సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పెనుమూరు ప్రభుత్వ వైద్యురాలు అనితా రాణి వ్యవహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై నిజానిజాలేంటో తేల్చాలంటూ ఆయన సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చారు. కాగా, డాక్టర్ అనితా రాణి.. కొంతమంది తనను వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వేధింపులపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందిస్తూ సమగ్ర విచారణకు ఆదేశించారు. మహిళ కమిషన్ సైతం డాక్టర్ అనితా రాణి వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. చిత్తూరు జిల్లా అధికారులను నివేదిక కోరారు. (సమగ్ర భూ సర్వేలో ఆలస్యం వద్దు: సీఎం జగన్)
అయితే, ప్రభుత్వ వైద్యురాలు అనితారాణిపై గతంలో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయని, పని చేసిన ప్రతిచోట రోగులతో కూడా గొడవలు పెట్టుకునేవారని జిల్లా వైద్యాధికారి పెంచలయ్య తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యం చేయకుండా రక్తం కారుతున్నా బయటకు పంపడంతో రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడం వాస్తవమేనన్నారు. ఆసుపత్రికి వచ్చిన వారికి చికిత్స అందించకపోవడం తప్పు కాదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పని చేసినప్పుడు ఆరు నెలలకు మించి కూడా ఆమె ఎక్కడ పని చేయలేదని గుర్తు చేశారు. బిల్లు విషయంలోనూ ఒక సబ్ ట్రెజరీ అధికారితో కూడా గొడవ పెట్టుకున్నారన్నారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని పెంచలయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment