Industrial investment
-
ఎలాంటి సహకారానికైనా ఒక్క ఫోన్‌కాల్ దూరంలో: సీఎం జగన్
విశాఖ జీఐఎస్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భూమి, నీరు, సముద్రతీరం, విస్తారమైన ఖనిజ సంపద, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఇతరత్రా ప్రకృతి వనరులు.. వీటన్నింటికీ తోడు పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పెట్టుబడులకు స్వర్గధామమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 340 పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 రంగాల్లో 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 తొలి రోజు శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం దేశ, విదేశాలకు చెందిన అగ్రశ్రేణి పారిశ్రామిక దిగ్గజాలు హాజరైన ఈ సమ్మిట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తొలి రోజు రూ.11.87 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 92 ఎంవోయూలు కుదుర్చుకుంటున్నామని, వీటి ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మిగిలిన 248 ఎంవోయూలను శనివారం కుదుర్చుకుంటామని, వాటి విలువ రూ.1.15 లక్షల కోట్లు అని తెలిపారు. వాటితో దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. జీఐఎస్ వేదికపై సీఎం వైఎస్ జగన్‌తో పాటు వరుసగా... మసహిరో యమగుచి (టోరే ఇండియా), సుమిత్ బిదానీ (కెనాఫ్), అరుణ్ ఒబెరాయ్ (ఒబెరాయ్ గ్రూప్), పునీత్ దాల్మియా (దాల్మియా భారత్), ప్రీతా రెడ్డి (అపోలో) కృష్ణ ఎల్లా (భారత్ బయోటెక్), జీఎం రావు (జీఎంఆర్), ముఖేశ్ అంబానీ (రిలయన్స్ గ్రూప్), కరణ్ అదానీ (అదానీ గ్రూప్), బీవీఆర్ మోహన్ రెడ్డి (సైయంట్), సజ్జన్ భజాంకా ( సెంచరీ ఫ్లై), హరిమోహన్ బంగర్ (శ్రీ సిమెంట్), మార్టిన్ ఎబర్ హార్డ్ (టెస్లా), కబ్ డాంగ్ లీ (కియా ప్రతినిధులు), ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పÆమంత్రి గుడివాడ అమర్నాథ్. రిలయెన్స్ గ్రూప్, అదాని గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్ గ్రూప్, మోండలెజ్, పార్లే, శ్రీ సిమెంట్స్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపించి వ్యాపారాన్ని విస్తరించనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఎలాంటి సహకారం అందించేందుకునైనా తమ ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటుందని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం ఏ విధంగా అనుకూలమో ఆయన వారికి స్పష్టంగా వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఎన్నెన్నో అనుకూలతలు ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశ్రమలు, పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలు, మెడ్‌టెక్ జోన్, ప్రముఖ పర్యాటక కేంద్రాలతో ప్రకృతి అందాలకు నెలవైన విశాఖపట్నం బలమైన ఆర్థిక కేంద్రంగా రూపాంతరం చెందింది. జీ–20 దేశాల వర్కింగ్ కమిటీ సమావేశాలకు కూడా ఇదే విశాఖ మార్చి చివరి వారంలో ఆతిథ్యం ఇవ్వనుంది. సమృద్ధిగా సహజ వనరులు, ఉన్నత విద్యా సంస్థలు, వ్యూహాత్మక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌కు సానుకూలతలు. వీటికి తోడు పెట్టుబడులకు రాష్ట్రాన్ని ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చేందుకు పటిష్ట కార్యాచరణతో అడుగులు ముందుకు వేసేందుకు చురుకైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. మూల స్తంభాలుగా 4 అంశాలు గ్రీనిఫికేషన్ సంప్రదాయేతర ఇంధనం దిశగా వ్యవస్థను మార్చడంపై ప్రధానంగా శ్రద్ధ పెట్టాం. రాష్ట్రంలో 82 గిగావాట్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని సాధించడానికి అవకాశాలున్నాయి. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ.. ఈ మూడు రకాల ఇంధనాలు సమ్మిళితంగా పొందడానికి అవకాశాలున్న అతికొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ ప్రాజెక్టులను ప్రారంభించడానికి అవసరమైన ల్యాండ్ పార్సిళ్లను కూడా ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక భౌగోళిక లక్షణాలు ఉన్నందున 34 గివావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉంది. 24 గంటలపాటు ఈ ప్రాజెక్ట్ నుంచి సంప్రదాయేతర ఇంధనాన్ని పొందవచ్చును. అతిపెద్ద తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులకు రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయి. పారిశ్రామిక లాజిస్టిక్స్, మౌలిక వసతులు ఈ విషయంలో భారతదేశానికి తూర్పుతీరంలో ఆంధ్రప్రదేశ్ గేట్‌వే గా ఉంది. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సముద్ర రవాణా రంగంలో రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, భావనపాడులలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నాం. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరు పోర్టులకు ఇవి అదనం. ఈ పోర్టుల సమీపంలో పారిశ్రామికీకరణకు అపార అవకాశాలున్నాయి. మూడు పారిశ్రామిక కారిడార్లు.. విశాఖపట్నం– చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్– బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు వస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. పారిశ్రామికంగా డిమాండ్ ఉన్న ప్రాంతాలకు సమీపంలో ఈ కారిడార్లు ఉన్నాయి. వీటికి పోర్టులతో అద్భుతమైన రవాణా అనుసంధానం ఉంది. ఈ పారిశ్రామిక కారిడార్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న 10 నోడ్స్ పారిశ్రామిక హబ్‌లుగా తయారవుతున్నాయి. సరుకు రవాణా సమయాన్ని, వ్యయాన్ని ఆదా చేయడానికి రాష్ట్రంలో వ్యూహాత్మక ప్రాంతాల్లో 5 మల్టీ మోడల్ పార్కులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. సముద్ర ఉత్పత్తులను పెంచడానికి ప్రాసెసింగ్ కోసం కొత్తగా 9 హార్బర్లను నిర్మిస్తున్నాం. వివిధ పారిశ్రామిక రంగాలకు సంబంధించి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు కూడా ఉన్నాయి. ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు నిర్దిష్టంగా క్లస్టర్లు ఉన్నాయి. అవి చక్కటి మౌలిక సదుపాయాలు, మానవ వనరులను అందిస్తున్నాయి. మెడ్‌టెక్ కంపెనీలకు ఏపీ పుట్టిల్లు. విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్లో అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ రంగంలో మరింత వృద్ధి కోసం ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. దాంతో సమయం, వ్యయం ఆదా అవుతుంది. డిజిటలైజేషన్ దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం సింగిల్ పోర్టల్ సేవలను అందిస్తోంది. 23 విభాగాల్లో 90 రకాల వ్యాపార సేవలు ఈ పోర్టల్‌లో లభిస్తున్నాయి. వ్యాపారాలు ప్రారంభించడానికి గరిష్టంగా 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 540 రకాల సేవలను అందిస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా ఏపీదే మొదటి స్థానం. పరిశ్రమలు పెట్టేవారికి అత్యంత అనుకూలంగా ఉండటం కోసం కొన్ని చట్టాలను సవరించడం, తొలగించడం చేశాం. ఎంటర్‌ప్రైజస్, స్కిల్ డెవలప్మెంట్ పారిశ్రామికంగా నిర్దేశిత లక్ష్యాలు సాధించడానికి మంచి మౌలిక వసతులు, సానుకూల వ్యాపార వాతావరణంతోపాటు నైపుణ్యమైన మానవ వనరులు అత్యంత కీలకం. ఈ దిశగా 26 చోట్ల నైపుణ్యాభివృద్ధి కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్థానిక యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం పారిశ్రామిక సంస్థల సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోనే అత్యధిక జీడీపీ సాధించిన ఏపీ ► 2021–22లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా 11.43 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు సాధించింది. గత మూడేళ్లలో ఏపీ నుంచి ఎగుమతులు కూడా వృద్ధి చెందాయి. సీఏజీఆర్ (సగటు వార్షిక వృద్ధి రేటు) 9.3 శాతంగా నమోదైంది. ► సుస్థిరమైన అభివృద్ధి కోసం మేం చేస్తున్న ప్రయత్నాలను నీతి ఆయోగ్ కూడా గుర్తించింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో 2020–21కి ఇచ్చిన ఎస్జీడీ ఇండియా ఇండెక్స్ ర్యాంకుల్లో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. ► క్షేత్ర స్థాయి నుంచి పరిపాలనను బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడం, స్థిరమైన విధానాలు, పోటీతత్వాన్ని పెంపొందించడానికి, తక్కువ రిస్క్ పెట్టుబడి వాతావరణాన్ని కల్పించడానికి, పారదర్శకతను పెంపొందించేందుకు పలు చర్యలు తీసుకుంది. త్వరలో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం అందమైన విశాఖపట్నంలో అద్భుతమైన సమయాన్ని గడపాలని కోరుతున్నాను. విశాఖపట్నం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని కాబోతోంది. నేనూ త్వరలోనే ఇక్కడి నుంచే పరిపాలన సాగించబోతున్నా. త్వరలోనే అది సాకారం అవుతుంది. -
Telangana: రాష్ట్రంలో పెట్టుబడులకు బోలెడు అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను యూరప్‌లోని వ్యాపార వాణిజ్య వర్గాలకు వివరించేందుకు సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయ ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో యూరోపియన్ బిజినెస్ గ్రూప్ బుధవారం నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం, టీఎస్ఐపాస్తో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమైన పాలసీలతో మంచి ఫలితాలు సాధించామన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఏడేళ్లలో తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని, దేశ జీడీపీలో తెలంగాణ వాటా గణనీయంగా ఉందన్నారు. ఐటీ, జీవ ఔషధాలు, ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ, వస్త్ర, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి 14 రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ విదేశాలతోనూ పోటీ పడేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మెడికల్ డివైజెస్ పార్క్ వంటి భారీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సొంత ఖర్చుతో మానవ వనరుల అభివృద్ధి పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే ఏ వ్యాపార సంస్థకైనా ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా ల్యాండ్ బ్యాంక్ సిద్ధంగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మౌలిక వసతులు సదుపాయాల కల్పనకు పరిమితం కాకుండా, మానవ వనరుల అభివృద్ధితో పాటు, శిక్షణకు కూడా ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అమెరికా, జపాన్, కొరియా, చైనా, కొరియా, తైవాన్ వంటి దేశాలకు చెందిన పెట్టుబడులు ఉన్నాయని, పలు యూరోపియన్ కంపెనీలు కూడా అత్యంత సౌకర్యవంతంగా తమ కార్యకలాపాలను తెలంగాణలో కొనసాగిస్తున్నాయన్నారు. రా ష్ట్ర ప్రభుత్వ పాలసీలు, వ్యాపార అనుకూలతలు, పెట్టుబడి అవకాశాలను యూరోపియన్ వ్యాపార వాణిజ్య సంస్థలకు తెలిపేందుకు సహకరించాలని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో అనుమతుల విధానానికి సంబంధించి సానుకూలమైన సమాచారం తమ వద్ద ఉందని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు వెల్లడించారు. -
మోసం చేసే మాటలు వద్దు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందించారు. కొత్త పారిశ్రామిక విధానం, అనుమతుల విషయంలో విధివిధానాలపై సీఎం అధికారులతో చర్చించారు. అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. పారిశ్రామిక విధానం నిజాయితీగా ఉండాలని, గత ప్రభుత్వం మాదిరిగా మోసం చేసే మాటలు వద్దని ఆయన స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘వందలాది కోట్ల రూపాయలను ఖర్చుచేసి పరిశ్రమను పెడుతున్నప్పుడు, అనుకున్న సమయానికి అది ప్రారంభమయ్యేలా చూద్దాం. తద్వారా వారి కార్యకలాపాలకు ప్రభుత్వం తరపున ఊతమిచ్చి చేదోడుగా నిలుద్దాం. స్థిరమైన పెట్టుబడులు రావాలన్నా, పదికాలాలపాటు పరిశ్రమలు చక్కగా నడవాలన్నా అందుకు అనుకూలంగా పారదర్శక విధానాలు ఉండాలి’ అని ఆయన చెప్పారు. నూతన పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. 1. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కాలుష్య నివారణా పద్దతుల్లో నిపుణులైన, ప్రఖ్యాత వ్యక్తులతో ఒక కమిటీని నియమించాలి. కనీసంగా ఇందులో నలుగురు సభ్యులు ఉండాలి. అలాగే ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డును టై అప్ చేయాలి. 2. పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఎవరైనా ముందుకు వస్తే... ముందుగా ఆ ప్రతిపాదన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న నిపుణులకు పంపాలి. ఆ కమిటీ ద్వారా అదివరకే టైఅప్ అయిన సంస్థలు ఆ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలి. నివేదిక రాగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యయనం చేసి సిఫార్సులు చేస్తుంది. 3. ఈ కమిటీ సిఫార్సులు సానుకూలంగా వస్తే.. స్టేట్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ ముందుకు ఆ ప్రతిపాదన వెళ్తుంది. వారు సంబంధిత పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సమావేశమవుతారు. రాష్ట్ర ప్రభుత్వం పాలసీని వివరిస్తారు, అవగాహన కల్పిస్తారు. పెట్టబడుల్లో వారి విశ్వసనీయత, సమర్థతలను ఎస్ఐసీసీ పరిశీలించి ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే, తర్వాత ఆ ప్రతిపాదన ఎస్ఐపీబీ ముందుకు వస్తుంది. 4. ఎస్ఐపీబీ ఆ ప్రతిపాదనపై ప్రజంటేషన్ ఇచ్చాక.. ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తుంది. 5. ఆ తర్వాత పరిశ్రమ ఏర్పాటు చేసేవారికి చేయూతగా సింగిల్ విండో విధానం నిలుస్తుంది. ఈ విధానం కారణంగా పెట్టుబడులు పెట్టేవారికి రిస్క్ తగ్గుతుందని, అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభం అయ్యేందుకు వారికి తగిన తోడ్పాటు లభిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహంగా నిలుస్తుందని అన్నారు. పరిశ్రమలకు, ప్రజలకు మేలుజరిగేలా ఈ విధానం నిలుస్తుందన్నారు. భవిష్యత్తు తరాలు కూడా మనకు ముఖ్యమని, పరిశ్రమలు రావడం, తద్వారా ఉద్యోగాల కల్పన ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి వెల్లడించారు. అదే సమయంలో ప్రజలకు, పర్యావరణానికి హాని జరకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. (చదవండి: 26న నూతన పారిశ్రామిక విధానం ఖరారు) నిజాయితీగా పారిశ్రామిక విధానం త్వరలో తీసుకురానున్న ఇండస్ట్రియల్ పాలసీ విధివిధానాలపైన కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలసీ రూపకల్పనలో పరిగణలోకి తీసుకోదగ్గ అంశాలను అధికారులకు సూచించారు. ఇండస్ట్రీ పాలసీ నిజాయితీగా ఉండాలి. మోసం చేయకూడదు. పరిశ్రమలకు మాట ఇస్తే అది కచ్చితంగా నెరవేర్చాలి. పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్ లాంటి సదుపాయాలు కల్పిస్తాం. నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందిస్తాం. ప్రభుత్వం సానుకూలంగా, వారిపట్ల ప్రోయాక్టివ్‌గా ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం నిజాయితీగా ఏం చేయగలదో అదే చెప్పాలని.. ఈ అంశాల ప్రాతిపదికగా పారిశ్రామిక విధానం తయారు చేయాలని సీఎం సూచించారు. ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక... ఆ ప్రతిపాదనలన్నీ వాస్తవ రూపంలోకి రావాలన్నారు. పరిశ్రమల విషయంలో కనికట్టు మాటలు వద్దని, గత ప్రభుత్వం ఇలాంటి మాయ మాటలు చెప్పి రూ.4 వేలకోట్లు ఇన్సెంటివ్‌లను బకాయిలుగా పెట్టిందని సీఎం గుర్తు చేశారు. ఆ బకాయిలను తీర్చడానికి తమ ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. ఎంఎస్ఎంఈలకు ఇప్పటికే ఒకవిడతలో రూ.450 కోట్లు చెల్లించామని, మిగిలిన డబ్బును చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈలకు చెల్లించిన తర్వాత రంగాలవారీగా, దశలవారీగా బకాయిలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చట్టం తెచ్చామని, దానికోసం యువతకు అవసరమైన నైపుణ్యాన్ని మనమే కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇది పరిశ్రమలకు చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందన్నారు. అంతేకాక స్థానికంగానే వారికి నైపుణ్యమున్న మానవనరులు లభిస్తాయన్నారు. సమీక్షలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, బొత్స సత్యనారాయణ, గుమ్మనూరి జయరాములు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ సహా అధికారులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ధమాకా!
-
ట్రిపుల్ ధమాకా!
- పెట్టుబడుల సాధనలో మూడింతల వృద్ధి సాధించిన తెలంగాణ - గత ఐదేళ్లలో పెరుగుదల 79% - రాష్ట్రంలో పెట్టుబడులు 2011–12లో రూ. 3.3 లక్షల కోట్లు - 2016–17లో రూ. 5.9 లక్షల కోట్లు - అసోచామ్ అధ్యయన నివేదికలో వెల్లడి - జాతీయ సగటును మించి వృద్ధి - దక్షిణ భారతంలో రాష్ట్రమే నంబర్‌వన్ - ఆర్థికవృద్ధిలోనూ ముందంజ - వ్యవసాయ అనుబంధ రంగాల్లో మాత్రం ప్రతికూల పరిస్థితులు - ఉత్పత్తుల రంగంపై దృష్టి పెట్టాలని సూచన సాక్షి, హైదరాబాద్ : పెట్టుబడుల సాధనలో రాష్ట్రం అనూహ్య ప్రగతిని సాధించింది. తోటి రాష్ట్రాలను అధిగమించడమేకాదు జాతీయ సగటును కూడా దాటేసింది. రాష్ట్రం గత ఐదేళ్లలో ఏకంగా మూడింతలకు పైగా పెట్టుబడుల వృద్ధి సాధించిందని ‘అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్)’ ప్రకటించింది. పెట్టుబడుల సమీకరణలో గత ఐదేళ్లలో తెలంగాణ 79 శాతం వృద్ధి సాధించిందని.. కొత్త రాష్ట్రమైనప్పటికీ పెట్టుబడిదారులకు ప్రోత్సాహకరంగా ఉండే విధానాలను అవలంబించడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని స్పష్టం చేసింది. 2011–12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంతానికి రూ.3.3 లక్షల కోట్ల దేశ, విదేశీ పెట్టుబడులు వస్తే... 2016–17లో రూ.5.9 లక్షల కోట్లు వచ్చాయని తెలిపింది. ఈ మేరకు అసోచామ్ ఎకనమిక్ రీసెర్చ్ బ్యూరో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన అంశాలతో ‘తెలంగాణ–ఆర్థికవృద్ధి, పెట్టుబడుల పురోగతి’ పేరుతో ఒక నివేదికను రూపొందించింది. గురువారం హైదరాబాద్‌లో అసోచామ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డీఎస్ రావత్, సీనియర్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు బాబులాల్ జైన్ ఈ నివేదికను విడుదల చేశారు. నివేదికలోని ప్రధాన అంశాలు.. – ఐదేళ్ల వ్యవధిలో పెట్టుబడుల సాధనలో జాతీయ వృద్ధి రేటు 27 శాతంగా నమోదుకాగా... తెలంగాణ 79 శాతం వృద్ధి సాధించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పరిగణనలోకి తీసుకున్నా.. 68.5 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే వ్యవధిలో జాతీయ సగటు వృద్ధి 20.8 శాతం మాత్రమే. – గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రూ.177 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అందులో 3.3 శాతం వాటాను నిలుపుకోవటం గమనార్హం. – పెట్టుబడుల సమీకరణలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. 2012తో పోలిస్తే 2017 నాటికి తెలంగాణ 79 శాతం వృద్ధి సాధిస్తే... ఏపీ 50.8 శాతం, కేరళ 18.9 శాతం, తమిళనాడు 11.2 శాతం, కర్ణాటక 0.2 శాతం వృద్ధి సాధించాయి. – పెట్టుబడుల్లో అత్యధిక వాటాను సాగునీటి రంగమే ఆక్రమించింది. దాదాపు 28 శాతం పెట్టుబడులు సాగునీటి ప్రాజెక్టులపైనే ఉన్నాయి. ఆర్థికేతర రంగాల్లో 25 శాతం, విద్యుత్ రంగంలో 18.5 శాతం, ఉత్పత్తి రంగంలో 11 శాతం పెట్టుబడులున్నాయి. అయితే ఉత్పత్తి రంగంలో గత ఐదేళ్లలో రెండు శాతం పెట్టుబడులు తగ్గాయి. – రాష్ట్రంలో దాదాపు రూ.4 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 370 ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ప్రారంభానికి నోచుకోకుండా కొట్టుమిట్టాడే ప్రాజెక్టుల సంఖ్య 2016లో 78 శాతం ఉంటే.. 2017లో 66 శాతానికి తగ్గింది. గత రెండేళ్లుగా జాతీయ స్థాయిలో ఇది 54 శాతంగా నమోదవుతోంది. – ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణ ముందంజలో ఉంది. దేశ స్థూల ఆదాయంలో తెలంగాణ వాటా నాలుగు శాతం. 2012లో తెలంగాణ ప్రాంత ఆర్థికవృద్ధి రేటు కేవలం 2.7 శాతంకాగా.. 2017లో 8.5 శాతానికి చేరింది. ఇదే వ్యవధిలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది. – తెలంగాణలో 55 శాతం మంది జనాభా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడి ఉన్నారు. 2015, 2016 సంవత్సరాల్లో వర్షాభావం కారణంగా వ్యవసాయ వృద్ధి రేటు వరుసగా మైనస్ 10 శాతం, మైనస్ 6 శాతానికి పడిపోయింది. 2011–12లో రాష్ట్ర స్థూల ఆదాయంలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 16.3 శాతం ఉండగా.. 2016–17 నాటికి 13.3 శాతానికి తగ్గింది. – సేవల రంగంలో వృద్ధి స్థిరంగా ఉంది. ఈ రంగంలో 2013లో 8.4 శాతంగా ఉన్న వృద్ధి 2017 నాటికి 10 శాతానికి పెరిగింది. రాష్ట్రానికి అసోచామ్ చేసిన సూచనలివీ.. – రాష్ట్రంలో మూడు శాతం జనాభా పారిశ్రామిక రంగం ఆధారంగా జీవిస్తున్నారు. 2015లో మైనస్ 7.5 శాతంతో ప్రతికూల వృద్ధి నమోదు చేసిన ఈ రంగం గణనీయంగా పుంజుకుంది. 2016లో 10 శాతం, 2017లో 4.1 శాతం వృద్ధి చెందింది. ఉత్పత్తి రంగం కూడా దాదాపుగా పారిశ్రామిక రంగం తరహాలోనే అడుగులు ముందుకేస్తోంది. కానీ ఎక్కువ మంది జనాభా ఆధారపడ్డ వ్యవసాయ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. – వ్యవసాయ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచేందుకు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలి. – ఉపాధి కల్పనకు అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగం అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలి. – యువతకు ఉపాధి కల్పించేందుకు, కొత్త రాష్ట్రంపై ప్రజలకు ఉన్న ఆకాంక్షలను నెరవేర్చేందుకు బయో టెక్నాలజీ, సోలార్ ఎనర్జీ, టూరిజం లాంటి రంగాలు, ప్రైవేటు పెట్టుబడి దారులను ఆకర్షించే పథకాలకు రూపకల్పన చేయాలి. -
డ్రైపోర్టులు.. ఎగుమతులకు రాచమార్గాలు
రెండు చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు - నాలుగు పోర్టుల ఏర్పాటుకు సీఎం మొగ్గు - స్థలాన్ని గుర్తించే బాధ్యత టీఎస్ఐఐసీకి? - నివేదిక తయారీలో అధికారులు తలమునకలు - అన్ని సౌకర్యాలు ఒకేచోట ఉండే లా ప్రణాళిక సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తూనే మౌలిక సౌకర్యాల కల్పన ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో భౌగోళికంగా రాష్ట్రానికి సముద్ర తీర ప్రాంతం లేకపోవడం పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకం కాకూడదని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక ఎగుమతులు, దిగుమతులను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రైపోర్టుల ఏర్పాటును ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతానికి కనీసం రెండు డ్రైపోర్టులు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చుట్టూ భూభాగం ఆవరించి వున్న (ల్యాండ్ లాక్డ్) తెలంగాణలో కనీసం నాలుగు డ్రైపోర్టులు ఉండాలనే యోచనతో ఉన్నట్లు సమాచారం. గతంలో మెదక్ జిల్లా పటాన్చెరు, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో డ్రైపోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గుచూపింది. అయితే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా, రైలు, రోడ్డు మార్గంతో అనుసంధానమున్న ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అనువైన ప్రాంతం కోసం అన్వేషణ సాగుతున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయడంతో పాటు భూసేకరణ బాధ్యత ను టీఎస్ఐఐసీకి అప్పగించే అవకాశముంది. డీపీఆర్‌పై అధికారుల కసరత్తు చుట్టూ భూ భాగం ఆవరించి ఉన్న రాష్ట్రాల్లో 12 డ్రైపోర్టులు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏప్రిల్‌లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయిన సందర్భంలోనూ డ్రైపోర్టుల ఏర్పాటుపై చర్చించారు. దేశవ్యాప్తంగా నదీ జల మార్గాలను అభివృద్ధి చేయాలనే ప్రణాళికలో భాగంగా గోదావరి నదీ జలమార్గాన్ని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీంతో ఖమ్మం జిల్లా భద్రాచలంలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. రాష్ట్రంలో డ్రైపోర్టులకు సంబంధించి సమగ్ర వివరాలతో కూడిన నివేదిక (డీపీఆర్) తయారీపై రవాణా శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అన్ని వసతులూ ఒకే చోట ప్రస్తుతం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకార్) ఇన్లాండ్ కంటెయినర్ డిపో (ఐసీడీ)ను నిర్వహిస్తోంది. తెలంగాణతోపాటు సమీప రాష్ట్రాల నుంచి ఎగుమతులు రోడ్డు మార్గంలో ఐసీడీకి చేరుకుని రైలు మార్గంలో నౌకాశ్రయాలకు చేరుకుంటున్నాయి. అయితే డ్రైపోర్టులో అన్ని వసతులు ఒకే చోట ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. స్టోరేజీ, కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలతో పాటు కస్టమ్స్ అనుమతుల మంజూరు, సుంకం వసూ ళ్లు కూడా డ్రైపోర్టుల్లోనే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నౌకాశ్రయాలకు చేరుకునే ఎగుమతులు ఎలాంటి జాప్యం లేకుండా సముద్రమార్గం ద్వారా నేరుగా రవాణా చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. డ్రైపోర్టుల ప్రతి పాదన ను వీలైనంత త్వరలో కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్పాయి. -
2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
పారిశ్రామికవేత్తల సదస్సులో చంద్రబాబు విశాఖపట్నం: రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. విదేశీ పారిశ్రామికవేత్తలతోపాటు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలను కూడా భాగస్వాములను చేసుకుని ప్రాజెక్టులు నెలకొల్పుతామన్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందంతో పాటు మంగళవారం ఆయన విశాఖలో పర్యటించారు. తొలుత మాధవధార, కైలాసగిరిల్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. తప్పెటగుళ్లు, కోలాటం, గిరిజన సంప్రదాయ థింసా నృత్యం, గొబ్బెమ్మలను పరిశీలించారు. థింసా కళాకారులతో కలిసి నృత్యం చేశారు. కోలాటం ఆడారు. గాలిపటాలు ఎగురవేశారు. సంక్రాంతి సంప్రదాయ పిండివంటలను రుచి చూశారు. చంద్రబాబు స్వయంగా ఈశ్వరన్‌కు చక్కెర పొంగలి, బూరెలను తినిపించారు. అనంతరం బీచ్ రోడ్డులో ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో సహకరించడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు రావడంతో జపాన్ వంటి ఇతర దేశాలు కూడా బిడ్డింగ్‌లో పోటీ పడుతున్నాయన్నారు. పెట్టుబడులకు ముందుకువచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందన్నారు. విశాఖ- కాకినాడ తీరంలో కొత్తగా నాలుగు పోర్టులు నెలకొల్పాలని నిర్ణయించినట్లు బాబు తెలిపారు. బిర్లా గ్రూప్ నెలకొల్పదలచిన శారదా బిర్లా అకాడ మీ కోసం విశాఖపట్నంలో 40 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. ఈశ్వరన్ మాట్లాడుతూ తూర్పుతీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున ఉత్పాదక పరిశ్రమలను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో ఐటీ, వాణిజ్యం, పరిశ్రమలు, పర్యాటక రంగ ప్రాజెక్టులకు సహకరిస్తామని ఆయన చెప్పారు.