మోసం చేసే మాటలు వద్దు: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On State Investment Promotion Board | Sakshi
Sakshi News home page

మోసం చేసే మాటలు వద్దు: సీఎం జగన్‌

Published Fri, Jun 5 2020 3:35 PM | Last Updated on Fri, Jun 5 2020 7:08 PM

CM YS Jagan Review Meeting On State Investment Promotion Board - Sakshi

సాక్షి, తాడేపల్లి: స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందించారు. కొత్త పారిశ్రామిక విధానం, అనుమతుల విషయంలో విధివిధానాలపై సీఎం అధికారులతో చర్చించారు. అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. పారిశ్రామిక విధానం నిజాయితీగా ఉండాలని, గత ప్రభుత్వం మాదిరిగా మోసం చేసే మాటలు వద్దని ఆయన స్పష్టం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ...

‘వందలాది కోట్ల రూపాయలను ఖర్చుచేసి పరిశ్రమను పెడుతున్నప్పుడు, అనుకున్న సమయానికి అది ప్రారంభమయ్యేలా చూద్దాం. తద్వారా వారి కార్యకలాపాలకు ప్రభుత్వం తరపున ఊతమిచ్చి చేదోడుగా నిలుద్దాం. స్థిరమైన పెట్టుబడులు రావాలన్నా, పదికాలాలపాటు పరిశ్రమలు చక్కగా నడవాలన్నా అందుకు అనుకూలంగా పారదర్శక విధానాలు ఉండాలి’ అని ఆయన చెప్పారు. నూతన పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు.

1. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో కాలుష్య నివారణా పద్దతుల్లో నిపుణులైన, ప్రఖ్యాత వ్యక్తులతో ఒక కమిటీని నియమించాలి. కనీసంగా ఇందులో నలుగురు సభ్యులు ఉండాలి. అలాగే ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలతో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును టై అప్‌ చేయాలి. 

2. పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఎవరైనా ముందుకు వస్తే... ముందుగా ఆ ప్రతిపాదన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో ఉన్న నిపుణులకు పంపాలి. ఆ కమిటీ ద్వారా అదివరకే టైఅప్‌ అయిన సంస్థలు ఆ  ప్రతిపాదనపై అధ్యయనం చేయాలి. నివేదిక రాగానే పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధ్యయనం చేసి సిఫార్సులు చేస్తుంది. 

3. ఈ కమిటీ సిఫార్సులు సానుకూలంగా వస్తే.. స్టేట్‌ ఇండస్ట్రీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ ముందుకు ఆ ప్రతిపాదన వెళ్తుంది. వారు సంబంధిత పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సమావేశమవుతారు. రాష్ట్ర ప్రభుత్వం పాలసీని వివరిస్తారు, అవగాహన కల్పిస్తారు. పెట్టబడుల్లో వారి విశ్వసనీయత, సమర్థతలను ఎస్‌ఐసీసీ పరిశీలించి ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే, తర్వాత ఆ ప్రతిపాదన ఎస్‌ఐపీబీ ముందుకు వస్తుంది. 

4. ఎస్‌ఐపీబీ ఆ ప్రతిపాదనపై ప్రజంటేషన్‌ ఇచ్చాక.. ప్రభుత్వం క్లియరెన్స్‌ ఇస్తుంది. 

5. ఆ తర్వాత పరిశ్రమ ఏర్పాటు చేసేవారికి చేయూతగా సింగిల్‌ విండో విధానం నిలుస్తుంది. 

ఈ విధానం కారణంగా పెట్టుబడులు పెట్టేవారికి రిస్క్‌ తగ్గుతుందని, అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభం అయ్యేందుకు వారికి తగిన తోడ్పాటు లభిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహంగా నిలుస్తుందని అన్నారు. పరిశ్రమలకు, ప్రజలకు మేలుజరిగేలా ఈ విధానం నిలుస్తుందన్నారు. భవిష్యత్తు తరాలు కూడా మనకు ముఖ్యమని, పరిశ్రమలు రావడం, తద్వారా ఉద్యోగాల కల్పన ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి వెల్లడించారు. అదే సమయంలో ప్రజలకు, పర్యావరణానికి హాని జరకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 
(చదవండి: 26న నూతన పారిశ్రామిక విధానం ఖరారు)



నిజాయితీగా పారిశ్రామిక విధానం
త్వరలో తీసుకురానున్న ఇండస్ట్రియల్‌ పాలసీ విధివిధానాలపైన కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలసీ రూపకల్పనలో పరిగణలోకి తీసుకోదగ్గ అంశాలను అధికారులకు సూచించారు. 

  • ఇండస్ట్రీ పాలసీ నిజాయితీగా ఉండాలి. మోసం చేయకూడదు. పరిశ్రమలకు మాట ఇస్తే అది కచ్చితంగా నెరవేర్చాలి.
  • పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్‌ లాంటి సదుపాయాలు కల్పిస్తాం.
  • నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందిస్తాం.
  • ప్రభుత్వం సానుకూలంగా, వారిపట్ల ప్రోయాక్టివ్‌గా ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
  • పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం నిజాయితీగా ఏం చేయగలదో అదే చెప్పాలని.. ఈ అంశాల ప్రాతిపదికగా పారిశ్రామిక విధానం తయారు చేయాలని సీఎం సూచించారు. ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాక... ఆ ప్రతిపాదనలన్నీ వాస్తవ రూపంలోకి రావాలన్నారు. 

పరిశ్రమల విషయంలో కనికట్టు మాటలు వద్దని, గత ప్రభుత్వం ఇలాంటి మాయ మాటలు చెప్పి రూ.4 వేలకోట్లు ఇన్సెంటివ్‌లను బకాయిలుగా పెట్టిందని సీఎం గుర్తు చేశారు. ఆ బకాయిలను తీర్చడానికి తమ ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. ఎంఎస్‌ఎంఈలకు ఇప్పటికే ఒకవిడతలో రూ.450 కోట్లు చెల్లించామని, మిగిలిన డబ్బును చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు చెల్లించిన తర్వాత రంగాలవారీగా, దశలవారీగా బకాయిలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చట్టం తెచ్చామని, దానికోసం యువతకు అవసరమైన నైపుణ్యాన్ని మనమే కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇది పరిశ్రమలకు చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందన్నారు. అంతేకాక స్థానికంగానే వారికి నైపుణ్యమున్న మానవనరులు లభిస్తాయన్నారు. సమీక్షలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, బొత్స సత్యనారాయణ, గుమ్మనూరి జయరాములు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ సహా అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement