
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, దీన్ని కూల్చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మనం కూర్చున్న ఈ భవనం నిబంధనలకు విరుద్ధంగా కట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి అక్రమాలకు పాల్పడితే కిందిస్థాయి అధికారులు అక్రమాలు చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేపడితే బాధ అనిపించదా అని అడిగారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు సాగుతున్నాయని, దీనికి చెక్ పెట్టాల్సిన అవరసముందన్నారు. ప్రజావేదిక నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభిద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామని, ప్రజావేదికలో ఇదే చివరి సమావేశమని వెల్లడించారు. ఎల్లుండి (బుధవారం) నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రజావేదికను పూర్తిగా అవినీతి సొమ్ముతో నిర్మించారని సీఎం జగన్ ఆరోపించారు.
(చదవండి: మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్)
కాగా, ప్రజావేదికపై ఇప్పటికే ప్రభుత్వానికి సీర్‌ఆర్‌డీఏ నివేదిక సమర్పించింది. ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నివేదికలో పేర్కొంది. అధికారంలో ఉండగా తన అక్రమ నివాసం పక్కన చంద్రబాబు అనధికారికంగా కట్టించిన ప్రజావేదిక అక్రమాలు, దుర్వినియోగాలకు వేదికగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబు సహా ఆయన కుమారుడు, టీడీపీ నేతలు దాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేశారు. పేరుకు ప్రభుత్వ భవనమే అయినా ఇన్నాళ్లు దానిని టీడీపీ కార్యాలయంగా వాడుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనూ ఇష్టానుసారం వినియోగించుకున్న చంద్రబాబు.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వదలకుండా వేలాడుతుండడం విమర్శలకు దారితీసింది. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాకుండా దాన్ని తనకే ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment