వ్యవ'సాయం' ఆగొద్దు | CM YS Jagan Review Meeting With Officials On Corona Virus Prevention | Sakshi
Sakshi News home page

వ్యవ'సాయం' ఆగొద్దు

Published Sat, Apr 4 2020 2:11 AM | Last Updated on Sat, Apr 4 2020 10:37 AM

CM YS Jagan Review Meeting With Officials On Corona Virus Prevention - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ పరీక్షల సామర్ధ్యం పెంపుపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌లు, వాటి సామర్థ్యం వివరాలను పరిశీలించిన ముఖ్యమంత్రి వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా కట్టడి చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తీరు, ఢిల్లీ యాత్రికులు, వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు, క్యాంపుల్లో వలస కూలీలకు వసతి సదుపాయాలు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల కార్యకలాపాలు, ఇంటింటి సర్వే స్థితిగతులపై ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ...

గౌరవంగానే లాక్‌డౌన్‌..
► పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తూనే ప్రజలకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని పోలీసులకు సీఎం సూచించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై అనుసరించాల్సిన విధానం పట్ల కూడా దృష్టి సారించాలన్నారు. పోలీసులపై విపరీతమైన పని ఒత్తిడి ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి మనం వాడే భాష, కౌన్సెలింగ్‌ తీరుకూడా ముఖ్యమనేది మరవకూడదని సూచించారు. ప్రజల పట్ల గౌరవ, మర్యాదలు చూపిస్తూనే లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. బాపట్ల యువకుడు ఆత్మహత్య కేసు విషయంలో విచారణ నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

ధరల బోర్డులు తప్పనిసరి
► పట్టణ ప్రాంతాలైనా గ్రామాల్లోనైనా సరే ప్రతి దుకాణం వద్ద మనిషి  మనిషికి మధ్య దూరం పాటించేలా మార్కింగ్స్‌ ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రద్దీ ఉన్నా లేకున్నా మార్కింగ్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల ప్రజలకు ఒక సంకేతం ఇచ్చినట్లు అవుతుందని, కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. ప్రతి దుకాణం వద్ద నిర్దేశించిన ప్రకారం ధరల బోర్డులు ఏర్పాటు చేసేలా గట్టి చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇంటింటి సర్వేపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా... 
► వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు నిర్వహించిన ఇంటింటి సర్వేపై సీఎం ఆరా తీశారు. రాష్ట్రంలోని 1.45 కోట్ల ఇళ్లకు గానూ 1.28 కోట్ల నివాసాల్లో సర్వే పూర్తయినట్లు అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా చేసిన సర్వేలో 3,456 మందికి సాధారణ జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం లాంటి ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు. రెండోదశలో వీరిని పరీక్షించేందుకు వైద్యులను పంపిస్తారు. వారిలో ఎవరికైనా కరోనా వైరస్‌  అనుమానిత లక్షణాలు కనిపిస్తే తదుపరి నిర్థారణ పరీక్షలకు, అవసరమైతే డాక్టర్ల సూచన మేరకు క్వారంటైన్‌కు పంపిస్తారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో వార్డులవారీగా డాక్టర్ల నియామకంపై అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. వైద్యుల మ్యాపింగ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. 
► కరోనా కారణంగా పనులు లేక జీవనోపాధి కోసం ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1,000 ఆర్థిక సాయాన్ని శనివారం వలంటీర్ల ద్వారా సమర్థంగా డోర్‌ డెలివరీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 

రోజూ 900 మందికి పరీక్షలు..
► ఢిల్లీలో సదస్సుకు హాజరైన వారితోపాటు వారితో సన్నిహితంగా మసలిన వారికి కూడా పూర్తిస్థాయిలో కరోనా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు. పోలీసులు, వైద్య సిబ్బంది డేటాతోపాటు క్షేత్రస్థాయి సర్వే డేటాను విశ్లేషించి ఒక వ్యూహం ప్రకారం వైద్య పరీక్షల విషయంలో ముందుకు వెళ్లాలని సూచించారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు తెలియచేశారు.

► గుంటూరు, కడప ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు ప్రారంభం కాగా  సోమవారం నుంచి విశాఖలోనూ మొదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటి ద్వారా రోజుకు కనీసం 700 మందికి పరీక్షలు నిర్వహించే వీలుంది. ప్రైౖవేట్‌ ల్యాబ్‌ల సహకారం తీసుకునేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడలో ప్రైవేట్‌ ల్యాబ్‌ ఏర్పాటు కానుంది. తద్వారా రోజుకు 900 మందికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి చేరుకుంటామని అధికారులు వివరించారు.
శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు, అధికారులు   

140 కేసులు ఢిల్లీ లింకే..
► ఢిల్లీలో జమాతేకు ఏపీ నుంచి 946 మంది వెళ్లి వచ్చినట్లు తేలింది. వీరిలో 881 మందికి ఇప్పటికే పరీక్షలు నిర్వహించగా 108 పాజిటివ్‌ కేసులుగా నిర్థారించారు. 65 మంది ఫలితాలు రావాల్సి ఉంది.
► ఇక ఢిల్లీ వెళ్లి వచ్చిన 946 మందితో కాంటాక్ట్‌ అయినవారిలో 616 మందికి పరీక్షలు నిర్వహించగా 32 మందిని పాజిటివ్‌ కేసులుగా నిర్థారించారు. కాంటాక్ట్‌ అయిన మరో 335 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. 
► రాష్ట్రంలో పాజిటివ్‌గా తేలిన మొత్తం  కేసుల్లో 140 మంది ఢిల్లీ జమాతే సదస్సుకు వెళ్లినవారు, వారితో కాంటాక్ట్‌ అయినవారేనని అధికారులు  వెల్లడించారు.

కొనుగోళ్లు సాఫీగా..
► రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగాలని సీఎం ఆదేశించారు. కొనుగోళ్లపై గ్రామాల వారీగా ప్రణాళిక రూపొందించి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయం, మార్కెటింగ్, పౌరసరఫరాలపై మంత్రులు, టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న అధికారులు క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 
► ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై తీసుకుంటున్న చర్యలను సీఎం సమీక్షించారు. ఏప్రిల్‌ 2న 803.4 మెట్రిక్‌ టన్నులు ఎగుమతి చేశామని, ఇక ఈ రెండు మూడు రోజుల్లో పంపిన వాటితో కలిపి మొత్తం 1,530 మెట్రిక్‌ టన్నులను విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులనుంచి ఎగుమతి చేసినట్లు అధికారులు తెలిపారు.
► నిల్వ చేసేందుకు వీలులేని కూరగాయలు, ఇతర పంటల విషయంలో తీసుకుంటున్న చర్యలను సీఎం పరిశీలించారు. మదనపల్లె మార్కెట్లో  టమోటాలు కొనుగోలు చేసి రైతు బజార్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల డిమాండ్‌ పెరిగి టమోటా ధర కిలో రూ.4  నుంచి రూ.8కి పెరిగినట్లు చెప్పారు. రాష్ట్రంలో చిన్న చిన్న మార్కెట్లకూ అరటిని అందుబాటులో తెస్తున్నట్లు వివరించారు.

రాష్ట్రం బయట మనవాళ్లు ఎలా ఉన్నారు?
► రాష్ట్రం వెలుపల ఉన్న తెలుగువారి పరిస్థితిపై సమావేశంలో సీఎం ఆరా తీశారు. ముంబై, వారణాసి, గోవా, అజ్మీర్, తమిళనాడులో చిక్కుకుపోయిన తెలుగువారిని ఆదుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతాలకు అధికారులను పంపి వారి బాగోగులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

క్యాంపుల్లో 78,000 మంది
లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా క్యాంపుల్లో తలదాచుకుంటున్న వారి వివరాలను అధికారులు సేకరించారు. వీరి సంఖ్య 78,000 వరకు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వమే 236 క్యాంపులు నిర్వహిస్తూ 16 వేల మందికి వసతి, భోజన సదుపాయాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు.

► ప్రతి క్యాంపు వద్ద సాంఘిక సంక్షేమ శాఖకు  చెందిన అధికారిని నియమించారు. క్యాంపుల్లో ఇద్దరి ఫోన్‌ నంబర్లు తీసుకుని ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ సేకరిస్తున్నట్లు అధికారులు చెప్పారు. వివిధ కంపెనీల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర మార్గాల్లో మరో 62 వేలమందికి భోజనం అందుతోందన్నారు. లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14 వరకు ఉన్నందున దీనిపై దృష్టి సారించి వారి బాగోగులు పర్యవేక్షించాలని సీఎం సూచించారు.

దేశమంతా ఒక్కటవుదాం.. కరోనాపై విజయం సాధిద్దాం
ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపు
చెడుపై మంచి.. చీకటిపై వెలుతురు గెలవాలని.. అలాగే కరోనాపై చేస్తున్న పోరాటంలో మానవాళి విజయం సాధించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిలషించారు. కరోనాపై చేస్తున్న పోరాటంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలకతీతంగా మనమంతా ఒక్కటేనని, మన శత్రువు కరోనా అని చాటిచెబుతూ భారతీయులంతా ఏకమవుదామని సీఎం పిలుపునిచ్చారు. ఈ నెల 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముంగిట దివ్వెలను, సెల్‌ఫోన్‌ లైట్లను వెలిగించి... భారతీయులంతా ఒక్క తాటిమీదకు రావాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపునకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement