మనదేశానికి ఘోర ద్రోహమని నేను దృఢంగా విశ్వసించాను. అందుకే ప్రజలకు వాటిల్లిన అన్యా యాన్ని సరిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని బలమైన సంకల్పం పూనాను. ఆ మేరకు జమ్మూ–కశ్మీర్ ప్రజల కష్టాలు తీర్చేందుకు అవిరళంగా శ్రమించాలని నిశ్చయించుకున్నాను. ఆ క్రమంలో ఆర్టికల్ 370, 35(ఎ) ప్రధాన అవరోధాలు అయ్యాయి. అవి దుర్భే ధ్యమైన అడ్గుగోడల్లా తోచాయి. మరోవైపు బాధితులంతా పేదలు, అణగారిన వర్గాలవారు. ఈ పరిస్థితుల నడుమ ఈ రెండు రాజ్యాంగ నిబంధనల వల్ల భారతీయులందరికీ లభించే హక్కులు, ప్రగతి కశ్మీర్ ప్రజలకు దక్కవన్నవి సుస్పష్టం. ఫలితంగా ఒకే దేశంలోని పౌరుల మధ్య అగాధం ఏర్పడింది. పర్యవసానంగా జమ్మూ కశ్మీర్ ప్రజల బాధలు తెలిసి, అక్కడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని భావించిన ఇతర పౌరులు కూడా నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఈ సమస్యను కొన్ని దశాబ్దాలుగా నిశితంగా పరిశీలించిన ఓ కార్యకర్తగా దాని లోతుపాతులు, సంక్లిష్టతలపై నాకు క్షుణ్ణమైన అవగాహన ఉంది. ఏదేమైనా ఒక విషయంలో మాత్రం నాకు తిరుగు లేని స్పష్టత ఉంది. అదేమిటంటే– జమ్మూ–కశ్మీర్ ప్రజలు ప్రగతిని కోరుకుంటున్నారు. తమ శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలతో దేశాభివృద్ధికి తోడ్పడాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. తమ భవిష్యత్తరానికి మెరుగైన జీవన నాణ్యతను, హింస–అనిశ్చితి రహిత జీవనాన్ని కూడా ప్రగాఢంగా వాంఛిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్యన జమ్మూ– కశ్మీర్ ప్రజలకు సేవలందించడంలో మూడు ప్రధానాంశాలకు మేంప్రాధాన్యమిచ్చాం. ఆ మేరకు పౌరుల సమస్యలను అవగతం చేసు కోవడం, చేయూత ద్వారా విశ్వాసం పెంచడం, ముమ్మూర్తులా అభివృద్ధి ప్రాథమ్యం కల్పించడంపై నిశితంగా దృష్టి సారించాం. దేశంలో మేం 2014లో అధికారంలోకి రాగానే... జమ్మూ–కశ్మీర్ ప్రగతి పయనాన్ని మరింత వేగిరపరచేందుకు మా ప్రభుత్వంలోని మంత్రులు తరచూ అక్కడికి వెళ్లి ప్రజలతో నేరుగా సంభాషించాలని మేం నిర్ణయించుకున్నాం. దీంతో అక్కడ సుహృద్భావం పెంపొందించడంలో ఈ పర్యటనలు కీలకపాత్ర పోషించాయి. ఈ మేరకు 2014 మే నెల నుంచి 2019 మార్చి వరకు 150 దఫాలకు పైగా మంత్రులు పర్యటించడం మునుపెన్నడూ లేని రికార్డు. ఇక ప్రత్యేక ప్యాకేజీతో జమ్మూ–కశ్మీర్ అభివృద్ధి అవసరాలు తీర్చే దిశగా 2015లో ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. ఇందులో మౌలిక సదుపాయాల నిర్మాణం, ఉద్యోగ–ఉపాధికల్పన, పర్యాటకానికి ప్రోత్సాహం, హస్త కళల పరిశ్రమకు మద్దతు వంటి కార్యక్రమాలున్నాయి. జమ్మూ–కశ్మీర్లో యువత కలలను రగిలించగల శక్తి క్రీడలకు ఉందన్న వాస్తవాన్ని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఈ మేరకు వివిధ క్రీడా కార్యక్రమాలు నిర్వహించాం. వారి ఆకాంక్షలు –భవిష్యత్తుపై ఈ క్రీడల పరివర్తనాత్మక ప్రభావాన్ని మేం ప్రత్యక్షంగా చూశాం. క్రీడా వేదికల మెరుగుతో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి శిక్షకులను అందుబాటులో ఉంచాం. స్థానిక ఫుట్‌బాల్ క్లబ్బుల ఏర్పాటును ప్రోత్సహించడం మేం చేపట్టిన అత్యంత ప్రత్యేక చర్యలలో ఒకటి. దీని ఫలితాలు అత్యద్భుతం. వీటిద్వారా ఎందరో యువతీయువకులు పటిష్ఠ శిక్షణతో ప్రతిభావంతులైన క్రీడాకారు లుగా వెలుగులోకి వచ్చారు. వీరిలో అఫ్షాన్ ఆషిఖ్ పేరు నాకింకా గుర్తుంది. ఎందుకంటే– 2014 డిసెంబరు నాటికి శ్రీనగర్‌లో రాళ్లు విసిరే అల్లరిమూకలో ఆమె ఒకరుగా ఉండేది. అయితే, సముచిత చర్యలు, ప్రోత్సాహంతో ఆ యువతి ఫుట్‌బాల్ వైపు మళ్లి జాతీయ స్థాయిలో పేరుప్రతిష్ఠలు సంపాదించింది. ఆ తర్వాత యువతరంతో సుదృఢ భారతం కార్యక్రమం సందర్భంగా ఓసారి నేను ఆమెతో సంభాషించినట్లు నాకిప్పటికీ గుర్తుంది. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధిలో పంచాయితీ ఎన్నికలు ఒక మేలిమలుపు. మరోసారి మేం అధికారంలో కొనసాగడం లేదా మా సిద్ధాంతాలకు కట్టుబాటు... అనే వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవా ల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాం. మాకు ఇదేమంత కఠినమైనది కాదు. అధికారం వదులుకున్నా, సిద్ధాంతాలను నిలబెట్టుకున్నాం. ఆ మేరకు జమ్మూ ప్రజల ఆకాంక్షలు, కశ్మీర్ ప్రగతికే అత్యంత ప్రాధాన్యమిచ్చాం. పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి కావడం అక్కడి ప్రజల ప్రజాస్వామిక స్వభావాన్ని స్పష్టం చేసింది. గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులతో సంభాషించాలని నా మనస్సుకు తోచింది. ఈ సందర్భంగా ఇతరత్రా సమస్యలపై మాట్లాడటంతో పాటు నేను వారికొక అభ్య ర్థన చేశాను. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలను తగులబెట్ట రాదని, ఈ వాగ్దానానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశాను. ఆ తర్వాత వారు తమ హామీని నిలబెట్టుకోవడం నన్నెంతో ఆనందింప జేసింది. పాఠశాలలు తగుల బడితే అందరి కన్నా ఎక్కువగా బాధపడేది పసివాళ్లే! ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీ ఒక చరిత్రాత్మక దినంగా ప్రతి భారతీయుడి హృదయంలో నాటుకు పోయింది. ఆ రోజున ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మన పార్లమెంటు చారిత్రక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ లలో పెనుమార్పులు వచ్చాయి. చివరకు 2023 డిసెంబరులో న్యాయ స్థానం తీర్పు దాన్ని బలపరచింది. ఈ మూడు ప్రదేశాల్లో అభివృద్ధిని చూశాక నాలుగేళ్ల కిందటి పార్లమెంటు నిర్ణయంపై ప్రజాకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రతిధ్వనింపజేసింది. రాజకీయాల స్థాయిలో గత 4 ఏళ్లుగా క్షేత్రస్థాయిన ప్రజా స్వామ్యంపై సరికొత్త విశ్వాసం పునరుద్ధరించబడింది. అంతకు ముందు సమాజంలోని మహిళలు, గిరిజనులు, ఎస్సీ/ఎస్టీ, అణగా రిన వర్గాలకు దక్కా ల్సిన ప్రయోజనాలు అందేవి కావు. అదే సమ యంలో లద్దాఖ్ ఆకాంక్షలు పూర్తిగా విస్మరణకు గురయ్యాయి. అయితే, 2019 ఆగస్టు 5న ఈ పరిస్థితి సమూలంగా మారిపోయింది. ఇప్పుడు కేంద్ర చట్టాలన్నీ ఎలాంటి భయపక్షపాతాలూ లేకుండా అమలవుతున్నాయి. ప్రాతి నిధ్యం మరింత పెరిగింది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. అందరూ విస్మరించిన శరణార్థి సమాజాలు అభివృద్ధి ఫలాలను ఆస్వాదించడం ప్రారంభించాయి. కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు సంతృప్త స్థాయికి చేరింది. మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక రంగానికి చేయూతతో కశ్మీర్ అందాలు ప్రతి ఒక్కరికీ మళ్లీ స్వాగతం పలుకు తున్నాయి. ఈ ఘనత సహజంగానే జమ్మూ–కశ్మీర్ ప్రజల దృఢ సంకల్పానికి దక్కుతుంది. ఈ మేరకు తాము ప్రగతి కాముకులం మాత్రమేనని, ఈ సానుకూల మార్పునకు చోదకులు కావడానికి సిద్ధంగా ఉన్నామని వారు పలుమార్లు నిరూపించుకున్నారు. గతంలో జమ్ము, కశ్మీర్, లద్దాఖ్‌ల పరిస్థితి ఒక ప్రశ్నార్థకంలా ఉండేది. కానీ, ఇప్పుడది ‘‘రికార్డు వృద్ధి, రికార్డు ప్రగతి, రికార్డు స్థాయిలో పర్యాటక ప్రవాహం’’తో ఆశ్చర్యార్థకానికి ప్రతీకగా మారింది. జమ్ము, కశ్మీర్, లద్దాఖ్లలోప్రతి బిడ్డ నేడు స్వచ్ఛమైన నేపథ్యంతో జన్మిస్తున్నాడు. అక్కడ అతను లేదా ఆమె శక్తిమంతమైన ఆకాంక్షలతో కూడిన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. ప్రజల స్వప్నాలు నేడు గతానికి బందీలు కావు. భవిష్యత్తుకు బంగారుబాట పరిచే అవకాశాలు. అన్నింటికీ మించి భ్రమలు, నిరాశా నిస్పృహల స్థానంలో ఇప్పుడు అభివృద్ధి, ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం పరిఢ విల్లుతున్నాయి! నరేంద్ర మోదీ భారత ప్రధాని -
ఇక అత్తారింటి కుటుంబంలో పేరు నమోదు సులువే
సాక్షి, అమరావతి: కొత్తగా పెళ్లయ్యి అత్తారింటికి వెళ్లిన వారికి.. ఆ కుటుంబంలో సభ్యురాలిగా పేరు నమోదు చేసుకునేందుకు గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ పేరు నమోదు సమయంలో సంబంధిత వ్యక్తి వేలిముద్రలు కూడా నమోదు చేసుకుంటారు. సచివాలయాల్లో నమోదయ్యే ఈ వివరాలను ఎంపీడీవో లేదంటే మున్సిపల్ కమిషనర్ ఆమోదం తెలిపిన తర్వాత ఆయా వ్యక్తులు సంబంధిత కుటుంబంలో సభ్యులుగా నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. వ లంటీర్లు ఆయా కుటుంబసభ్యులుగా పేరు నమోదు చేసిన అనంతరం రేషన్‌కార్డులో కొత్తగా పేరు నమోదు చేయించుకోవడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందడానికి వీలు కలుగుతుందని అధికారులు వెల్లడించారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ, వలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా, పట్టణాల్లో 70–100 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా వర్గీకరించి, ఒక్కొక్క క్లస్టర్‌కు ఒక్కొక్కరి చొప్పున వలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో కలిపి 1.65 కోట్ల కుటుంబాల్లో 4.67 కోట్ల మంది తమ పేర్లు నమోదుచేసుకోగా, ఆయా కుటుంబాల ను 2.65 లక్షల వలంటీరు క్లస్టర్లుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ఈ వివరాల ప్రకారమే అర్హులను గుర్తిస్తోంది. -
మత రాజకీయాలకు చోటులేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మత విద్వేషాలకు తావులేదని, క్షుద్ర రాజకీయాలకు పాల్పడే వారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సర్వమతాలకు చెందిన పెద్దలు విజ్ఞప్తి చేశారు. మతకల్లోలాలు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అన్ని మతాల వారు అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవిస్తున్నారని చెప్పారు. పార్టీలు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ ప్రజలకు చేటు చేసేలా, మతాలను కించపరిచేలా, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఏ పార్టీ, ఏ వర్గమూ, ఏ ఒక్కరూ వ్యవహరించవద్దని సవినయంగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు మంత్రుల కమిటీ శుక్రవారం విజయవాడలో నిర్వహించిన సర్వమత సమావేశంలో పాల్గొన్న అనంతరం మతపెద్దలు ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలివీ.. అలాంటి ధోరణులు సరికాదు.. మన రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం ఉంది. మతపరమైన విద్వేషాలు లేవు. హిందువులు, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు.. అన్ని మతాల ప్రజలు తమ ఆచారానికి అనుగుణంగా జీవనం గడుపుతున్నారు. ఎక్కడా మతపరంగా మెజార్టీ, మైనార్టీ అన్న భావన ప్రజల్లో లేదు. ఇటీవల మారుమూల ప్రాంతాల్లోని ఆలయాల్లో జరుగుతున్న ఘటనలు, అనంతరం కొందరు చేస్తున్న విషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఈ తరహా ధోరణులు ఎంతమాత్రం సబబు కాదు. విద్వేషాలను విరజిమ్మేలా వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టే ధోరణి ఏమాత్రం తగదు. ఈ పని ఎవరు చేసినా ఆమోదయోగ్యం కాదు. వన్నె తరగని మత సామరస్యం తరతరాలుగా మత సామరస్యం భారతీయ సంస్కృతికి వన్నె తెచ్చింది. చుట్టుపక్కల దేశాల్లో రాజకీయంగా, సామాజికంగా అస్థిర పరిస్థితులు ఉన్నా... ప్రజలు కలసి మెలసి ఉంటున్నారు కాబట్టే మన దగ్గర సుస్థిర ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గర ఒకే చోట ఆలయం, దర్గా కనిపిస్తాయి. ఉర్సు (ముస్లింల ఆధ్యాత్మిక కార్యక్రమం) ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో హిందువులూ హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. నెల్లూరు జిల్లాలో బారా షహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండుగకు అన్ని మతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. చాలామంది హిందువులు మస్తాన్ అనే పేరు పెట్టుకోవడం చూశాం. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు తరతరాలుగా కలిసే ఉంటున్నారు. ఇక మీదట కూడా అలాగే ఉంటారు. కుట్రదారులకు నిలువనీడ లేకుండా చేయాలి.. ప్రభుత్వ పథకాల అమలులో మతాలకు అతీతంగా పేదలకు సాయం చేయటమే ఏకైక ప్రామాణికంగా ఉన్నప్పుడు, అన్ని మతాలకూ గౌరవ మర్యాదలు దక్కుతున్నప్పుడు, ప్రభుత్వ పెద్దలు అన్ని మతాల సంప్రదాయాలకు గౌరవం ఇస్తున్నప్పుడు... మత సామరస్యాన్ని దెబ్బతీసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికావు. ఏ దేవాలయం మీద దాడి చేసినా, ఏ ప్రార్థనా మందిరం మీద దాడి చేసినా అది ముమ్మాటికీ తప్పు. ఆ తప్పు చేసినవారు కచ్చితంగా శిక్షించబడాలి. అలాంటి ఘటనలను ఆసరాగా తీసుకుని లేని విద్వేషాలను సృష్టించే ప్రయత్నాలు చేయవద్దు. లేని విచ్ఛినాన్ని దయచేసి తెలుగు సమాజంలోకి తీసుకురాకండి. ప్రజలంతా ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రతో బయలుదేరిన వ్యక్తులకు నిలువనీడ లేకుండా చేయాలి. తప్పు చేసినవారిని వెతికి పట్టించేందుకు గ్రామాల్లో ప్రజలు సహకరించాలి. రాష్ట్రంలో అన్ని మతాలవారు సంయమనం పాటిస్తూ సౌభ్రాతృత్వంతో మెలగాలి. తమ మతాలను అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలి. – వేణుగోపాల దీక్షితులు, ప్రధాన అర్చకులు, తిరుమల శ్రీవారి ఆలయం ప్రజలంతా ప్రేమ, శాంతితో జీవనం సాగించాలి. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం మంచి పాలన అందిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు పరస్పరం సహనం, స్నేహభావంతో మెలగాలి. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో కొన్ని దుస్సంఘటనలు జరగడం బాధాకరం. ఏ మతం కూడా విధ్వంసాన్ని ప్రోత్సహించదు. – సయ్యద్ అహ్మద్ పీర్ షామిరీ, షామీరా పీఠాధిపతి ప్రజాస్వామ్యయుతమైన మన దేశంలో ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో మెలగాలి. ప్రేమ, సహనం, సర్వమత సౌభ్రాతృత్వమే సమాజం అనుసరించే విధానం కావాలి. మత విద్వేషాలను ఏ మతం కూడా అంగీకరించదు. మౌఢ్యం, విద్రోహ చర్యలకు మతాన్ని వాడుకోవాలని కొందరు భావించడం క్షమార్హం కాదు. అలాంటి వాటిని ప్రజలు సమష్టిగా తిప్పికొట్టి శాంతియుత జీవనం సాగించాలి’ – సీహెచ్ మోడరేటర్, రెవరెండ్ -
నిబద్ధతతో సేవలందించండి
