సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దుచేసే అవకాశం ఉందని లదాఖ్ వాసులు ఊహించారు. కానీ జమ్మూ కశ్మీర్ నుంచి లదాఖ్‌ను వేరు చేస్తారని మాత్రం వారిలో ఎవరూ ఊహించలేక పోయారు. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామానికి వారు అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాంస్కృతికంగా జమ్మూ కశ్మీర్ ప్రజలతో విభేదించే లదాఖ్ వాసులు ఎప్పటి నుంచో ప్రత్యేక లదాఖ్‌ను కోరుకుంటుండమే అందుకు కారణం.
లదాఖ్‌లో మొదటి నుంచి బౌద్ధులు ఎక్కువ. వారు 1934లో ‘లదాఖ్ బౌద్ధుల సంఘం’ను ఏర్పాటు చేశారు. ‘ఫ్రీ లదాక్ ఫ్రమ్ కశ్మీర్’ అంటూ వారు 1989లో ఆందోళన చేపట్టి తీవ్రతరం చేశారు. లదాఖ్‌ను వదిలి వెళ్లాల్సిందిగా ముస్లింలను హెచ్చరించారు. కశ్మీర్, లెహ్ జిల్లాకు చెందిన ముస్లింలపై ఆర్థిక ఆంక్షలను విధించారు. 1992లో వారు ఈ ముస్లింల బహిష్కరణను ఉపసంహరించుకున్నారు. లదాఖ్ ప్రాంతం అభివృద్ధి కోసం 1995లో ‘లదాఖ్ స్వయంప్రతిపత్తి గల జిల్లా కౌన్సిల్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినప్పటికీ వారిలో జమ్మూ కశ్మీరీల పట్ల బేధ భావం పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టం చేసినా కశ్మీర్ కేంద్రంగానే ఉండేవని, తమను చిన్న చూపు చూస్తున్నారనే భావం లదాఖ్ వాసుల్లో ఎన్నడూ పోలేదు. కశ్మీర్‌లో జరిగే ఏ ఆందోళనతోనూ లదాఖ్‌కు సంబంధం లేకపోయినా, కశ్మీర్‌లో కాలేజీలు మూసివేస్తే లదాఖ్‌లో మూసివేయాల్సి వచ్చేది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కారీ లదాఖ్ ప్రాంతంలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో లదాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని హామీ ఇచ్చారు. అది అమలు జరుగుతుందని కూడా ప్రజలు భావించలేదు.
ఇప్పుడు అనూహ్యంగా లదాఖ్‌ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించడం ఆశ్చర్యంగా ఉందని లెహ్‌లోని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు త్సేరింగ్ నామ్‌గ్యాల్ వ్యాఖ్యానించారు. పార్టీలతో ప్రమేయం లేకుండా తమ ప్రాంతం వేరైనందుకు తామంతా ఆనందిస్తున్నామని ఆయన చెప్పారు. లెహ్ జిల్లా నుంచే ప్రత్యేక లదాఖ్ ఉద్యమం పుట్టిందని లదాఖ్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు హుస్సేన్ ఖలో తెలిపారు. లదాఖ్‌లోనే ఉన్నప్పటికీ లెహ్, కార్గిల్ జిల్లా వాసులకు పడదని, కార్గిల్ వాసులు కశ్మీర్‌వాసులతోని కలుస్తారుగానీ లెహ్ వాసులతో కలవరని కార్గిల్ జిల్లాలో ఉంటున్న హుస్సేన్ ఖలో చెప్పారు. లదాఖ్ నుంచి కార్గిల్‌ను వేరు చేయాల్సిందిగా మరో డిమాండ్ త్వరలోనే తెరపైకి రావచ్చని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment