వైఎస్‌ జగన్‌: శభాష్‌..సిద్ధార్థ అంటూ సీఎం ప్రశంసలు! | YS Jagan Praises Prakasam SP Siddhartha Kaushal on Security Maintenance in Nadu-Nedu Program - Sakshi
Sakshi News home page

శభాష్‌..సిద్ధార్థ అంటూ సీఎం జగన్‌ ప్రశంసలు! 

Published Fri, Nov 15 2019 7:19 AM | Last Updated on Fri, Nov 15 2019 5:06 PM

CM YS Jagan Praised Prakasam SP Siddhartha Kaushal - Sakshi

శాంతి భద్రతలపై పోలీసు అధికారులకు సూచనలిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

సాక్షి, ఒంగోలు: నాడు–నేడు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సమర్థంగా సభ నిర్వహించారంటూ ఎస్పీ సిద్థార్థ కౌశల్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గుంటూరు రేంజి ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ శభాష్‌ సిద్ధార్థ..అంటూ ప్రశంసించారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కావడం, వేదిక మొత్తం జనంతో కిక్కిరిసి పోయింది.  క్రౌడ్‌ కంట్రోల్‌ విషయంలో తీసుకున్న చర్యలు బాగున్నాయంటూ సీఎం నుంచి ఎస్పీ ప్రశంసలు అందుకున్నారు. బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీతో పాటు విధుల్లో పాల్గొన్న సిబ్బందిని కూడా జగన్‌ అభినందించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న చర్యలు బాగున్నాయని ఎస్పీ పలువురి ప్రశంసలు అందుకున్నారు. 

బారులు తీరిన అభిమానం
ఒంగోలు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు రాక సందర్భంగా ఆయన కోసం జనాభిమానం బారులు తీరింది. పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలు కూడా ఉత్సాహంగా కనిపించారు. గుంటూరు రేంజి ఐజి వినీత్‌బ్రిజ్‌లాల్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌లు సీఎం రాకకు ముందే పోలీసు ట్రైనింగ్‌ కాలేజీలోని హెలిపాడ్‌ను, సభావేదికను, వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. మన బడి నాడు–నేడు కార్యక్రమ ప్రారంభానికి షెడ్యూలు ప్రకారం సీఎం గురువారం ఉదయం 10.10 గంటలకు చేరుకోవాల్సి ఉండగా 10.25 గంటలకు స్థానిక పోలీసు ట్రైనింగ్‌ కాలేజీలో హెలికాప్టర్‌ నుంచి దిగారు. ఆయనతోపాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పినిపె విశ్వరూప్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలు కూడా ఆయన వెంట వచ్చారు. హెలిప్యాడ్‌ వద్ద సీఎంకు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ పోల భాస్కర్, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు స్వాగతం పలికారు.
 
భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్, డీఎస్పీ జి. నాగేశ్వరరెడ్డి 
అడుగడుగునా నిఘా నేత్రం:
సీఎం సభ ఎటువంటి అంతరాయం లేకుండా సాగేందుకు గుంటూరు రేంజి ఐజీ, జిల్లా ఎస్పీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. వేదిక పక్కనే గ్రీన్‌రూముకు ఆనుకుని కమాండ్‌ కంట్రోల్‌ రూమును ఒక దానిని ఏర్పాటు చేశారు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ రూములో భారీ సిస్టంలు రెండు ఏర్పాటు చేసి సభాప్రాంగణం, ఆవరణతోపాటు చుట్టుపక్కల రహదారులలో పరిస్థితులను ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీతోపాటు మార్కాపురం డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డిలు పరిశీలిస్తూ తగు ఆదేశాలు జారీచేయడం ప్రారంభించారు. రంగారాయుడు చెరువువద్ద ఉన్న ఫ్యాన్సీ గూడ్స్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ వద్దనుంచి కాపు కళ్యాణమండపం రోడ్డు చివరవరకు, ఇటు అంజయ్యరోడ్డులో బ్రిలియంట్‌ కంప్యూటర్‌ వరకు రహదారులు కిక్కిరిసిపోయాయి. ఈ సమయంలో స్వాట్‌ టీం కూడా ప్రాంగణ ముఖద్వారం వద్ద ఉండి అధికారులకు భద్రతా ఏర్పాట్లలో చేయూతనిచ్చి ప్రశంసలు అందుకుంది. 

ఉన్నది 2.15గంటలే:
ఉదయం 10.25కు ఒంగోలు పోలీసు ట్రైనింగ్‌ కాలేజీలో దిగిన సీఎం తిరిగి 12.37 గంటలకు హెలిపాడ్‌ చేరుకున్నారు. 12.40 గంటలకు హెలికాప్టర్‌ టేకాఫ్‌ తీసుకుంది. మొత్తం 2.15గంటలపాటు ఆయన ఒంగోలులో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా పాఠశాలల బస్సులు సైతం సభాప్రాంగణం నుంచి వెళ్లిపోయాయి. ఆ వెంటనే ట్రాఫిక్‌ మొత్తం క్లియర్‌ కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో సామాన్య ప్రజలు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement