సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్ శాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. తీవ్ర రుణభారం, బకాయిల నుంచి డిస్కంలను గట్టెక్కించే మార్గాలపై ప్రధానంగా చర్చ జరిగింది. జెన్, ట్రాన్స్ కో ఆర్థిక పరిస్థితులపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల వివరాలు ఆయనకు తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు అమ్ముతామంటూ ఎవరైనా ముందుకు వస్తే.. వారితో ఒప్పందాలు కుదుర్చుకోండని ఈ సందర్భంగా సీఎం సూచించారు. దీనివల్ల డిస్కంలపై భారం తగ్గుతుందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో మాదిరిగా అధిక ధరలకు కాకుండా రీజనబుల్ ఖరీదుకు ఎవరు అమ్మినా విద్యుత్‌ను కొనుగోలు చేయండని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
దాంతోపాటు.. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాలక్రమంలో ఈ ప్లాంట్‌ను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. జెన్‌కో థర్మల్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన బొగ్గుతో ప్లాంట్ల సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. హైడ్రో రివర్స్ పంపింగ్ ప్రాజకెక్టులపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రం విద్యుత్ అమ్మకాల కోసం ఇన్వెస్టర్ల కోసం ఎక్స్‌పోర్టు పాలసీ రూపొందించాలన్నారు. విద్యుత్ రంగంలో అవినీతికి చోటు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment