సాక్షి, అమరావతి : పిల్లలను బడికి పంపించేలా తల్లులను ప్రోత్సహించేందుకే అమ్మఒడి పథకం పెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నిరక్షరాస్యత సగటు (33శాతం) జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రంలో అక్షరాస్యత పెరుగుతుందని, పిల్లలను స్కూల్‌కు పంపే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం వర్తింపచేస్తామన్నారు.
సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘జనవరి 26న అమ్మ ఒడి చెక్కుల పంపిణీని గ్రామ వాలంటీర్ల ద్వారా నిర్వహించాలి. నాకు అత్యంత ప్రాధాన్యమైన దాంట్లో విద్యా రంగం ఒకటి. స్కూల్స్ ఫొటోలు తీసి పంపించండి. వాటిని అభివృద్ధి చేస్తాం. ఫ్యాన్లు, ఫర్నిచర్, ప్రహరీ గోడ, బాత్‌రూమ్స్ అన్ని బాగుచేస్తాం. ప్రతి స్కూలును ఇంగ్లీషు మీడియం స్కూలుగా మారుస్తాం. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తాం. యూనిఫారంలు, పుస్తకాలు సకాలనికే ఇస్తాం. పిల్లలకు షూలు కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. గత ప్రభుత్వం మాదిరిగా స్కూలు యూనిఫారాల్లో స్కాంలు జరగకూడదు. మధ్యాహ్న భోజనంలో కూడా నాణ్యత పెంచుతాం. ఇవన్నీ చేశాక ఏ పిల్లాడు కూడా ప్రైవేట్ స్కూల్‌కు పోవాలనే ఆలోచన రాకూడదు. ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యాహక్కు చట్టాన్ని 100 శాతం అమలు చేస్తాం. ప్రైవేట్ స్కూళ్లలో 25 సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. దేశంలో విద్య అనేది సేవేకాని, డబ్బు ఆర్జించే రంగం కాదు. ఎవరు విద్యాసంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదు.(చదవండి : ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం)
సన్న బియ్యం ఇస్తాం..
పౌరసరఫరాల శాఖలో ప్రజలు వాడే వస్తువులనే ఇవ్వాలి. ఇప్పుడిస్తున్న బియ్యం నాణ్యత బాగోలేదు. ఆ బియ్యాన్ని తిరిగి డీలర్‌కే అమ్మేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తిరిగి అవే బియ్యం పాలిష్ చేసి, మళ్లీ ప్రజల దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది. ప్రజలు వినియోగించే వాటినే మనం ఇవ్వాలి. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ, మరోవైపు క్వాలిటీ బియ్యం ప్రజలకు చేరాలి. దీనికి కలెక్టర్లు కీలకమైన పాత్ర పోషించాలి. గత ప్రభుత్వం రైతులకు రూ.1000 కోట్లు బకాయి పడింది. ఈ డబ్బులను ఎన్నికల స్కీంలకు మళ్లించారు. ఈ వెయ్యి కోట్లను రైతులకే చెల్లించాలి’ అని వైఎస్ జగన్ కలెక్టర్లకు తెలిపారు. (చదవండి : మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్)
Comments
Please login to add a commentAdd a comment