నైపుణ్య కేంద్రాలతో పారిశ్రామిక ప్రగతి | CM YS Jaganmohan Reddy Review Meeting On IT And Skill Development | Sakshi
Sakshi News home page

నైపుణ్య కేంద్రాలతో పారిశ్రామిక ప్రగతి

Published Tue, Feb 18 2020 4:08 AM | Last Updated on Tue, Feb 18 2020 5:15 AM

CM YS Jaganmohan Reddy Review Meeting On IT And Skill Development - Sakshi

ఏడాదిలోగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఒకే నమూనాలో అందుబాటులోకి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇందుకు అవసరమైన భూమిని గుర్తించడంతోపాటు, ఆర్థిక వనరుల సమీకరణను 45 రోజుల్లోగా పూర్తి చేయాలి. ప్రభుత్వం వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలన్నీ ఈ విభాగం పరిధిలోకి తీసుకురావాలి.

నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో కోర్సులు, సిలబస్, శిక్షణా కార్యక్రమాలు, ఇతర ప్రణాళిక అంశాల కోసం పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి గౌతమ్‌ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో ఉన్నత విద్యా మండలి, ఐటీ విభాగాలకు చెందిన అధికారులను సభ్యులుగా చేర్చాలి. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడం కోసం విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలు కలసి పని చేయాలి. 

సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచాలని, దేశంలోనే నైపుణ్య వికాస కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 30 నైపుణ్య కేంద్రాలతో పాటు, ఐటీ రంగం కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఐటీ పాలసీ, నైపుణ్యాభివృద్ధిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రంతో పాటు, నాలుగు ట్రిపుల్‌ ఐటీలకు అనుబంధంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వీటితోపాటు పులివెందుల జేఎన్‌టీయూలో కూడా మరో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పాలన్నారు. ఈ కేంద్రాల్లో పాఠ్య ప్రణాళిక, పర్యవేక్షణ, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కోర్సులను ఆధునికీకరించడం కోసం కేంద్రీకృత అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ను ముందుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

ప్రతిభావంతుల్లో నైపుణ్యం పెంచాలి
ఐటీ రంగానికి అవసరమైన నిపుణులను అందించడం కోసం విశాఖలో హైఎండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలతో పోటీ పరిస్థితి రావాలంటే నైపుణ్యాలకు అనుగుణంగా నగరాలను అభివృద్ధి చేయడమే మార్గమన్నారు. ఇంజనీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని ఎంపిక చేసి, ఈ హైఎండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రంలో శిక్షణ ఇప్పించడం ద్వారా వారిలో నైపుణ్యాన్ని మరింత పెంచాలని సూచించారు. విశాఖ కేంద్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత దీనికి అనుబంధంగా మధ్య ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో మరో రెండు సంస్థలను ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండని సూచించారు.
క్యాంప్‌ కార్యాలయంలో ఐటీ పాలసీ, నైపుణ్యాభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

డీ–శాలినేషన్‌ నీరు ఉపయోగించాలి
కోస్తా ప్రాంతంలో సాధ్యమైనంత వరకు పరిశ్రమలకు మంచి నీటికి బదులు శుద్ధి చేసిన సముద్రపు నీరు (డీ–శాలినేషన్‌) అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఇజ్రాయిల్‌ వంటి దేశాల్లో డీశాలినేషన్‌ నీటిని లీటర్‌ నాలుగు పైసలకే విక్రయిస్తున్నారని, ఈ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా పరిశ్రమలకు మంచి నీటిని బదులు సముద్రపు నీటిని వినియోగించుకునేలా చూడాలన్నారు. ఇందుకోసం సంబంధిత కంపెనీలతో మాట్లాడి డీ–శాలినేషన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం రూ.4,500 కోట్లకు పైగా పరిశ్రమలకు రాయితీలు చెల్లించకుండా బకాయిలు పెట్టిందని, రాష్ట్రంపై నమ్మకంతో ఇక్కడ పరిశ్రమలు పెడితే వారికి రాయితీలు కూడా చెల్లించకుండా మోసం చేసిందన్నారు.

ఐటీ రంగంలో రాష్ట్రానికి ఉన్న అవకాశాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా పాలసీ రూపకల్పనపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి గౌతం రెడ్డి, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా మధు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అనంతరాము, ఐటీ, సివిల్‌ సప్‌లైయిస్‌ ప్రిన్సిపల్‌  కార్యదర్శి కోన శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement