ఎన్నికల ప్రచారానికి భారీ బడ్జెట్‌! | Huge budget for election campaign | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారానికి భారీ బడ్జెట్‌!

Published Tue, Jan 15 2019 4:41 AM | Last Updated on Tue, Jan 15 2019 4:41 AM

Huge budget for election campaign - Sakshi

సాక్షి, అమరావతి: ఈవెంట్లు, సదస్సులు, దీక్షల పేరుతో నాలుగున్నరేళ్లపాటు లెక్కాపత్రం లేకుండా కోట్ల రూపాయలను ఇష్టారాజ్యంగా వ్యయంచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు.. తాజాగా ఎన్నికల ప్రచారానికి భారీగానే ప్రణాళికను సిద్ధంచేసింది. ఇందులో భాగంగా రూ.582 కోట్ల అదనపు బడ్జెట్‌కు సమాచార శాఖ ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి సూచనతోనే సమాచార శాఖ ఈ ఏడాది మార్చిలోగా ఔట్‌డోర్, ఇన్‌డోర్‌ పేరుతో ప్రచారానికి ఏకంగా రూ.482 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధంచేసింది. ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రచారం కోసం కేటాయించిన రూ.121.72 కోట్లను ఖర్చు చేసేశామని.. బకాయిల కోసం రూ.100 కోట్లతో పాటు మార్చి నెలాఖరు వరకు ప్రచార నిమిత్తం రూ.482 కోట్లతో కలిపి మొత్తం రూ.582 కోట్లను అదనంగా కేటాయించాల్సిందిగా ఆర్థిక శాఖకు సమాచార శాఖ ప్రతిపాదనలు పంపించింది.

వీటిని పరిశీలించిన ఆర్థిక శాఖ ఆశ్చర్యానికి గురైంది. ఎన్నికల ముందు ప్రచారం కోసం ఇంత పెద్దఎత్తున వ్యయం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్నికల ముందు ప్రజాధనాన్ని ఇంత పెద్ద మొత్తంలో వినియోగించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో అదనపు బడ్జెట్‌ ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టంచేసింది. దీంతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగారు. సమాచార శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదించడంతో పాటు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ముఖ్యమంత్రే ఒత్తిడి చేయడంతో ఆర్థిక శాఖ చేసేదేమీలేక ప్రతిపాదనల్లో సగం మొత్తాన్ని తగ్గించాల్సిందిగా సమాచార శాఖకు సూచించింది. 
ఇప్పటికే రూ.60.18కోట్లు ఖర్చు
కాగా, ముఖ్యమంత్రి ఈ ఏడాదిలో చేసిన వివిధ ఈవెంట్లు, సదస్సుల నేపథ్యంలో ఇప్పటివరకు ప్రచారం కోసం ఏకంగా రూ.60.18 కోట్లు వ్యయంచేశారు. ముఖ్యమంత్రి నిర్వహించిన ఒక్కరోజు నవ నిర్మాణ దీక్ష ప్రచారానికి రూ.8.67 కోట్లను వెచ్చించారు. ‘అంబేద్కర్‌ ఆశయం–చంద్రన్న ఆచరణ’ ఈవెంట్‌ ప్రచారం కోసం రూ.3కోట్లు ఖర్చుపెట్టారు. ఇక 1500 రోజుల పాలన పూర్తి పేరుతో రూ.17.79 కోట్లు వ్యయం చేశారు. అలాగే, రంజాన్, ఏరువాక–పౌర్ణమి, జలసిరి హారతి, యువనేస్తం, పోలవరం తదితర ఈవెంట్లకు ఏకంగా రూ.31.91కోట్లు ఉపయోగించారు. అంతేకాక, వివిధ ఈవెంట్ల కోసం ఔట్‌ డోర్‌ ప్రచారానికి అంటే హోర్డింగ్స్‌ కోసం ఈ ఏడాది ఇప్పటివరకు రూ.30.26 కోట్లు వెచ్చించారు. ఇందులో స్వచ్ఛభారత్, సంక్రాంతి సంబరాలు హోర్డింగ్స్‌కు రూ.ఏడున్నర కోట్లను వ్యయం చేశారు. సామూహిక గృహ సముదాయాల ఈవెంట్ల ప్రచారానికి రూ.4.6కోట్లు, 1500 రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో రూ.12 కోట్లు, యువనేస్తానికి రూ.6కోట్లు ప్రచారానికి ఖర్చుపెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement