breaking news
dhananjaya Reddy
-
‘సాక్షి’పై ప్రభుత్వ కక్ష సాధింపు తగదు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి, ప్రత్యేకించి ‘సాక్షి’ మీడియా సంస్థను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏపీలో ‘సాక్షి’ మీడియా సంస్థతోపాటు జర్నలిస్టుల పట్ల పోలీసుల వ్యవహారశైలిపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం ఎడిటర్స్ గిల్డ్ ఒక ఘాటు లేఖ రాసింది. ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలను తక్షణమే నిలిపివేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడు అనంత్ నాథ్, ప్రధాన కార్యదర్శి రూబెన్ బెనర్జీ, కోశాధికారి కె.వి. ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.ఒక్క పత్రికపైనే ఎందుకు?ఒక రాజకీయ నాయకుడు నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ప్రచురించినందుకు ఇతర మీడియా సంస్థలను వదిలిపెట్టి, కేవలం ‘సాక్షి’పై మాత్రమే క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది పక్షపాత వైఖరికి నిదర్శనమని, నేర చట్టాలను ఎంపిక చేసుకుని ప్రయోగించడం పోలీసుల అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని పేర్కొంది. ఇది సాధారణ జర్నలిజంలో భాగమే అయినప్పటికీ, ‘సాక్షి’ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది.వేధింపులు ఆపండి పత్రికలను అనవసరమైన, కక్ష సాధింపు ఫిర్యాదులతో వేధించకూడదని ఎడిటర్స్ గిల్డ్ హితవు పలికింది. పోలీసుల ప్రవర్తన నిష్పక్షపాతంగా, వృత్తిపరంగా ఉండాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే సంస్థలను భయపెట్టేలా ఉండకూడదని స్పష్టంచేసింది. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను అణచివేయడానికి, భయపెట్టడానికి క్రిమినల్ చట్టాలను ఆయుధాలుగా వాడటం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. తక్షణమే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని, రాష్ట్రంలో పత్రికలు నిర్భయంగా విధులను నిర్వర్తించే వాతావరణాన్ని కల్పించాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది.సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసులు పత్రికా స్వేచ్చపై దాడే: ఐజేయూ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛపై దాడే అని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) తీవ్రంగా విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులతోనే సాక్షి దినపత్రిక, పాత్రికేయులను వేధిస్తోందని ఐజేయూ ప్రధాన కార్యదర్శి బల్విందర్‌సింగ్ జమ్ము శుక్రవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు ఇటీవల తనిఖీలు చేయడం, ఆయనకు నోటీసులు జారీ చేయడం పత్రికా స్వేచ్ఛపై ముప్పేట దాడి చేయడమేనని ఆయన దుయ్యబట్టారు. సాక్షి ఎడిటర్, పాత్రికేయులను భయపెట్టేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పత్రికలను నియంత్రించాలని ఏ ప్రభుత్వం భావించకూడదన్నారు. పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, కథనాలపై అభ్యంతరం ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని బల్విందర్‌సింగ్ స్పష్టంచేశారు. కానీ, పత్రికలపై అక్రమ కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్చను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి చర్యలను ఐజేయూ ఏమాత్రం ఆమోదించదని స్పష్టంచేశారు. -
ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం
సాక్షి బెంగళూరు: పత్రికా స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటకలో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ తీరు పత్రికల గొంతు నొక్కడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదమన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి వేధించడాన్ని ఇక్కడి జర్నలిస్టు సంఘాల నేతలు, న్యాయవాదులు, రైతు సంఘం నాయకులు, తెలుగు సంఘాల ప్రతినిధులు తప్పుపడుతున్నారు. ఏ వార్తా పత్రికలో ప్రచురితమైన వార్తపైనా అభ్యంతరాలుంటే దాన్ని ఖండించడం లేదా వివరణ ఇవ్వడం పరిపాటి అని.. కానీ, ఇలా విలేకరులపై కేసులు పెట్టడం, నోటీసులివ్వడం సరికాదని హితవు పలికారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం, భంగం కలిగేలా.. ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు వ్యవహరించడాన్ని వారు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పలు పార్టీల నాయకులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, మేధావుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..కేసులు పెట్టి వేధించడం సబబు కాదు.. పత్రికల్లో వచ్చే ప్రతి విమర్శపై కేసులు పెట్టడం పద్ధతికాదు. ఎవరి మీదైనా కేసులు పెట్టే ముందు, నోటీసులిచ్చే ముందు ఆ కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయా లేదా అని పరిశీలించాలి. ఆధారాల్లేకుండా కేసులు పెట్టడం చట్టవిరుద్ధం. ప్రచురితమైన వార్తలపై అభ్యంతరాలుంటే వివరణ లేదా రిజాయిండర్ డిమాండ్ చేయాలి. అప్పుడు కూడా పత్రిక ప్రచురించకపోతే తదుపరి చర్యలకు పూనుకోవాలి. అంతేగానీ, ఉద్దేశపూర్వకంగా ఇలా కేసులు పెట్టి వేధించడం సబబు కాదు. – పునీత్, సీనియర్ న్యాయవాది, బెంగళూరు ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే.. వార్తను ప్రచురించినందుకు సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై కేసులు పెట్టడం సమంజసం కాదు. కచ్చితంగా ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఆధారాల్లేని కేసులు చట్టం ముందు నిలబడవు.. ప్రజల కోసం ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించే పత్రికలపై ఇలా వేధింపులు స్వాగతించదగ్గ పరిణామం కాదు. – గుళ్య హనుమన్న, దళిత ఉద్యమ నాయకుడు, బెంగళూరు సాక్షి ఎడిటర్‌పై కేసులు ఎత్తేయాలి.. సాక్షి పత్రిక ఎడిటర్, రిపోర్టర్లపై అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పత్రిక స్వేచ్ఛపై దాడిగానే పరిగణిస్తున్నాం. ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతుంటే సాక్షి దినపత్రిక దాన్ని ఎత్తిచూపుతోందని, అంతమాత్రానా అదిరించి బెదిరించి రిపోర్టర్లను లొంగదీసుకోవాలని చూడడం సరికాదు. వెంటనే పత్రికా స్వేచ్ఛను కాపాడుతూ సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై కేసులను ఎత్తివేయాలి. – నకిరెకంటి స్వామి, రాష్ట్ర కార్యదర్శి, కర్ణాటక జర్నలిస్టు యూనియన్తప్పుడు కేసులు సబబు కాదు.. వార్తలో ఏమైనా అభ్యంతరాలుంటే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చు లేదా రిజాయిండర్ ఇవ్వొచ్చు. దానికి కూడా స్పందించపోతే కేసులు పెట్టుకోవచ్చు. అంతేగానీ, ప్రభుత్వం భయపెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలన్న కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టడం సబబుకాదు. వెంటనే సాక్షి పాత్రికేయులపై ఉన్న కేసులను ఎత్తివేయాలి. – రెవరెండ్ డాక్టర్ బిషప్ ఎం. బెంజమిన్, అధ్యక్షుడు, కర్ణాటక తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఫెలోషిప్ఇది ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం.. ఏపీలో ప్రతిపక్షం గొంతునొక్కే ఘటనలు తరచూ గమనిస్తున్నాం. ప్రతిపక్షాల గొంతును వినిపిస్తున్న మీడియాపై కూడా కక్షసాధింపు ధోరణి కనిపిస్తోంది. కేసులతో సాక్షిని అణచివేయాలని చూడడం దారుణం. సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు పెట్టి నోటీసులివ్వడం వారి స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఇది ప్రజాస్వామ్య రక్షణకు పెనుప్రమాదం. – సిద్ధం నారయ్య, అధ్యక్షుడు, బెంగళూరు తెలుగు సమాఖ్య మీడియా స్వేచ్ఛను గౌరవించే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు మీడియాను సహించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండడం లేదని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేయడంపై స్పందిస్తూ.. ‘మీడియాకు, జర్నలిస్టులకు ఒక హక్కు, స్వేచ్ఛ ఉంటాయన్న విషయాన్ని గౌరవించే పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా లేవు. జర్నలిస్టులను గౌరవించాలన్న విషయాన్ని వదిలేస్తున్నాయి. అందుకే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. – ప్రొఫెసర్ హరగోపాల్కేసులతో భయపెట్టే ప్రయత్నమే ఇదిసమాజ శ్రేయస్సుకు ప్రజాస్వామిక విలువలు, వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రం, స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ ఎంతో అవసరమని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ‘పత్రికా స్వేచ్ఛ వాక్ స్వాతంత్య్రంలో ఒక భాగం. మీడియా అనేది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య కళ్ల మాదిరిగా పనిచేస్తుంది. ఎక్కడో జరిగే అక్రమాలు, అన్యాయాలను మీడియా బట్టబయలు చేస్తుంది. దానివల్ల ప్రభుత్వాలకు, అధికారులకు తాము చేస్తున్న పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. కానీ, ప్రభుత్వానికి ఇష్టంలేని, నాయకులకు ఇష్టంలేని వార్తలు వచ్చినప్పుడు విలేకరులపై, ఎడిటర్లపై కేసులు పెట్టడం అంటే పత్రికా స్వేచ్ఛపై దెబ్బకొట్టడమే. విలేకరులపై, ఎడిటర్లపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తే ఇలాంటి వార్తలు రాకుండా చేయవచ్చన్నది వాళ్ల ప్రయత్నం. కానీ, అది అప్రజాస్వామికం. ఈ చర్యలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తాయి. అదేవిధంగా పత్రికా స్వేచ్ఛను హరిస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం’ అని విమర్శించారు. – జస్టిస్ చంద్రకుమార్ -
అక్రమ కేసులతో మీడియాను అణచివేయడం అసాధ్యం
సాక్షి, హైదరాబాద్: అక్రమ కేసులతో మీడియాను అణచివేయడం అసాధ్యం అని కుల సంఘాలు స్పష్టం చేశాయి. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఈ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా వ్యవహరించే మీడియా.. ప్రజల సమస్యలతో పాటు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతుందని, అలాంటి వాటిని సానుకూలంగా స్వీకరించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించాయి. సాక్షి మీడియా వచ్చిన తర్వాత బీసీలు, బడుగు, బలహీన వర్గాల గొంతు పెద్ద ఎత్తున వినిపిస్తోందని ఆ సంఘాలు తెలిపాయి. అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి.. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే ఈ వ్యవస్థను బలవంతంగా కేసులు పెట్టి లొంగదీసుకోవాలనుకోవడం ముర్ఖత్వం. సాక్షి మీడియా ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే ఏపీ ప్రభుత్వం ఈ కేసులను ఉపసంహరించుకోవాలి. – జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పత్రికా స్వేచ్ఛను హరించడమే.. ప్రతిపక్షంతో పాటు విపక్ష అనుకూల మీడియా గొంతు నొక్కుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాల చర్యలను ఎండగట్టడంలో మీ డియా పాత్ర కీలకం. అలాంటి వార్తలను ప్రభుత్వం పాజిటివ్‌గా తీసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలి. అలాకాకుండా మీడియాపైన అక్రమంగా కేసులు పెట్టడమంటే ప్రతికా స్వేచ్ఛను హరించడమే. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – గవ్వల భరత్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మీడియాపై దాడి మంచిదికాదు ప్రభుత్వాలు ఏ మీడియాపైనా ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయవద్దు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే.. వాటికి వివరణ ఇవ్వడమో, ఖండించడమో జరగాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తామనడం సరికాదు. సాక్షి ఎడిటర్‌పై ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. మీడియాలో కేవలం పాలకపక్షం వార్తలే కాకుండా ప్రతిపక్షం వార్తలు కూడా వస్తాయి. ప్రతిపక్షాల వార్తలు రాసినందుకు సాక్షి మీడియాపై కేసులు నమోదు చేయడమంటే జర్నలిజంపై నేరుగా దాడి చేయడమే. – జి.చెన్నయ్య, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు -
‘సాక్షి’పై కొనసాగుతున్న కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న సాక్షి పత్రికపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో పోలీసు అధికారులకు పదోన్నతులు కల్పించలేదని ప్రచురించిన కథనంపై నమోదు చేసిన అక్రమ కేసులో సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మరో ఇద్దరు పాత్రికేయులు తాడేపల్లి పోలీసుల ఎదుట గురువారం విచారణకు హాజరయ్యారు. పోలీసులు విచారణ పేరుతో మూడు గంటలపాటు వేచి ఉండేలా చేశారు.పాత్రికేయ ప్రమాణాలు, విలువలకు విరుద్ధంగా ప్రశ్నలు సంధించడం విస్మయ పరిచింది. బాధితుల వివరాలు వెల్లడించాలని, సంస్థ నిర్వహణకు సంబంధించిన అంతర్గత అంశాలు బహిర్గతం చేయాలని పట్టుబట్టడం గమనార్హం. రాజ్యాంగ నిబంధనలు, పాత్రికేయ ప్రమాణాలు, విలువలను కచ్చితంగా పాటిస్తున్నామని సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులు స్పష్టం చేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబమే పత్రికా స్వేచ్ఛ. సామాజిక మాధ్యమాల యుగంలో ప్రెస్‌మీట్‌ను వక్రీకరించకుండా యథాతథంగా ప్రచురించడం సంపాదకుడి బాధ్యత. సాక్షి ఎడిటర్‌గా తన విద్యుక్త ధర్మాన్ని పాటించిన ఆర్.ధనంజయరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం సరికాదు. ఫిర్యాదులోని అంశాల్లో ఆధారాలు పరిశీలించకుండా కేసులు నమోదు చేయడం భావ్యం కాదు. నేతలు తమ పార్టీ విధానాలను వెల్లడిస్తే, వాటి ఆధారంగా ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం సరికాదు. – కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ఎడిటర్పై కేసులు పెట్టే సంస్కృతి ఏమిటి?విలేకరుల సమావేశంలో ఒక నాయకుడు మాట్లాడిన అంశాలను పత్రికలో ప్రచురిస్తే.. ఆ పత్రిక సంపాదకునిపై ఏకంగా కేసు నమోదు చేయడం ఏమిటి? ఇదెక్కడి న్యాయం? ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా, సాక్షిలో పనిచేసే వారిని, ఎడిటర్ ధనంజయరెడ్డిని వేధించేలా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు పెట్టొచ్చు కానీ.. అది ప్రచురించిన సంపాదకునిపై కేసు పెట్టడం అధికార దుర్వినియోగమే. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుంది. ఈ సంస్కృతికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకాలి. – టి.హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాంపత్రికా స్వేచ్ఛ మన ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఒక మీడియా సమావేశాన్ని ప్రచురించినందుకు సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేయడం సరికాదు. విమర్శ హేతుబద్ధం కానప్పుడు, విమర్శ చేసిన వారిపై చట్టబద్ధ చర్య తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఈ విషయంపై పత్రిక సంపాదకునిపై కేసు పెట్టడం కక్ష సాధింపు చర్యే. దీనిని ఖండిస్తూ ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై ఎడిటర్ గిల్డ్ స్పందించాలని కోరుతున్నా. – విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలుబెదిరింపు ధోరణి సరికాదుపోలీసుల పదోన్నతుల్లో అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకు ప్రభుత్వం సాక్షిపై కక్షగట్టడం సరికాదు. లోపాలను ఎత్తిచూపితే బెదిరింపు ధోరణికి దిగడం సమర్థనీయం కాదు. సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పోలీస్ కేసులు పెట్టి విచారణ పేరుతో వేధించడం సరి కాదు. పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించేలా పోలీసులు తీరు ఉంది. ఏదైనా అభ్యంతరకరమైన విధంగా వార్తా కథనం ప్రచురిస్తే.. పోలీసు అధికారులు రిజాండర్ ఇచ్చే అవకాశం ఉంది. పోలీసులు తమ వాదనను కూడా సంబంధిత పత్రికకు చెప్పొచ్చు. అంతేగాని అధికారం చేతిలో ఉందని కేసులు పెట్టి బెదిరింపు ధోరణికి దిగడం మానుకోవాలి. – కె.రామకృష్ణ, సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిఇది కక్ష సాధింపు ధోరణేతెలుగు రాష్ట్రాల్లో పాలక పక్షాలు.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతిపక్షాల గొంతును వినిపిస్తున్న మీడియాపైనా కక్ష సాధింపు ధోరణి కనిపిస్తోంది. కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి పెరగడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ ఆలోచన విధానం నుంచి ప్రభుత్వాలు బయటకు రావాలి. ప్రతిపక్షాల పాత్రను అణచి వేయడం, పత్రికల స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం. ఏకపక్షంగా పత్రికల గొంతు నొక్కే యత్నం ప్రజా క్షేత్రంలో చెల్లుబాటు కాదు. – సంధ్య, పీఓడబ్ల్యూ నేతమీడియాపై కేసులు సరికాదు ఉద్దేశ పూర్వకంగా మీడియాపై కేసులు పెట్టడం సరికాదు. మీడియాలో కేవలం పాలక పక్షం వార్తలే కాదు. ప్రతిపక్షం వార్తలు కూడా వస్తాయి. ప్రతిపక్షాల వార్తలు రాసినందుకు మీడియాపై కేసులు నమోదు చేయడమంటే జర్నలిజంపై దాడి చేయడమే. – ఎస్ఎల్ పద్మ, ప్రజాపంథా నాయకురాలువిచారణ సందర్భంగా పలు ప్రశ్నలు!» సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. విజయవాడలోని సాక్షి కార్యాలయంలో అర్ధరాత్రి తనిఖీల పేరుతో వేధింపులకు తెగబడ్డారు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కును కాలరాస్తూ నమోదు చేసిన అక్రమ కేసుపై సాక్షి పత్రిక ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కఠిన చర్యలు చేపట్టవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణకు సహకరించాలని సూచించింది.» న్యాయస్థానం ఆదేశాల మేరకు సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇద్దరు పాత్రికేయులు తాడేపల్లి పోలీసు స్టేషన్లో సీఐ పి.వీరేంద్ర బాబు ఎదుట గురువారం విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా పోలీసులు దాదాపు 3గంటలపాటు నిరీక్షించేలా చేశారు. అసలు పత్రికా నిబంధనలను, నియమావళికి విరుద్ధంగా ప్రశ్నలు సంధించడం గమనార్హం.» బాధితుల వివరాలు చెప్పకూడదన్నది సహజ న్యాయ సూత్రం. కానీ పదోన్నతులు కల్పించక పోవడంతో తాము నష్టపోయామని సాక్షి పత్రిక దృష్టికి తీసుకువచ్చిన పోలీసు అధికారుల పేర్లు, వివరాలు చెప్పాలని పోలీసులు పదే పదే ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పదోన్నతులు కోల్పోయిన డీఎస్పీలు బాధితులు అవుతారు. కానీ వారి పేర్లను చెప్పాలని తాడేపల్లి పోలీసులు పట్టుబట్టారు. » సాక్షి పత్రిక నిర్వహణ, రోజువారీ పనితీరు అన్నది ఆ సంస్థ అంతర్గత వ్యవహారం. ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని పత్రికకు సంబంధించిన అంతర్గత అంశాలను కూడా వెల్లడించాలని పోలీసులు ప్రశ్నించడం విస్తుగొలుపుతోంది. పోలీసులు సంధించిన 35 ప్రశ్నలకు సాక్షి ప్రతినిధులు లిఖిత పూర్వకంగా, మౌఖికంగా సమాధానాలు ఇచ్చారు.» రాజ్యాంగ నిబంధనలు, పాత్రికేయ ప్రమాణాలు, విలువలను సాక్షి పత్రిక కచ్చితంగా పాటిస్తోందని స్పష్టం చేశారు. పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బ తీయడం తమ అభిమతం ఏమాత్రం కాదని, ప్రజల ప్రయోజనాల పరిరక్షణే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఎటువంటి బాహ్య ఒత్తిడికి తలొగ్గకుండా పాత్రికేయ ప్రమాణాలు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను తు.చ. తప్పక పాటిస్తున్నామని సాక్షి ప్రతినిధులు విస్పష్టంగా చెప్పారు. న్యాయవాదుల సమక్షంలో నిర్వహించిన విచారణ ప్రక్రియను పోలీసులు వీడియో తీశారు. -
కలంపై కూటమి కత్తి.. ఖండించాలి గొంతెత్తి
సాక్షి, హైదరాబాద్: పత్రికాస్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును ఏపీ, తెలంగాణకు చెందిన పలు రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరు పత్రికల గొంతునొక్కడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్చార్జి, రిపోర్టర్లపై ఏపీ ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు కేసులు పెట్టి ఆఫీస్‌కు వచ్చి మరీ నోటీసులు అందజేయడంపై వారు మండిపడ్డారు. ‘సాక్షి’ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో ప్రచురితమైన వార్తపై చద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేసు పెట్టి నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. వార్తాపత్రికలో వచ్చిన ఏదైనా వార్తపై అభ్యంతరాలుంటే ఖండించడం, వివరణ ఇవ్వడం సంప్రదాయం కాగా.. ఏకంగా కేసులు పెట్టి సాక్షి జర్నలిస్టులకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. పత్రికాస్వేచ్ఛకు విఘాతం, భంగం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు వ్యవహరించడాన్ని నిరసించారు. పలు పార్టీల నాయకులు, జర్నలిస్టు సంఘాల నేతల అభిప్రాయాలు.. వారి మాటల్లోనే..కక్షపూరితం.. అత్యంత దుర్మార్గం ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ పట్ల రాజకీయ పార్టీలకు గౌరవం ఉండాలి. అది లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. పత్రికా స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అని ప్రభుత్వంలో ఉన్న వారికి తెలియంది కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ఏ ఈ హక్కును ప్రసాదించింది. దీనిని ఉల్లంఘించి ఇష్టానుసారం పాలన సాగిస్తామంటే కుదరదు. రాజకీయ నేతలు మాట్లాడిన మాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లే మాధ్యమం మీడియా. ఈ క్రమంలో వారికి ఇష్టం లేని మాటలు మాట్లాడారని ప్రజల గొంతుక అయిన పత్రిక పట్ల, పత్రిక ఎడిటర్ పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ఇది మంచిది కాదు. రాత్రి తర్వాత కచ్చితంగా పగలు అనేది వస్తుందని పాలకులు గుర్తుంచుకోవాలి. సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. – బొత్స సత్యనారాయణ, శాసన మండలి విపక్ష నేత భయపెట్టి దారికి తెచ్చుకోవాలనే కుతంత్రం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడిన మాటలను ప్రచురించినందుకుగాను ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం ఎంత మాత్రం సరికాదు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపే. సాక్షి దినపత్రిక వాస్తవాలను వెలికి తెస్తోందని, ప్రభుత్వ పెద్దల నిర్వాకాలను బట్టబయలు చేస్తోందని ఇలా దుర్మార్గంగా కేసులు పెట్టడం ఎంత మాత్రం భావ్యం కాదు. పత్రికలో వచ్చిన వార్త లేదా కథనంలో ఏవైనా అభ్యంతరాలుంటే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చు. లేదా రిజాయిండర్ ఇవ్వొచ్చు. దానికి స్పందించకపోతే పరువునష్టం దావా వేసుకోవచ్చు. భయపెట్టి, తన దారిలోకి తెచ్చుకోవాలనే కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టడాన్ని సమాజం హర్షించదు. వెంటనే సాక్షి ఎడిటర్‌పై కేసులను ఎత్తివేయాలి. – భూమన కరుణాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేత కేసులు పెట్టడం పద్ధతి కాదు వార్తాపత్రికల్లో వచ్చే ప్రతి విమర్శపై కేసులు పెట్టడం పద్ధతి కాదు. ఎవరి మీద అయినా కేసు పెట్టడానికి ముందు, నోటీసులు ఇవ్వడానికి ముందే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం చట్టవిరుద్ధం. ప్రచురితమైన వార్తలపై అభ్యంతరాలుంటే వివరణ లేదా రిజాయిండర్ ఇవ్వాలి. దానిని ఆ పత్రిక ప్రచురించకపోతే తదుపరి చర్యలు తీసుకునే వీలుంటుంది. – ఎన్.రామచందర్‌రావు, సీనియర్ న్యాయవాది, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పత్రికాస్వేచ్ఛపై దాడే సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసును తీవ్రంగా ఖండస్తున్నాం. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణిస్తున్నాం. ఏపీలో అదిరించి, బెదిరించి మీడియాను, రిపోర్టర్లను లొంగదీసుకోవాలని కూటమి కుట్రపన్నతోంది. రిపోర్టర్ ఉద్యోగమే.. ఎవరు ఏ అంశాలు మాట్లాడితే వాటిని యథాతథంగా ప్రచురించడం. ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీ విధానం మేరకు మాట్లాడితే దాన్ని ప్రచురించడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుగా చిత్రీకరించడం, తప్పుడు కేసులు నమోదు చేయడం తప్పు. – దాసోజు శ్రావణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సమంజసం కాదు ఒక రాజకీయ నాయకుడు పెట్టిన ప్రెస్‌మీట్ వార్తను ప్రచురించినందుకు సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసు పెట్టడం సమంజసం కాదు. అది పత్రికాస్వేచ్ఛను హరించడమే. కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఆధారాల్లేని కేసులు చట్టప్రకారమే కాదు.. ప్రజల ముందు కూడా నిలబడవు. – జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే -
కూటమి సర్కారు బరితెగింపు
జనం పక్షాన నిలిచిన కలంపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కత్తిగట్టింది. గత పదిహేను నెలల పాలనలో వరస కుంభకోణాలూ, వంచనలూ తప్ప చేసిందేమీ లేదని బట్టబయలవుతున్నకొద్దీ దిక్కుతోచక ‘సాక్షి’పైనా, ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డిపైనా అక్రమ కేసులతో రెచ్చిపోతోంది. రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సిన బాధ్యతను పక్కనబెట్టి రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మారుస్తోంది. పత్రికలపై కక్షగట్టడంలో ప్రభుత్వ నైచ్యం హద్దులు దాటింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే వెనువెంటనే కేసులు రిజిస్టర్ చేయాలంటూ కూటమి సర్కారు మౌఖిక ఆదేశాలిచ్చిందంటున్నారు. అందులో భాగంగానే సోమవారం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయానికొచ్చి ఎడిటర్ ధనంజయరెడ్డికి నోటీసులు అందజేశారు. గత మే నెలలోనే కూటమి ప్రభుత్వం ఈ అరాచకానికి నాంది పలికింది. విజయవాడలో ధనంజయరెడ్డి ఇంట్లోకి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తప్పుడు సాకులతో అక్రమంగా చొరబడి,‘మద్యం కేసు నిందితులు మీ ఇంట్లో ఉన్నారేమో తెలుసుకోవటానికి వచ్చామంటూ మూడు గంటలపాటు హడావుడి సృష్టించింది. తలుపులు మూసి, సోదాలు చేసి, దౌర్జన్యంతో ఫోన్ లాక్కొనే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం వాస్తవాలను ఏ మాత్రం సహించే స్థితిలో లేదు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆఖరుకు వార్తలను, వ్యాఖ్యలను కవర్ చేసినా కూడా ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు పెడుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాల్లోని వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే ఇలా కక్షగట్టింది. అసలే స్కాంలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడిదాకో ఎందుకు... 2015 మొదలుకొని 2019 వరకూ అధికారం వెలగబెట్టినప్పుడు ఏటా రూ. 1,300 కోట్ల చొప్పున అయిదేళ్లలో ఖజానాకు వేల కోట్ల రూపాయల మేర గండికొట్టిన ఘనుడాయన. ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదు. కాగ్ ఆధ్వర్యంలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నిశితంగా గమనించి బట్ట బయలు చేసిన చేదు నిజం. దీన్నంతటిని వెలుగులోకి తెస్తున్నందునే ‘సాక్షి’పై సర్కారు వారి అక్కసు. ఇదొక్కటే కాదు... అక్రమ మార్గాల్లో అధికారాన్ని చెరబట్టింది మొదలు కూటమి పెద్దలు చేయని అరాచకం లేదు. ఇసుక దోపిడీ, భూకబ్జాలు, పేరూ ఊరూ లేని సంస్థలకు విలువైన భూముల్ని కారు చౌకగా కట్టబెట్టడాలూ, మహిళలపై అఘాయిత్యాలూ.... ఒకటేమిటి, కూటమి సర్కారు చేస్తున్న సమస్త అరాచకాలనూ ‘సాక్షి’ బయట పెడుతోంది. అందుకే తప్పుడు కేసులు బనాయించి నోరుమూయించాలని చూస్తోంది. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నిత్యం రాజకీయ చైతన్యంతో తొణికిసలాడే ప్రాంతం. ఇలాంటిచోట ఎంతకైనా బరితెగించి పాలిద్దామని, నిజాలు బయటపెడుతున్నవారి నోరు నొక్కుదామని చూడటం తెలివితక్కువతనం. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా మీడియా పైనా, ఎడిటర్లపైనా ఈ స్థాయిలో కక్ష తీర్చుకున్న దాఖలాలు లేవు. గతంలో ‘సాక్షి’ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ మూకలు దాడులు చేశాయి. ఈమధ్య పోలీసులే ఆ బాధ్యత తీసుకుంటున్నారు. ఇటీవల విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలోకి అర్ధరాత్రి చొరబడి అరాచకం సృష్టించారు. ఇప్పుడిక వార్త ప్రచురించటాన్ని కూడా నేరంగా పరిగణించి నోటీసులు జారీ చేయటం, అక్రమ కేసులు బనాయించటం మొదలైందన్నమాట! ఒక పార్టీ నాయకుడు నిర్వహించిన మీడియా సమావేశం వివరాలు ప్రచురించటం నేరమెలా అవుతుందో సర్కారు చెప్పగలదా?మన రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో పత్రికా స్వేచ్ఛ అంతర్భాగం. పత్రికా స్వేచ్ఛ అంటే సమాచారాన్ని తెలుసుకోవటానికి ప్రజలకుండే హక్కు.దీన్ని కాలరాయాలని చూస్తే ప్రజాస్వామ్య శక్తులు సహించవు. ‘సాక్షి’ గొంతు నొక్కితే తమ అరాచకాలను ప్రశ్నించేవారుండరని కూటమి ప్రభుత్వం కలలుగంటోంది.అందుకే నోటీసులతో, తప్పుడు కేసులతో బెదిరిస్తోంది. పాలకుల అక్రమాలనూ, అన్యాయాలనూ, అరాచకాలనూ బట్టబయలు చేయటం, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటం ‘సాక్షి’ కర్తవ్యం. పాలకుల చవకబారు ఎత్తుగడలకు భయపడి దీన్నుంచి వైదొలగే ప్రశ్నే లేదు. -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు!
ఎమర్జెన్సీ నాటి దురాగతాలను తలపిస్తోన్న రాష్ట్ర పరిస్థితి సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమల్లో ఘోర వైఫల్యం.. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం.. అంతులేని అవినీతి, అక్రమాలపై ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తున్న ‘సాక్షి’ మీడియాపై ఆది నుంచీ చంద్రబాబు కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రజల గొంతుకగా ప్రతిధ్వనిస్తున్న ‘సాక్షి’పై పోలీసులను ఉసిగొలిపి, అక్రమ కేసులు బనాయిస్తూ బరితెగిస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను యథేచ్ఛగా కాలరాస్తూ.. పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తూ.. ఎమర్జెన్సీ నాటి దురాగతాలను గుర్తుచేస్తోంది. సోమవారం ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై తాడేపల్లి పోలీసు స్టేషన్లో నమోదు చేసిన అక్రమ కేసులే ఇందుకు తార్కాణం. దీనిని అడ్డుపెట్టుకుని సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు విజయవాడ ఆటోనగర్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో పోలీసులు దాడికి తెగబడ్డారు. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి 2 గంటల వరకూ హల్చల్ చేస్తూ భయోత్పాతం సృష్టించారు. ఇంతకూ ఆ అక్రమ కేసు ఎందుకు బనాయించారంటే.. పోలీసు అధికారుల హక్కులపై ‘సాక్షి’ గళమెత్తినందుకే. బరితెగింపునకు నిలువెత్తు నిదర్శనం.. రాష్ట్రంలో డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్యానల్ కాల పరిమితి ఆగస్టు 31తో ముగిసింది. కానీ.. పదోన్నతులు ఇవ్వకపోవడంతో డీఎస్పీలు తీవ్రంగా నష్టపోయారు. కొందరు గత నెల 31న రిటైరయ్యారు. మళ్లీ కొత్తగా ప్యానల్ ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించే సరికి మరికొందరు రిటైరవుతారు. భారీగా ముడుపులు ఇవ్వలేదనే నెపంతోనే తమకు పదోన్నతులు ఇవ్వలేదని పలువురు డీఎస్పీలు వాపోయారు. పోలీసు శాఖ క్రమశిక్షణను గౌరవిస్తూ.. ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రకటనలు జారీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచి్చంది. దీంతో కూటమి ప్రభుత్వం ‘సాక్షి’పై అక్రమ కేసులతో దాడికి తెగబడింది. ఏ పోలీసు అధికారుల హక్కుల కోసమైతే సాక్షి గళమెత్తిందో.. అదే పోలీసు అధికారులతోనే అక్రమ కేసు నమోదు చేయించి అత్యంత దుర్మార్గానికి పాల్పడింది. ఆ ఫిర్యాదు కూడా రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్‌తో చేయించి మరీ అక్రమ కేసు పెట్టడం గమనార్హం. ఆ ఫిర్యాదు మేరకు తాడేపల్లి స్టేషన్లో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై బీఎన్ఎస్ సెక్షన్లు 61(2), 196(1), 353(2) కింద కేసు(క్రైమ్ నంబరు 543/ 2025) నమోదు చేశారు. ఆది నుంచీ అక్రమ కేసులే.. చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ‘సాక్షి’పై అక్రమ కేసులతో దాడి చేస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో యథేచ్ఛగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది. కూటమి అరాచకాలను ఎక్కడికక్కడ ప్రశి్నస్తుండడంతో గొంతు నొక్కే దుస్సాహసానికి ఒడిగడుతోంది. రాజ్యాంగం కల్పించిన ఆరి్టకల్–19 (1)(ఏ)లోని భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తోంది. అక్రమ కేసులు బనాయించడాన్ని న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నా ప్రభుత్వ తీరు మారడం లేదు. భావ ప్రకటనపై వచ్చే ఫిర్యాదుల కేసు నమోదు విషయాల్లో పాటించాల్సిన ప్రమాణాలపై పోలీసుశాఖతోపాటు జిల్లా మేజి్రస్టేట్లకు హైకోర్టు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయినా సరే.. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు, ఎత్తిచూపుతున్న ‘సాక్షి’ని అక్రమ కేసులతో వేధించడమే పనిగా పెట్టుకుంది.రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. బాపట్ల టౌన్, టెక్కలి, కోనేరుసెంటర్, నరసరావుపేట: సాక్షి ఎడిటర్, మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా మంగళవారం బాపట్ల జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో పట్టణ పోలీసులకు వినతిపత్రం అందజేశారు. » సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ బందరు డీఎస్పీ చప్పిడి రాజాకు మచిలీపట్నం ‘సాక్షి’ పాత్రికేయుల బృందం మంగళవారం రాత్రి వినతిపత్రం అందజేసింది. » సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసుపై పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పాత్రికేయులు నిరసించారు. మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా ప్రెస్‌క్లబ్, నరసరావుపేట, ఏపీ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఏపీడబ్ల్యూయు జే) ప్రతినిధులు ఇన్చార్జి డీఎస్పీ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. అక్రమ కేసు వెనక్కి తీసుకోవాలి రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతున్న ‘సాక్షి’ దిన పత్రికపై ప్రభుత్వ ప్రోత్సాహంతో పోలీసు అధికారులు అక్రమ కేసులు పెట్టడం తగదు. జర్నలిస్టు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రతిఘటించాలి. – శాసపు జోగినాయుడు, ఏపీ జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షుడు అర్ధరాత్రి చొరబాటు దారుణం రాజకీయ కక్షలు కార్పణ్యాలతో ‘సాక్షి’ మీడియా సంస్థపై దాడికి దిగడం ఆమోదయోగ్యం కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని మరచిపోకూడదు. సాక్షి కార్యాలయంపై పోలీసుల దాడి, ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. అర్ధరాత్రి పత్రికా కార్యాలయంలోకి చొరబడటం అసమంజసం, అనైతికం. – స్వాతిప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాకినాడ యూపీ బాటలో ఏపీ ఏపీలో ప్రభుత్వం ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదు. ఆరి్టకల్ 19(1)ఎ ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంది. సాక్షి కార్యాలయాల్లోకి చొరబడి జర్నలిస్టులను విచారించడం అనైతికం. – నల్లి ధర్మారావు, స్సామ్నా రాష్ట్ర అధ్యక్షుడుపత్రికా స్వేచ్ఛపై దాడి.. పత్రికా ఎడిటర్‌పై కేసు పెట్టడం అంటే కచ్చితంగా పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తున్నట్లే. భావ వ్యక్తీకరణను అడ్డుకోవద్దని, తప్పుడు కేసులు పెట్టొద్దని కోర్టులు అధికారులకు చీవాట్లు పెడుతున్నా లెక్క చేయడం లేదు. – బి.మురళీకృష్ణ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యులు మీడియా స్వేచ్ఛను హరించడమే.. కూటమి సర్కారు మీడియా స్వేచ్ఛను హరిస్తోంది. అర్ధరాత్రి ‘సాక్షి’ కార్యాలయంలోకి పోలీసులను పంపి వేధింపులకు దిగడం సమంజసం కాదు. అధికారంలో ఉన్న వారి మీద వార్తలు రాస్తే అక్రమ కేసులు పెడతారా? ఏదైనా సమస్య ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలి. రిజాండర్ ఇవ్వాలి. – మచ్చా రామలింగా రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పత్రికలను ఇబ్బంది పెట్టే సంప్రదాయం మంచిది కాదు ప్రజల పక్షాన గళమెత్తుతున్న ‘సాక్షి’ గొంతు నులిమే చర్య ఇది. పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధానాలు ప్రభుత్వం మానుకోవాలి. పత్రికలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. – కొత్తపల్లి అనిల్‌కుమార్ రెడ్డి, ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుఇప్పటి వరకు ‘సాక్షి’పై అక్రమంగా నమోదు చేసిన కేసులివీ..» గత ఏడాది ఆగస్టు 31న విజయవాడ వరదల సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీ సినందుకు ‘సాక్షి’పై అక్రమ కేసు నమోదు » పల్నాడు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తను తెలంగాణలో దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని ప్రచురించినందుకు ఈ ఏడాది ఏప్రిల్ 9న అక్రమ కేసు » కర్నూలు జిల్లాలో ప్రభుత్వ టీచర్ కుటుంబం కిడ్నాప్ ఉదంతాన్ని వెలుగులోకి తెచి్చనందుకు.. అదే జిల్లాలో ఓ ఐపీఎస్ అరాచకాలను ఎండగట్టినందుకు ‘‘సాక్షి’’ పత్రికపై అక్రమ కేసులు నమోదు » అనంతపురంలో బాలికపై టీడీపీ మూకలు అత్యాచారం చేసిన దారుణాన్ని ప్రశి్నంచినందుకు సాక్షి టీవీపై అక్రమ కేసు » ఇటీవల భారీ వర్షాలకు రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని వీడియో ఆధారాలతో సహా ప్రసారం చేసిన సాక్షి టీవీపై అక్రమ కేసు » శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై సభాహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు » వాట్సప్ గవర్నెన్స్ ముసుగులో చేస్తున్న సంక్షేమ పథకాల ఎగవేత, ఓట్ల తొలగింపుపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై న్యాయస్థానంలో ఫిర్యాదుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనుమతి ఇస్తూ మార్చి 5న ఉత్తర్వులు జారీ » మే 8న పోలీసులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో తనిఖీల పేరుతో హల్చల్ (ఓ పత్రిక ఎడిటర్ నివాసంలో తనిఖీల పేరుతో వేధింపులకు దిగడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి) » ‘సాక్షి’ టీవీ డిబేట్లో సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అనని మాటలను అన్నట్లుగా జూన్ 9న అక్రమ కేసు, అరెస్టు. -
పత్రికా స్వేచ్ఛ అణచివేత.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
సాక్షి, హైదరాబాద్: పత్రికాస్వేచ్ఛను హరిస్తూ మీడియా ప్రతినిధులను అరెస్టు చేయడంపై సీనియర్ సంపాదకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టు సమాజమంతా ఐక్యంగా ఉండాలని, ప్రభుత్వాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మీడియాపై ప్రభుత్వాలు చేస్తున్న ఒత్తిడి, అణచివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలపై స్పందించకుంటే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలను మీడియా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం– పత్రికాస్వేచ్ఛ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.సీనియర్ జర్నలిస్టు ఆర్.దిలీప్ రెడ్డి ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ‘ప్రభుత్వాలు జర్నలిస్టులను భయపట్టేలా వ్యవహరిస్తున్నాయి. కొమ్మినేని శ్రీనివాస రావు కించపరిచే వ్యాఖ్యలు చేయకపోయినా ఆయనను అరెస్టు చేయడం అన్యాయం. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది’ అని సీనియర్ సంపాదకులు అన్నారు.ఇటీవల ఏపీలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడాన్ని ముక్త కంఠంతో ఖండించారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇటీవల సంపాదకుడు రహమాన్‌పై కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు కె.శ్రీకాంత్‌రావు, ట్రెజరర్ రాజేష్, సభ్యులు బాపూరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సంపాదకులు వ్యక్తపర్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే... - కె.రామచంద్రమూర్తి ,సీనియర్ సంపాదకులుపత్రికా స్వేచ్ఛను కోరుకునేది ప్రజలే.. పత్రికా స్వేచ్ఛ అనేది ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. దీన్ని ప్రధానంగా కోరుకునేది ప్రజలే. పత్రికలు చురుకుగా ఉన్నప్పుడే ప్రతీ విషయం ప్రజలకు చేరుతుంది. కానీ ప్రస్తుతం ప్రతికాస్వేచ్ఛ ప్రమాదంలో పడింది. కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం చూస్తుంటే ఏపీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో స్పష్టమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గత 40 ఏళ్లుగా ఏ వర్గాన్నీ గౌరవించిన మనిషి కాదు. ప్రతీ రంగంలో తన వ్యతిరేకులను అణచివేయడం ఏళ్లుగా చూస్తున్నాం. ప్రస్తుతం ప్రతికా స్వేచ్ఛనే కాదు... అన్ని స్వేచ్ఛలు హరించుకుపోతున్నాయి. నియంత పాలన మాదిరిగా ప్రభుత్వాలను నిర్వహిస్తున్నారు. - టంకశాల అశోక్, సీనియర్ సంపాదకులుమీడియాను భయపెట్టే ప్రయత్నమిది.. కొమ్మినేని అరెస్టుతో మీడియాను భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది. కొమ్మినేని తప్పు లేకు న్నా.. ఒకరకమైన భయం కలిగించే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. రాజకీయ నేతలు తమకు అనుకూలంగా ఉండే వార్తలే రాయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం మీడి యా స్వతంత్రంగా లేదు. రాజకీయ పారీ్టల మద్దతుతో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ పాత్రికేయులు తమ పరిమితులకు లోబడి వాస్తవాలను మాత్రమే రాయాలి. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వా మ్యం రెండూ వేర్వేరు కాదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కొమ్మినేని అరెస్ట్‌తో ఆగుతుందని అనుకోవడం లేదు. దీంతో భయపడి మిగతావారు వ్యతిరేక వార్తలు రా యకుండా ఉంటారని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మిగతా జర్నలిస్టులు రియాక్ట్ కాకుంటే ఎలా..? - దేవులపల్లి అమర్ ,సంపాదకులు మన తెలంగాణకక్ష సాధింపునకు పరాకాష్ట సాక్షి టీవీ డిబెట్లో కొమ్మినేని శ్రీనివాసరావు అనని మాటలకు ఆయన్ను అరెస్టు చేయడం సరికాదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానాలి. కొమ్మినేని అరెస్టే సరి కాదని న్యాయస్థానం స్పష్టంచేస్తుంటే, సాక్షి కార్యాలయాలపై దాడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. టీడీపీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సరైన కారణం లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చని, ఎవరి ఇంట్లోనైనా సోదాలు చేయొచ్చనే తప్పుడు సంప్రదాయానికి తెరతీసింది. ఇది రాబోయే రోజుల్లో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగించనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. - ఆర్.ధనంజయ రెడ్డి, ఎడిటర్, సాక్షిఒక్కో మీడియా ఒక్కో వైఖరితో.. ప్రస్తుత రోజుల్లో ఒక్కో మీడియా ఒక్కో వైఖరితో ఉంది. ఈ పరిస్థితుల్లో ఐదు పేపర్లు, పది టీవీ చానళ్లు చూస్తే తప్ప వాస్తవాలేంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం మీడియా ప్రతినిధులను అరెస్టు చేస్తుంటే... ఇక్కడ రేవంత్ ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలోనే గుడ్డలూడదీసి కొడతానంటోంది. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి అరెస్టులను వ్యతిరేకించాలి. అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులుపాత్రికేయుల భద్రత గురించి ఆలోచించాలి రాజకీయ కక్ష సాధింపులో మీడియా పావులుగా మారుతోంది. ఏపీ, తెలంగాణ అనే కాదు.. చాలా రాష్ట్రాల్లో మీడియా టార్గెట్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో పాత్రికేయుల భద్రత గురించి ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాచా రం అందించే ఏ వ్యవస్థ అయినా మీడియా కిందనే గుర్తించాలి. ఓ వార్త విషయంలో ప్రైవేటు వ్యక్తులు కేసు పెడితే నాపై కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టి అరెస్టు చేశారు. ఇదివరకు సోషల్ మీడియా వాళ్లను అరెస్ట్ చేసినప్పుడు ప్రధాన స్రవంతి మీడియా పెద్దలు పట్టించుకోలేదు. ఇప్పుడది మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వచ్చింది. కొమ్మినేని అరెస్టుతో ఎంతపెద్ద జర్నలిస్టునైనా అరెస్టు చేస్తామనే అభిప్రాయాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లింది. - కె.శ్రీనివాస్, సీనియర్ సంపాదకులుసుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా కొన్ని మీడియా సంస్థలు వెక్కిరిస్తున్నాయి కొమ్మినేని అరెస్టు... సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన తీరు ఏపీ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం విలువలను దిగజార్చుతున్నాయి. కొమ్మినేని అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కొమ్మినేని నవ్వితే అరెస్టు చేయడాన్ని కక్ష సాధింపుగా కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు సూచనలపై కొందరు వ్యంగ్యంగా చర్చిస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు సెక్షన్లు తెలియకుండా చర్చలు పెట్టేస్తున్నారు. ఇది మీడియా ఉనికికే ప్రమాదకరం. - విజయ్ బాబు,సీనియర్ సంపాదకులుపత్రికలకు స్వేచ్ఛ లేదు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పత్రికలకు స్వేచ్ఛ ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా.. వార్త రాసినా ఉపేక్షించే పరిస్థితిలో లేవు. అందుకు తాజా ఉదా హరణ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు వ్యవహారమే. వాస్తవానికి ఆయనను అరెస్టు చేయడం సమంజసం కాదు. - దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్..అయినా ప్రజా ప్రయోజన వార్తలు ఆగవు గద్వాల జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తారనే స్థానికుల సమాచారంతో నేను వార్తలు రాశాను. ఇథనాల్ పరిశ్రమ అత్యంత ప్రమాదకరమైంది. దీంతో ప్రజలు ఆందోళనబాట పట్టారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నన్ను అరెస్టు చేసింది. అయినా ప్రజలకు ప్రయోజనం కలిగించే వార్తలు రాయడం ఆపను. - రహమాన్, సంపాదకులుకలిసి ఉంటేనే మనుగడవ్యవస్థలో అన్ని రంగాలు ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉంటున్నాయి. దీంతో జర్నలిస్టులను అకారణంగా టెర్రరిస్టుల మాదిరిగా అరెస్టు చేసి వారికి బెయిల్ రాకుండా చూసే ప్రయత్నం జరుగుతోంది. జర్నలిస్టు సమాజమంతా కలిసికట్టుగా ఉంటేనే మీడియా మనుగడ ఉంటుంది. - శైలేష్ రెడ్డి, సీఈఓ, టీ న్యూస్ -
పత్రికా స్వేచ్ఛపై సర్కారు మరోదాడి
సాక్షి, అమరావతి : రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా సాక్షి దినపత్రికను మరోసారి లక్ష్యంగా చేసుకుంది. ఏపీ శాసనసభ ద్వారా వేధింపులకు దిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికకు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ఫిబ్రవరి 25న సాక్షిలో ప్రచురితమైన ఒక వార్త అసెంబ్లీకి, అసెంబ్లీ సభ్యుల హక్కులకు భంగం కలిగించిందని అందులో పేర్కొన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారని, ఈనెల 2న సమావేశమైన కమిటీ పత్రిక ఎడిటర్, సంబంధిత రిపోర్టర్, ప్రింటర్ అండ్ పబ్లిషర్ స్పందన తెలుసుకోవాలని సూచించిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఈ నోటీసుపై స్పందించాలని కోరారు. ఎవరి హక్కుల ఉల్లంఘనా జరగలేదు.. వాస్తవానికి.. ‘సాక్షి’ ప్రచురించిన కథనంలో ఎక్కడా సభా హక్కుల ఉల్లంఘన జరగలేదు. అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యులు, అధికారుల ప్రస్తావన అందులో లేదు. వారి హక్కులకుగానీ, వారి హుందాతనానికి గానీ అగౌరవం కలిగే వ్యాఖ్యలు అసలేలేవు. కేవలం పరిపాలనాపరమైన లోపాలను మాత్రమే అందులో ప్రస్తావించారు. శిక్షణా తరగతుల పేరుతో అన్ని ఏర్పాట్లు చేశాక రద్దుచేయడం ద్వారా ప్రజాధనం వృధా అయిందని, ప్రణాళికా లోపంవల్లే ఇది జరిగిందని వ్యవస్థాపరమైన లోపాలను గుర్తుచేస్తూ ఈ కథనంలో రాశారు. కానీ, సాక్షి మీడియాపై కక్షగట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. బడ్జెట్ సమావేశాల్లో ఒక సభ్యుడితో దీనిపై ఫిర్యాదు చేయించి సభా హక్కుల ఉల్లంఘనగా ఆరోపించింది. ఆ సభ్యుడి ఫిర్యాదు మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపగా కమిటీ నోటీసులిచ్చింది. ఇలా కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై వరుస దాడులు చేయిస్తోంది. జర్నలిస్టులను భయపెట్టాలని, పత్రికా స్వేచ్ఛకు పరిమితులు విధించాలనే కుతంత్రంతో ఇలా చేయిస్తున్నట్లు ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు. సాక్షి, సాక్షి సిబ్బందిపై వరుస దాడులు.. ఇక ఇటీవలే సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి నివాసంలో ‘సిట్’ పోలీసులు అకారణంగా సోదాలు జరిపారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. మద్యం కేసు నిందితుల కోసం అన్వేషించే పేరుతో ఒక పత్రిక ఎడిటర్ నివాసంలో సోదాలు జరిపి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించారు. అలాగే, సమాజంలో జరిగే పలు అంశాలను ప్రతిబింబించే క్రమంలో రాసిన వివిధ కథనాలపై పరువు నష్టం కేసులు వేసింది. మరోవైపు.. సాక్షి విలేకరులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కులు దాడులకు తెగబడుతున్నారు. వారి తప్పులను ఎత్తిచూపడమే నేరమన్నట్లు భౌతిక దాడులకు దిగుతున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే, గుంటూరు జిల్లా సాక్షి ఛానల్ ప్రతినిధిపై కూటమి నేతలు దాడికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలోనూ సాక్షి విలేకరిపై దాడి చేశారు. ఇంకా అనేక చోట్ల సాక్షి మీడియాపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఇప్పుడు అసెంబ్లీ ద్వారా ప్రివిలేజ్ నోటీసు ఇచ్చి పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారు. -
గుర్తుకొచ్చిన ‘నాజీల’ పాలన
ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఏకంగా ఒక ప్రముఖ పత్రికా ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం ఒకప్పటి హిట్లర్ నాజీల పాలనను ప్రజల కళ్లకు కట్టింది. ప్రజాభిప్రాయాన్ని నాణేనికి రెండో పక్క ప్రతిబింబించే ప్రధాన పత్రిక ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డిపై ఇప్పటికే మూడు, నాలుగు కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం, తాజా ఘటన ద్వారా ఏకంగా ఆయన నైతిక స్థైర్యాన్నే దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ‘సాక్షి’పై వీలైనప్పుడల్లా విషం కక్కే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోని పోలీ సులు నాటి నాజీ సేనలను గుర్తు చేశారు. నాజీల పాలనలో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉందన్న విషయాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటే...ప్రజాభిప్రాయాన్ని నియంత్రించే సాధనాలుగా...అడాల్ప్ హిట్లర్ నాజీ పాలనలో (1933–1945), ప్రెస్ స్వాతంత్య్రాన్ని పూర్తిగా అణచివేశారు. ప్రజాభిప్రాయాన్ని నియంత్రించడానికి పత్రికలను ప్రచార పరికరంగా ఉపయోగించారు. ప్రభుత్వ నిర్దేశాలను అనుసరించి అన్ని మీడియా, పత్రికలు, రేడియో లకు కఠిన నియంత్రణలు విధించారు. జర్మనీలోని అన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ పార్టీకి అనుకూలంగా ఉండాల్సిందే. నాజీ ప్రభుత్వాన్ని ప్రోత్సహించడానికి, నిరసనలు నెమ్మదింపచేయడానికి మీడియానే సాధనంగా వినియోగించారు. నాజీలకు నిరసనలు తెలిపే పత్రికలను మూసివేశారు. వ్యతిరేక వార్తలను ప్రచురించడాన్ని పూర్తిగా నిషేధించారు. యూదులపై ద్వేషాన్ని ప్రేరేపించడానికి, ప్రజల మనస్సులో హిట్లర్, నాజీ పార్టీకి అనుకూల భావనను పెంపొందించేందుకు పత్రికలు పనిచేసేవి.ప్రతి పత్రికనూ జర్మనీ ప్రచార, ప్రజల బోధన మంత్రిత్వ శాఖ (రీచ్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ ఎన్‌లైట్‌మెంట్ అండ్ ప్రాపగాండా) పరిధిలోకి తీసుకొచ్చారు. దీనిని జోసెఫ్ గోబెల్స్ (తప్పుడు ప్రచారానికి ప్రస్తుత నానుడి) నాయకత్వం వహించారు. స్వతంత్రంగా పనిచేసే పత్రికలు, విపక్ష పత్రికలను నిషేధించారు లేదా బలవంతంగా మూసివేశారు. నాజీ పార్టీ ఆమోదించిన సమాచారం మాత్రమే ప్రచురితం కావాలి. ఒక జర్నలిస్ట్ చట్టబద్ధంగా పని చేయాలంటే, రీచ్ ప్రెస్ చాంబర్లో సభ్యత్వం తప్పనిసరి.కమ్యూనిస్టు, సోషలిస్టు, యూదు, లిబరల్ పత్రికలు తొలుత నిషేధానికి గురయ్యాయి. హిట్లర్ లేదా నాజీ పార్టీపై చేసే ఏవైనా విమర్శలను దేశద్రోహం లేదా రాజద్రోహంగా పరిగణించేవారు.పత్రికల నుంచి రేడియో, సినిమాలు, పిల్లల పుస్తకాల వరకు కూడా నాజీ ప్రచారంతో నిండిపోయేవి.చదవండి: ఇప్పటికైనా బౌద్ధాన్ని అర్థం చేసుకున్నామా?భావ ప్రకటనా స్వేచ్ఛ రద్దయ్యింది. జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే నాజీ ప్రభుత్వానికి సహకరించాలి. లేదంటే జైలుకు పోవాలి. లేదంటే ప్రాణాలే పోగొట్టుకోవాలి.జర్నలిస్టులు నిరంతరం భయంతో నిఘా నీడన బ్రతకాల్సి వచ్చేది. ఒక మాటలో చెప్పాలంటే, నాజీ పాలన పత్రికలను ప్రజాభిప్రాయం ప్రతిబింబించడానికి మాధ్యమాలుగా కాకుండా, తమకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలిచే శక్తిమంతమైన ఆయుధంగా మార్చింది. – ఎన్. భాస్కర్ ప్రసాద్, విజయవాడ -
ప్రశ్నించే గొంతును నొక్కేద్దామనుకోవడం పొరపాటు
సాక్షి ప్రతినిధి, కడప: ‘నియంతృత్వ పాలన ఈ దేశంలో ఎప్పుడూ మనుగడ సాగించలేదు. విపరీత జనాకర్షణ కలిగిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి పత్రికా స్వేచ్ఛ గొంతు నొక్కారు. ప్రజలు ఎమర్జెన్సీని తిరస్కరిస్తూ ఆమెకు, ఆమె పార్టీకి గుణపాఠం చెప్పారు’ అని రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ నియంతృత్వ చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. రాష్ట్రంలో గనులు ధారాదత్తం రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించిన వారినంతా అణిచివేయాలనే దృక్పథంతో ఉన్నారు. ఎమర్జెన్సీని పెట్టిన ఇందిరాగాంధీ ప్రజాగ్రహానికి గురయ్యారన్న విషయం వారికి తెలియంది కాదు. చరిత్ర ఎన్నిమార్లు గుణపాఠాలు నేర్పినా పాలకులు ఆ పంథా వీడడం లేదు. రాష్ట్రంలో గనులు, భూములను ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమకు కావాల్సిన వాళ్లకు ధారాదత్తం చేస్తోంది. ఓబుళాపురం ఇనుప ఖనిజ గనుల్లో అధికారులు ఎంతమందికి శిక్ష పడిందో గమనించి కూడా గనులను అస్మదీయులకు ధారాదత్తం చేస్తున్నారు.ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం కన్పించడం లేదు...ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగించాల్సిన ప్రభుత్వమే వ్యవస్థను బలహీన పరుస్తోంది. తద్వారా రాబోయే ప్రభుత్వాలకు తప్పుడు సంకేతాలు ఇస్తోంది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. వివిధ వర్గాల ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి గొంతుకగా నిలుస్తూ, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఆ పత్రికా ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో సోదాలు, పోలీసుల దురుసు ప్రవర్తన, ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గమైన విషయం. ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించడంపై ప్రజల పక్షంగా ‘సాక్షి’ నిలుస్తోంది. ఇలాంటివి మనస్సులో ఉంచుకొని మానసికంగా దెబ్బకొట్టే చర్యలకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులను తొక్కిపెట్టారు. మరోవైపు పత్రికల గొంతు నొక్కే చర్యలకు సిద్ధమయ్యారు. పత్రికా స్వేచ్ఛను దెబ్బతీసే పరిస్థితులకు ప్రభుత్వమే దిగడం ప్రజాస్వామ్యవాదులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.రూ.9వేల కోట్లు అప్పు కోసం.. ప్రభుత్వానికి రూ.9 వేల కోట్ల అప్పు కోసం దాదాపు రూ.రెండు లక్షల కోట్ల విలువైన 436 రకాల ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు సిద్ధపడటం దురదృష్టకరం. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఆ గనుల తవ్వకాలు చేపడితే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. నిరుద్యోగుల అసంతృప్తిని చల్లార్చవచ్చు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేసినా, చేయకపోయినా వారికున్న స్వేచ్ఛను హరించకుండా ఉంటే అదే పదివేలనిపిస్తోంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నాటి పరిస్థితిని పాలకులు మరిపిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానాలు అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మందలించినప్పటికీ అప్రజాస్వామిక దాడులు ఆగడం లేదు. ఇది ఏమాత్రం సహేతుకం కాదు.నోటీసులు ఇవ్వకుండా సోదాలు సరికాదునోటీసులు ఇవ్వకుండా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటి మీదకు వెళ్లి సోదాలు చేయడం సరికాదు. చట్టం పద్ధతులు, నిబంధనలు పాటించకుండా ఎడిటర్ ఇంట్లో తనిఖీలు చేయడాన్ని జర్నలిస్టులు అంతా ఖండిస్తున్నారు. మా నోరు నొక్కడానికే పోలీసులు ఇలా చేస్తున్నారని అంటున్నారు. తప్పు చేస్తే నోటీసులిచ్చి పిలిచి అడగాలి కానీ.. నోటీసులివ్వకుండా ముందుగానే సోదాలు చేయొద్దని కోర్టులు కూడా చెబుతున్నాయి. అయినా వీటిని పోలీసులు పాటించడం లేదు. మీడియా, సోషల్ మీడియాలో పొగిడితే ఓకే... విమర్శిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. – తెలకపల్లి రవి, సీనియర్ సంపాదకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు -
సోదాలు అప్రజాస్వామికం
శ్రీకాకుళం: బ్రిటిష్ పాలనను కూటమి ప్రభుత్వం గుర్తుకు తెస్తోందని ‘సామ్నా’ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు అన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు చేయడాన్ని ఆయన ఖండించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసు బలగంతో సోదాలు చేయించడం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి పరాకాష్టగా అభివరి్ణంచారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏమన్నారంటే... ఇలాంటి ఘటనలు లేవు పత్రికా సంపాదకులపై దాడులకు శ్రీకారం చుట్టింది బ్రిటిష్ ప్రభుత్వంలోనే. మన దేశంలో ఒక సంపాదకీయం రాసినందుకు గాడిచర్ల హరిసర్వోత్తమరావుపై రాజద్రోహం నేరాన్ని ఆపాదించి జైలు శిక్ష విధించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు మళ్లీ జరగలేదు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఆ నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నిర్బంధాన్ని అమలు చేశారు. అయితే పత్రికల కార్యాలయాలు, సంపాదకుల ఇళ్లపై మాత్రం దాడులు జరిగిన దాఖలాలు లేవు. నచ్చకపోతే అణగదొక్కుతారా? నచ్చిన పత్రికలను ప్రోత్సహించడం, నచ్చని పత్రికలను అణగదొక్కడం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే మొదలైంది. పత్రికా రంగాన్ని గుప్పెట్లో ఉంచుకోవడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలమనే భావన సరైనది కాదని వైఎస్ రాజశేఖరరెడ్డి ఘన విజయంతో రుజువైంది. చంద్రబాబు పాలనలో భావప్రకటన స్వేచ్ఛపై మునుపెన్నడూ లేని విధంగా అణచివేతకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార బలంతో వేధింపులు దేశానికి ఒకటే పవిత్ర గ్రంథం. అది రాజ్యాంగం. వ్యవస్థలన్నీ దీనికి లోబడే పనిచేయాలి. కూటమి ప్రభుత్వం అలా పనిచేయడం లేదని ఏపీ హైకోర్టు అనేక కేసుల విచారణ సమయంలో మందలిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అయినా కూటమి ప్రభుత్వం వాటిని గౌరవిస్తున్నట్టు కనిపించడం లేదు. మీడియాలో వచ్చిన వార్త, కథనంపై లీగల్‌గా చర్యలు తీసుకోవడానికి చట్టం కొన్ని అవకాశాలు కల్పించింది. వాటిని విస్మరించి నేరుగా అధికార బలంతో క్రిమినల్ కేసులు బనాయించి, వేధించడం ఈ ప్రభుత్వమే ప్రారంభించింది. ఒక ఎడిటర్ ఇంట్లో ముందస్తు సమాచారం ఇవ్వకుండా సోదాలు చేయించడం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి పరాకాష్ట. ఏముంటాయి అక్షరాలు తప్ప ఎడిటర్ ఇంట్లో ఏముంటాయి. అక్షరాలే తప్ప ఆయుధాలు కాదు కదా. అక్షరాలను కూడా ఆయుధాలుగా భావించిన ఒకనాటి బ్రిటిష్ వైఖరి బయట పెట్టుకోవడం తప్ప సాధించిందేమీ లేదు. అణచివేతలతో చరిత్రహీనులుగా మిగిలిపోవడం తప్ప ఏమీ చేయలేరు. మన ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజలు సరైన సమయంలో తమ చైతన్యాన్ని ప్రకటిస్తారు. ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే, సామ్నా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు, ఫొటో జర్నలిస్టు సంఘాలు కలిసి ‘సాక్షి’ పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణిలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తూనే ఉంటాయి. -
ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులను వేధించడం సరికాదని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) హితవు పలికింది. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆయన ఇంట్లో సోదాలు చేయడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే అని ఐజేయూ జాతీయ అధ్యక్షులు వినోద్ కోహ్లీ పేర్కొన్నారు. సాక్షి మీడియాపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. సాక్షాత్తు పత్రికా సంపాదకులను టార్గెట్ చేసుకుని దాడి చేయడం శోచనీయమన్న కోహ్లీ... ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో వైఖరి మార్చుకోవాలని సూచించారు. -
విమర్శను సహించలేరా?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగం నాలుగు వ్యవస్థలను ఏర్పాటు చేసింది. అందులో నాలుగో వ్యవస్థ (ఫోర్త్ ఎస్టేట్) పత్రికలు. వీటి భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజా జీవితంలోని వ్యక్తులు, ప్రభుత్వాలు, వ్యవస్థలు తప్పుచేస్తే ఎత్తి చూపడం, విమర్శించే హక్కు పత్రికలకు ఉంది. కానీ.. పత్రికలు వార్తలు రాస్తే కేసులు పెడతాం, జైలుకు పంపిస్తామంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. మనం రాచరిక, నియంతృత్వ వ్యవస్థలో లేం అనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి’ అని జన విజ్ఞానవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి అన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం, సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసానికి వెళ్లి భయానక వాతావరణాన్ని సృష్టించడం వంటి పరిణామాల నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రభుత్వాల బాధ్యత, తాజా పరిణామాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. మనం రాచరికాన్ని ఎంచుకోలేదు మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంచుకున్నాం. రాచరిక, నియంతృత్వ వ్యవస్థలను కాదు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్యం బతికేందుకు మనం నాలుగు వ్యవస్థలను ఎంచుకున్నాం. అందులో నాలుగో వ్యవస్థగా పత్రికలకు, భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగ నిర్మాతలు చోటు కల్పించారు. ప్రజాస్వామ్యం బతకాలంటే భావ ప్రకటన స్వేచ్ఛ బతకాలి. సమాజంలోని మంచిని ఎలా పత్రికలు తెలియజేస్తాయో.. ప్రభుత్వాలు తమ సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని పత్రికలను ఎలా ఆశ్రయిస్తాయో.. అలాగే ప్రభుత్వాలు, ప్రజాజీవితంలోని వ్యక్తుల తప్పులను ఎత్తిచూపడం, విమర్శించడం పత్రికలకు ఉన్న హక్కు. దీన్ని కాలరాయడం ముమ్మాటికీ తప్పు. ఎడిటర్ ఇంటికి వెళ్లి అలజడి సృష్టించడం సరికాదు. తప్పును ఎత్తిచూపడం పత్రికల హక్కు తప్పును ఎత్తిచూపడం, విమర్శించడం పత్రికల హక్కు. ఇలాంటి వాటిపై అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి. తప్పొప్పులను కోర్టులు నిర్ణయిస్తాయి. అంతేకానీ.. ‘తప్పులు ఎత్తిచూపకూడదు, వార్తలు రాస్తే పోలీసులతో కేసులు పెడతాం, రిమాండ్‌కు పంపుతాం’ అంటే ఎలా? ఇది ముమ్మాటికీ తప్పే. ఈ కేసులేవీ కోర్టుల్లో నిలబడవు. అప్పుడు రిమాండ్‌కు పంపిన వ్యక్తికి పరిహారం కూడా ప్రభుత్వాలు చెల్లించాలి. ఇటీవల భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దీనిని పౌరసంఘాలు ఖండించాలి. భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతుగా నిలవాలి. పౌర సంఘాలు ప్రశ్నించాలి.. ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లితే ప్రశ్నించడం పౌరహక్కుల నేతల బాధ్యత. కాబట్టే ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లితే కచ్చితంగా ప్రశ్నిస్తా. ప్రశ్నించకూడదు అంటే ఎలా? ఈవీఎంలపై అనుమానాలు మాకు ఉన్నాయి. ప్రజలకు ఉన్నాయి. ఈవీఎంలో పోలైన ఓట్లకు, వీవీ ప్యాట్లకు తేడాలు ఉన్నాయి. వీటిని ప్రశ్నిస్తే నివృత్తి చేసి వ్యవస్థపై నమ్మకం పెంచేలా ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్ బాధ్యతలు తీసుకోవాలి. కానీ.. ఆ పని చేయలేదు. దీంతో అనుమానాలు పెరుగుతాయి. వ్యవస్థలపై నమ్మకం పోతుంది. ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరించలేదనే అనుమానాలు ప్రజల్లో ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇలాంటి అంశాలలో పౌరసంఘాలు ప్రశ్నించాలి.పోలీసులకు అపరిమిత స్వేచ్ఛ ప్రమాదకరం ఎవరు అధికారంలో ఉంటే వారిని పోలీసులు బాస్‌లుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు అపరిమితమైన స్వేచ్ఛ ఇవ్వడం అత్యంత ప్రమాదకరం. ప్రస్తుత దుష్పరిణామాలకు మద్దతు తెలపడం అంటే రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే నిజమైన దేశభక్తి మన ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది. ఇది ప్రభుత్వాలు గ్రహించాలి. తమపై విమర్శలు చేసే వ్యక్తులు, పత్రికలపై కేసులు పెడతామంటే ప్రజాస్వామ్యాన్ని తీసేసి రాచరిక, నియంతృత్వ వ్యవస్థలను పెట్టుకోవాలి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే నిజమైన దేశభక్తి. బాధ్యతగల ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.మీడియా స్వేచ్ఛను హరించకూడదు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సాక్షి, హైదరాబాద్: రాజకీయపరమైన కారణాలతో మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం సమర్థనీయం కాదని ఆరి్థక, రాజకీయరంగ నిపుణుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని అందరూ గౌరవించాలని సూచించారు. విజయవాడలో ఏపీ పోలీసులు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసానికి సెర్చ్‌వారెంట్ లేకుండానే వెళ్లి సోదాలు జరపడంపై నాగేశ్వర్ స్పందించారు. ప్రభుత్వంలో ఎవరున్నా మీడియా కవరేజీ విషయంలో ఏమైనా భిన్నాభిప్రాయాలుంటే దాని గురించి చెప్పాలే తప్ప, కేసులు పెట్టడం సరికాదన్నారు. కేసులు పెట్టి మీడియా స్వేచ్ఛను హరించకూడదని, వార్తలపై ఏమైనా అభ్యంతరాలుంటే రిజాయిండర్, లేదా వివరణ కోరవచ్చని అన్నారు. ప్రజాస్వామ్యానికి మూలం విమర్శ కాబట్టి దానిని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏదైనా నేరం చేస్తే కేసులు పెట్టడం వేరని, కానీ కేవలం రాజకీయ కారణాలతో మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం సరికాదని సూచించారు. ‘సాక్షి’ ఎడిటర్‌కు వేధింపులు అన్యాయంసీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ దినపత్రిక సంపాదకుడు ధనంజయరెడ్డిపై వేధింపులు అన్యాయమని సీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విజయవాడలోని ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో.. కె.శ్రీనివాస్ పై విధంగా స్పందించారు. ఒక పత్రికా సంపాదకుడిని లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు.నోటీసుల్లేకుండా ఎడిటర్ ఇంట్లో సోదాలా? తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ ఖండన సాక్షి, హైదరాబాద్: విజయవాడలో ‘సాక్షి‘ దినపత్రిక సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు ముందస్తు నోటీసులు లేకుండా సోదాలు చేయడాన్ని తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.గంగాధర్, ప్రధాన కార్యదర్శి హరి ఒక ప్రకటనలో పోలీసులు తీరును గర్హించారు. -
ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా?: ఆర్.ధనంజయరెడ్డి
సాక్షి, అమరావతి: ఎలాంటి నోటీసులు లేకుండా ఓ పత్రిక ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం దేశ చరిత్రలో ముందెన్నడూ జరగలేదని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా.. అని సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాకుండా, ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగానే భావిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రాజకీయ కుట్రలో భాగంగా సోదాల పేరిట పోలీసులు వ్యవహరించిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలోని తన నివాసంలో గురువారం పోలీసుల సోదాల ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక, లిక్కర్, మైనింగ్, విద్యుత్ స్కామ్‌లతో పాటు విజయవాడలో వరదలు, తిరుమలలో తొక్కిసలాట, సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు మద్దతు ధర కల్పించకపోవడం వంటి వరుస వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి గొంతునొక్కాలనే యత్నమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల మూడ్‌ను రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నంలో సాక్షి తన బాధ్యతను నిర్వర్తిస్తోందని చెప్పారు. దాన్ని ఓర్వలేకనే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగడుతున్నారని, దీనిని ఖండించకపోతే ఎవరింట్లోకైనా సరే ఇలాగే చొరబడతారన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరి మీదా కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. పోలీసులకు చట్టం, న్యాయం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేనట్టుగా కన్పిస్తోందని చెప్పారు. ‘ఉదయం ఉన్న ఫళంగా పది మంది పోలీసులు ఇంట్లోకి చొర బడ్డారు. ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఒక డీఎస్పీ, సీఐలతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వచ్చి, ఇల్లు సెర్చ్ చేస్తాం.. ఇది ఓపెన్ చేయండి.. అది ఓపెన్‌చేయండి.. ఇంట్లో ఉన్న వాళ్లను వాళ్లెవరు.. వీళ్లెవరు.. అంటూ ఆరాలు తీయడం దుర్మార్గం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. నాపై ఇప్పటికే 3–4 కేసులు పెట్టారుఇప్పటికే నాపై మూడు నాలుగు కేసులు పెట్టారు. ఒకటి సభా హక్కుల ఉల్లంఘన కేసు అన్నారు. ఒక వార్త రాస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి కాటమనేని భాస్కర్ ద్వారా ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి జారీ చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ, ఏపీ ఎడిషన్‌లో ఒకే వార్త వేర్వేరుగా రిపోర్టు అయ్యిందని మరో కేసు పెట్టారు. జర్నలిజం మౌలిక నియమాలు, ఓనమాలు తెలిసిన వారెవరికైనా ఇదేంటని తెలుసు. ఎక్కడన్నా ఒక ఘటన జరిగితే ఆ ప్రాంత రిపోర్టర్ స్పాట్ రాస్తారు. సొంత ఊళ్లో ఉన్న రిపోర్టర్‌కు మరిన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి మరింత లోతుగా ప్రజంట్ చేస్తారు. దాన్ని అడ్డం పెట్టుకొని నాపై కేసు పెట్టారు. కొంత మంది సాక్షి పాత్రికేయులపై కూడా కేసులు పెట్టారు. ఇదంతా సాక్షి గొంతునొక్కే ప్రయత్నంగా చూడాల్సి వస్తుంది. రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాలు ఎందుకొచ్చారు.. సెర్చ్ నోటీసు ఉందా? దాంట్లో నా పేరు ఏమైనా ఉందా? అని సోదాలకు వచ్చిన పోలీసు అధికారులను చాలా స్పష్టంగా అడిగాను. ‘లేదు సర్.. ఇన్ అండ్ అరౌండ్ సెర్చ్ చేస్తున్నాం.. జస్ట్ ఊరికే మీ ఇల్లు చూసేసి పోతాం’ అని చెప్పారు. కానీ వాళ్లు వ్యవహరించిన తీరు చూస్తుంటే రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాల పేరిట వచ్చారని స్పష్టంగా కన్పించింది. నా కార్ నంబర్, నా ఫోన్ నంబర్లు తీసుకున్నారు. వారు స్పష్టమైన లక్ష్యం, ఉద్దేశంతోనే వచ్చినట్టుగా స్పష్టమైంది. వారు చెబుతున్న లిక్కర్ కేసులో నిందితులు నా ఇంట్లో ఎందుకు ఉంటారు? వారికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడకు ఎందుకు వస్తారు? ఏమైనా అడిగితే పై నుంచి ప్రెజర్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా పొలిటికల్ మోటివేషన్‌తో జరుగుతోందని అర్థమవుతోంది. -
‘సాక్షి’పై కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’పై చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు, వేధింపులకు బరితెగిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుండటంతో కక్షకట్టి పోలీసులను ఉసిగొలిపి బెదిరింపులకు దిగుతోంది. రాజ్యాంగాన్ని కాలరాస్తూ, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ ఎమర్జెన్సీ నాటి దురాగతాలకు పాల్పడుతోంది. ఏకంగా సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి విజయవాడ నివాసంలో గురువారం సోదాల పేరుతో బెదిరింపు చర్యలకు పాల్పడటం ప్రభుత్వ కుట్రకు పరాకాష్టగా నిలుస్తోంది. కనీసం సెర్చ్ వారంట్ కూడా లేకుండా, నోటీసు కూడా ఇవ్వకుండా గురువారం ఉదయం 9 గంటలకే విజయవాడ ఏసీపీ దామోదర్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు సాక్షి ఎడిటర్ నివాసంలోకి ప్రవేశించి సోదాల పేరుతో హల్చల్ చేశారు. అసలు పోలీసులు ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదు. తన నివాసంలో సోదాలు చేసేందుకు సెర్చ్ వారంట్ చూపించాలని అడిగితే పట్టించుకోకుండా అన్ని గదుల్లో తనిఖీలు కొనసాగించడం గమనార్హం. ఏ కేసులో సోదాలు చేస్తున్నారు.. ఏం కావాలని ఎడిటర్ ధనంజయ రెడ్డి ఎంతగా అడిగినా ఏసీపీ దామోదర్ కనీస సమాధానం కూడా ఇవ్వలేదు. సమాచారం తెలిసిన పాత్రికేయ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు హుటాహుటిన ఆయన నివాసానికి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఇంటి తలుపులు వేసి.. ధనంజయ రెడ్డిని ఎవరూ కలవకుండా అడ్డుకున్నారు. ధనంజయ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేని అంశాలపై ప్రశ్నించారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు... మీరు ఎప్పుడు వచ్చారు.. అంటూ ప్రశ్నలు వేయడం గమనార్హం. ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారని అడిగితే సమాధానం మాత్రం చెప్ప లేదు. తమను లోపలికి అనుమతించాలని పాత్రికేయులు ఎంతగా కోరినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక వైఖరి, దౌర్జన్యపూరిత తీరుకు నిరసనగా పాత్రికేయులు అక్కడే ఆందోళన చేపట్టారు.సెర్చ్ వారంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుఉదయం 11 గంటల సమయంలో తాము సోదాలు చేసినట్టు ఓ కాగితంపై రాసి సంతకం చేయాలని ధనంజయ రెడ్డికి చెప్పారు. సిట్ దర్యాప్తు చేస్తున్న మద్యం కేసులో నిందితులు ఉన్నారేమోనని తెలుసుకునేందుకు తాము సెర్చ్ వారంట్‌తో వచ్చి సోదాలు నిర్వహించినట్టు పేర్కొనడం గమనార్హం. దీనిపై ఎడిటర్ ధనంజయ రెడ్డి అభ్యంతరం తెలిపారు. అసలు మద్యం కేసులో నిందితులు తన నివాసంలో ఎందుకు ఉంటారని ఆయన పోలీసులను నిలదీశారు. కొంత కాలం నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న తాను బుధవారం రాత్రే విజయవాడ వచ్చానని తెలిపారు. కేవలం సాక్షి పత్రికను బెదిరించేందుకే ఎడిటర్ నివాసంలో సోదాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సెర్చ్ వారంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు.. అనంతరమే సోదాలు నిర్వహించినట్టు ఎలా రాస్తారని.. తాను ఎందుకు సంతకం చేయాలని ఆయన ప్రశ్నించారు. తన న్యాయవాదితో సంప్రదించిన తర్వాతే సంతకం చేస్తానన్నారు. దాంతో న్యాయవాది మనోహర్ రెడ్డిని పోలీసులు లోపలికి అనుమతించారు. పోలీసుల తీరును న్యాయవాది మనోహర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఏదైనా సరే నిబంధనల ప్రకారం చేయాలని, పోలీసులు ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదని న్యాయస్థానాలు స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. వ్యక్తి స్వేచ్ఛే అత్యున్నతమైందన్న న్యాయస్థానాల తీర్పులను కూడా ఖాతరు చేయరా అని పోలీసులను నిలదీశారు. కాసేపు తర్జనభర్జనల అనంతరం పోలీసులు సెర్చ్ వారంట్‌ను అప్పటికప్పుడు పెన్‌తో రాసి ఇచ్చి.. తాము సోదాలు చేసినట్టు పంచనామా నివేదికను సమర్పించి వెళ్లిపోయారు. దాదాపు మూడు గంటలపాటు పోలీసులు సోదాల పేరుతో సాక్షి ఎడిటర్ నివాసంలో హల్చల్ చేశారు. కేవలం సాక్షి గొంతు నొక్కేందుకే ఇలా బెదిరింపులకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. -
'సాక్షి'పై కూటమి సర్కార్ అక్కసు.. జర్నలిస్టుల నిరసన
ఏపీలో కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతికా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్న చంద్రబాబు సర్కారు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టాయి. సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు ఆందోళనలు చేపట్టారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేయడాన్ని పాత్రికేయ సంఘాలు ఖండించాయి. సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికాయి.హైదరాబాద్ సాక్షి ప్రధాన కార్యాలయంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లో పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లడాన్ని నిరసిస్తూ విశాఖపట్నంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందంటూ నినదించారు. తర్వాత జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కృష్ణాజిల్లాలోనూ జర్నలిస్టులు ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసుల అక్రమ సోదాలను ఎన్టీఆర్ జిల్లా నందిగామ జర్నలిస్టులు ఖండించారు. ప్రభుత్వ , పోలీసుల తీరును నిరసిస్తూ నందిగామ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకర్నూలు కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాలు ధర్నా చేపట్టాయి. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకొవాలని డిమాండ్ చేశాయి. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై వేధింపులకు పాల్పడటం సరికాదని సూచించాయి. కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి జర్నలిస్టు సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు.గాంధీ విగ్రహానికి వినతిపత్రంసాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై పోలీసులు కక్ష్య సాధింపు చర్యలకు దిగడంపై తిరుపతి జర్నలిస్ట్ సంఘాలు, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపాయి. ప్రభుత్వం చేస్తున్న కక్ష్య సాధింపు చర్యలకు నిరసనగా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించాయి.నల్ల రిబ్బన్లు ధరించి నిరసనసాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డిఆర్వో వెంకట్రావ్ కు వినతి పత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో.. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు వెళ్లడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. కలెక్టర్ వల్లూరి క్రాంతికి వినతి పత్రం సమర్పించారు.పెద్దపల్లి జిల్లాలో.. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి పట్ల ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా గోదావరిఖని బస్టాండ్ రాజీవ్ రహదారిపై సాక్షి దినపత్రిక, టీవీ ఛానల్ ప్రతినిధులు నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేశారు. దీంతో రాజీవ్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఏపీలో పత్రిక స్వేచ్ఛ ఉందా?సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసుల సోదాలను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాక్షాత్తు పత్రికా సంపాదకులను టార్గెట్ చేయడం శోచనీయమని, ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ ఉందా అని ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. చదవండి: పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ‘సాక్షి’పై ఏపీ సర్కార్ కక్ష సాధింపు -
దుర్మార్గం.. అక్రమం
సాక్షి, నెట్వర్క్: ‘ఒక సంఘటనను యథాతథంగా వాస్తవాలతో ప్రచురించడం తప్పా? నిజాలు రాస్తే గొంతు నొక్కేస్తారా? హత్యను హత్య అని చెప్పినందుకు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మరో ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా కేసు పెట్టించడం దుర్మార్గం. ఇది ముమ్మాటికీ స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే. ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో ఒక వార్త ఒకేలా లేదని చెబుతూ కేసు పెట్టడం హాస్యాస్పదం. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కేసు పెట్టడం అంటే ముమ్మాటికీ కక్ష సాధింపే. తక్షణమే ఆ కేసును ఎత్తివేయాలి’ అని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల నేతలు, జర్నలిస్టులు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. విజయవాడలో ఏపీయూడబ్ల్యూజే, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం (సామ్నా) ఆధ్వర్యంలో కలెక్టరేట్లో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహంను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం డీఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించారు. మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. బాపట్లలో నిరసన తెలిపి కలెక్టర్ వెంకట మురళికి వినతి పత్రం సమర్పించారు. రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోనూ నిరసన చేపట్టారు. మార్కాపురం ప్రెస్‌క్లబ్ నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టులు నెల్లూరులో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ఏఎస్పీ సుబ్బరాజుకు వినతిపత్రం అందజేశారు. కొవ్వూరు, ఆలమూరు, కొత్తపేట, రావులపాలెంలో కూడా జర్నలిస్టులు నిరసన తెలిపారు. ‘సీమ’ వ్యాప్తంగా కదం తొక్కిన జర్నలిస్టులుసాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డితో పాటు ఆరుగురు పాత్రికేయులపై అక్రమ కేసు నమోదును నిరసిస్తూ రాయలసీమ వ్యాప్తంగా జర్నలిస్టులు కదం తొక్కారు. అనంతపురంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషికి వినతి పత్రం అందజేశారు. కళ్యాణదుర్గం, పుట్టపర్తి, చిలమత్తూరు, పెనుకొండలో నిరసన తెలిపారు. కర్నూల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఇతర జర్నలిస్టు సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. గంగాధరనెల్లూరు, తవణంపల్లె, పలమనేరులో ఆందోళనలు చేపట్టారు. చిత్తూరులో గాంధీ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కడపలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడుకు వినతిపత్రం సమర్పించారు. ఉత్తరాంధ్రలో నిరసనలువిశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్కులో శుక్రవారం జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టులను కేసుల పేరుతో అణిచి వేయాలని చూస్తే ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలిలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ధర్నా నిర్వహించి, మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, పార్వతీపురం ఐటీడీఎ పీవో, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవకు వినతిపత్రాలు అందజేశారు. తప్పుడు కేసు ఎత్తివేయాలి సాక్షి ఎడిటర్, ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్ధన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నేత కోన సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర శాఖ కూడా సాక్షిపై కేసును తీవ్రంగా తప్పుపట్టింది. సాక్షి ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై కేసు పెట్టడాన్ని సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డిలు కేసును తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు, కార్యదర్శి శ్రీనివాసరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు ప్రభుత్వ తీరును వేర్వేరు ప్రకటనల్లో తప్పుపట్టారు. -
మిషన్ ఉద్దానం..!
సిక్కోలు కోనసీమగా పచ్చని కొబ్బరి చెట్లతో పేరుతెచ్చుకున్న ఉద్దానం ప్రాంతాన్ని ఇప్పుడు కిడ్నీ రోగాలు వణికిస్తున్నాయి. రోగాలకు మూలకారణాలపై పరిశోధనలు మాటెలా ఉన్నా ప్రజలలో ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. అసలు వ్యాధికి కారణమేమిటో కనుక్కునేలోగా అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం నింపాలంటే ఏమి చేయాలి? అదే మిషన్ ఉద్దానం! జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి ప్రత్యేక దృష్టితో దీనికి నాంది పలికారు. వైద్య, సామాజిక, ఆర్థిక కోణాల్లో సమస్యను పరిశీలించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఉద్దానంలోని ఏడు మండలాల్లో మండలానికి ఒక్కటి చొప్పున అవగాహన సమావేశాలనూ నిర్వహించారు. మరోవైపు వైద్యం, తాగునీటి సౌకర్యాలను పెంచేందుకు ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. – సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం సాక్షి: మీ ‘మిషన్ ఉద్దానం’ లక్ష్యాలేమిటి? కలెక్టర్: కిడ్నీ రోగ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తేలితే వైద్యం ఏ స్థాయిలో అందించాలనేదీ నిర్ణయమవుతుంది. ఇందుకు తొలుత ఉద్దానంలో పెద్ద ఎత్తున మెడికల్ మాస్ స్క్రీనింగ్ టెస్టులు చేయాలి. అలా గుర్తించినవారికి ఉచితంగా మందులు, డయాలసిస్ సౌకర్యం కల్పించాలి. తాగునీటి వల్లే ఈ రోగాలు వస్తున్నాయనే వాదనలు ఉన్న నేపథ్యంలో ముందు ఇంటింటికీ శుద్ధజలం అందించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజల్లో అవగాహన కల్పించడం మరో ఎత్తు. సాక్షి: మిషన్ విజయవంతమవ్వాలంటే మౌలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టర్: కిడ్నీ రోగాలపై ప్రజల్లో ఇప్పటికీ తగిన అవగాహన లేదు. రోగం వచ్చినా తగిన వైద్యం పొందితే కోలుకుంటామన్న మనోధైర్యం కూడా చాలామందిలో ఉండట్లేదు. ఒకవిధమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సమస్యను ఇప్పటివరకూ వైద్యపరంగానే చూస్తున్నాం. సామాజిక, ఆర్థిక కోణాల్లోనూ చూడాలి. ప్రజలను చైతన్యం చేసి ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ చూపించాలి. ఈ ప్రక్రియ పక్కాగా జరిగితే ముందడుగు వేసినట్లే. సాక్షి: రోగం గుర్తించడానికి అవసరమైన వైద్య పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి ఏం చేస్తారు? కలెక్టర్: వైద్య పరీక్షలు చేయించుకోవాలనే అవగాహన కూడా చాలామంది ఉద్దానం ప్రజల్లో లేదు. భయంతో పెయిన్ కిల్లర్స్ తీసుకొని రోగాన్ని పెంచుకుంటున్నారు. కొంతమందైతే రోగం బాగా ఎక్కువయ్యేవరకూ వైద్యానికి వెళ్లట్లేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ కిడ్నీ రోగాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందుకోసం వైద్యాఆరోగ్య శాఖనే గాకుండా స్త్రీశిశు సంక్షేమ శాఖ, డీఆర్డీఏ శాఖల సిబ్బందితో పాటు స్థానిక వైద్యులు, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నాం. ఇలా అన్నివర్గాలనూ ఈ మిషన్‌లో పాలుపంచుకునేలా చేసేందుకే ముందుగా మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాం. సాక్షి: క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయా? కలెక్టర్: క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సాధికారమిత్రలతో మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారులకూ ముందుగా అవగాహన కల్పించాం. వారైతే ప్రజలకు చేరువగా వెళ్లి చైతన్యం చేయగలరు. ఈ విషయంలో మీడియా కూడా తన వంతు సహకారం అందిస్తోంది. అన్ని వర్గాల అనుభవాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఉద్దానం ప్రాంతంలో 730 ఆవాసాలు ఉన్నాయి. గ్రామపంచాయతీలైతే 160 నుంచి 170 వరకూ ఉన్నాయి. ప్రతి గ్రామానికీ ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈనెల 11వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకూ ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. సాక్షి : ప్రచార కార్యక్రమంలో ప్రధాన లక్ష్యమేమిటి? కలెక్టర్: కిడ్నీ రోగాలకు కారణాలేమిటి? వైద్య పరీక్షలు ఎలా చేయించుకోవాలి? ఆహారం, పరిసరాల పరిశుభ్రత తదితర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై ప్రత్యేకంగా కరపత్రాలను రూపొందించాం. వాటిని కమిటీ సభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి అందజేస్తారు. తర్వాత గ్రామసభలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఈ కరపత్రాలు అందజేయాలని డీఈవో, ఎంఈవోలకు ఆదేశాలిచ్చాం. వాస్తవానికి కిడ్నీ రోగుల్లో క్రియాటిన్ లెవల్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మందులు వాడితే సరిపోతుంది. సాక్షి: వైద్య పరీక్షలు సక్రమంగా జరగట్లేదు కదా? కలెక్టర్: జబ్బు బయటపడితే ఏదో జరిగిపోతుందనే భయం ఉద్దానం ప్రజల్లో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యువతలో. ముందు ఆ భయం పోగొట్టాలి. వారికి భరోసా కల్పించాలి. ప్రజలు వైద్య పరీక్షలకు ముందుకొస్తే సమస్య పరిష్కార దిశగా ముందడుగు పడినట్లే! క్రియాటిన్ లెవల్ వగైరా వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఉద్దానంలోని ఆరు సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లో సౌకర్యాలు ఉన్నాయి. అలాగే 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా సెమీ ఆటో ఎనలైజర్లు ఏర్పాటు చేయించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక్కో దానికి రూ.1.50 లక్షల ఖర్చవుతోంది. అంటే ఏ కారణమైనా పీహెచ్‌సీకి వచ్చిన ప్రతి ఒక్కరికీ క్రియాటిన్ లెవల్ పరీక్ష చేయాలని వైద్యాధికారులకు చెప్పాం. ఎవరిలోనైనా రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే సీహెచ్‌సీకి వెళ్లాలని వారికి సూచించాలని ఆదేశించాం. సాక్షి: ఉచిత మందుల పంపిణీ మాటేమిటి? కలెక్టరు: కిడ్నీమార్పిడి చేసుకున్నవారికి విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో మాత్రమే ఉచితంగా మందులు ఇస్తున్నారు. ఇది వ్యయప్రయాసలతో కూడినది. అలాగాకుండా శ్రీకాకుళం రిమ్స్‌లో నెఫ్రాలజిస్టు అందుబాటులో ఉన్నందున ఇక్కడే మందులు ఇచ్చేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి కోరాం. ఇప్పటికే ఉద్దానంలోని అన్ని ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు ఇవ్వడానికి ఏడాదికి రూ.6.5 కోట్ల బడ్జెట్‌తో ఏర్పాట్లు చేశాం. సాక్షి: ఆహారపు అలవాట్లు మార్పు కోసం ప్రచారం చేస్తున్నారా? కలెక్టర్: కిడ్నీ రోగానికి గురైనవారెవ్వరైనా మద్యం, గుట్కా, మాంసాహారానికి దూరంగా ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. అలాగే ఆర్వో ప్లాంట్ల ద్వారా శుద్ధిజలం అందించడానికి ఏర్పాట్లు చేసినా మూడో వంతు ప్రజలు మాత్రమే ఇప్పటివరకూ కార్డులు తీసుకున్నారు. 20 లీటర్లు నీటిని రూ.2కు సరఫరా చేస్తున్నారు. అలాగాకుండా తొలి నెల ఉచితంగా కార్డు ఇచ్చేలా డీఆర్డీఏ అధికారులకు బాధ్యత అప్పగించాం. ఇలా అన్ని కోణాల్లో సమష్టిగా మిషన్‌ను విజయవంతం చేస్తే కిడ్నీ మహమ్మారిపై పోరాటంలో ముందడుగు వేసినట్లే! సాక్షి: డయాలసిస్ సౌకర్యాలు మెరుగుపరుస్తారా? కలెక్టర్: సోంపేట, పలాసలోనూ ఉన్న డయాలసిస్ కేంద్రాలకు తాకిడి ఎక్కువగా ఉంది. అక్కడ నాలుగైదు మిషన్లు పెంచేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో కూడా పెట్టాలనే డిమాండు ఉంది. -
తేడాచేస్తే ఉద్యోగాలు పోతాయ్!
ఓటుహక్కు ప్రజాస్వామ్యానికే కాదు పౌరులకూ ఊపిరి! ఇది పోతే ఊపిరి ఆగినంతగా భావిస్తారు! అలాంటిది జిల్లాలో లక్ష ఓట్లు ఒకేసారి తొలగించేసరికి అర్హుల్లో అలజడి మొదలైంది! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలన్నీ గొంతెత్తాయి. దీనిపై జిల్లా కలెక్టరు కె.ధనంజయరెడ్డి సానుకూలంగా స్పందించారు. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోతే ఉద్యోగాలు పోతాయ్ అని హెచ్చరించారు. ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వూ్యలో జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆయన వివరించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లావ్యాప్తంగా లక్షకు పైగా ఓట్లను తొలగించారు. వారిలో చాలామంది అర్హులవీ రాజకీయ కారణాలతో గల్లంతు చేసేశారని విపక్షాల నుంచి వస్తున్న విమర్శలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టరు: ఈ సమస్యపై వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీల నాయకులు నన్ను కలిశారు. ఈ ఫిర్యాదుల పరిశీలన బాధ్యత ఆర్డీవోకి అప్పగించాం. వలస వెళ్లినవారి, వయస్సు తక్కువగా ఉన్నవారి పేర్లు ఉన్నాయా? మరణించినవారి ఓట్లను తొలగించలేదా? రెండు చోట్ల ఓట్లు నమోదై ఉన్నాయా? అనే కోణంలో పరిశీలించి వాటిని తొలగించే క్రమంలో పొరపాట్లు జరిగి ఉండొచ్చు. రాజకీయ కారణాలతో ఎవ్వరైనా సిబ్బంది ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో జరిగే ఈ ఓట్ల ప్రక్రియకు సంబంధించి ఎవ్వరైనా అలక్ష్యం వహించడానికి వీల్లేదు. సాక్షి: ఒక్క శ్రీకాకుళం నగరంలోనే 28 వేలు, పలాసలో 20 వేల మంది ఓట్లు తీసేశారు. వాటిలో అర్హులవీ ఎలా తప్పించారో వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు కదా? కలెక్టరు: శ్రీకాకుళం నగరంలో జనాభాతో పోల్చితే ఓటర్ల శాతం సాధారణం (65–70 శాతం) కన్నా ఎక్కువగా (80 శాతం) ఉంది. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలెక్టో రోల్స్ (ఐఆర్‌ఈఆర్) పట్టణాల్లో ప్రత్యేక పరిశీలన కార్యక్రమం నిర్వహించింది. శ్రీకాకుళంలో పోలింగ్ స్టేషన్లు శాస్త్రీయంగా లేవు. దీంతో ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధి ప్రాంతానికి సరిహద్దులిచ్చి నగరీలక్ష్య పేరుతో మ్యాప్‌ను తయారుచేశారు. ఈ ప్రకారం సామీప్య పోలింగ్ స్టేషన్ పరిధిలోకి ఓటర్లను మార్పులు చేర్పులు చేశారు. దీంతో సుమారు 32 వేల ఓట్లు ఒక పోలింగ్ స్టేషన్ పరిధి నుంచి మరో పోలింగ్ స్టేషన్ పరిధిలోకి మారిపోయాయి. తొలగించిన 27 వేల ఓట్లలో అర్హులు ఎవ్వరున్నా వారి ఓటుహక్కు కోల్పోకుండా చూసే బాధ్యత మాది. ఫిర్యాదులొచ్చిన ఏరియాలో సిబ్బందిని ఇంటింటికీ పంపిస్తున్నాం. అక్కడే అర్హుల వివరాలతో ఫారం–6 పూర్తిచేయిస్తారు. సాక్షి: సిబ్బందిలో కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి ఓటర్ల నమోదు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి? కలెక్టరు: ఎలక్షన్ కమిషన్ నియమనిబంధనలను లోబడి పనిచేయకుంటే వీఆర్వో నుంచి డీఎల్వో వరకూ ఏ స్థాయిలో ఉద్యోగులైనా తేడా చేస్తే ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఫారం–6 వివరాలు మరోసారి చెక్ చేయిస్తాం. అవసరమైతే క్రాస్‌చెక్ కూడా చేయిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పిస్తాం. ఏప్రిల్ నెల నుంచి ఈఆర్వో నెట్ పేరుతో కొత్త సాఫ్ట్వేర్ వస్తోంది. డబుల్ ఎంట్రీ ఓట్లను గుర్తించి ఓటరు ఎక్కడైతే తన ఓటు ఉండాలని కోరుకుంటారో అక్కడే ఓటు ఉంచి రెండోది తొలగిస్తాం. సాక్షి: ప్రస్తుతం జిల్లాలో ఏ ఏటీఎం చూసినా నగదు ఉండట్లేదు. రెండు నెలలుగా తీవ్రతరమైన ఈ సమస్యకు పరిష్కార చర్యలేమైనా ఉన్నాయా? కలెక్టరు: నగదుకొరత జిల్లాలో ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. బ్యాంకులకు క్యాష్ వచ్చినా విశాఖ నగరంలోనే ఎక్కువగా సర్దేస్తున్నారు. వచ్చే నెలలో ఆ సమస్య తలెత్తకుండా జిల్లాకు నిష్పత్తి ప్రకారం నగదు ఇవ్వాలని ఆర్బీఐకి కోరాం. ఈనెలాఖరులోగా పింఛన్లు, వేతనదారులకు సరిపడా నగదు సిద్ధం చేసుకోవాలని బ్యాంకర్లకు సూచించాం. సాక్షి: జిల్లాలో సాగునీరు సమస్య తీర్చడంలో జలసిరి పథకం ఎంతవరకూ ఉపయోగపడుతుంది? కలెక్టరు: ఈ పథకం కింద ఒక్కో బోర్వెల్కు ఈపీడీసీఎల్ రూ.3 లక్షల వరకూ ఖర్చు చేస్తోంది. బోరుబావి తవ్వకం, సబ్మెర్సిబుల్ పంప్, సోలారు విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మొత్తం రూ.3 లక్షల ఖర్చు అవుతుంది. దీనిలో జనరల్, బీసీ కేటగిరి రైతులు రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ రైతులు రూ.6 వేలు మాత్రమే భరిస్తే సరిపోతుంది. సన్న, చిన్నకారు రైతులకు ఉపయోగపడేలా ఒకేచోట రెండున్నర ఎకరాలలోపు భూమి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జిల్లాలో ఎక్కువ చిన్న కమతాలే ఉన్న దృష్ట్యా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ షరతును కాస్త సడలించేలా కృషి చేశాను. మూడు ఎకరాలలోపు అదీ ఒకేచోట గాకుండా వేర్వేరు చోట్ల ఉన్నా రైతులకు లబ్ధి కలుగుతుంది. జిల్లాలో 9 వేల బోర్‌వెల్స్ లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. మార్చి నెలాఖరులోగా 3 వేలు క్లియర్ చేస్తాం. సాక్షి: వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2 పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తయ్యే అవకాశం కనిపించట్లేదు? కలెక్టరు: 87 ప్యాకేజీ పనులు ఆలస్యమైనా ఇప్పుడు అవీ వేగవంతమయ్యాయి. మిగిలిన వంతెనలు తదితర 25 నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేయాలని గడువు నిర్దేశించాం. ఒకవేళ ఆలస్యమైనా మే, జూన్ నెలల్లో తొలకరి వర్షాలతో వంశధార నదిలో నీరు వచ్చే సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. 88 ప్యాకేజీలో కొత్తూరు–సీతంపేట రోడ్డులో ఒక్కచోట కటింగ్‌కు సంబంధించిన కోర్టు కేసు కూడా త్వరలోనే క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. హిరమండలం జలాశయానికి సంబంధించిని మూడు పెండింగ్ పనుల్లో గార్లపాడు, తులగాం వద్ద దాదాపుగా పూర్తికావచ్చాయి. స్పిల్‌వే, హెడ్‌రెగ్యులేటర్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదేమైనా జూన్ నాటికి జలాశయంలో 8 టీఎంసీల నీరు నింపడానికి కృషి చేస్తున్నాం. నిబంధనల ప్రకారం కొత్త డ్యామ్‌లో తొలి సంవత్సరం 40 శాతం (8 టీఎంసీలు), రెండో సంవత్సరం 80 శాతం (16 టీఎంసీలు), మూడో సంవత్సరానికి శత శాతం (19 టీఎంసీలు) నింపాలి. సాక్షి: నేరడిబ్యారేజీ నిర్మాణం పూర్తిగాకుండా 19 టీఎంసీలు జలాశయానికి తీసుకురావడం సాధ్యమేనా? కలెక్టరు: నేరడి బ్యారేజీకి సంబంధించి దాదాపు రూ.460 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించడానికి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్ధమైంది. కానీ వంశధార ట్రిబ్యునల్ తీర్పుపై ఒడిశా ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏమైనా తీర్పు మనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. సాక్షి: కానీ వంశధార నిర్వాసితుల సమస్యల పరిష్కారం ఇంకా కొలిక్కిరాలేదు? కలెక్టరు: నిర్వాసితుల కాలనీల్లో తాగునీరు, రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కల్పన ఇప్పటికే పూర్తి చేశాం. సామాజిక భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాల నిర్మాణపనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన మెట్టూరు బిట్–2, 3ల్లోని లోతట్టు ప్రాంతం పూడ్చివేత పనులకూ ఆమోదం తెలిపాం. పరిహారం విషయానికొస్తే యూత్ ప్యాకేజీ అందని కుటుంబాలకు హౌసింగ్ స్కీమ్ కింద ఇప్పటికే 1300 వరకూ ఇళ్లు మంజూరుచేశాం. వారం పది రోజుల్లో మరో ఏడొందల వరకూ మంజూరు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద జాబ్‌కార్డులు ఇచ్చాం. ఒకవేళ పనిప్రాంతాలు దూరంగా ఉంటే రవాణా సౌకర్యం కల్పిస్తాం. సాక్షి: నిర్వాసితుల కాలనీలున్న చోట్ల ప్రత్యేక గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఓటుహక్కు కల్పన విషయాల్లో నెలకొన్న గందరగోళాన్ని ఎలా చక్కదిద్దుతారు? కలెక్టరు: నిర్వాసిత కాలనీలున్న గ్రామ పంచాయతీల్లో విలీనం చేసేందుకు డీనోటిఫై చేశాం. ఇక ఓట్ల విషయానికొస్తే డిసెంబరులో డ్రాఫ్ట్ ప్రచురించే సమయానికి ఆయా గ్రామాల్లో ఉన్నట్లే ఓట్లు ఉంటాయి. అయితే కొత్త గ్రామపంచాయతీ పరిధిలోకి ఓట్లను తీసుకొచ్చే విషయాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. అందరికీ ఓటుహక్కు కల్పిస్తాం. సాక్షి: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యం సాధించడానికి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి కదా? కలెక్టరు: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అక్టోబరులోగా శతశాతం పూర్తి చేయాలనేది మా లక్ష్యం. కానీ దీన్ని మార్చి నెలకు కుదించేసరికి ఒత్తిడి పెంచక తప్పలేదు. వారం రోజులు పింఛన్లు ఆపినా తర్వాత ఇచ్చేశారు. ఈసారి ప్రజలను గాకుండా గ్రామ సర్పంచులను బాధ్యులను చేస్తున్నాం. నిర్లక్ష్యం వహిస్తే చెక్ పవర్ రద్దు చేస్తామని, నిధులు నిలిపేస్తామని కూడా హెచ్చరించాల్సి వస్తోంది. -
అవే సమస్యల ని‘వేదన’!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: వ్యవసాయానికి సాగునీరు నుంచి గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు వరకూ.. ఉపాధి కల్పన నుంచి పరిశ్రమల స్థాపన వరకూ.. పింఛను నుంచి రేషన్‌కార్డు వరకూ ఇలా ప్రతి అంశంలోనూ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ల కాలంలో చేసిందేమైనా ఉందా? అంటే ప్రజలు మాత్రం పెదవి విరుస్తున్నారు. ముఖ్యమంత్రే సిక్కోలు జిల్లాలో పది సార్లు పర్యటించినా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు మాత్రం గుదిబండలా అలాగే ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనేక హామీలు ఇచ్చినా అవేవీ కార్యరూపం దాల్చ లేదు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే గురువారం నుంచి రెండ్రోజుల పాటు ఆయన జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర రాజధానిలో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దీనికి జిల్లా కలెక్టరు కె.ధనంజయరెడ్డి కూడా హాజరవుతున్నారు. జిల్లాలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల సహా వ్యవసాయ, వ్యవసాయానుబంధ, పారిశ్రామిక, సేవా రంగాల తీరుపై నివేదికను సమర్పించనున్నారు. జిల్లా కలెక్టరు నివేదిక ప్రకారం జిల్లా గత ఆర్థిక సంవత్సరం (2016–17)లో వ్యవసాయ రంగం 12.8 శాతం, పారిశ్రామిక రంగం 9.28 శాతం, సేవారంగంలో 10.10 శాతం వృద్ధి సాధించింది. కానీ ఇదంతా నివేదికలో చూపించడానికే తప్ప ఆచరణలో ఆ స్థాయి వృద్ధి కనిపించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా తలసరి ఆదాయం రూ.94,118 మాత్రమే. కానీ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,22,376 ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 14.44 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టరు ధనంజయ్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. తొలిరోజు వ్యవసాయం, వ్యవసాయాధార పరిశ్రమల పరిస్థితి, సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపుల అవసరంపై కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించనున్నట్లు తెలిపారు. జీడిపప్పు పరిశ్రమలో అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతులకు బదులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫుడ్‌ప్రాసెసింగ్ విధానాన్ని పరిచయం చేయాల్సి ఉందన్నారు. మేజర్, మైనర్ ఇరిగేషన్లో పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించనున్నట్లు చెప్పారు. ఉద్దానం సహా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించడానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ప్రస్తావించనున్నట్లు తెలిపారు. కొవ్వాడ అణుపార్కు, భావనపాడు పోర్టు భూసేకరణకు సంబంధించిన వివాదాలను కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. శ్రీకాకుళంలోని ఏకైక ప్రభుత్వ బోధనాసుపత్రి రిమ్స్‌లో ఎంబీబీఎస్ సీట్లు వంద నుంచి 150కి పెంపు, అలాగే పీజీ వైద్య విద్య సీట్ల పెంపునకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన విషయమై ప్రస్తావించనున్నట్లు చెప్పారు. ఉద్దానంలోని కిడ్నీ రోగులకు ఉచితంగా మందుల సరఫరా ప్రతిపాదనను కూడా సాధ్యమైనంత సత్వరమే ఆచరణలోకి తీసుకొచ్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొస్తామన్నారు. -
వేరుశనగ రక్షణకు రెయిన్‌గన్స్
-అవసరమైతే విద్యుత్ వేళల్లో మార్పు -రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు: ధనంజయరెడ్డి భాకరాపేట రాష్ట్ర వ్యాఫ్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు నుండి వేరుశనగ పంటను కాపాడటానికి రాష్ట్రవ్యాప్తంగా 13వేల 300 రెయిన్‌గన్స్‌ను వినియోగిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయు సంచాలకులు ధనంజయరెడ్డి తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లులో వేరుశనగ పంటకు అందిస్తున్న తడిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు కారణంగా ఎండి పోతున్న పంటకు తడిని అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 160 కోట్లతో రెయిన్ గన్లను అందిస్తున్నామన్నారు. ఎక్కడా తడి లేక పంట రాలేదన్నది వినపడకూడదని సీఎం చెప్పినట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలో వేసిన వేరుశనగ 50 శాతం పంట మాత్రం చేతికి వస్తుందన్నారు. ఎకరాకు 20 వేల లీటర్లు నీటితో వేరుశనగ చేనును తడపవచ్చునన్నారు. ఇందుకు అయ్యే ఖర్చులో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందన్నారు. ముందుగా రైతు పెట్టుకుంటే వారి ఖాతాలకు వారంలో నగదు వేస్తామన్నారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లా ప్యాఫిలి మండలంలో అత్యధికంగా పంట ఎండిపోయిందన్నారు. కరెంటు వేళల్లో కూడా మార్పులు చేయడానికి ప్రభుత్వం చోరవ తీసుకుందన్నారు. మధ్యాహ్నం సమయంలో కరెంటు ఇస్తే రెయిన్ తో నీటీని వదలితే ఎక్కువ శాతం గాలిలో కలిసి పోతుందని, ఉదయం వేళల్లోనే కరెంటు సరఫరా చేసి వేరుశనగ రైతులును ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రాష్ర్ట వ్యాప్తంగా తెగుళ్ళు, సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక టీమ్‌లు సందర్శించి చర్యలు తీసుకుంటున్నాయన్నారు. రైతులుకు వ్యవసాయబావులు దగ్గర నీటీ వసతి లేకుండా అయిల్ఇంజిన్లు సైతం సరఫరా చేసి, పైపులు, రెయిన్ గన్స్, స్పింక్లర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. నీటీ వసతి లేక, వర్షాభావం వల్ల వేరుశనగ పంట ఎండిపోతే ఇన్సూరెన్సు చేయించుకున్నవారికి వారంలో బీమా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్సూరెన్సు లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ విజయ్‌కుమార్, పీడీ శివనారాయణ పాల్గొన్నారు.