నారావారిపల్లిలో ఆదివారం సీఎం కుటుంబ సభ్యులు, బంధువులు సంక్రాంతి సంబరాలు చేసుకుంటుండగా... వెనుక అధికారులు చేతులు కట్టుకుని నిల్చొని ఉన్న దృశ్యం
నాలుగేళ్లుగా జిల్లా అధికారులకు పండుగరోజూ పాట్లు తప్పటం లేదు. ఈ నెల 11వ తేదీ వరకు పది రోజుల పాటు జన్మభూమి కార్యక్రమాలతో అధికారులు తలమునకలయ్యారు. వెనువెంటనే సీఎం చంద్రబాబు స్వగ్రామానికి వస్తున్న నేపథ్యంలో అధికారులు పండగ సంబరాలకు దూరమై మదనపడుతున్నారు.
సాక్షి,చిత్తూరు, తిరుపతి : సంక్రాంతి పండుగను సీఎం చంద్రబాబు తన స్వగ్రామంలో జరుపుకునేందుకు నారావారిపల్లికి వస్తున్నారు. గత మూడేళ్లుగా సొంత ఊరికి సీఎం చంద్రబాబు కుటుంబం, సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబసభ్యులు నారావారిపల్లికి వచ్చి పండగ సంబరాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నాలుగో యేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సీఎం చంద్రబాబు సోమవారం జిల్లాకు వస్తున్నారు. ఆయన కుటుంబీకులు ఒకరోజు ముందుగానే నారావారిపల్లికి చేరుకున్నారు. దీంతో అధికారులు విధుల్లో ఉండక తప్పడం లేదు. రెండు రోజులపాటు సీఎం చంద్రబాబు జిల్లాలోనే ఉంటుండటంతో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు విధుల్లోనే ఉన్నారు.
ఈసారీ సంక్రాంతి పండుగకు అధికారులు దూరంగా ఉండక తప్పడం లేదు. సీఎం చంద్రబాబు మూడేళ్లుగా సొంత ఊరికి రావడం ఆనవాయితీ పెట్టుకోవటంతో జిల్లా అధికారులు, వారి కుటుంబీకులు సంక్రాంతి సంతోషానికి దూరంగా ఉండాల్సి వస్తోందని జిల్లా అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలతో రెండు నిముషాలు మాట్లాడేందుకు కూడా తీరిక లేకుండా సీఎం పర్యటన ఏర్పాట్లలో తలమునకలయ్యారు. రెండు రోజుల ముందే సీఎం కుటుంబ సభ్యులు నారావారిపల్లికి చేరుకోవటంతో అధికారులు శనివారం నుంచే అక్కడికి చేరుకున్నారు. అంతకు ముందు నుంచే సీఎం రాకకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా సీఎం పర్యటనలో పోలీసు శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు నారా వారిపల్లిలో విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం.
శాపంగా మారిన ప్రొటోకాల్ డ్యూటీ..
రేణిగుంట, ఏర్పేడు, తిరుపతి, ఐరాల పరిధిలోని రెవెన్యూ, పోలీసు అధికారులకు సాధారణ విధులతో పాటు ప్రొటోకాల్ డ్యూటీ అదనం. అదే విధంగా ఏడాదికోసారి సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా నారావారిపల్లెకు వస్తుండడంతో అధికారుల తిప్పలు వర్ణనాతీతంగా మారాయి. దీనికి తోడు తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలు ఉండటంతో అధికారులకు తిప్పలు తప్పడం లేదు.
జన్మభూమితో మరింత భారం..
జన్మభూమి మా ఊరు కార్యక్రమం పేరుతో జనవరి 2 నుంచి 11 వరకు అధికారులు ఊరారా తిరిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఉంటే.. అధికారులకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయ్యేది కాదు. టీడీపీ సర్కారు మాటలకు, చేతలకు పొంతన లేకపోవటంతో అధికారులకు జన్మభూమి కార్యక్రమంలో స్థానికులు చుక్కలు చూపించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, తిరుపతి కార్పొరేషన్, తుడా వీసీతో పాటు అర్బన్ ఎస్పీ, రెవెన్యూ, మండల పరిషత్, మున్సిపాలిటీ, ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, వైద్యవిభాగం, అగ్నిమాపక సిబ్బంది, తుడా, పోలీసు అధికారులందరికీ మూడు రోజుల పాటు డ్యూటీలు వేశారు. ప్రస్తుతం సీఎం పర్యటన ఏర్పాట్లలో విధుల్లో ఉన్న వారంతా జన్మభూమి కార్యక్రమం ప్రారంభం నుంచి తీరికలేకుండా గడుపుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment