నమస్తే..! నేను భారతి..
నమస్తే..! నేను భారతి..
Published Sat, Oct 15 2016 4:16 PM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
మెతుకుసీమ మెరిసేలా పాలన
ఇక్కడికి రావడం సొంతింటికి వచ్చినట్టే ఉంది
అవకాశం వచ్చింది.. అద్భుతం చేద్దాం
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం
త్వరలో ‘ఈ ఆఫీస్’లు
‘కాకతీయ’, భగీరథపై ప్రత్యేక దృష్టి
కబ్జాలకు పాల్పడితే చర్యలు
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కలెక్టర్ భారతి హోళికేరి
సాక్షి, మెదక్ : ‘సమ్మిళిత అభివృద్ధి, సమర్థమైన పాలనతో మెదక్‌ను రాష్ట్రంలోనే నంబర్‌వన్ జిల్లాగా తీర్చిదిద్దుతా. ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా చూస్తాను. జిల్లాకు పరిశ్రమలు, విద్యాసంస్థలు మరిన్ని రావాలి. ఆ దిశగా ప్రణాళికా బద్దంగా ప్రయత్నిస్తాను. సమస్యల సత్వరం పరిష్కారానికి ‘ఈ ఆఫీస్’లు రాబోతున్నాయి.. వ్యవసాయం, వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. జిల్లాను బహిరంగ మల విసర్జన లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. అలాగే భవిష్యతరాలకు మేలు జరిగేలా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తా. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలను సమన్వయం చేసుకుంటూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా’..నని జిల్లా కలెక్టర్ భారతి హోళి కేరి అన్నారు. గురువారం ఆమె ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా అభివృద్ధి, సంక్షేమం తదితర అంశాలపై తన అభి ప్రాయాలు, పాలనా విధానాలను వెల్లడించారు.
ప్రశ్న: మెదక్ జిల్లాకు కలెక్టర్‌గా రావటంపై మీ అభిప్రాయం?
కలెక్టర్: చాలా ఆనందంగా ఉంది. నా ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది.. సబ్‌కలెక్టర్‌గా పనిచేశా. కొత్తగా ఏర్పాౖటెన మెదక్ జిల్లాకు కలెక్టర్‌గా రావటం సంతోషంగా ఉంది. అంతకుమించి సొంతింటికి వచ్చినట్లు ఉంది.
ప్రశ్న: కలెక్టర్‌గా మీ ప్రాధాన్యతలు ఏమిటీ?
కలెక్టర్: ప్రభుత్వ ప్రాధాన్యతలు. సంక్షేమ పథకాలు, ఆసరా, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అమలుపై ప్రత్యేక దృష్టి పెడతాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటాను.
ప్రశ్న: జిల్లాను ఎలా అభివృద్ధి చేస్తారు. ప్రణాళికలు ఉన్నాయా?
కలెక్టర్: జిల్లాలో పుష్కలమైన వనరులున్నాయి. వాటన్నింటిని వినియోగించుకుని జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తాం. అలాగే జిల్లాలోని పరిస్థితులపై సమగ్రంగా అధ్యనం చేస్తాం. ఒకే ప్రాంతానికి అభివృద్ధి పరిమితం కాకుండా సమ్మిళిత అభివృద్ధి దిశగా సాగుతాం. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలను రూపొందించి ముందుకు సాగుతాం.
ప్రశ్న: మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత ఉంది కదా, ఎలా అధిగమిస్తారు?
కలెక్టర్: అక్కడక్కడా కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే. అయితే సమస్యల నుంచి పారిపోయేది లేదు. జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం. సమస్యలను అధిగమించి ప్రజలకు మెరుగైన పాలనను అందజేస్తాం.
ప్రశ్న: ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బంది పనితీరు ఎలా ఉండబోతుంది?
కలెక్టర్: ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించేందుకు వీలుగా ‘ఈ ఆఫీస్’ కార్యాలాయలు ఏర్పాటు చేస్తాం. ఇది వరకే అన్నిశాఖల ఫైళ్లు స్కాం చేయటం జరిగింది. దీంతో ‘ఈ ఆఫీస్’ ఏర్పాటు సులభతరం అవుతుంది. ఈ ఆఫీస్‌తో ప్రజా సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి. కొత్త జిల్లా అయినందున అధికారులు, ఉద్యోగులు కష్టపడి పనిచేయాలి.
ప్రశ్న: వ్యవసాయ రంగం అభివృద్ధికి మీరు తీసుకోబోయే చర్యలు..?
కలెక్టర్: జిల్లాలో ప్రధానమైనది వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తాం. రైతులకు మేలు జరిగే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, వనరులను, వ్యవసాయమార్కెట్లను అభివృద్ధి చేస్తాం.
ప్రశ్న: పరిశ్రమలు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు ఆశించిన స్థాయిలో లేవన్న అసంతృత్తి ప్రజల్లో ఉంది?
కలెక్టర్: జిల్లాలో పరిశ్రమలు మొత్తంగా లేవు అనటం సబబు కాదు. జిల్లాలో పరిశ్రమలున్నాయి. అయితే వాటి సంఖ్య మరింత పెరగాల్సి ఉంది. జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం, భూములు అందుబాటులో ఉన్న విషయాన్ని పారిశ్రామికవేత్తలకు వివరించి పరిశ్రమలను తీసుకువస్తాం.
ప్రశ్న: మహిళా, శిశు సంక్షేమానికి చేపట్టబోయే పనుల తీరు వివరిస్తారా..?
కలెక్టర్: జిల్లాలో మహిళా శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతా. జిల్లాలో భ్రూణహత్యలు, ఇతర సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటాం. బాలికల డ్రాపౌట్స్ తగ్గించేలా చూస్తాం. మహిళా సంక్షేమ పథకాలు వందశాతం అమలయ్యేలా చూస్తాం.
ప్రశ్న: ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ఏం చేయబోతున్నారు..?
కలెక్టర్: జిల్లాలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా చెరువులు, కుంటలు కబ్జా కాకుండా చూస్తాం. గతంలో మెదక్ పట్టణ సమీపంలోని మల్లం చెరువు ఆక్రమణకు గురయ్యాయి. అయితే వాటిని గుర్తించి తొలగించాం. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, స్థలాల కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
Advertisement
Advertisement