విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి బొత్స. చిత్రంలో మంత్రులు, మతపెద్దలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మత విద్వేషాలకు తావులేదని, క్షుద్ర రాజకీయాలకు పాల్పడే వారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సర్వమతాలకు చెందిన పెద్దలు విజ్ఞప్తి చేశారు. మతకల్లోలాలు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అన్ని మతాల వారు అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవిస్తున్నారని చెప్పారు. పార్టీలు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ ప్రజలకు చేటు చేసేలా, మతాలను కించపరిచేలా, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఏ పార్టీ, ఏ వర్గమూ, ఏ ఒక్కరూ వ్యవహరించవద్దని సవినయంగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు మంత్రుల కమిటీ శుక్రవారం విజయవాడలో నిర్వహించిన సర్వమత సమావేశంలో పాల్గొన్న అనంతరం మతపెద్దలు ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలివీ..
అలాంటి ధోరణులు సరికాదు..
మన రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం ఉంది. మతపరమైన విద్వేషాలు లేవు. హిందువులు, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు.. అన్ని మతాల ప్రజలు తమ ఆచారానికి అనుగుణంగా జీవనం గడుపుతున్నారు. ఎక్కడా మతపరంగా మెజార్టీ, మైనార్టీ అన్న భావన ప్రజల్లో లేదు. ఇటీవల మారుమూల ప్రాంతాల్లోని ఆలయాల్లో జరుగుతున్న ఘటనలు, అనంతరం కొందరు చేస్తున్న విషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఈ తరహా ధోరణులు ఎంతమాత్రం సబబు కాదు. విద్వేషాలను విరజిమ్మేలా వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టే ధోరణి ఏమాత్రం తగదు. ఈ పని ఎవరు చేసినా ఆమోదయోగ్యం కాదు.
వన్నె తరగని మత సామరస్యం
తరతరాలుగా మత సామరస్యం భారతీయ సంస్కృతికి వన్నె తెచ్చింది. చుట్టుపక్కల దేశాల్లో రాజకీయంగా, సామాజికంగా అస్థిర పరిస్థితులు ఉన్నా... ప్రజలు కలసి మెలసి ఉంటున్నారు కాబట్టే మన దగ్గర సుస్థిర ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గర ఒకే చోట ఆలయం, దర్గా కనిపిస్తాయి. ఉర్సు (ముస్లింల ఆధ్యాత్మిక కార్యక్రమం) ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో హిందువులూ హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. నెల్లూరు జిల్లాలో బారా షహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండుగకు అన్ని మతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. చాలామంది హిందువులు మస్తాన్ అనే పేరు పెట్టుకోవడం చూశాం. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు తరతరాలుగా కలిసే ఉంటున్నారు. ఇక మీదట కూడా అలాగే ఉంటారు.
కుట్రదారులకు నిలువనీడ లేకుండా చేయాలి..
ప్రభుత్వ పథకాల అమలులో మతాలకు అతీతంగా పేదలకు సాయం చేయటమే ఏకైక ప్రామాణికంగా ఉన్నప్పుడు, అన్ని మతాలకూ గౌరవ మర్యాదలు దక్కుతున్నప్పుడు, ప్రభుత్వ పెద్దలు అన్ని మతాల సంప్రదాయాలకు గౌరవం ఇస్తున్నప్పుడు... మత సామరస్యాన్ని దెబ్బతీసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికావు. ఏ దేవాలయం మీద దాడి చేసినా, ఏ ప్రార్థనా మందిరం మీద దాడి చేసినా అది ముమ్మాటికీ తప్పు. ఆ తప్పు చేసినవారు కచ్చితంగా శిక్షించబడాలి. అలాంటి ఘటనలను ఆసరాగా తీసుకుని లేని విద్వేషాలను సృష్టించే ప్రయత్నాలు చేయవద్దు. లేని విచ్ఛినాన్ని దయచేసి తెలుగు సమాజంలోకి తీసుకురాకండి. ప్రజలంతా ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రతో బయలుదేరిన వ్యక్తులకు నిలువనీడ లేకుండా చేయాలి. తప్పు చేసినవారిని వెతికి పట్టించేందుకు గ్రామాల్లో ప్రజలు సహకరించాలి.
రాష్ట్రంలో అన్ని మతాలవారు సంయమనం పాటిస్తూ సౌభ్రాతృత్వంతో మెలగాలి. తమ మతాలను అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలి.
– వేణుగోపాల దీక్షితులు, ప్రధాన అర్చకులు, తిరుమల శ్రీవారి ఆలయం
ప్రజలంతా ప్రేమ, శాంతితో జీవనం సాగించాలి. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం మంచి పాలన అందిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు పరస్పరం సహనం, స్నేహభావంతో మెలగాలి. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో కొన్ని దుస్సంఘటనలు జరగడం బాధాకరం. ఏ మతం కూడా విధ్వంసాన్ని ప్రోత్సహించదు.
– సయ్యద్ అహ్మద్ పీర్ షామిరీ, షామీరా పీఠాధిపతి
ప్రజాస్వామ్యయుతమైన మన దేశంలో ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో మెలగాలి. ప్రేమ, సహనం, సర్వమత సౌభ్రాతృత్వమే సమాజం అనుసరించే విధానం కావాలి. మత విద్వేషాలను ఏ మతం కూడా అంగీకరించదు. మౌఢ్యం, విద్రోహ చర్యలకు మతాన్ని వాడుకోవాలని కొందరు భావించడం క్షమార్హం కాదు. అలాంటి వాటిని ప్రజలు సమష్టిగా తిప్పికొట్టి శాంతియుత జీవనం సాగించాలి’
– సీహెచ్ మోడరేటర్, రెవరెండ్
Comments
Please login to add a commentAdd a comment