బ్రహ్మణీ స్టీల్స్ శంకుస్థాపన కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి (ఫైల్)
రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీకి ఈనాటికి దిక్కులేదు.. పార్లమెంటు సాక్షిగా చట్టం చేసినా కేంద్రం మాత్రం పట్టించుకోలేదు. విభజన జరిగి ఐదేళ్లు గడిచిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ బీజేపీతో కలిసి నాలుగున్నరేళ్లు కాపురం చేసినా ఉక్కుకు బీజం పడలేదు. బీజేపీతో విడిపోయిన తర్వాత టీడీపీ సర్కార్ ఓట్ల కోసం కొత్త రాజకీయానికి తెర తీసింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓట్లు.. సీట్లే లక్ష్యంగా చంద్రబాబు కొత్త డ్రామాకు తెర తీశారు. ఉక్కు పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వమే నెలకొల్పుతుందంటూ ఎత్తులు వేస్తూ గత డిసెంబరు 27న పునాదిరాయి వేశారు. రూ. రెండు కోట్లో నిధులు కేటాయించి ఉసూరుమనిపించారు.
అయితే అంతకుముందే ప్రజా సంకల్పపాదయాత్ర సందర్భంగా...ఎన్నికలకు ముందు కూడా మాట ఇచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే మాట నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. జులై 8న జమ్మలమడుగుకు వచ్చిన సీఎం జగన్ వైఎస్సార్ రైతు దినోత్సవ సందర్భంగా రానున్న డిసెంబరులోనే ఉక్కు పరిశ్రమకు భూమి పూజ చేసి మూడేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించి ఉక్కు పరిశ్రమ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేశారు.
సాక్షి, కడప : అత్యంత వెనుకబడిన రాయలసీమలో ఉక్కు పరిశ్రమకు సంబంధించి అనువైన వనరులున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా జిల్లాలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వసతులు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఉక్కు పరిశ్రమను జిల్లాలో నెలకొల్పాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఉక్కుకు సంబంధించి ముడి సరుకుతోపాటు ఇతర అవసరమైన వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఏర్పాటైతే దినదినాభివృద్ది చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు. 20–25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా అనుబంధ రంగాలు కూడా కొత్త పుంతలు తొక్కనున్నాయి. జిల్లా రూపురేఖలు కూడా మారిపోనున్నాయి.
ఉక్కు పేరుతో బాబు ఎన్నికల జి(ఎ)త్తులు
‘ఉక్కుఫ్యాక్టరీ శంకుస్థాపన ఎన్నికల స్టంట్‌లో భాగంగా తెరమీదికి తీసుకొచ్చారు. టీడీపీ అధినేత బాబు....రాయలసీమ స్టీల్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తరపున తెలియజేశారు. అయితే అప్పటి సీఎం చంద్రబాబు చిత్తశుద్ధిపై జిల్లా ప్రజలకు నమ్మకం అంతంత మాత్రమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే 1996, 1998లో సీఎం హోదాలో చంద్రబాబునాయుడు గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లే ‘స్టీల్‌ఫ్లాంట్ శంకుస్థాపన’గా వర్ణించారు. కడపలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రప్రభుత్వం రూపొందించింది. ఆమేరకు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని ప్రజానీకం ఉద్యమించింది. కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా తక్షణమే స్పందించి విభజన చట్టంలోని అంశాల సాధనకు కషి చేయాల్సిన టీడీపీ నేతలు ‘నిమ్మకు నీరెత్తినట్లు’గా అప్పట్లో వ్యవహరించారు.
ఎన్నికల ఎత్తులో భాగంగా డిసెంబరు 27న మైలవరం మండలంలోని కంబాలదిన్నె వద్ద ముఖ్యమంత్రి చేతుల మీదుగా ‘రాయలసీమ స్టీల్ కార్పోరేషన్ లిమిటెడ్’ఏర్పాటుకు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఏపీఎండీసీ, రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ 50:50 వాటాలతో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుందని, అందుకోసం రూ.2కోట్లు మూలధనంతో రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేçస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిజంగా టీడీపీ సర్కార్‌కు అప్పట్లో చిత్తశుద్ది ఉంటే అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే శిలాఫలకం వేసి పనులు చేపట్టి ఉండేవారు. అలా కాకుండా ఎన్నికలకు మూడు నెలలు ముందు పునాది రాయి వేయడం....ఎన్నికల జిత్తుగాక మరొకటి కాదు. అందుకే జిల్లా ప్రజలు కూడా విజ్ఞతతో ఓట్లు వేసి టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు.
బడ్జెట్‌లో భారీగా నిధులు
జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కానున్న నేపథ్యంలో బడ్జెట్‌లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికంగా నిధులు కేటాయించారు. ఉక్కుకు సంబంధించి తొలి విడతలోనే సుమారు రూ.250 కోట్లు కేటాయించారు. డిసెంబరులో శంకుస్థాపన చేయగానే పనులు కూడా వేగంగా జరిగే అవకాశం ఉంది. పనులు ప్రారంభం కావడమే తరువాయి....యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం శుభపరిణామం.
వైఎస్ జగన్ ఉక్కు సంకల్పం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉక్కు సంకల్పం నెరవేర్చే దిశగా శ్రీకారం చుట్టారు. ముందుగా శిలాఫలకం వేసే తేదితోసహా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెనువెంటనే బడ్జెట్‌లో భారీ ఎత్తున నిధులు కేటాయించి జిల్లా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఏది ఏమైనా ఉక్కు పరిశ్రమకు డిసెంబరులో పునాది రాయి పడడంతోపాటు నిధులు పుష్కలంగా ఉండడంతో పనులు వేగవంతంగా జరుగుతాయని జిల్లా వాసులు ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment