తేడాచేస్తే ఉద్యోగాలు పోతాయ్‌! | Collector K.Dhananjaya Reddy special interview | Sakshi
Sakshi News home page

తేడాచేస్తే ఉద్యోగాలు పోతాయ్‌!

Published Sun, Feb 18 2018 10:06 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Collector K.Dhananjaya Reddy special interview - Sakshi

ఓటుహక్కు ప్రజాస్వామ్యానికే కాదు పౌరులకూ ఊపిరి! ఇది పోతే ఊపిరి ఆగినంతగా భావిస్తారు! అలాంటిది జిల్లాలో లక్ష ఓట్లు ఒకేసారి తొలగించేసరికి అర్హుల్లో అలజడి మొదలైంది! వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సహా విపక్షాలన్నీ గొంతెత్తాయి. దీనిపై జిల్లా కలెక్టరు    కె.ధనంజయరెడ్డి సానుకూలంగా స్పందించారు. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎలక్షన్‌ కమిషన్‌ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోతే ఉద్యోగాలు పోతాయ్‌ అని హెచ్చరించారు. ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వూ్యలో జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆయన వివరించారు.

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లావ్యాప్తంగా లక్షకు పైగా ఓట్లను తొలగించారు. వారిలో చాలామంది అర్హులవీ రాజకీయ కారణాలతో గల్లంతు చేసేశారని విపక్షాల నుంచి వస్తున్న విమర్శలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టరు: ఈ సమస్యపై వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీల నాయకులు నన్ను కలిశారు. ఈ ఫిర్యాదుల పరిశీలన బాధ్యత ఆర్డీవోకి  అప్పగించాం. వలస వెళ్లినవారి, వయస్సు తక్కువగా ఉన్నవారి పేర్లు ఉన్నాయా? మరణించినవారి ఓట్లను తొలగించలేదా? రెండు చోట్ల ఓట్లు నమోదై ఉన్నాయా? అనే కోణంలో పరిశీలించి వాటిని తొలగించే క్రమంలో పొరపాట్లు జరిగి ఉండొచ్చు. రాజకీయ కారణాలతో ఎవ్వరైనా సిబ్బంది ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్‌ కమిషన్‌ పర్యవేక్షణలో జరిగే ఈ ఓట్ల ప్రక్రియకు సంబంధించి ఎవ్వరైనా అలక్ష్యం వహించడానికి వీల్లేదు.  

సాక్షి: ఒక్క శ్రీకాకుళం నగరంలోనే 28 వేలు, పలాసలో 20 వేల మంది ఓట్లు తీసేశారు. వాటిలో అర్హులవీ ఎలా తప్పించారో వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు కదా?
కలెక్టరు: శ్రీకాకుళం నగరంలో జనాభాతో పోల్చితే ఓటర్ల శాతం సాధారణం (65–70 శాతం) కన్నా ఎక్కువగా (80 శాతం) ఉంది. ఈసారి ఎలక్షన్‌ కమిషన్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఆఫ్‌ ఎలెక్టో రోల్స్‌ (ఐఆర్‌ఈఆర్‌) పట్టణాల్లో ప్రత్యేక పరిశీలన కార్యక్రమం నిర్వహించింది. శ్రీకాకుళంలో పోలింగ్‌ స్టేషన్లు శాస్త్రీయంగా లేవు. దీంతో ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ పరిధి ప్రాంతానికి సరిహద్దులిచ్చి నగరీలక్ష్య పేరుతో మ్యాప్‌ను తయారుచేశారు. ఈ ప్రకారం సామీప్య పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలోకి ఓటర్లను మార్పులు చేర్పులు చేశారు. దీంతో సుమారు 32 వేల ఓట్లు ఒక పోలింగ్‌ స్టేషన్‌ పరిధి నుంచి మరో పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలోకి మారిపోయాయి. తొలగించిన 27 వేల ఓట్లలో అర్హులు ఎవ్వరున్నా వారి ఓటుహక్కు కోల్పోకుండా చూసే బాధ్యత మాది. ఫిర్యాదులొచ్చిన ఏరియాలో సిబ్బందిని ఇంటింటికీ పంపిస్తున్నాం. అక్కడే అర్హుల వివరాలతో ఫారం–6 పూర్తిచేయిస్తారు.

సాక్షి: సిబ్బందిలో కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి ఓటర్ల నమోదు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి?
కలెక్టరు: ఎలక్షన్‌ కమిషన్‌ నియమనిబంధనలను లోబడి పనిచేయకుంటే వీఆర్‌వో నుంచి డీఎల్‌వో వరకూ ఏ స్థాయిలో ఉద్యోగులైనా తేడా చేస్తే ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఫారం–6 వివరాలు మరోసారి చెక్‌ చేయిస్తాం. అవసరమైతే క్రాస్‌చెక్‌ కూడా చేయిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పిస్తాం. ఏప్రిల్‌ నెల నుంచి ఈఆర్వో నెట్‌ పేరుతో కొత్త సాఫ్ట్‌వేర్‌ వస్తోంది. డబుల్‌ ఎంట్రీ ఓట్లను గుర్తించి ఓటరు ఎక్కడైతే తన ఓటు ఉండాలని కోరుకుంటారో అక్కడే ఓటు ఉంచి రెండోది తొలగిస్తాం.

సాక్షి: ప్రస్తుతం జిల్లాలో ఏ ఏటీఎం చూసినా నగదు ఉండట్లేదు. రెండు నెలలుగా తీవ్రతరమైన ఈ సమస్యకు పరిష్కార చర్యలేమైనా ఉన్నాయా?
కలెక్టరు: నగదుకొరత జిల్లాలో ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. బ్యాంకులకు క్యాష్‌ వచ్చినా విశాఖ నగరంలోనే ఎక్కువగా సర్దేస్తున్నారు. వచ్చే నెలలో ఆ సమస్య తలెత్తకుండా జిల్లాకు నిష్పత్తి ప్రకారం నగదు ఇవ్వాలని ఆర్‌బీఐకి కోరాం. ఈనెలాఖరులోగా పింఛన్లు, వేతనదారులకు సరిపడా నగదు సిద్ధం చేసుకోవాలని బ్యాంకర్లకు సూచించాం.  

సాక్షి: జిల్లాలో సాగునీరు సమస్య తీర్చడంలో జలసిరి పథకం ఎంతవరకూ ఉపయోగపడుతుంది?
కలెక్టరు: ఈ పథకం కింద ఒక్కో బోర్‌వెల్‌కు ఈపీడీసీఎల్‌ రూ.3 లక్షల వరకూ ఖర్చు చేస్తోంది. బోరుబావి తవ్వకం, సబ్‌మెర్సిబుల్‌ పంప్, సోలారు విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మొత్తం రూ.3 లక్షల ఖర్చు అవుతుంది. దీనిలో జనరల్, బీసీ కేటగిరి రైతులు రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ రైతులు రూ.6 వేలు మాత్రమే భరిస్తే సరిపోతుంది. సన్న, చిన్నకారు రైతులకు ఉపయోగపడేలా ఒకేచోట రెండున్నర ఎకరాలలోపు భూమి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జిల్లాలో ఎక్కువ చిన్న కమతాలే ఉన్న దృష్ట్యా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ షరతును కాస్త సడలించేలా కృషి చేశాను. మూడు ఎకరాలలోపు అదీ ఒకేచోట గాకుండా వేర్వేరు చోట్ల ఉన్నా రైతులకు లబ్ధి కలుగుతుంది. జిల్లాలో 9 వేల బోర్‌వెల్స్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. మార్చి నెలాఖరులోగా 3 వేలు క్లియర్‌ చేస్తాం.

