- గృహ నిర్మాణ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి
- కేసీఆర్‌లో కాఠిన్యమే కాదు.. కారుణ్యమూ ఉంది
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. పేదలకు గూడు కల్పించే కీలక బాధ్యత ఉన్న గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ఉద్యోగుల జేఏసీ కొత్త సంవత్సర డైరీ, కేలండర్‌ను ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలసి ఆవిష్కరించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సీఐడీ విచారణతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఉద్యోగ సంఘ నేతలు మంత్రుల దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన ఈటెల పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పులను ప్రభుత్వాలపై నెడితే కుదరదని, ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమనే విషయాన్ని మరవద్దని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కక్షపూరితంగా ఉండదని, కేసీఆర్ వద్ద కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా ఉందని గుర్తించాలన్నారు.
గృహ నిర్మాణశాఖ ఉద్యోగుల పింఛన్, ఇళ్ల స్థలాల కేటాయింపును సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వేతనాల పెం పును పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. సీఐడీ విచారణలో పక్కాగా వివరాలు వెలుగుచూడకపోవచ్చని మంత్రి తుమ్మల అన్నారు. గత ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాల వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తిందని టీఎన్‌జీవోస్ అధ్యక్షులు దేవీప్రసాద్ అన్నారు.