
కోల్డ్‌వార్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : రాష్ట్రంలో టీడీపీ చేతిలో అధికారం ఉండటంతో జిల్లాలో తమ్ముళ్లదే పైచేయిగా సాగుతోంది. దీంతో కమలనాథులు అధిష్టానానికి చెప్పినా ఫలితం లేకపోవటం తో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్నారు. ఆ వివరాల్లోకెళితే... జిల్లాకు ప్రతిష్టాత్మకమైన దుగ్గరాజపట్నం ఓడరేవు నిర్మించాలన్నది బీజేపీ నాయకుల కల. అందుకు కేంద్రప్రభుత్వం సైతం తమవంతు నిధులు కేటాయించటానికి సిద్ధమైంది. దుగ్గరాజపట్నం ఏర్పాటు విషయంలో రాష్ర్టప్రభుత్వం వెనుకడుగేస్తోంది.
అందుకు అనేక కారణాలను బూచి గా చూపిస్తూ..ఓడరేవు రాకుండా అడ్డుకుంటుందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కోట సమీపంలో తోళ్లపరిశ్రమను నిర్మించి తీరాలని టీడీపీ పట్టుబడుతోంది. సముద్రం కలుషితమై మత్స్యసంపదకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని బీజేపీ నాయకుల వాదన. తోళ్ల పరిశ్రమను నిర్మిస్తే మత్స్యకారులుతో పాటు చుట్టపక్కల గ్రామాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
ప్రభుత్వ పథకాల్లోనూ కమలనాథులకు అన్యాయం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లోనూ తమకు తీరని అన్యాయం జరుగుతోందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం సీఎస్‌ఆర్ పథకం కింద మంజూరు చేసిన 5,500 ఉచిత గ్యాస్ కనెక్షన్లు సై తం తమ్ముళ్లు దక్కించుకున్నట్లు తెలి సింది. పేద, మధ్య తరగతి వారి కోసం కేంద్రం గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా పంపిణీ చేయమంటే.. టీడీపీ నాయకులే 4,500 కనెక్షన్లను వారికి, అనుచరులకు దక్కించుకున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. జన్మభూమి కమిటీలు ఏర్పా టు చేసి ప్రభుత్వ పథకాలు తాము చెప్పిన వారెవ్వరికీ ఇవ్వకుండా టీడీపీ నాయకులే దక్కించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
అంతటి వదలకుం డా బీజేపీ నాయకులు, కార్యకర్తల పైనా టీడీపీ నాయకులు తప్పుడు కేసులు బనాయించే స్థాయికి చేరారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేజర్ల మండలం గోడపాడు రచ్చబండ వద్ద గొడవ జరిగింది. ఆ వివాదంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై 307 కేసులు నమోదు చేయించి టీడీపీ వారి పై పెట్టీకేసులు పెట్టి తప్పుకున్నట్లు తెలిసింది. బీజేపీ, టీడీపీల మధ్య గొడవలు జరుగుతున్న దృష్ట్యా బీజేపీ అధిష్టానం ఇరుపార్టీల నాయకులతో సమన్వయకమిటీని వేసి సయోధ్య కుది ర్చేందుకు శ్రీకారం చుట్టింది.
అందులోభాగంగా బీజేపీ నుంచి కమిటీలో ఎవరెవరు ఉండాలో జాబితా ఇచ్చా రు. టీడీపీ నుంచి ఇంతవరకు ఒక్కరి పేరు కూడా ఇవ్వలేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. పేర్లు ఇవ్వకపోవటం వెనుక బీజేపీతో కలిసి పనిచేయాలనే అభిప్రాయం టీడీపీ నేతల్లో లేదని స్పష్టమైందని కమలనాథులు చెబుతున్నారు. తాజాగా గురువారం రాత్రి మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో సంతపేట, తదితర ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు. అయితే కనీస సమాచారం కూడా ఇవ్వకుండా మంత్రి రావటాన్ని స్థానిక బీజేపీ కౌన్సిలర్ భర్త కప్పిర శ్రీనివాసులు ప్రశ్నించారు.
దీంతో కొంతసేపు టీడీ పీ, బీజేపీ వర్గీయుల మధ్య వాగ్వాదం నడిచినట్లు తెలిసింది. టీడీపీ నేతల ఆదేశాల మేరకు శ్రీనివాసులను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి రంగంలోకి దిగి శ్రీనివాసులను విడిపించుకొచ్చినట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం తీవ్రమవుతుందా? సమసిపోతుందా వేచిచూడాలి.