ఈ కన్నీరు తుడిచేవారెవరు? | Titli cyclone effect to the Uddanam Kidney victims | Sakshi
Sakshi News home page

ఈ కన్నీరు తుడిచేవారెవరు?

Published Sun, Nov 11 2018 4:34 AM | Last Updated on Sun, Nov 11 2018 4:34 AM

Titli cyclone effect to the Uddanam Kidney victims - Sakshi

ఉద్దానం ప్రాంతంలోని పెద్దశ్రీరాంపురం గ్రామం , కనీస వసతులు లేక రేకులషెడ్డులో పడుకున్న కిడ్నీ బాధితురాలు

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పచ్చదనానికి మారుపేరైన శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ఏ పల్లెలో ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. నిన్నటి దాకా పది మందికి అన్నం పెట్టిన రైతన్నలు నేడు ఆర్థిక సాయం కోసం చేతులు చాపాల్సిన దుస్థితి దాపురించింది. మూత్రపిండాల(కిడ్నీ) జబ్బులతో వేలాది కుటుంబాలు చితికిపోయాయి. ఈ దెబ్బకు ఉన్న ఆస్తులు, పొలాలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. పుండుపై కారం చల్లినట్టు తిత్లీ తుపాన్‌ బాధిత కుటుంబాలను మరింత కుంగదీసింది. ఉద్దానంలోని సోంపేట, కవిటి, కంచిలి, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో కిడ్నీ రోగుల దుస్థితిని ‘సాక్షి’ ప్రత్యక్షంగా పరిశీలించింది. గుండె తరుక్కుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. 

ఉద్దానం ప్రాంతంలో 40–45 ఏళ్ల వయసుకే వేలాది మంది మూత్రపిండాల జబ్బుల బారిన పడ్డారు. ఎప్పటికప్పుడు రక్తశుద్ధి(డయాలసిస్‌) చేయించుకుంటే తప్ప వారు బతికి బట్టకట్టలేని పరిస్థితి. ఉద్దానంలో 7 మండలాలు ఉండగా, సోంపేట, పలాసలో మాత్రమే డయాలసిస్‌ కేంద్రాలున్నాయి. చాలామంది బాధితులు వారానికి రెండుసార్లు, కొందరు మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాల్సి వస్తోంది. సోంపేటలో రోజుకు 70 మందికి, పలాసలో 40 మందికి మాత్రమే డయాలసిస్‌ చేస్తున్నారు. ఈ రెండు కేంద్రాల్లో చాలామంది బాధితులు వెయిటింగ్‌లో ఉన్నారు. లేదంటే విశాఖపట్నం, శ్రీకాకుళం వెళ్లాలి. డయాలసిస్‌ కేంద్రాలకు వెళ్లాలంటే సహాయకుడితో కలిపి రూ.2,000 ఖర్చవుతున్నాయని బాధితులు వాపోతున్నారు. కిడ్నీ వ్యాధుల వల్ల ఉద్దానంలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. తిత్లీ తుపాన్‌ పల్ల పంటలు, తోటలన్నీ నాశనమయ్యాయని, రూపాయి కూడా ఆదాయం లేదని, ఇక డయాలసిస్‌ ఎలా చేయించుకోవాలని కిడ్నీ బాధితులు బోరున విలపిస్తున్నారు. ఉద్దానంలో ఏ కిడ్నీ బాధితుడిని కదిలించినా ఒకటే ఆవేదన. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పెన్షన్‌ సరిపోవడం లేదని, తక్షణమే పెంచాలని కోరుతున్నారు. డయాలసిస్‌ కేంద్రాలకు వెళ్లడానికి బస్‌ పాసులు ఇవ్వాలని వేడుకుంటున్నారు. తిత్లీ తుపాన్‌ వల్ల దారుణంగా నష్టపోయామని, తమకు ప్రత్యేకంగా నష్ట పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఒకరు మృతి చెందితేనే మరొకరికి డయాలసిస్‌ 
ఉద్దానంలోని సోంపేట, పలాసతోపాటు టెక్కలి, శ్రీకాకుళంలో మాత్రమే డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో 10 నుంచి 13 రక్తశుద్ధి యంత్రాలు పనిచేస్తున్నాయి. ఉద్దానంలోని బాధితులంతా సోంపేట, పలాసకే వస్తారు. ఇక్కడ డయాలసిస్‌ చేయించుకుంటున్న బాధితులెవరైనా మృతి చెందితేగానీ మరొకరికి అవకాశం రాదు. ఒక యంత్రం రోజుకు ఒక్కొక్కరికి 4 గంటల చొప్పున మూడు షిఫ్ట్‌లు మాత్రమే రక్తశుద్ధి చేయగలదు. గడిచిన ఏడాదిన్నరలో సోంపేట డయాలసిస్‌ కేంద్రం పరిధిలో 43 మంది, పలాస కేంద్రం పరిధిలో 15 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. శ్రీకాకుళం, టెక్కలి కేంద్రాలను కూడా కలుపుకుంటే 100 మందికి పైగా మృతి చెందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. డయాలసిస్‌ చేయడంలో జాప్యం జరిగితే కాళ్లు, చేతులు వాపు వస్తాయి. తీవ్ర ఆయాసం వస్తుంది. రక్తపోటు తీవ్రంగా పెరుగుతుంది. దానివల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా జాప్యం జరగడం వల్ల చాలామంది బాధితులు మృతి చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని డయాలసిస్‌ కేంద్రాల్లో కనీస వసతులు కూడా లేకపోవడంతో బాధితులు నానా కష్టాలు పడుతున్నారు. 

పెన్షన్‌ డబ్బులు చాలడం లేదు 
‘‘నాది ఇచ్ఛాపురం దగ్గర కేఎస్‌ పురం. డయాలసిస్‌ కేంద్రానికి రావాలంటే 35 కిలోమీటర్లు. వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చెయ్యాలి. వచ్చిన ప్రతిసారీ రూ.1,000 ఖర్చవుతోంది. ఇక్కడ ఇచ్చే మందులు చాలవు. మందులకే రూ.5,000 అవుతోంది. ప్రభుత్వం ఇచ్చే రూ.2,500 పెన్షను ఒక్క వారానికి కూడా సరిపోవడం లేదు’’ 
– లోకనాథం, కిడ్నీ బాధితుడు, కేఎస్‌ పురం 

మాకే ఎందుకు ఈ శాపం 
‘‘మాకు ఇద్దరు పిల్లలు. నా భర్తకు కిడ్నీ జబ్బు వచ్చింది. మంచానికే పరిమితమయ్యాడు. చికిత్స కోసం డబ్బుల్లేక కొంత పొలం అమ్ముకున్నాం. వారానికి రెండుసార్లు డయాలసిస్‌ కేంద్రానికి వస్తున్నాం. మాకే దేవుడు ఎందుకు ఈ శాపం పెట్టాడో. సర్కారు సాయం చాలడం లేదు.  భర్తకు కిడ్నీ జబ్బు రావడంతో మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది’’ 
– శోభ, కిడ్నీ బాధితుడు బాలం భార్య, బెజ్జపుట్టుగ గ్రామం 

మందులు మింగకపోతే చనిపోతా..
‘‘నేను ఆత్మహత్య చేసుకోనక్కరలేదు. మూడు రోజులు మందులు మింగకపోతే చనిపోతా. కిడ్నీ జబ్బు వచ్చాక నా భార్య కిడ్నీ ఇచ్చింది. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారికి మందులు ఉచితంగా ఇవ్వరట. ఎకరా భూమిలో కొబ్బరి చెట్లన్నీ తిత్లీ తుపాన్‌ ధాటికి నేలకొరిగాయి. మందులు ఏ రోజైతే ఆపేస్తానో అవే నాకు చివరి రోజులు’’ 
– లమ్మత శేషగిరి, అతని భార్య సుజాత, పెద్ద శ్రీరాంపురం

చనిపోతే మేలేమో అనిపిస్తోంది 
‘‘నా భార్య రెండేళ్లుగా డయాలసిస్‌ చేయించుకుంటోంది. ఇంట్లో వృద్ధురాలు మా అమ్మ, మా అత్త ఉన్నారు. అనారోగ్యం వల్ల నా భార్య ఏ పనీ చేయలేదు. ఈ ముగ్గురికీ నేనే వండిపెట్టాలి. నా భార్యకు చికిత్స చేయించాలంటే చేతిలో డబ్బుల్లేవు. సర్కారు ఇచ్చే సాయం  సరిపోవడం లేదు. ఈ బాధ పడే కంటే చనిపోతే మేలేమో అనిపిస్తోంది’’ 
– కిడ్నీ జబ్బు బాధితురాలు నాగమణి భర్త పురుషోత్తం, పలాస టౌన్‌ 

పెన్షన్‌ పెంచాలని ప్రతిపాదించాం.. 
‘‘కవిటి మండల కేంద్రంలో మరో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. కిడ్నీ బాధితులకు పెన్షన్‌ రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. ఉద్దానం కిడ్నీ బాధితులకు మందుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని లేఖ రాశాం. బస్సు పాసులు ఇవ్వాలని కూడా ప్రతిపాదన పంపిస్తాం’’ 
– ధనుంజయరెడ్డి, కలెక్టర్, శ్రీకాకుళం జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement