సీఎంపై నేతల ఆగ్రహం
Published Sun, Sep 29 2013 3:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ :తెలంగాణపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమవుతుందనుకుంటున్న సమయంలో సీఎం వ్యవహరిస్తున్న తీరుపై భగ్గుమన్నారు. రాష్ర్ట ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే సీఎం రాజీనామా చేయాలంటూ ఆ పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మంత్రి రెడ్యానాయక్ బహిరంగంగానే సీఎం వ్యాఖ్యలను ఖండించారు. ఇంతకాలం మౌనం వహించిన తెలంగాణ నేతలు కిరణ్‌పై క్రమంగా గొంతెత్తుతున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో నోరెత్తని ఈ నాయకులు.. సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత నెమ్మదిగా స్పందిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకులు కలుగుతాయేమోననే ఆందోళనతో నాయకులు సీఎంపై విమర్శ దాడి పెంచుతున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలు సైతం సీడబ్లూసీ తీర్మానానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
అరుుతే గండ్ర, రాజయ్య మాత్రం తీవ్రంగా స్పందించారు. ‘అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని శాసనసభలో చెప్పిన సీఎం.. ఇప్పుడు మాటమార్చడంమేమిటి. అధిష్టాన నిర్ణయంతో సీఎం అయిన కిరణ్.. సీమాంధ్ర ప్రజల కోసం సీఎం పదవిని ఒదులుకుంటాననడం శోచనీయం’. అని శనివారం చీఫ్‌విప్ గండ్ర రమణారెడ్డి హన్మకొండలో అన్నారు. ‘తెలంగాణ ఉద్యమం ఆకలి పోరాటమైతే, సీమాంధ్ర ఉద్యమం అజీర్తి ఉద్యమం. అసెంబ్లీలో తనచేతిలో ఏమీ లేదు.., అధిష్టాన నిర్ణయమే తనకు శిరోధార్యమన్న సీఎం నేడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో అర్దం కావడం లేదు’ అని ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. ‘సీడబ్ల్యూసీ ద్వారా ప్రకటించిన తెలంగాణను సీఎం కిరణ్‌కుమార్ అడ్డుకునే యత్నం చేస్తున్నారు. ఇది సరైందికాదు. ఆ పదవిలో ఉంటూ సీమాంధ్రకు మద్దతు తెలియజేస్తున్న సీఎం తన పదవికి రాజీనామా చేయాలి.’ అని కురవిలో మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ అన్నారు.
సీఎం వ్యాఖ్యలపై నిరసనలు
మరోవైపు కిరణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా న్యాయవాదులు, తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్, జేఏసీ, టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు. సీఎం వైఖరికి నిరసనగా హన్మకొండ కోర్టు ఎదుట న్యాయవాదులు దిష్టిబొమ్మ దహనం చేశారు. హసన్‌పర్తిలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఘన్‌పూర్‌లో తెలంగాణవాదులు సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. నర్సంపేటలో టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి సీఎం కిరణ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అదేవిధంగా కరీమాబాద్, గోపాలస్వామిగుడి జంక్షణ్‌లో తెలంగాణవాదులు సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.
Advertisement