
ట్రిపుల్ ధమాకా!
- పెట్టుబడుల సాధనలో మూడింతల వృద్ధి సాధించిన తెలంగాణ
- గత ఐదేళ్లలో పెరుగుదల 79%
- రాష్ట్రంలో పెట్టుబడులు 2011–12లో రూ. 3.3 లక్షల కోట్లు
- 2016–17లో రూ. 5.9 లక్షల కోట్లు
- అసోచామ్ అధ్యయన నివేదికలో వెల్లడి
- జాతీయ సగటును మించి వృద్ధి
- దక్షిణ భారతంలో రాష్ట్రమే నంబర్‌వన్
- ఆర్థికవృద్ధిలోనూ ముందంజ
- వ్యవసాయ అనుబంధ రంగాల్లో మాత్రం ప్రతికూల పరిస్థితులు
- ఉత్పత్తుల రంగంపై దృష్టి పెట్టాలని సూచన
సాక్షి, హైదరాబాద్ : పెట్టుబడుల సాధనలో రాష్ట్రం అనూహ్య ప్రగతిని సాధించింది. తోటి రాష్ట్రాలను అధిగమించడమేకాదు జాతీయ సగటును కూడా దాటేసింది. రాష్ట్రం గత ఐదేళ్లలో ఏకంగా మూడింతలకు పైగా పెట్టుబడుల వృద్ధి సాధించిందని ‘అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్)’ ప్రకటించింది. పెట్టుబడుల సమీకరణలో గత ఐదేళ్లలో తెలంగాణ 79 శాతం వృద్ధి సాధించిందని.. కొత్త రాష్ట్రమైనప్పటికీ పెట్టుబడిదారులకు ప్రోత్సాహకరంగా ఉండే విధానాలను అవలంబించడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని స్పష్టం చేసింది.
2011–12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంతానికి రూ.3.3 లక్షల కోట్ల దేశ, విదేశీ పెట్టుబడులు వస్తే... 2016–17లో రూ.5.9 లక్షల కోట్లు వచ్చాయని తెలిపింది. ఈ మేరకు అసోచామ్ ఎకనమిక్ రీసెర్చ్ బ్యూరో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన అంశాలతో ‘తెలంగాణ–ఆర్థికవృద్ధి, పెట్టుబడుల పురోగతి’ పేరుతో ఒక నివేదికను రూపొందించింది. గురువారం హైదరాబాద్‌లో అసోచామ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డీఎస్ రావత్, సీనియర్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు బాబులాల్ జైన్ ఈ నివేదికను విడుదల చేశారు.
నివేదికలోని ప్రధాన అంశాలు..
– ఐదేళ్ల వ్యవధిలో పెట్టుబడుల సాధనలో జాతీయ వృద్ధి రేటు 27 శాతంగా నమోదుకాగా... తెలంగాణ 79 శాతం వృద్ధి సాధించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పరిగణనలోకి తీసుకున్నా.. 68.5 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే వ్యవధిలో జాతీయ సగటు వృద్ధి 20.8 శాతం మాత్రమే.
– గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రూ.177 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అందులో 3.3 శాతం వాటాను నిలుపుకోవటం గమనార్హం.
– పెట్టుబడుల సమీకరణలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. 2012తో పోలిస్తే 2017 నాటికి తెలంగాణ 79 శాతం వృద్ధి సాధిస్తే... ఏపీ 50.8 శాతం, కేరళ 18.9 శాతం, తమిళనాడు 11.2 శాతం, కర్ణాటక 0.2 శాతం వృద్ధి సాధించాయి.
– పెట్టుబడుల్లో అత్యధిక వాటాను సాగునీటి రంగమే ఆక్రమించింది. దాదాపు 28 శాతం పెట్టుబడులు సాగునీటి ప్రాజెక్టులపైనే ఉన్నాయి. ఆర్థికేతర రంగాల్లో 25 శాతం, విద్యుత్ రంగంలో 18.5 శాతం, ఉత్పత్తి రంగంలో 11 శాతం పెట్టుబడులున్నాయి. అయితే ఉత్పత్తి రంగంలో గత ఐదేళ్లలో రెండు శాతం పెట్టుబడులు తగ్గాయి.
– రాష్ట్రంలో దాదాపు రూ.4 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 370 ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ప్రారంభానికి నోచుకోకుండా కొట్టుమిట్టాడే ప్రాజెక్టుల సంఖ్య 2016లో 78 శాతం ఉంటే.. 2017లో 66 శాతానికి తగ్గింది. గత రెండేళ్లుగా జాతీయ స్థాయిలో ఇది 54 శాతంగా నమోదవుతోంది.
– ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణ ముందంజలో ఉంది. దేశ స్థూల ఆదాయంలో తెలంగాణ వాటా నాలుగు శాతం. 2012లో తెలంగాణ ప్రాంత ఆర్థికవృద్ధి రేటు కేవలం 2.7 శాతంకాగా.. 2017లో 8.5 శాతానికి చేరింది. ఇదే వ్యవధిలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది.
– తెలంగాణలో 55 శాతం మంది జనాభా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడి ఉన్నారు. 2015, 2016 సంవత్సరాల్లో వర్షాభావం కారణంగా వ్యవసాయ వృద్ధి రేటు వరుసగా మైనస్ 10 శాతం, మైనస్ 6 శాతానికి పడిపోయింది. 2011–12లో రాష్ట్ర స్థూల ఆదాయంలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 16.3 శాతం ఉండగా.. 2016–17 నాటికి 13.3 శాతానికి తగ్గింది.
– సేవల రంగంలో వృద్ధి స్థిరంగా ఉంది. ఈ రంగంలో 2013లో 8.4 శాతంగా ఉన్న వృద్ధి 2017 నాటికి 10 శాతానికి పెరిగింది.
రాష్ట్రానికి అసోచామ్ చేసిన సూచనలివీ..
– రాష్ట్రంలో మూడు శాతం జనాభా పారిశ్రామిక రంగం ఆధారంగా జీవిస్తున్నారు. 2015లో మైనస్ 7.5 శాతంతో ప్రతికూల వృద్ధి నమోదు చేసిన ఈ రంగం గణనీయంగా పుంజుకుంది. 2016లో 10 శాతం, 2017లో 4.1 శాతం వృద్ధి చెందింది. ఉత్పత్తి రంగం కూడా దాదాపుగా పారిశ్రామిక రంగం తరహాలోనే అడుగులు ముందుకేస్తోంది. కానీ ఎక్కువ మంది జనాభా ఆధారపడ్డ వ్యవసాయ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.
– వ్యవసాయ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచేందుకు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలి.
– ఉపాధి కల్పనకు అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగం అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలి.
– యువతకు ఉపాధి కల్పించేందుకు, కొత్త రాష్ట్రంపై ప్రజలకు ఉన్న ఆకాంక్షలను నెరవేర్చేందుకు బయో టెక్నాలజీ, సోలార్ ఎనర్జీ, టూరిజం లాంటి రంగాలు, ప్రైవేటు పెట్టుబడి దారులను ఆకర్షించే పథకాలకు రూపకల్పన చేయాలి.