సిక్కోలు కోనసీమగా పచ్చని కొబ్బరి చెట్లతో పేరుతెచ్చుకున్న ఉద్దానం ప్రాంతాన్ని ఇప్పుడు కిడ్నీ రోగాలు వణికిస్తున్నాయి. రోగాలకు మూలకారణాలపై పరిశోధనలు మాటెలా ఉన్నా ప్రజలలో ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. అసలు వ్యాధికి కారణమేమిటో కనుక్కునేలోగా అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం నింపాలంటే ఏమి చేయాలి? అదే మిషన్ ఉద్దానం! జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి ప్రత్యేక దృష్టితో దీనికి నాంది పలికారు. వైద్య, సామాజిక, ఆర్థిక కోణాల్లో సమస్యను పరిశీలించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఉద్దానంలోని ఏడు మండలాల్లో మండలానికి ఒక్కటి చొప్పున అవగాహన సమావేశాలనూ నిర్వహించారు. మరోవైపు వైద్యం, తాగునీటి సౌకర్యాలను పెంచేందుకు ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను వెల్లడించారు.
– సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం
సాక్షి: మీ ‘మిషన్ ఉద్దానం’ లక్ష్యాలేమిటి?
కలెక్టర్: కిడ్నీ రోగ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తేలితే వైద్యం ఏ స్థాయిలో అందించాలనేదీ నిర్ణయమవుతుంది. ఇందుకు తొలుత ఉద్దానంలో పెద్ద ఎత్తున మెడికల్ మాస్ స్క్రీనింగ్ టెస్టులు చేయాలి. అలా గుర్తించినవారికి ఉచితంగా మందులు, డయాలసిస్ సౌకర్యం కల్పించాలి. తాగునీటి వల్లే ఈ రోగాలు వస్తున్నాయనే వాదనలు ఉన్న నేపథ్యంలో ముందు ఇంటింటికీ శుద్ధజలం అందించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజల్లో అవగాహన కల్పించడం మరో ఎత్తు.
సాక్షి: మిషన్ విజయవంతమవ్వాలంటే మౌలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్: కిడ్నీ రోగాలపై ప్రజల్లో ఇప్పటికీ తగిన అవగాహన లేదు. రోగం వచ్చినా తగిన వైద్యం పొందితే కోలుకుంటామన్న మనోధైర్యం కూడా చాలామందిలో ఉండట్లేదు. ఒకవిధమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సమస్యను ఇప్పటివరకూ వైద్యపరంగానే చూస్తున్నాం. సామాజిక, ఆర్థిక కోణాల్లోనూ చూడాలి. ప్రజలను చైతన్యం చేసి ఈ మహమ్మారి నుంచి
బయటపడటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ చూపించాలి. ఈ ప్రక్రియ పక్కాగా జరిగితే ముందడుగు వేసినట్లే.
సాక్షి: రోగం గుర్తించడానికి అవసరమైన వైద్య పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి ఏం చేస్తారు?
కలెక్టర్: వైద్య పరీక్షలు చేయించుకోవాలనే అవగాహన కూడా చాలామంది ఉద్దానం ప్రజల్లో లేదు. భయంతో పెయిన్ కిల్లర్స్ తీసుకొని రోగాన్ని పెంచుకుంటున్నారు. కొంతమందైతే రోగం బాగా ఎక్కువయ్యేవరకూ వైద్యానికి వెళ్లట్లేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ కిడ్నీ రోగాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందుకోసం వైద్యాఆరోగ్య శాఖనే గాకుండా స్త్రీశిశు సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏ శాఖల సిబ్బందితో పాటు స్థానిక వైద్యులు, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నాం. ఇలా అన్నివర్గాలనూ ఈ మిషన్‌లో పాలుపంచుకునేలా చేసేందుకే ముందుగా మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాం.
సాక్షి: క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయా?
కలెక్టర్: క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, సాధికారమిత్రలతో మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారులకూ ముందుగా అవగాహన కల్పించాం. వారైతే ప్రజలకు చేరువగా వెళ్లి చైతన్యం చేయగలరు. ఈ విషయంలో మీడియా కూడా తన వంతు సహకారం అందిస్తోంది. అన్ని వర్గాల అనుభవాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఉద్దానం ప్రాంతంలో 730 ఆవాసాలు ఉన్నాయి. గ్రామపంచాయతీలైతే 160 నుంచి 170 వరకూ ఉన్నాయి. ప్రతి గ్రామానికీ ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈనెల 11వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకూ ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
సాక్షి : ప్రచార కార్యక్రమంలో ప్రధాన లక్ష్యమేమిటి?
