సదస్సు ప్రాంగణంలో రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్
విశాఖ జీఐఎస్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భూమి, నీరు, సముద్రతీరం, విస్తారమైన ఖనిజ సంపద, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఇతరత్రా ప్రకృతి వనరులు.. వీటన్నింటికీ తోడు పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పెట్టుబడులకు స్వర్గధామమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 340 పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు.
తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 రంగాల్లో 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 తొలి రోజు శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం దేశ, విదేశాలకు చెందిన అగ్రశ్రేణి పారిశ్రామిక దిగ్గజాలు హాజరైన ఈ సమ్మిట్‌ను ఉద్దేశించి మాట్లాడారు.
తొలి రోజు రూ.11.87 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 92 ఎంవోయూలు కుదుర్చుకుంటున్నామని, వీటి ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మిగిలిన 248 ఎంవోయూలను శనివారం కుదుర్చుకుంటామని, వాటి విలువ రూ.1.15 లక్షల కోట్లు అని తెలిపారు. వాటితో దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
జీఐఎస్ వేదికపై సీఎం వైఎస్ జగన్‌తో పాటు వరుసగా... మసహిరో యమగుచి (టోరే ఇండియా), సుమిత్ బిదానీ (కెనాఫ్), అరుణ్ ఒబెరాయ్ (ఒబెరాయ్ గ్రూప్), పునీత్ దాల్మియా (దాల్మియా భారత్), ప్రీతా రెడ్డి (అపోలో) కృష్ణ ఎల్లా (భారత్ బయోటెక్), జీఎం రావు (జీఎంఆర్), ముఖేశ్ అంబానీ (రిలయన్స్ గ్రూప్), కరణ్ అదానీ (అదానీ గ్రూప్), బీవీఆర్ మోహన్ రెడ్డి (సైయంట్), సజ్జన్ భజాంకా ( సెంచరీ ఫ్లై), హరిమోహన్ బంగర్ (శ్రీ సిమెంట్), మార్టిన్ ఎబర్ హార్డ్ (టెస్లా), కబ్ డాంగ్ లీ (కియా ప్రతినిధులు), ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పÆమంత్రి గుడివాడ అమర్‌నాథ్.
రిలయెన్స్ గ్రూప్, అదాని గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్ గ్రూప్, మోండలెజ్, పార్లే, శ్రీ సిమెంట్స్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపించి వ్యాపారాన్ని విస్తరించనున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఎలాంటి సహకారం అందించేందుకునైనా తమ ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటుందని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం ఏ విధంగా అనుకూలమో ఆయన వారికి స్పష్టంగా వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఎన్నెన్నో అనుకూలతలు
ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశ్రమలు, పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలు, మెడ్‌టెక్ జోన్, ప్రముఖ పర్యాటక కేంద్రాలతో ప్రకృతి అందాలకు నెలవైన విశాఖపట్నం బలమైన ఆర్థిక కేంద్రంగా రూపాంతరం చెందింది. జీ–20 దేశాల వర్కింగ్ కమిటీ సమావేశాలకు కూడా ఇదే విశాఖ మార్చి చివరి వారంలో ఆతిథ్యం ఇవ్వనుంది.
సమృద్ధిగా సహజ వనరులు, ఉన్నత విద్యా సంస్థలు, వ్యూహాత్మక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌కు సానుకూలతలు. వీటికి తోడు పెట్టుబడులకు రాష్ట్రాన్ని ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చేందుకు పటిష్ట కార్యాచరణతో అడుగులు ముందుకు వేసేందుకు చురుకైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది.
మూల స్తంభాలుగా 4 అంశాలు గ్రీనిఫికేషన్
సంప్రదాయేతర ఇంధనం దిశగా వ్యవస్థను మార్చడంపై ప్రధానంగా శ్రద్ధ పెట్టాం. రాష్ట్రంలో 82 గిగావాట్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని సాధించడానికి అవకాశాలున్నాయి. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ.. ఈ మూడు రకాల ఇంధనాలు సమ్మిళితంగా పొందడానికి అవకాశాలున్న అతికొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ ప్రాజెక్టులను ప్రారంభించడానికి అవసరమైన ల్యాండ్ పార్సిళ్లను కూడా ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక భౌగోళిక లక్షణాలు ఉన్నందున 34 గివావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉంది. 24 గంటలపాటు ఈ ప్రాజెక్ట్ నుంచి సంప్రదాయేతర ఇంధనాన్ని పొందవచ్చును. అతిపెద్ద తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులకు రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయి.
పారిశ్రామిక లాజిస్టిక్స్, మౌలిక వసతులు
ఈ విషయంలో భారతదేశానికి తూర్పుతీరంలో ఆంధ్రప్రదేశ్ గేట్‌వే గా ఉంది. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సముద్ర రవాణా రంగంలో రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, భావనపాడులలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నాం. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరు పోర్టులకు ఇవి అదనం. ఈ పోర్టుల సమీపంలో పారిశ్రామికీకరణకు అపార అవకాశాలున్నాయి.
మూడు పారిశ్రామిక కారిడార్లు.. విశాఖపట్నం– చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్– బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు వస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. పారిశ్రామికంగా డిమాండ్ ఉన్న ప్రాంతాలకు సమీపంలో ఈ కారిడార్లు ఉన్నాయి. వీటికి పోర్టులతో అద్భుతమైన రవాణా అనుసంధానం ఉంది. ఈ పారిశ్రామిక కారిడార్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న 10 నోడ్స్ పారిశ్రామిక హబ్‌లుగా తయారవుతున్నాయి.
సరుకు రవాణా సమయాన్ని, వ్యయాన్ని ఆదా చేయడానికి రాష్ట్రంలో వ్యూహాత్మక ప్రాంతాల్లో 5 మల్టీ మోడల్ పార్కులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. సముద్ర ఉత్పత్తులను పెంచడానికి ప్రాసెసింగ్ కోసం కొత్తగా 9 హార్బర్లను నిర్మిస్తున్నాం. వివిధ పారిశ్రామిక రంగాలకు సంబంధించి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు కూడా ఉన్నాయి.
ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు నిర్దిష్టంగా క్లస్టర్లు ఉన్నాయి. అవి చక్కటి మౌలిక సదుపాయాలు, మానవ వనరులను అందిస్తున్నాయి. మెడ్‌టెక్ కంపెనీలకు ఏపీ పుట్టిల్లు. విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్‌లో అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ రంగంలో మరింత వృద్ధి కోసం ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. దాంతో సమయం, వ్యయం ఆదా అవుతుంది.
డిజిటలైజేషన్
దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం సింగిల్ పోర్టల్ సేవలను అందిస్తోంది. 23 విభాగాల్లో 90 రకాల వ్యాపార సేవలు ఈ పోర్టల్‌లో లభిస్తున్నాయి. వ్యాపారాలు ప్రారంభించడానికి గరిష్టంగా 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాం.
గ్రామ, వార్డు సచివాలయాల్లో 540 రకాల సేవలను అందిస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా ఏపీదే మొదటి స్థానం. పరిశ్రమలు పెట్టేవారికి అత్యంత అనుకూలంగా ఉండటం కోసం కొన్ని చట్టాలను సవరించడం, తొలగించడం చేశాం.
ఎంటర్‌ప్రైజస్, స్కిల్ డెవలప్‌మెంట్
పారిశ్రామికంగా నిర్దేశిత లక్ష్యాలు సాధించడానికి మంచి మౌలిక వసతులు, సానుకూల వ్యాపార వాతావరణంతోపాటు నైపుణ్యమైన మానవ వనరులు అత్యంత కీలకం. ఈ దిశగా 26 చోట్ల నైపుణ్యాభివృద్ధి కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్థానిక యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం పారిశ్రామిక సంస్థల సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తున్నాం.
దేశంలోనే అత్యధిక జీడీపీ సాధించిన ఏపీ
► 2021–22లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా 11.43 శాతం జీఎస్‌డీపీ వృద్ధి రేటు సాధించింది. గత మూడేళ్లలో ఏపీ నుంచి ఎగుమతులు కూడా వృద్ధి చెందాయి. సీఏజీఆర్ (సగటు వార్షిక వృద్ధి రేటు) 9.3 శాతంగా నమోదైంది.
► సుస్థిరమైన అభివృద్ధి కోసం మేం చేస్తున్న ప్రయత్నాలను నీతి ఆయోగ్ కూడా గుర్తించింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో 2020–21కి ఇచ్చిన ఎస్‌జీడీ ఇండియా ఇండెక్స్ ర్యాంకుల్లో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది.
► క్షేత్ర స్థాయి నుంచి పరిపాలనను బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడం, స్థిరమైన విధానాలు, పోటీతత్వాన్ని పెంపొందించడానికి, తక్కువ రిస్క్ పెట్టుబడి వాతావరణాన్ని కల్పించడానికి, పారదర్శకతను పెంపొందించేందుకు పలు చర్యలు తీసుకుంది.
త్వరలో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం
అందమైన విశాఖపట్నంలో అద్భుతమైన సమయాన్ని గడపాలని కోరుతున్నాను. విశాఖపట్నం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని కాబోతోంది. నేనూ త్వరలోనే ఇక్కడి నుంచే పరిపాలన సాగించబోతున్నా. త్వరలోనే అది సాకారం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment