కుటుంబాన్ని సజావుగా నడిపించాలంటే.. ఆ ఇంట్లోని ప్రతి ఒక్కరూ యజమానికి సంపూర్ణంగా చేయూతనివ్వాలి. అప్పుడే ఎటువంటి ఒడిదొడుకులూ లేకుండా వారి జీవన పయనం హాయిగా సాగుతుంది. ఐదుగురు సభ్యులున్న కుటుంబానికే ఇంతటి సహాయం అవసరమైతే.. ఏకంగా 50 లక్షలు పైగా జనాభా ఉన్న ఒక జిల్లాను నడిపించే సారథికి ఇంకెంత సహకారం అవసరం? అటువంటి సహకారాన్నే కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ కాంక్షిస్తున్నారు. ‘ప్రతి ఉద్యోగీ చెప్పిన పనిని చెప్పినట్టుగా బాధ్యతగా చేస్తేనే విధానపరమైన నిర్ణయాలను సజావుగా అమలు చేయవచ్చని.. అప్పుడే సమగ్రాభివృద్ధి సాకారమవుతుందని ఆయనన్నారు. ఒకప్పుడు జిల్లాలో ఒక శాఖ బాధ్యతలు పర్యవేక్షించిన ఆయన.. ప్రస్తుతం జిల్లా అంతటినీ టీమ్ లీడర్‌గా నడిపిస్తున్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన బంగ్లాలో ‘సాక్షి’ జరిపిన ముఖాముఖిలో పలు అంశాలు ముచ్చటించారు.
సాక్షి : కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి 40 రోజులైంది. ఈ బాధ్యతల్లో మీరు కంఫర్ట్‌గా ఫీలవుతున్నారా?
కలెక్టర్ : ఆ విషయం మీరే చెప్పాలి. ఎందుకంటే జనం ఏమనుకుంటున్నారో మాకంటే మీకే ఎక్కువగా తెలుస్తుంది.
సాక్షి : జిల్లాలో ఇన్ని రోజుల్లో మీరు గమనించి,
చేయాలనుకున్న మార్పులు, చర్యలు, లక్ష్యాలు చెబుతారా?
కలెక్టర్ : స్థానిక పరిస్థితుల కారణంగా ఏజెన్సీలో వైద్య సేవలు గిరిజనుల దరిచేరడం లేదు. అధికారులతో టీములు ఏర్పాటు చేసి వారిచ్చిన నివేదిక ఆధారంగా ఆశ, ఏఎన్‌ఎంలకు సేవలపై శిక్షణ ఇవ్వదలిచాం. ఎన్ని సేవలందిస్తున్నామో కూడా తెలియని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇందుకు వైద్య రంగంలో ఉన్న ఎన్‌జీఓల సహకారం కూడా తీసుకుంటాం. లోతట్టు ప్రాంతంలో ప్రభుత్వ వైద్య సేవలందకున్నా మైదాన ప్రాంతం మాదిరిగా ప్రైవేటు వైద్యం కూడా అందడంలేదు. ఈ కారణంగానే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
సాక్షి : మైదాన ప్రాంతంలో ప్రభుత్వ వైద్యం సక్రమంగా
అందుతోందంటారా?
కలెక్టర్ : అలాగని చెప్పలేం. అక్కడ కూడా అవగాహనా
రాహిత్యం కనిపిస్తోంది. పీహెచ్‌సీల్లో చేసే వైద్యానికి కూడా కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చేస్తున్నారంటే అక్కడ అందుతున్న సేవల గురించి స్థానికులకు తెలియడంలేదనే కదా! వాటిపై దృష్టి పెట్టి జీజీహెచ్‌పై ఒత్తిడి తగ్గించాలనుకుంటున్నాం. అలాగే గ్రామాల్లో మాతా, శిశు మరణాల రేటు కూడా తగ్గించాలనేది లక్ష్యం.
సాక్షి : అధికారులంతా మీకు పూర్తిగా సహకరిస్తున్నారా? బాధ్యతల నిర్వహణలో ఒత్తిడికి గురవుతున్నారా?
కలెక్టర్ : ఎవరి పని వారు బాధ్యతగా చేస్తే నేను చాలా ఫ్రీగా ఉంటా. చాలామంది అధికారులు అలానే పని చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం చెబుతున్న పనులు కాకుండా పక్కచూపులు చూస్తున్నారు. వారికింద పని చేస్తున్నవారు కూడా అలానే ఉంటున్నారు. చెప్పేదొకటి, చేసేదొకటి అన్నట్టుగా అనుకున్న పనులు అనుకున్నట్టు జరగడం లేదు. దీనివల్ల విధానపరమైన నిర్ణయాల అమలు సజావుగా సాగదని నా అభిప్రాయం.
సాక్షి : పని చేయని అధికారులు ఎంత శాతం ఉంటారు?
కలెక్టర్ : ఎందుకులెండి! నాకంటే మీకే ఎక్కువగా తెలుసనుకుంటా!
సాక్షి : జిల్లాలో స్వచ్ఛభారత్‌తో పారిశుధ్యం మెరుగుపడుతుందని అనుకుంటున్నారా?
కలెక్టర్ : 100 రోజుల్లో లక్షా 26 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలనేది లక్ష్యం. ఇందులో గోదావరి పరీవాహక ప్రాంతంలో 235 గ్రామాలను స్వచ్ఛంగా చేయాలనే సంకల్పం మా ముందుంది. ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్‌తో ఈ లక్ష్యాన్ని సాధిస్తాం.
సాక్షి : పుష్కరాల పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదనే అభిప్రాయం ఉంది.
కలెక్టర్ : నిజమే. టెండర్లు దాదాపు పూర్తి కావచ్చాయి. పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. నెల రోజుల్లో అన్ని పనులూ ప్రారంభమవుతాయి.
సాక్షి : 13వ ఆర్థిక సంఘం నిధులను పుష్కరాల పనులకు మళ్లిస్తున్నారట. జీఓ కూడా వచ్చిందంటున్నారు.
కలెక్టర్ : ఆ నిధులు స్థానిక సంస్థల పరిధిలోని పనులకు మాత్రమే. చేపట్టే పనులకు నిధుల కొరత అనేదే లేదు.
సాక్షి : పుష్కరాల పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు?
కలెక్టర్ : మే నెలాఖరుకల్లా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాం. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేయాల్సిన ఘాట్లు, అనుసంధానంగా నిర్మించే రోడ్లు, ఇతర పనులు నిర్ణీత సమయానికి ముందే పూర్తవుతాయి. పుష్కరాలను బేస్ చేసుకుని చేపట్టే అభివృద్ధి పనులు కొంత ఆలస్యం కావచ్చు. ఆ పనులకు, ఈ పనులకు ఎటువంటి సంబంధమూ లేదు.
సాక్షి : స్థలం లేదన్న కారణంతో ప్రతిష్టాత్మక పెట్రో యూనివర్సిటీ వెనక్కు పోయినట్టేనంటారా!
కలెక్టర్ : అటువంటిదేమీ లేదు. జిల్లాలోనే ఏర్పాటవుతుందనే నమ్మకం ఉంది.
సాక్షి : కాకినాడ, మండపేట తదితర ప్రాంతాల్లో వందల ఎకరాలుండగా.. ద్వారపూడి వద్ద గోతులున్న భూములనే కమిటీకి చూపించారు. అలా చేయకుండా ఉంటే బాగుండేది కదా.
కలెక్టర్ : కరెక్టే! ఎందుకలా జరిగిందో కానీ ప్రస్తుతం కాకినాడ వాకలపూడితో పాటు ద్వారపూడిలోనే ఖాళీ భూములను గుర్తించాం.
సాక్షి : స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు ఎంతవరకూ వచ్చాయి?
కలెక్టర్ : స్మార్ట్ విలేజెస్ అంటే అక్కడేదో పెద్ద ఎత్తున డబ్బు కుమ్మరించాల్సి వస్తుందనే భావన అంతటా నెలకొంది. ఇన్వెస్ట్‌మెంట్‌కంటే ఉన్న వ్యవస్థలను ప్రజా అంచనాల మేరకు పటిష్టం చేయాలనేది స్మార్ట్ విలేజెస్‌కు నిర్దేశించిన 20 సూత్రాల్లో ఉంది. నేను దత్తత తీసుకున్న దానవాయిపేట గ్రామంలో పరిస్థితులను తెలుసుకుంటున్నాను.
సాక్షి : ఆదర్శ నియోజకవర్గం అన్నారు. అది ఎంతవరకూ వచ్చింది?
కలెక్టర్ : ఎమ్మెల్యేలతో మాట్లాడాలి. వారు ఆసక్తిగా ముందుకు రావాలి. అప్పుడే దీనిపై దృష్టి పెడతాం.
సాక్షి : కలెక్టరేట్‌లో, మండలాల్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నా సమస్యలు పరిష్కారం కావడంలేదు. కారణమేమిటంటారు?
కలెక్టర్ : మండల స్థాయి గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే సమస్యలకు అక్కడ పరిష్కారం లభించినప్పుడు కాకినాడ వరకూ రావాల్సిన అవసరం ఉండదు. కానీ అలా జరగడం లేదు. క్షేత్రస్థాయిలోనే పరిష్కారం లభించేలా కార్యాచరణ రూపొందించి, పర్యవేక్షించే బాధ్యతలను జాయింట్ కలెక్టర్‌కు అప్పగించాం.
బాధ్యతగా పని చేస్తేనే..సమగ్రాభివృద్ధి
Published Wed, Mar 4 2015 1:13 AM | Last Updated on Thu, Mar 21 2019 8:24 PM
Advertisement
Advertisement