సాక్షి, అమరావతి : నిబద్ధతగల అధికారులుగా ప్రజలకు మంచి సేవలందించి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 ఏపీ కేడర్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఐఏఎస్‌లదే కీలకపాత్ర అయినందున చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన వారిని కోరారు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఓ మహిళేనని, మహిళల రక్షణ కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా దిశా చట్టాన్ని చేయడంతో పాటు ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏర్పాటుచేశామని యువ ఐఏఎస్ అధికారులకు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను శనివారం ఈ ప్రొబేషనరీ ఐఏఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిని ముఖ్యమంత్రి అభినందించారు. అనంతరం యువ ఐఏఎస్‌లు మాట్లాడారు. వారేమన్నారంటే.. ► వలంటీర్ల వ్యవస్థ, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రితో చర్చించాం. ► గ్రామ వలంటీర్లు, అధికార వికేంద్రీకరణ వంటి కొత్త వ్యవస్థలో పనిచేయడం ఆనందంగా ఉంది. ► ముస్సోరిలో తమకిచ్చిన శిక్షణలో గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో పాటు అధికార వికేంద్రీకరణపై పలుమార్లు చర్చ జరిగింది. గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాల ద్వారా సాధ్యమవుతుంది. మహిళాభివృద్ధి మీద ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ► నిన్నటివరకు పరిపాలనకు సంబంధించి అనేక అంశాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్‌గా తెలుసుకోబోతున్నాం. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన యువ ఐఏఎస్‌లలో ఎం. నవీన్, నిధి మీనా, చహత్ బాజ్‌పాయ్, వికాస్ మర్మత్, వి.అభిషేక్, జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్, సి. విష్ణుచరణ్, కట్టా సింహాచలం, అపరాజిత సింగ్ సిన్సివర్, భావన వశిష్ట్ ఉన్నారు. -
శంకుస్థాపన చేసిన 4 వారాల్లోగా పనులు ప్రారంభం
ముఖ్యమంత్రి ఏదైనా హామీ ఇస్తే అది ప్రభుత్వం ఇచ్చే హామీనే. మాట ఇస్తే కచ్చితంగా చేయాలి. ఇచ్చిన మాట నెరవేర్చలేదన్న మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. విశ్వసనీయతే నా బలం, దానికి భంగం కలగకూడదు. శంకుస్థాపన చేసిన నాలుగు వారాల్లోగా ఏ పనులైనా ప్రారంభం కావాలి. – ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం తరహాలో ప్రజలను మభ్య పెట్టేందుకు పనులకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకోవడం ఇక కుదరదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లోగా పనులు ప్రారంభం కావాల్సిందేనని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి స్పష్టత ఇచ్చారు. విశ్వసనీయతే నా బలం, దానికి భంగం కలగకూడదని స్పష్టం చేశారు. నవరత్నాలే ప్రభుత్వ ప్రాధాన్యం అని పునరుద్ఘాటించారు. పరిపాలనా మార్గదర్శక సూత్రాలపై శుక్రవారం వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తాను ఇచ్చిన హామీలు, అమలుపై క్షుణ్ణంగా చర్చించారు. జనవరి లేదా ఫిబ్రవరిలో ‘‘రచ్చబండ’’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. అనవసర వ్యయం వద్దు... గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్లిపోయిందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రూ.నాలుగు వేల కోట్లో ఐదు వేల కోట్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టిందంటే సరేలే అనుకునేవాళ్లమని, కానీ ఏకంగా రూ.40 వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టారని అధికారులతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. కార్పొరేషన్ల పేర్లతో రూ.వేల కోట్లు అప్పులు తేవడమే కాకుండా పౌరసరఫరాలు లాంటి కీలక కార్పొరేషన్ల మనుగడనే గత సర్కారు ప్రశ్నార్థకం చేసిందని, అలాంటి తరుణంలో అధికారంలోకి వచ్చామంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సీఎం వివరించారు. గత ఆర్నెల్లుగా ఆర్థికపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నామని, కఠిన పరిస్థితులనుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ సమయంలో అనవసర వ్యయాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టాలని, ఒక్కపైసా కూడా ఎక్కడా వృథా కాకూడదని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులను ఆదేశించారు. ప్రాధాన్యతాంశాలపై దృష్టి సారించకుంటే ప్రయోజనం ఉండదన్నారు. చేపట్టే ప్రతి పని 100 శాతం పూర్తవ్వాలి ఈ ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేసినా సంతృప్త స్థాయి (శాచ్యురేషన్)లో అమలు చేస్తుందనేది నిర్వివాదాంశం కావాలని సీఎం స్పష్టం చేశారు. ఉన్న నిధులను సరైన దృష్టి లేకుండా అక్కడ కొంత ఇక్కడ కొంత వ్యయం చేస్తే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. చేపట్టే ప్రతి పనిని ఈ ప్రభుత్వం నూటికి నూరుశాతం చేస్తుందన్నదే మార్గదర్శక సూత్రం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఎన్నిక కావడమన్నదే మైలురాయి అవుతుందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి వారికి మేలు చేసినప్పుడే అది నెరవేరుతుందని సీఎం చెప్పారు. జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ‘‘రచ్చబండ’’ జనవరి 1 నాటికి గ్రామ, వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయని సీఎం చెప్పారు. జనవరి లేదా ఫిబ్రవరిలో ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించడంతోపాటు ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, వినతులపై హామీలు ఇవ్వాల్సి వస్తుందని, అక్కడికక్కడే చేపట్టాల్సిన పనులపై ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మాట ఇస్తే తాత్సారం చేయకూడదన్నారు. సీఎం హోదాలో జిల్లాల పర్యటన సందర్భంగా తానిచ్చిన హామీల అమలుపైనా సీఎం సమీక్షించారు. తదుపరి సమీక్ష నాటికి హామీల అమలు క్షేత్రస్థాయిలో ప్రారంభం కావాలని ఆదేశించారు. సమన్వయంతో నిధులు సాధించాలి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా అందే నిధులపైనా సీఎం సమీక్ష చేశారు. ఈ పథకాల నుంచి వీలైనన్ని నిధులు తెచ్చుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖకు చెందిన కార్యదర్శి లేదా విభాగాధిపతి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి, ఏపీ భవన్ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. వీరి సహకారంతో కేంద్ర ప్రభుత్వ అధికారులను క్రమం తప్పకుండా కలుసుకుంటూ నిధులు తెచ్చుకోవడంపై దృష్టిపెట్టాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీతోపాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నవరత్నాలే తొలి ప్రాధాన్యం ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నవరత్నాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని సీఎం స్పష్టం చేశారు. అధికారులంతా మేనిఫెస్టోను దగ్గర పెట్టుకుని అమలు చేయడంపై దృష్టిపెట్టాలన్నారు. 14 నెలలపాటు 3,648 కిలోమీటర్లు సాగిన తన పాదయాత్రలో వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తులను అధ్యయనం చేసి మేనిఫెస్టో రూపొందించామన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని ఏదో ఒకటి పెడదాంలే అన్నరీతిలో మేనిఫెస్టోని తయారు చేయలేదన్నారు. క్షేత్రస్థాయిలో గమనించిన పరిస్థితులు, వెనకబడ్డ వర్గాల వేదనల నుంచి ఈ మేనిఫెస్టో వచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నవరత్నాలతోపాటు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ప్రతి అంశాన్నీ అమలు చేయాలన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు - జనవరి లేదా ఫిబ్రవరిలో ‘‘రచ్చబండ’’ కార్యక్రమం ప్రారంభం - నవరత్నాలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం - చేపట్టే ప్రతి పనిని ఈ ప్రభుత్వం నూరుశాతం చేస్తుందన్నదే మార్గదర్శక సూత్రం కావాలి. - అనవసర వ్యయాలకు కళ్లెం వేసి సామాన్యులపై భారం మోపకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. - ఎన్నికల హామీలు, జిల్లా పర్యటనల సందర్భంగా చేసే వాగ్దానాలను కచ్చితంగా అమలు చేయాలి. - సమన్వయంతో కృషి చేసి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను వీలైనంత ఎక్కువగా సాధించాలి. -
మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో రూ.10 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల్లో రూ.10 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు మలేసియా ప్రభుత్వ రంగ సంస్థ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బోర్డు(సీఐడీబీ) సుముఖత వ్యక్తం చేసింది. జాతీయ రహదారులు, ప్రజా రవాణా, గృహ నిర్మాణం తదితర రంగాల్లో దీర్ఘకాలంలో ఈ పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వచ్చింది. 3 రోజులుగా సింగపూర్, మలేసియాలో పర్యటిస్తున్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు.. శుక్రవారం సీఐడీబీ సీఈవో అబ్దుల్ లతీఫ్ హిటామ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేటీఆర్ ఆయనకు వివరించారు. దేశీయంగా నిర్మాణ రంగంలో సేవలు, పెట్టుబడులతో పాటు.. ఎగుమతులను ప్రోత్సహించడం లక్ష్యంగా మలేసియా ప్రభుత్వం సీఐడీబీని ఏర్పాటు చేసిందని సీఈవో హిటామ్ వెల్లడించారు. ‘గోయింగ్ గ్లోబల్’ విధానంలో భాగంగా తమ వద్ద ఉన్న నిధులను సీఐడీబీ సోదర సంస్థ సీఐడీబీ హోల్డింగ్స్ ద్వారా విదేశీ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో రహదారుల నిర్మాణానికి రాజస్తాన్ ప్రభుత్వంతో తమ సంస్థ ఇప్పటికే పరస్పర అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు హిటామ్ వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఐడీబీ సుముఖత వ్యక్తం చేయడాన్ని స్వాగతించిన కేటీఆర్.. సంస్థ కార్యకలాపాలకు సహకారం అం దిస్తామని ప్రకటించారు. మలేసియా పెట్టుబడులతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం లభిస్తుందని తెలిపారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు ఏటా తిరిగి చెల్లించే విధానంలో.. స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఉంటాయన్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై అధ్యయనం చేసేందుకు త్వరలో సీఐడీబీ బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని కేటీఆర్ చెప్పారు. వ్యాక్సిన్ల తయారీలో పెట్టుబడులు తెలంగాణలో వ్యాక్సిన్ల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మలేసియాకు చెందిన అతిపెద్ద ఫార్మా కంపెనీ ‘కెమికల్ కంపెనీ ఆఫ్ మలేసియా’ సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థ ఎండీ ఆరిఫ్ అబ్దుల్ షతార్తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఫార్మా కంపెనీలకు తెలంగాణ కేంద్రంగా ఉందని.. ఫార్మాకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ చెప్పారు. తమ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో పలు కంపెనీలతో వివిధ రంగాల్లో కలసి పనిచేస్తున్నట్లు ఆరిఫ్ వెల్లడించారు. అనంతరం వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ఎల్కేఎల్ ఎండీ లిమ్ కోన్ లియాన్తోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొల్పుతున్న మెడికల్ డివెజైస్ పార్కులో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ప్రతినిధి బృందాన్ని పంపిస్తామని లియాన్ హామీ ఇచ్చారు. ఏవియేషన్ రంగంలో శిక్షణ కార్యకలాపాల్లో కలసి రావాల్సిందిగా ఏసియా ఏరోటెక్నిక్ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్.. కేటీఆర్ వెంట భేటీల్లో పాల్గొన్నారు. కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రధాని సలహాదారుతో సమావేశం ప్రభుత్వ పథకాల అమలును రోజూవారీగా పర్యవేక్షించేందుకు మలేసియా తరహాలో ‘పెమండు’(పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ యూనిట్) ‘డ్యాష్ బోర్డు’ వ్యవస్థ ఏర్పాటును పరిశీలిస్తామని కేటీఆర్ వెల్లడించారు. జాతీయ పరివర్తన పథకం ‘పెమండు’ అధినేత, మలేసియా ప్రధాని సలహాదారు డాటో శ్రీ ఇద్రిస్ జాలాతో కేటీఆర్ భేటీ అయ్యారు. 2020 నాటికి మలేసియాను అధిక ఆదాయ దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పెమండును ఏర్పాటు చేసినట్లు ఇద్రిస్ చెప్పారు. ప్రభుత్వ శాఖల పనితీరును డ్యాష్‌బోర్డుల ద్వారా పెమండు పర్యవేక్షిస్తున్న విధానాన్ని కేటీఆర్ అభినందించారు. పెమండు తరహాలో రాష్ట్రంలోనూ.. మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు అవసరమని, తద్వారా స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడం సులభమవుతుందన్నారు. -
అక్రమాలను ఉపేక్షించం: ఈటెల
గృహ నిర్మాణ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి కేసీఆర్‌లో కాఠిన్యమే కాదు.. కారుణ్యమూ ఉంది సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. పేదలకు గూడు కల్పించే కీలక బాధ్యత ఉన్న గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ఉద్యోగుల జేఏసీ కొత్త సంవత్సర డైరీ, కేలండర్‌ను ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలసి ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సీఐడీ విచారణతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఉద్యోగ సంఘ నేతలు మంత్రుల దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన ఈటెల పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పులను ప్రభుత్వాలపై నెడితే కుదరదని, ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమనే విషయాన్ని మరవద్దని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కక్షపూరితంగా ఉండదని, కేసీఆర్ వద్ద కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా ఉందని గుర్తించాలన్నారు. గృహ నిర్మాణశాఖ ఉద్యోగుల పింఛన్, ఇళ్ల స్థలాల కేటాయింపును సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వేతనాల పెం పును పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. సీఐడీ విచారణలో పక్కాగా వివరాలు వెలుగుచూడకపోవచ్చని మంత్రి తుమ్మల అన్నారు. గత ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాల వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తిందని టీఎన్జీవోస్ అధ్యక్షులు దేవీప్రసాద్ అన్నారు.