
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను యూరప్‌లోని వ్యాపార వాణిజ్య వర్గాలకు వివరించేందుకు సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయ ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో యూరోపియన్ బిజినెస్ గ్రూప్ బుధవారం నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం, టీఎస్‌ఐపాస్‌తో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమైన పాలసీలతో మంచి ఫలితాలు సాధించామన్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్నారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఏడేళ్లలో తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని, దేశ జీడీపీలో తెలంగాణ వాటా గణనీయంగా ఉందన్నారు. ఐటీ, జీవ ఔషధాలు, ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ, వస్త్ర, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి 14 రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ విదేశాలతోనూ పోటీ పడేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, మెడికల్ డివైజెస్ పార్క్ వంటి భారీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సొంత ఖర్చుతో మానవ వనరుల అభివృద్ధి
పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే ఏ వ్యాపార సంస్థకైనా ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా ల్యాండ్ బ్యాంక్ సిద్ధంగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మౌలిక వసతులు సదుపాయాల కల్పనకు పరిమితం కాకుండా, మానవ వనరుల అభివృద్ధితో పాటు, శిక్షణకు కూడా ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అమెరికా, జపాన్, కొరియా, చైనా, కొరియా, తైవాన్ వంటి దేశాలకు చెందిన పెట్టుబడులు ఉన్నాయని, పలు యూరోపియన్ కంపెనీలు కూడా అత్యంత సౌకర్యవంతంగా తమ కార్యకలాపాలను తెలంగాణలో కొనసాగిస్తున్నాయన్నారు. రా
ష్ట్ర ప్రభుత్వ పాలసీలు, వ్యాపార అనుకూలతలు, పెట్టుబడి అవకాశాలను యూరోపియన్ వ్యాపార వాణిజ్య సంస్థలకు తెలిపేందుకు సహకరించాలని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో అనుమతుల విధానానికి సంబంధించి సానుకూలమైన సమాచారం తమ వద్ద ఉందని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment