సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఎవరేమన్నా, ఏదేమైనా..దాదాపు రెండు వారాలుగా సిద్ధమవుతూ వచ్చిన బరుల్లో పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. కోడిపుంజులు కంఠాలు రిక్కించి, కాళ్లే మారణాస్త్రాలుగా లంఘించే పోరు మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. జిల్లాలో కోనసీమలో లంకలు, మెట్టలో గ్రామ శివారు ప్రాంతాల్లో కోడిపందేలకు రంగం సిద్ధమైంది. కొన్ని బరుల్లో బారికేడ్లు, కుర్చీలు, ఇతర ఏర్పాట్లకు రూ.రెండు లక్షల వరకూ ఖర్చు చేశారంటే.. పందేలు ఏ స్థాయిలో సాగుతాయో ఊహించుకోవచ్చు. ఇక వీటి నిర్వహణను సైతం పోటీ పడి రూ.లక్షలు వెచ్చించి దక్కించుకున్న వారున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే పందేలకు హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల నుంచి ప్రముఖులు సైతం తరలివస్తున్నారు. ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో స్థిరపడినవారు సైతం పండగకు సొంతూరు వచ్చి.. పందేలకు సిద్ధమైపోతున్నారు. పండగ మూడురోజులూ జిల్లాలోని బరుల్లో దాదాపు రూ.వంద కోట్ల మేర చేతులు మారతాయని అంచనా.
ఫ్లడ్‌లైట్లు, షామియూనాలు..
కోనసీమలో ఐ.పోలవరం మండలం మురమళ్ల, అల్లవరం మండలం గోడిలంకల్లో భారీ బరులు సిద్ధం చేశారు. ఫ్లడ్‌లైట్లు, షామియానాలతో పాటు గుండాట బోర్డులు సిద్ధం చేస్తున్నారు.ఐ.పోలవరం మండలంలో గతంలో ఎదుర్లంక, కేశనకుర్రు, మురమళ్లలో పందేలు జరిగేవి. ఇప్పుడు ఒక్క మురమళ్లలోనే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పందేలను తిలకించేందుకు కొందరు ప్రజాప్రతినిధులు, మంత్రులతో పాటు తెలంగాణ నుంచి కూడా కొందరు రాజకీయ నాయకులు వస్తారనే ప్రచారం జరుగుతోంది. కాట్రేనికోన మండలం చెయ్యేరులో గతంలో జరిగిన పందేలను ఐజీ స్థాయి పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు వీక్షించిన సందర్భాలున్నాయి. ఈ మండలంలో గెద్దనపల్లి, నడవపల్లి, దొంతికుర్రు, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, ఎస్.యానాం, చల్లపల్లి, గొల్లవిల్లి, గాడవిల్లి, భీమనపల్లి, అల్లవరం మండలం గుండెపూడి, రాజోలు నియోజకవర్గంలో మలికిపురం, వి.వి.మెరక, సఖినేటిపల్లి, ఆత్రేయపురం మండలం లొల్ల, పేరవరం, తాడిపూడి, పులిదిండిల్లో బరులు సిద్ధమయ్యూయి.
మిగిలిన చోట్లా పందేలకు సై..
రాజానగరం మండలం దివాన్‌చెరువు, పుణ్యక్షేత్రం, కల్వచర్ల, తోకాడ, మల్లంపూడి, కోరుకొండ మండలం శ్రీరంగపట్నం, నర్సాపురం, సీతానగరం మండలం పెదకొండేపూడి, రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి, కవలగొయ్యి, శాటిలైట్ సిటీ, పిఠాపురం టౌన్‌తో పాటు పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోనూ బరులు సిద్ధమయ్యాయి. ఇక గుండాటలు, పేకాటలు యథావిధిగా జరగనున్నాయి. మెట్ట ప్రాంతంలో కిర్లంపూడిలో పందేలకు భారీ ఏర్పాట్లు చేశారు.
సామర్లకోట మండలం వేట్లపాలెం, మేడపాడు, పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం, జి.రాగంపేటల్లో పందేలు జరగనున్నాయి. తుని మండలం తేటగుంట, వి.కొత్తూరు, వల్లూరు, తొండంగి మండలం ఏవీ నగరం, తొండంగి, కోటనందూరు మండలం కె.ఎ.మల్లవరం, అల్లిపూడిల్లో, విశాఖ-తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న కె.ఒ. మల్లవరంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరప మండలంలో గొర్రిపూడి, అరట్లకట్ట, వేళంగి, యండమూరు, పెనుగుదురు, నడకుదురు గ్రామాల్లో, కాకినాడ రూరల్ మండలంలో పండూరు, నేమాం, వాకలపూడి, వలసపాకల, తూరంగి తదితర గ్రామాల్లో పందేల నిర్వహణకు రంగం సిద్ధమైంది.
ఏజెన్సీలోనూ..
ఏజెన్సీలో గంగవరం మండలం ఓజుబంద, దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్, మండల కేంద్రం వీఆర్‌పురంలలో భారీగా పందేలు జరగనున్నాయి. ఓజుబంద, ఫజుల్లాబాద్ మైదాన ప్రాంతాలకు సమీపంలో ఉండటంతో అక్కడ పందేలను చూడటానికి భారీ సంఖ్యలోనే వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
కదనానికి కౌంట్‌డౌన్
Published Thu, Jan 14 2016 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM
Advertisement
Advertisement