
2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
పారిశ్రామికవేత్తల సదస్సులో చంద్రబాబు
విశాఖపట్నం: రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. విదేశీ పారిశ్రామికవేత్తలతోపాటు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలను కూడా భాగస్వాములను చేసుకుని ప్రాజెక్టులు నెలకొల్పుతామన్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందంతో పాటు మంగళవారం ఆయన విశాఖలో పర్యటించారు. తొలుత మాధవధార, కైలాసగిరిల్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. తప్పెటగుళ్లు, కోలాటం, గిరిజన సంప్రదాయ థింసా నృత్యం, గొబ్బెమ్మలను పరిశీలించారు. థింసా కళాకారులతో కలిసి నృత్యం చేశారు. కోలాటం ఆడారు. గాలిపటాలు ఎగురవేశారు. సంక్రాంతి సంప్రదాయ పిండివంటలను రుచి చూశారు. చంద్రబాబు స్వయంగా ఈశ్వరన్‌కు చక్కెర పొంగలి, బూరెలను తినిపించారు. అనంతరం బీచ్ రోడ్డులో ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో సహకరించడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు రావడంతో జపాన్ వంటి ఇతర దేశాలు కూడా బిడ్డింగ్‌లో పోటీ పడుతున్నాయన్నారు. పెట్టుబడులకు ముందుకువచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందన్నారు. విశాఖ- కాకినాడ తీరంలో కొత్తగా నాలుగు పోర్టులు నెలకొల్పాలని నిర్ణయించినట్లు బాబు తెలిపారు. బిర్లా గ్రూప్ నెలకొల్పదలచిన శారదా బిర్లా అకాడ మీ కోసం విశాఖపట్నంలో 40 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. ఈశ్వరన్ మాట్లాడుతూ తూర్పుతీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున ఉత్పాదక పరిశ్రమలను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో ఐటీ, వాణిజ్యం, పరిశ్రమలు, పర్యాటక రంగ ప్రాజెక్టులకు సహకరిస్తామని ఆయన చెప్పారు.