జిల్లాలో కోడిపందేలకు చురుగ్గా సన్నాహాలు
మురమళ్లలో పదెకరాల విస్తీర్ణంలో నిర్వహణ
ఫ్లడ్ లైట్లు, ఐరన్ గ్రిల్స్‌తో ప్రత్యేక ఏర్పాట్లు
కోనసీమలో పలు ప్రాంతాల్లో భారీ బరులు
అమలాపురం టౌన్ : కోర్టు కాదన్నా, ఖాకీ వ్యవస్థ ‘ఖబడ్దార్’ అన్నా పెద్ద పండక్కి ‘యుద్ధ’భూములు సిద్ధమవుతున్నాయి. సంప్రదాయం పేరిట సమరభేరి మోగనుంది. జిల్లాలో.. ముఖ్యంగా కోనసీమలో భారీస్థారుులో కోడిపందేల బరులు తయూరవుతున్నాయి. గతంలో మాదిరిగానే చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులే.. వాటి నిర్వహణకు వెన్నుదన్ను గా నిలుస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో తయూరుతిండి తింటూ, ప్రత్యేక తర్ఫీదు పొందిన పుంజుల కాళ్లకు కత్తులు మెరవనున్నాయి. వాటి నులివెచ్చని నెత్తుటితో బరులు తడవనున్నాయి. వాటిలో కొన్ని విజయూనికీ, కొన్ని వీరమరణానికీ నోచుకోనున్నాయి.
జిల్లాలో కోనసీమతో పాటు మెట్ట ప్రాంతంలో కూడా కోడి పందేలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే పందేల్ని చట్టబద్ధం చేయాలంటున్న క్రమంలో కొందరు ఎమ్మెల్యేలు సంక్రాంతి పండగ మూడు రోజులూ దగ్గరుండి పందేల్ని ఆడించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సారి పందేల బరులను గతంలోకన్నా భారీగా, పటిష్టమైన ఏర్పాట్లతో సిద్ధం చేస్తున్నారు. ఐ.పోలవరం మండలం మురమళ్లలో పదెకరాల పంట భూమిని పందేల నిర్వహణకు ఎంపిక చేశారు. కేవలం ఈ పందేల కోసమే ఆ భూమికి పంట వేయకుండా ఖాళీగా ఉంచేశారు.
దాదాపు రూ.30 లక్షల వ్యయంతో ఈ బరిని తయూరు చేస్తున్నారు. గత పది రోజులుగా పొక్లెయిన్లతో నేల చదును చేయించడం, ఇసుక పరిపించడం వంటి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పందేలు జరిగే సమయంలో జనం ముందుకు తోసుకురాకుండా బరి చుట్టూ కొత్తగా ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో పందేలకు వీలుగా భారీ ఫ్లడ్ లైట్లు అమరుస్తున్నారు. మురమళ్ల బరిలో కేవలం కోడి పందేలే కాక అదే స్థాయిలో పేకాట ఆడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తరలిరండి మా బరికి..
కోనసీమ ప్రాంతానికి చెందిన కొందరు ధనికులు వ్యాపారాల రీత్యా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారిలో కొందరికి ఏటా సంక్రాంతికి కోనసీమకు రావడం, కోడి పందేలు ఆడడం, చూడడం రివాజు. వారి ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఈసారి పందేల నిర్వాహకులు అలాంటి సుదూర ప్రాంతాల్లో ఉండే వ్యాపారవేత్తలకు, సంపన్నులకు ఆహ్వానాలు పంపించారు. వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా పందేల బరుల వద్ద సదుపాయాలను, వినోద కార్యక్రమాలను వివరించారు.
లక్షల్లో గుండాట, మద్యం దుకాణాల వేలం
కోనసీమలో మురమళ్లతో పాటు అల్లవరం మండలం గోడి, గోడితిప్ప, మలికిపురం మండలం వి.వి.మెరక, సఖినేటిపల్లిలంక, రామరాజులంక, అంబాజీపేట మండలం వాకలగరువు, రావులపాలెం మండలం దేవరపల్లిల్లో, సామర్లకోట మండలం వేట్లపాలెం తదితర ప్రాంతాల్లో కోడి పందేల బరులు సిద్ధమవుతున్నాయి. బరుల వద్ద గుండాట బోర్డులు, మద్యం, పలావు, మిరపకాయ బజ్జీ, మాంసం పకోడీ దుకాణాల ఏర్పాటుకు పందేల నిర్వాహకులు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. గుండాట, మద్యం దుకాణాల వేలం రూ.లక్షల్లో ఖరారు కావటం గమనార్హం. పండగ మూడు రోజుల్లో ఒక్కో బరిలో పందేల నిర్వాహకులకు ఇలాంటి వేలం ద్వారా రూ.రెండు లక్షల నుంచి రూ. పది లక్షల వరకూ ఆదాయం సమకూరనుంది.
మురమళ్లలో రూ.60 లక్షల పేకాట టోర్నీ!
పండగ చివరి రోజు మురమళ్ల బరి వద్ద 40 మంది పేకాటగాళ్లు ఒక్కొక్కరు రూ.1.50 లక్షల వంతున డిపాజిట్ చేసి ఆడే భారీ పేకాట టోర్నమెంట్‌లో ఫైనల్ విజేతకు రూ.18 లక్షల కారును బహుమతిగా ఇవ్వనున్నారు. తర్వాతి రెండు స్థానాల్లో నిలిచే వారికీ ఖరీదైన బహుమతులు అందనున్నాయి. 40 మందీ కొన్ని బృందాలుగా పేకాడతారనీ, చివరికి అతి తక్కువ పాయింట్లు కోల్పోయిన వారు విజేతగా నిలుస్తారని, ఈ తరహా టోర్నమెంట్లు తమిళనాడులో జరుగుతాయని చెపుతున్నారు. కాగా పందేలు ఆడేందుకు, వీక్షించేందుకు వచ్చే సంపన్నుల కార్ల కోసం సువిశాలమైన పార్కింగ్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఈసారి మురమళ్లే పందేల్లో ‘అగ్రతాంబూలం’ అందుకునేలా సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ ఒక్క బరిలోనే పండగ మూడు రోజుల్లో రూ.50 కోట్లు చేతులు మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పందెం పుంజుల్ని రెండు రోజుల ముందే మురమళ్లకు తీసుకు రానుండగా వాటికి అవసరమైన సదుపాయూలు పందేల నిర్వాహకులే కల్పించనున్నారు.
పోరు బరులు రె‘ఢీ’
Published Sun, Jan 10 2016 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM
Advertisement
Advertisement