కలెక్టర్: కిడ్నీ రోగాలకు కారణాలేమిటి? వైద్య పరీక్షలు ఎలా చేయించుకోవాలి? ఆహారం, పరిసరాల పరిశుభ్రత తదితర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై ప్రత్యేకంగా కరపత్రాలను రూపొందించాం. వాటిని కమిటీ సభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి అందజేస్తారు. తర్వాత గ్రామసభలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఈ కరపత్రాలు అందజేయాలని డీఈవో, ఎంఈవోలకు ఆదేశాలిచ్చాం. వాస్తవానికి కిడ్నీ రోగుల్లో క్రియాటిన్ లెవల్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మందులు వాడితే సరిపోతుంది.
సాక్షి: వైద్య పరీక్షలు సక్రమంగా జరగట్లేదు కదా?
కలెక్టర్: జబ్బు బయటపడితే ఏదో జరిగిపోతుందనే భయం ఉద్దానం ప్రజల్లో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యువతలో. ముందు ఆ భయం పోగొట్టాలి. వారికి భరోసా కల్పించాలి. ప్రజలు వైద్య పరీక్షలకు ముందుకొస్తే సమస్య పరిష్కార దిశగా ముందడుగు పడినట్లే! క్రియాటిన్ లెవల్ వగైరా వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఉద్దానంలోని ఆరు సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లో సౌకర్యాలు ఉన్నాయి. అలాగే 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా సెమీ ఆటో ఎనలైజర్లు ఏర్పాటు చేయించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక్కో దానికి రూ.1.50 లక్షల ఖర్చవుతోంది. అంటే ఏ కారణమైనా పీహెచ్‌సీకి వచ్చిన ప్రతి ఒక్కరికీ క్రియాటిన్ లెవల్ పరీక్ష చేయాలని వైద్యాధికారులకు చెప్పాం. ఎవరిలోనైనా రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే సీహెచ్‌సీకి వెళ్లాలని వారికి సూచించాలని ఆదేశించాం.
సాక్షి: ఉచిత మందుల పంపిణీ మాటేమిటి?
కలెక్టరు: కిడ్నీమార్పిడి చేసుకున్నవారికి విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో మాత్రమే ఉచితంగా మందులు ఇస్తున్నారు. ఇది వ్యయప్రయాసలతో కూడినది. అలాగాకుండా శ్రీకాకుళం రిమ్స్‌లో నెఫ్రాలజిస్టు అందుబాటులో ఉన్నందున ఇక్కడే మందులు ఇచ్చేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి కోరాం. ఇప్పటికే ఉద్దానంలోని అన్ని ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు ఇవ్వడానికి ఏడాదికి రూ.6.5 కోట్ల బడ్జెట్‌తో ఏర్పాట్లు చేశాం.
సాక్షి: ఆహారపు అలవాట్లు మార్పు కోసం ప్రచారం చేస్తున్నారా?
కలెక్టర్: కిడ్నీ రోగానికి గురైనవారెవ్వరైనా మద్యం, గుట్కా, మాంసాహారానికి దూరంగా ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. అలాగే ఆర్‌వో ప్లాంట్ల ద్వారా శుద్ధిజలం అందించడానికి ఏర్పాట్లు చేసినా మూడో వంతు ప్రజలు మాత్రమే ఇప్పటివరకూ కార్డులు తీసుకున్నారు. 20 లీటర్లు నీటిని రూ.2కు సరఫరా చేస్తున్నారు. అలాగాకుండా తొలి నెల ఉచితంగా కార్డు ఇచ్చేలా డీఆర్‌డీఏ అధికారులకు బాధ్యత అప్పగించాం. ఇలా అన్ని కోణాల్లో సమష్టిగా మిషన్‌ను విజయవంతం చేస్తే కిడ్నీ మహమ్మారిపై పోరాటంలో ముందడుగు వేసినట్లే!
సాక్షి: డయాలసిస్ సౌకర్యాలు మెరుగుపరుస్తారా?
కలెక్టర్: సోంపేట, పలాసలోనూ ఉన్న డయాలసిస్ కేంద్రాలకు తాకిడి ఎక్కువగా ఉంది. అక్కడ నాలుగైదు మిషన్లు పెంచేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో కూడా పెట్టాలనే డిమాండు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment