కోవిడ్‌ పట్ల భయాందోళనలు పోవాలి | CM YS Jagan Video Conference With Officials On Covid-19 Prevention | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ పట్ల భయాందోళనలు పోవాలి

Published Wed, May 20 2020 4:46 AM | Last Updated on Wed, May 20 2020 4:46 AM

CM YS Jagan Video Conference With Officials On Covid-19 Prevention - Sakshi

కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి ప్రతీదీ ఓపెన్‌ చేయాలి. రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రజా రవాణా కూడా ప్రారంభం అవుతుంది. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు ప్రారంభం అవుతాయి. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. 

మనం కోవిడ్‌–19తో కలిసి జీవించాల్సి ఉంటుంది. కరోనా వైరస్‌ సోకిన వారిని వివక్షతో చూడడం అన్నది సమాజం నుంచి తొలగించాలి. ప్రజల్లో భయాందోళనలను పూర్తిగా పోగొట్టాలి. కోవిడ్‌ సోకిన వారి పట్ల వివక్ష చూపరాదు. రాబోయే కాలంలో కోవిడ్‌ రాని వారు ఎవ్వరూ ఉండరేమో? అది వస్తుంది.. పోతుంది.. అని దాని పట్ల ఉన్న భయాన్ని తొలగించాలి. ఆ మేరకు వైరస్‌ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించాలి.

కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల పరిధిని తగ్గించుకుంటూ వెళ్లాలి. ప్రజలకు అందుబాటులో టెస్టింగ్‌ సదుపాయాలను తీసుకెళ్లాలి. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా, చేతులు శుభ్రపరుచుకునేలా ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కలిగించాలి.

ఎకానమీ పూర్తిగా ఓపెన్‌ కావాలి. ఇందుకు కలెక్టర్లు, ఎస్పీల భాగస్వామ్యం చాలా అవసరం. షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, మత పరమైన కార్యక్రమాలు, సదస్సులు.. ఇవి తప్ప మిగిలిన చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకుని అన్నీ ప్రారంభించాల్సి ఉంది.

సాక్షి, అమరావతి: కోవిడ్‌ అంటే ప్రజల్లో భయాందోళనలు పోవాలని, ఇందుకోసం ప్రజల్లో అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పరీక్షలు, వైద్యానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడమే అంతిమ పరిష్కారమని స్పష్టం చేశారు. మినహాయింపులతో నాలుగవ విడత లాక్‌డౌన్‌ అమలు, కోవిడ్‌–19 నియంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. నాల్గో విడత లాక్‌ డౌన్‌లో కరోనాపై దృష్టి సారిస్తూనే ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం, ఇతర అంశాలపై వారికి దిశ నిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పుడు ఏం చేయాలి?
► మనం ఇంతకు ముందు అనుసరించిన పద్దతి వేరు. ఇప్పుడు నాలుగో విడత లాక్‌డౌన్లో అనుసరిస్తున్న పద్దతి వేరు. ఈ విడతలో కోవిడ్‌ –19 నివారణపై దృష్టి కొనసాగిస్తూనే, మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. 
► ప్రజలు తమకు తాముగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకునే పరిస్థితి రావాలి. దీన్ని మనం ప్రోత్సహించాలి. పరీక్షల కోసం ఎవర్ని సంప్రదించాలి? ఎక్కడకు వెళ్లాలి? ఎలా పరీక్షలు చేయించుకోవాలనే విషయాలపై ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకురావాలి. పరీక్షల సదుపాయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
► రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ను తీసుకొస్తున్నాం. వీటి నిర్మాణాన్ని కలెక్టర్ల ప్రథమ పనిగా భావించాలి. అనుమానం ఉన్న వారు అక్కడకు వెళ్లి.. పరీక్షలు చేయించుకుని మందులు తీసుకునే ప్రక్రియ చాలా సాఫీగా సాగిపోవాలి. 
► ఆస్పత్రులను పూర్తిగా సన్నద్ధం చేసుకోవాలి. కోవిడ్‌ కేసుల్లో 98 శాతం మంది రికవరీ అయ్యి ఇంటికి వెళ్లిపోతున్నారు. 85 శాతం మంది ఇంట్లోనే చికిత్స పొంది కోలుకుంటున్నారు. ఈ రెండు ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

కోవిడ్‌ మరణాలు లేకుండా చూడాలి
► రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారితో పాటు, దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్న వారే మరణానికి గురవుతున్నారు. వైరస్‌ సోకిన వెంటనే వారు ఆస్పత్రికి రాగలిగితే.. మరణాలు లేకుండా చూడగలం. అయితే  వైరస్‌ వల్ల భయాందోళన కారణంగా వారు బయటకు చెప్పుకునే పరిస్థితి ఉండడం లేదు. 
► చివర దశలో ఆస్పత్రికి వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారిని కాపాడటం కష్టం అవుతోంది. వైరస్‌ రావడం తప్పు కాదు, వస్తే.. వైద్య సిబ్బందికి చెబితే చాలు.. వారు అన్ని రకాలుగా తోడుగా ఉంటారు. 

కలెక్టర్లు, ఎస్పీలే నా బలం
► కోవిడ్‌ నియంత్రణలో అందరూ బాగా పని చేశారు. దేశంలోనే అత్యధికంగా 2,48,711 పరీక్షలు చేశాం. ప్రతి పది లక్షల జనాభాకు 4,840 మందికి పరీక్షలు చేశాం. పరీక్షల్లో మనం (ఆంధ్రప్రదేశ్‌) నంబర్‌ వన్‌. కరోనా వైరస్‌ నుంచి 1,527 మంది పూర్తిగా రికవరీ అయ్యారు. 705 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. (వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు).
► రాష్ట్రంలో 0.94 శాతం పాజిటివిటీ ఉంది. 63.82 శాతం రికవరీ రేటు ఉంటోంది. 2.06 శాతం మరణాల రేటు ఉంది. ఈ డేటా అంతా చూశాక మనం కోవిడ్‌–19ను బాగానే నియంత్రించామని చెప్పగలం. 
► నా బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అని ప్రతిసారి చెబుతున్నా. ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా మిమ్మల్ని గుర్తించి బాధ్యతలు అప్పగించాం. పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను. అందుకే మీరే మా బలమని చెబుతున్నాను. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే. మీరు కోవిడ్‌ –19 నివారణలో అద్భుతంగా పని చేశారు.
► గ్రామ వలంటీర్, గ్రామ సచివాలయం, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, డాక్టర్ల దగ్గర నుంచి, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు,  పారిశుధ్య కార్మికులు అందరూ అద్భుతంగా పని చేశారు. 
► ఈ వీడియో కాన్పరెన్స్‌లో మంత్రులు పెద్డిరెడ్డి రామచంద్రా రెడ్డి, కొడాలి నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌ రెడ్డి, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement