డ్రైపోర్టులు.. ఎగుమతులకు రాచమార్గాలు
రెండు చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
- నాలుగు పోర్టుల ఏర్పాటుకు సీఎం మొగ్గు
- స్థలాన్ని గుర్తించే బాధ్యత టీఎస్‌ఐఐసీకి?
- నివేదిక తయారీలో అధికారులు తలమునకలు
- అన్ని సౌకర్యాలు ఒకేచోట ఉండే లా ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తూనే మౌలిక సౌకర్యాల కల్పన ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో భౌగోళికంగా రాష్ట్రానికి సముద్ర తీర ప్రాంతం లేకపోవడం పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకం కాకూడదని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక ఎగుమతులు, దిగుమతులను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రైపోర్టుల ఏర్పాటును ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతానికి కనీసం రెండు డ్రైపోర్టులు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చుట్టూ భూభాగం ఆవరించి వున్న (ల్యాండ్ లాక్డ్) తెలంగాణలో కనీసం నాలుగు డ్రైపోర్టులు ఉండాలనే యోచనతో ఉన్నట్లు సమాచారం.
గతంలో మెదక్ జిల్లా పటాన్‌చెరు, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో డ్రైపోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గుచూపింది. అయితే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా, రైలు, రోడ్డు మార్గంతో అనుసంధానమున్న ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అనువైన ప్రాంతం కోసం అన్వేషణ సాగుతున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయడంతో పాటు భూసేకరణ బాధ్యత ను టీఎస్‌ఐఐసీకి అప్పగించే అవకాశముంది.
డీపీఆర్‌పై అధికారుల కసరత్తు
చుట్టూ భూ భాగం ఆవరించి ఉన్న రాష్ట్రాల్లో 12 డ్రైపోర్టులు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏప్రిల్‌లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయిన సందర్భంలోనూ డ్రైపోర్టుల ఏర్పాటుపై చర్చించారు. దేశవ్యాప్తంగా నదీ జల మార్గాలను అభివృద్ధి చేయాలనే ప్రణాళికలో భాగంగా గోదావరి నదీ జలమార్గాన్ని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీంతో ఖమ్మం జిల్లా భద్రాచలంలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. రాష్ట్రంలో డ్రైపోర్టులకు సంబంధించి సమగ్ర వివరాలతో కూడిన నివేదిక (డీపీఆర్) తయారీపై రవాణా శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
అన్ని వసతులూ ఒకే చోట
ప్రస్తుతం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకార్) ఇన్‌లాండ్ కంటెయినర్ డిపో (ఐసీడీ)ను నిర్వహిస్తోంది. తెలంగాణతోపాటు సమీప రాష్ట్రాల నుంచి ఎగుమతులు రోడ్డు మార్గంలో ఐసీడీకి చేరుకుని రైలు మార్గంలో నౌకాశ్రయాలకు చేరుకుంటున్నాయి. అయితే డ్రైపోర్టులో అన్ని వసతులు ఒకే చోట ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. స్టోరేజీ, కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలతో పాటు కస్టమ్స్ అనుమతుల మంజూరు, సుంకం వసూ ళ్లు కూడా డ్రైపోర్టుల్లోనే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నౌకాశ్రయాలకు చేరుకునే ఎగుమతులు ఎలాంటి జాప్యం లేకుండా సముద్రమార్గం ద్వారా నేరుగా రవాణా చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. డ్రైపోర్టుల ప్రతి పాదన ను వీలైనంత త్వరలో కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్పాయి.