సాక్షి: వంశధార ప్రాజెక్టు స్టేజ్‌–2 ఫేజ్‌–2 పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తయ్యే అవకాశం కనిపించట్లేదు?
కలెక్టరు: 87 ప్యాకేజీ పనులు ఆలస్యమైనా ఇప్పుడు అవీ వేగవంతమయ్యాయి. మిగిలిన వంతెనలు తదితర 25 నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేయాలని గడువు నిర్దేశించాం. ఒకవేళ ఆలస్యమైనా మే, జూన్‌ నెలల్లో తొలకరి వర్షాలతో వంశధార నదిలో నీరు వచ్చే సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. 88 ప్యాకేజీలో కొత్తూరు–సీతంపేట రోడ్డులో ఒక్కచోట కటింగ్‌కు సంబంధించిన కోర్టు కేసు కూడా త్వరలోనే క్లియర్‌ అయిపోయే అవకాశం ఉంది. హిరమండలం జలాశయానికి సంబంధించిని మూడు పెండింగ్‌ పనుల్లో గార్లపాడు, తులగాం వద్ద దాదాపుగా పూర్తికావచ్చాయి. స్పిల్‌వే, హెడ్‌రెగ్యులేటర్‌ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదేమైనా జూన్‌ నాటికి జలాశయంలో 8 టీఎంసీల నీరు నింపడానికి కృషి చేస్తున్నాం. నిబంధనల ప్రకారం కొత్త డ్యామ్‌లో తొలి సంవత్సరం 40 శాతం (8 టీఎంసీలు), రెండో సంవత్సరం 80 శాతం (16 టీఎంసీలు), మూడో సంవత్సరానికి శత శాతం (19 టీఎంసీలు) నింపాలి.

సాక్షి: నేరడిబ్యారేజీ నిర్మాణం పూర్తిగాకుండా 19 టీఎంసీలు జలాశయానికి తీసుకురావడం సాధ్యమేనా?
కలెక్టరు: నేరడి బ్యారేజీకి సంబంధించి దాదాపు రూ.460 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించడానికి డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) సిద్ధమైంది. కానీ వంశధార ట్రిబ్యునల్‌ తీర్పుపై ఒడిశా ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏమైనా తీర్పు మనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది.

సాక్షి: కానీ వంశధార నిర్వాసితుల సమస్యల పరిష్కారం ఇంకా కొలిక్కిరాలేదు?
కలెక్టరు: నిర్వాసితుల కాలనీల్లో తాగునీరు, రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కల్పన ఇప్పటికే పూర్తి చేశాం. సామాజిక భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాల నిర్మాణపనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన మెట్టూరు బిట్‌–2, 3ల్లోని లోతట్టు ప్రాంతం పూడ్చివేత పనులకూ ఆమోదం తెలిపాం. పరిహారం విషయానికొస్తే యూత్‌ ప్యాకేజీ అందని కుటుంబాలకు హౌసింగ్‌ స్కీమ్‌ కింద ఇప్పటికే 1300 వరకూ ఇళ్లు మంజూరుచేశాం. వారం పది రోజుల్లో మరో ఏడొందల వరకూ మంజూరు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద జాబ్‌కార్డులు ఇచ్చాం. ఒకవేళ పనిప్రాంతాలు దూరంగా ఉంటే రవాణా సౌకర్యం కల్పిస్తాం.

సాక్షి: నిర్వాసితుల కాలనీలున్న చోట్ల ప్రత్యేక గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఓటుహక్కు కల్పన విషయాల్లో నెలకొన్న గందరగోళాన్ని ఎలా చక్కదిద్దుతారు?
కలెక్టరు: నిర్వాసిత కాలనీలున్న గ్రామ పంచాయతీల్లో విలీనం చేసేందుకు డీనోటిఫై చేశాం. ఇక ఓట్ల విషయానికొస్తే డిసెంబరులో డ్రాఫ్ట్‌ ప్రచురించే సమయానికి ఆయా గ్రామాల్లో ఉన్నట్లే ఓట్లు ఉంటాయి. అయితే కొత్త గ్రామపంచాయతీ పరిధిలోకి ఓట్లను తీసుకొచ్చే విషయాన్ని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాం. అందరికీ ఓటుహక్కు కల్పిస్తాం.

సాక్షి: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యం సాధించడానికి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి కదా?
కలెక్టరు: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అక్టోబరులోగా శతశాతం పూర్తి చేయాలనేది మా లక్ష్యం. కానీ దీన్ని మార్చి నెలకు కుదించేసరికి ఒత్తిడి పెంచక తప్పలేదు. వారం రోజులు పింఛన్లు ఆపినా తర్వాత ఇచ్చేశారు. ఈసారి ప్రజలను గాకుండా గ్రామ సర్పంచులను బాధ్యులను చేస్తున్నాం. నిర్లక్ష్యం వహిస్తే చెక్‌ పవర్‌ రద్దు చేస్తామని, నిధులు నిలిపేస్తామని కూడా హెచ్చరించాల్సి వస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement