సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: వ్యవసాయానికి సాగునీరు నుంచి గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు వరకూ.. ఉపాధి కల్పన నుంచి పరిశ్రమల స్థాపన వరకూ.. పింఛను నుంచి రేషన్‌కార్డు వరకూ ఇలా ప్రతి అంశంలోనూ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ల కాలంలో చేసిందేమైనా ఉందా? అంటే ప్రజలు మాత్రం పెదవి విరుస్తున్నారు. ముఖ్యమంత్రే సిక్కోలు జిల్లాలో పది సార్లు పర్యటించినా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు మాత్రం గుదిబండలా అలాగే ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనేక హామీలు ఇచ్చినా అవేవీ కార్యరూపం దాల్చ లేదు.
ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే గురువారం నుంచి రెండ్రోజుల పాటు ఆయన జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర రాజధానిలో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దీనికి జిల్లా కలెక్టరు కె.ధనంజయరెడ్డి కూడా హాజరవుతున్నారు. జిల్లాలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల సహా వ్యవసాయ, వ్యవసాయానుబంధ, పారిశ్రామిక, సేవా రంగాల తీరుపై నివేదికను సమర్పించనున్నారు.
జిల్లా కలెక్టరు నివేదిక ప్రకారం జిల్లా గత ఆర్థిక సంవత్సరం (2016–17)లో వ్యవసాయ రంగం 12.8 శాతం, పారిశ్రామిక రంగం 9.28 శాతం, సేవారంగంలో 10.10 శాతం వృద్ధి సాధించింది. కానీ ఇదంతా నివేదికలో చూపించడానికే తప్ప ఆచరణలో ఆ స్థాయి వృద్ధి కనిపించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా తలసరి ఆదాయం రూ.94,118 మాత్రమే. కానీ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,22,376 ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 14.44 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టరు ధనంజయ్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. తొలిరోజు వ్యవసాయం, వ్యవసాయాధార పరిశ్రమల పరిస్థితి, సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపుల అవసరంపై కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించనున్నట్లు తెలిపారు. జీడిపప్పు పరిశ్రమలో అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతులకు బదులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫుడ్‌ప్రాసెసింగ్ విధానాన్ని పరిచయం చేయాల్సి ఉందన్నారు. మేజర్, మైనర్ ఇరిగేషన్‌లో పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించనున్నట్లు చెప్పారు.
ఉద్దానం సహా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించడానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ప్రస్తావించనున్నట్లు తెలిపారు. కొవ్వాడ అణుపార్కు, భావనపాడు పోర్టు భూసేకరణకు సంబంధించిన వివాదాలను కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. శ్రీకాకుళంలోని ఏకైక ప్రభుత్వ బోధనాసుపత్రి రిమ్స్‌లో ఎంబీబీఎస్ సీట్లు వంద నుంచి 150కి పెంపు, అలాగే పీజీ వైద్య విద్య సీట్ల పెంపునకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన విషయమై ప్రస్తావించనున్నట్లు చెప్పారు. ఉద్దానంలోని కిడ్నీ రోగులకు ఉచితంగా మందుల సరఫరా ప్రతిపాదనను కూడా సాధ్యమైనంత సత్వరమే ఆచరణలోకి తీసుకొచ్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment