
సాక్షి, అమరావతి: ఐటీ, నైపుణ్యాభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. నైపుణ్య వికాస కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా అత్యుత్తమ స్థాయిలో.. నైపుణ్యాభివృద్ధి కోసం కొత్తగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కేంద్రం చొప్పున 25 కేంద్రాలు, నాలుగు ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా ఒక్కొక్కటి, పులివెందుల జేఎన్టీయూకు అనుబంధంగా మరో కేంద్రం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటి పర్యవేక్షణకు ఒక కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేసి, దానిని భవిష్యత్‌లో విస్తరించాలని సీఎం చెప్పారు.
విశాఖలో ఐటీ రంగానికి సంబంధించిన హై ఎండ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీనికి అనుబంధంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరో 2 సంస్థల్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు వీటిల్లో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టం చేశారు. వీటికి సంబంధించి 45 రోజుల్లోగా భూముల గుర్తింపు, ఆర్థిక వనరుల సమీకరణ పూర్తి కావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో.. పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment