బరి నుంచి తప్పించారు | Initiative as Strategic | Sakshi
Sakshi News home page

బరి నుంచి తప్పించారు

Published Wed, Mar 8 2017 11:22 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Initiative as Strategic

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : మహిళపై టీడీపీ మంత్రాంగం ఫలించింది. తీవ్రమైన ఒత్తిడి నడుమ తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా బరిలో నిలచిన చదలవాడ సుచరిత పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడుకే మద్దతు అంటూ విచారవదనంతో తెలిపారు.

పార్టీ అభ్యర్థిత్వం ఆశించి..
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాని కి టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి భార్య సుచరిత టీడీపీ మద్దతుతో పోటీకి దిగాలని భావించారు. టికెట్‌ తనకే వస్తుందన్న ధీమాతో మూడు నెలల ముందు నుంచే ఆమె ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగట్టడానికి రంగంలోకి దిగారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలతో మూడు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు. టీడీపీ అభ్యర్థిగా తనను ప్రకటించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు వినతిపత్రం ఇచ్చారు.

టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం మద్దతు సంపాదించి మిత్రపక్షం కోటాలో బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఈ స్థానానికి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. చివరి నిమిషంలో వాసుదేవనాయుడుని అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం సుచరితను పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేసింది. చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణ, సుచరిత భర్త చదలవాడ కృష్ణమూర్తి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.శ్రీనివాసులుకు ఈ బాధ్యత అప్పగించారు.

వ్యూహాత్మకంగా ముందడుగు
 తెలుగుదేశం అధిష్టానం వాసుదేవనాయుడుని అభ్యర్థిగా ప్రకటించడంతో ఒత్తిడి వస్తుందని ఊహించిన సుచరిత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. సుచరిత తిరుగుబాటు అభ్యర్థిగా పోటీలో నిలిచినా పెద్దగా ప్రభావం చూపలేరని తెలుగుదేశం నాయకులు మొదట భావించారు. అయితే ఈ స్థానానికి చతుర్ముఖ పోటీ నెలకొనడం, పీడీఎఫ్‌ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యంకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ మద్దతు తెలపడం, ఏపీటీఎఫ్‌ నాయకుడు మాదాల వెంకటకృష్ణయ్య గట్టి పోటీ ఇస్తుండటంతో సుచరితను ఎలాగైనా పోటీ నుంచి తప్పించాలని తెలుగుదేశం నాయకత్వం నిర్ణయించింది.

నాలుగు గంటల పాటు చర్చోపచర్చలు
ఎన్నికల ఏర్పాట్లపై తన మద్దతుదారులతో చర్చించడానికి మంగళవారం నెల్లూరుకు వచ్చిన సుచరితను మంత్రి నారాయణ, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య కలిశారు. పోటీ నుంచి తప్పుకుని టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిని ఆమె తొలుత తిరస్కరించారు. అధికారపార్టీపై తిరుగుబాటు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఆమెను హెచ్చరించారని తెలిసింది. ఇప్పటికైనా మించిపోలేదని, పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి మద్దతిస్తున్న సంఘాలన్నీ టీడీపీ అభ్యర్థికి పనిచేయాలని పత్రికా ప్రకటన ఇవ్వాలని సుచరితకు వారు సూచించినట్లు సమాచారం. తాను మద్దతు అడిగితే ఏమాత్రం పట్టించుకోని పార్టీ నాయకత్వం చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవాలని ఎలా అడుగుతుందని  సుచరిత మంత్రిని ఎదురు ప్రశ్నించారని తెలిసింది. తనకు మద్దతు ఇస్తున్న సంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతానని సుతిమెత్తగా తిరస్కరించారని సమాచారం.

పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక
గంటల కొద్దీ చర్చించినా వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో మంత్రి నారాయణ, వర్ల రామయ్య చివరకు బెదిరింపులకు దిగినట్లు సమాచారం. చెప్పినట్లు వినకపోతే చదలవాడ విద్యాసంస్థలను మూసి వేయిస్తామని, రాజకీయంగా ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లు.. బరి నుంచి తప్పుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆగ్రహించినట్లు తెలిసింది. చంద్రబాబుకు ఫోన్‌ చేసి సుచరితతో మాట్లాడించినట్లు, చివరకు సుచరిత బరి నుంచి తప్పుకునేలా ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఎట్టకేలకు రాత్రి 11 గంటల ప్రాంతంలో తాను పోటీ నుంచి తప్పుకుని టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు మంత్రి నారాయణ, వర్ల రామయ్యలతో కలిసి సుచరిత విచారవదనంతో విలేకరులకు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement