ఆర్టికల్ ‘370, 35ఎ’ల రద్దుపై భారత సర్వోన్నత న్యాయస్థానం డిసెంబరు 11న ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలను నిర్ద్వంద్వంగా సమర్థించింది. ఈ మేరకు 2019 ఆగస్టు 5 నాటి నిర్ణయం రాజ్యాంగ సమగ్రతను మరింత పటిష్ఠం చేసేదే తప్ప దెబ్బ తీసేది ఎంతమాత్రం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతే కాకుండా ఆర్టికల్ 370కి స్వాభావిక శాశ్వతత్వం లేదనే వాస్తవాన్ని కూడా కోర్టు గుర్తించింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుతో ‘ఒకే భారతం–శ్రేష్ఠ భారతం’ స్ఫూర్తి మరింత బలోపేతమైంది. ఐక్యతా బంధం, సుపరిపాలనపై ఉమ్మడి నిబద్ధతకు నిర్వచనం ఇదేనని గుర్తు చేసిన ఈ తీర్పు ప్రతి భారతీయుడూ గర్వించదగినది.
జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు ప్రకృతి సౌందర్యానికి నిలయాలు. నిర్మలమైన లోయలు, గంభీర పర్వతాలతో కూడిన ప్రాకృతిక వైభవం అనాదిగా కవులు, కళాకారులను ఉత్తేజితం చేయడమే కాకుండా సాహసికుల హృదయాలను కూడా దోచుకుంది. ఆకాశాన్నంటే హిమాలయ సోయగం నడుమ సౌందర్య–అద్భుతాల సంగమంగా ఈ ప్రదేశం అలరారేది. కానీ, ఈ స్వర్గం ఏడు దశాబ్దాలపాటు అత్యంత దారుణ హింస, అస్థిరతలకు ఆలవాలమై ప్రకృతి ప్రేమికులకు, సౌందర్య ఆరాధకులకు నరకంగా పరిణమించింది.
దురదృష్టవశాత్తూ శతాబ్దాల పాటు సాగిన వలసపాలన వల్ల... ముఖ్యంగా మానసిక, ఆర్థిక అణచివేత ఫలితంగా మనం ఒక రకమైన అస్తవ్యస్త సమాజంగా మారిపోయాం. అనేక ప్రాథమిక అంశాలపై సుస్పష్ట వైఖరి కొరవడి, ద్వంద్వత్వాన్ని అనుమతించడంతో అది మనల్ని మరింత గందరగోళంలోకి నెట్టింది. ఈ దురదృష్టకర పరిణా మాలకు జమ్మూ కశ్మీర్ ప్రధాన బాధితురాలుగా మిగిలింది.
స్వాతంత్య్రం సిద్ధించిన వేళ జాతీయ సమైక్యత దిశగా నవ్యారంభాన్ని ఎంచుకునే అవకాశం మనకు దక్కింది. కానీ, మనం దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలకు బదులు అస్తవ్యస్త సమాజ విధానాల కొన సాగింపునకే నిర్ణయించుకున్నాం.
నా జీవితంలో చిన్న వయసు నుంచే జమ్మూ–కశ్మీర్ సమస్యతో నేను ఒకవిధంగా ముడిపడి ఉన్నాను. కానీ, దీన్ని కేవలం రాజకీయ సమస్యగా కాకుండా సామాజిక ఆకాంక్షలు తీర్చే అంశంగా పరిగణించే సైద్ధాంతిక చట్రంలో నేనొకడిని. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో జరిగిందంతా అక్కడి ప్రజానీకానికి, మనదేశానికి ఘోర ద్రోహమని నేను దృఢంగా విశ్వసించాను. అందుకే ప్రజలకు వాటిల్లిన అన్యా యాన్ని సరిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని బలమైన సంకల్పం పూనాను. ఆ మేరకు జమ్మూ–కశ్మీర్ ప్రజల కష్టాలు తీర్చేందుకు అవిరళంగా శ్రమించాలని నిశ్చయించుకున్నాను.
ఆ క్రమంలో ఆర్టికల్ 370, 35(ఎ) ప్రధాన అవరోధాలు అయ్యాయి. అవి దుర్భే ధ్యమైన అడ్గుగోడల్లా తోచాయి. మరోవైపు బాధితులంతా పేదలు, అణగారిన వర్గాలవారు. ఈ పరిస్థితుల నడుమ ఈ రెండు రాజ్యాంగ నిబంధనల వల్ల భారతీయులందరికీ లభించే హక్కులు, ప్రగతి కశ్మీర్ ప్రజలకు దక్కవన్నవి సుస్పష్టం. ఫలితంగా ఒకే దేశంలోని పౌరుల మధ్య అగాధం ఏర్పడింది. పర్యవసానంగా జమ్మూ కశ్మీర్ ప్రజల బాధలు తెలిసి, అక్కడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని భావించిన ఇతర పౌరులు కూడా నిస్సహాయులుగా మిగిలిపోయారు.
ఈ సమస్యను కొన్ని దశాబ్దాలుగా నిశితంగా పరిశీలించిన ఓ కార్యకర్తగా దాని లోతుపాతులు, సంక్లిష్టతలపై నాకు క్షుణ్ణమైన అవగాహన ఉంది. ఏదేమైనా ఒక విషయంలో మాత్రం నాకు తిరుగు లేని స్పష్టత ఉంది. అదేమిటంటే– జమ్మూ–కశ్మీర్ ప్రజలు ప్రగతిని కోరుకుంటున్నారు. తమ శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలతో దేశాభివృద్ధికి తోడ్పడాలని కూడా ఆకాంక్షిస్తున్నారు.
తమ భవిష్యత్తరానికి మెరుగైన జీవన నాణ్యతను, హింస–అనిశ్చితి రహిత జీవనాన్ని కూడా ప్రగాఢంగా వాంఛిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్యన జమ్మూ– కశ్మీర్ ప్రజలకు సేవలందించడంలో మూడు ప్రధానాంశాలకు మేంప్రాధాన్యమిచ్చాం. ఆ మేరకు పౌరుల సమస్యలను అవగతం చేసు కోవడం, చేయూత ద్వారా విశ్వాసం పెంచడం, ముమ్మూర్తులా అభివృద్ధి ప్రాథమ్యం కల్పించడంపై నిశితంగా దృష్టి సారించాం.
దేశంలో మేం 2014లో అధికారంలోకి రాగానే... జమ్మూ–కశ్మీర్ ప్రగతి పయనాన్ని మరింత వేగిరపరచేందుకు మా ప్రభుత్వంలోని మంత్రులు తరచూ అక్కడికి వెళ్లి ప్రజలతో నేరుగా సంభాషించాలని మేం నిర్ణయించుకున్నాం. దీంతో అక్కడ సుహృద్భావం పెంపొందించడంలో ఈ పర్యటనలు కీలకపాత్ర పోషించాయి. ఈ మేరకు 2014 మే నెల నుంచి 2019 మార్చి వరకు 150 దఫాలకు పైగా మంత్రులు పర్యటించడం మునుపెన్నడూ లేని రికార్డు. ఇక ప్రత్యేక ప్యాకేజీతో జమ్మూ–కశ్మీర్ అభివృద్ధి అవసరాలు తీర్చే దిశగా 2015లో ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. ఇందులో మౌలిక సదుపాయాల నిర్మాణం, ఉద్యోగ–ఉపాధికల్పన, పర్యాటకానికి ప్రోత్సాహం, హస్త కళల పరిశ్రమకు మద్దతు వంటి కార్యక్రమాలున్నాయి.
జమ్మూ–కశ్మీర్‌లో యువత కలలను రగిలించగల శక్తి క్రీడలకు ఉందన్న వాస్తవాన్ని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఈ మేరకు వివిధ క్రీడా కార్యక్రమాలు నిర్వహించాం. వారి ఆకాంక్షలు –భవిష్యత్తుపై ఈ క్రీడల పరివర్తనాత్మక ప్రభావాన్ని మేం ప్రత్యక్షంగా చూశాం. క్రీడా వేదికల మెరుగుతో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి శిక్షకులను అందుబాటులో ఉంచాం. స్థానిక ఫుట్‌బాల్ క్లబ్బుల ఏర్పాటును ప్రోత్సహించడం మేం చేపట్టిన అత్యంత ప్రత్యేక చర్యలలో ఒకటి. దీని ఫలితాలు అత్యద్భుతం.
వీటిద్వారా ఎందరో యువతీయువకులు పటిష్ఠ శిక్షణతో ప్రతిభావంతులైన క్రీడాకారు లుగా వెలుగులోకి వచ్చారు. వీరిలో అఫ్షాన్ ఆషిఖ్ పేరు నాకింకా గుర్తుంది. ఎందుకంటే– 2014 డిసెంబరు నాటికి శ్రీనగర్‌లో రాళ్లు విసిరే అల్లరిమూకలో ఆమె ఒకరుగా ఉండేది. అయితే, సముచిత చర్యలు, ప్రోత్సాహంతో ఆ యువతి ఫుట్‌బాల్ వైపు మళ్లి జాతీయ స్థాయిలో పేరుప్రతిష్ఠలు సంపాదించింది. ఆ తర్వాత యువతరంతో సుదృఢ భారతం కార్యక్రమం సందర్భంగా ఓసారి నేను ఆమెతో సంభాషించినట్లు నాకిప్పటికీ గుర్తుంది.
ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధిలో పంచాయితీ ఎన్నికలు ఒక మేలిమలుపు. మరోసారి మేం అధికారంలో కొనసాగడం లేదా మా సిద్ధాంతాలకు కట్టుబాటు... అనే వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవా ల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాం. మాకు ఇదేమంత కఠినమైనది కాదు. అధికారం వదులుకున్నా, సిద్ధాంతాలను నిలబెట్టుకున్నాం. ఆ మేరకు జమ్మూ ప్రజల ఆకాంక్షలు, కశ్మీర్ ప్రగతికే అత్యంత ప్రాధాన్యమిచ్చాం. పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి కావడం అక్కడి ప్రజల ప్రజాస్వామిక స్వభావాన్ని స్పష్టం చేసింది.
గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులతో సంభాషించాలని నా మనస్సుకు తోచింది. ఈ సందర్భంగా ఇతరత్రా సమస్యలపై మాట్లాడటంతో పాటు నేను వారికొక అభ్య ర్థన చేశాను. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలను తగులబెట్ట రాదని, ఈ వాగ్దానానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశాను. ఆ తర్వాత వారు తమ హామీని నిలబెట్టుకోవడం నన్నెంతో ఆనందింప జేసింది. పాఠశాలలు తగుల బడితే అందరి కన్నా ఎక్కువగా బాధపడేది పసివాళ్లే!
ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీ ఒక చరిత్రాత్మక దినంగా ప్రతి భారతీయుడి హృదయంలో నాటుకు పోయింది. ఆ రోజున ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మన పార్లమెంటు చారిత్రక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ లలో పెనుమార్పులు వచ్చాయి. చివరకు 2023 డిసెంబరులో న్యాయ స్థానం తీర్పు దాన్ని బలపరచింది. ఈ మూడు ప్రదేశాల్లో అభివృద్ధిని చూశాక నాలుగేళ్ల కిందటి పార్లమెంటు నిర్ణయంపై ప్రజాకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రతిధ్వనింపజేసింది. రాజకీయాల స్థాయిలో గత 4 ఏళ్లుగా క్షేత్రస్థాయిన ప్రజా స్వామ్యంపై సరికొత్త విశ్వాసం పునరుద్ధరించబడింది.
అంతకు ముందు సమాజంలోని మహిళలు, గిరిజనులు, ఎస్సీ/ఎస్టీ, అణగా రిన వర్గాలకు దక్కా ల్సిన ప్రయోజనాలు అందేవి కావు. అదే సమ యంలో లద్దాఖ్ ఆకాంక్షలు పూర్తిగా విస్మరణకు గురయ్యాయి. అయితే, 2019 ఆగస్టు 5న ఈ పరిస్థితి సమూలంగా మారిపోయింది. ఇప్పుడు కేంద్ర చట్టాలన్నీ ఎలాంటి భయపక్షపాతాలూ లేకుండా అమలవుతున్నాయి. ప్రాతి నిధ్యం మరింత పెరిగింది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. అందరూ విస్మరించిన శరణార్థి సమాజాలు అభివృద్ధి ఫలాలను ఆస్వాదించడం ప్రారంభించాయి.
కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు సంతృప్త స్థాయికి చేరింది. మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక రంగానికి చేయూతతో కశ్మీర్ అందాలు ప్రతి ఒక్కరికీ మళ్లీ స్వాగతం పలుకు తున్నాయి. ఈ ఘనత సహజంగానే జమ్మూ–కశ్మీర్ ప్రజల దృఢ సంకల్పానికి దక్కుతుంది. ఈ మేరకు తాము ప్రగతి కాముకులం మాత్రమేనని, ఈ సానుకూల మార్పునకు చోదకులు కావడానికి సిద్ధంగా ఉన్నామని వారు పలుమార్లు నిరూపించుకున్నారు. గతంలో జమ్ము, కశ్మీర్, లద్దాఖ్‌ల పరిస్థితి ఒక ప్రశ్నార్థకంలా ఉండేది. కానీ, ఇప్పుడది ‘‘రికార్డు వృద్ధి, రికార్డు ప్రగతి, రికార్డు స్థాయిలో పర్యాటక ప్రవాహం’’తో ఆశ్చర్యార్థకానికి ప్రతీకగా మారింది.
జమ్ము, కశ్మీర్, లద్దాఖ్‌లలోప్రతి బిడ్డ నేడు స్వచ్ఛమైన నేపథ్యంతో జన్మిస్తున్నాడు. అక్కడ అతను లేదా ఆమె శక్తిమంతమైన ఆకాంక్షలతో కూడిన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. ప్రజల స్వప్నాలు నేడు గతానికి బందీలు కావు. భవిష్యత్తుకు బంగారుబాట పరిచే అవకాశాలు. అన్నింటికీ మించి భ్రమలు, నిరాశా నిస్పృహల
స్థానంలో ఇప్పుడు అభివృద్ధి, ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం పరిఢ విల్లుతున్నాయి!
నరేంద్ర మోదీ
భారత ప్రధాని
Comments
Please login to add a commentAdd a comment