Employment works
-
‘ఉపాధి’ పనుల కోసం కూటమి నేతల సిగపట్లు
మేడిపల్లి కోటిరెడ్డి, సాక్షి ప్రతినిధి సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కేటగిరి నిధులతో చేపట్టే సిమెంట్ (సీసీ)రోడ్లు, సిమెంట్ మురుగు కాల్వల(సీసీ డ్రెయిన్లు)తో పాటు మట్టి, తారు రోడ్ల పనుల కోసం కూటమి నేతలు సిగపట్లు పట్టుకుంటున్నారు. ఏ పనులు ఏ పార్టీ నేతలకు చేపట్టాలి అనే విషయంలో ఆధిపత్య పోరాటం కొనసాగుతోంది. దీంతో 20 రోజులుగా ఎటూ తేలక అనుమతుల కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. జిల్లాల్లో అందుబాటులో ఉన్న నిధులు పదుల కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే.. గ్రామాల నుంచి అందిన ప్రతిపాదనలు వందల కోట్ల రూపాయల మేర ఉండటంతో ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో పనుల మంజూరులో మూడు పారీ్టల నాయకులను ఎలా సంతృప్తి పరచాలో తెలియక ఎమ్మెల్యేలు పనుల జాబితాలను ఆమోదం కోసం పంపకుండా కాలయాపన చేస్తున్నారు. ఇక బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలున్న చోట కూడా పనులన్నీ తమకే కావాలంటూ టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఉపాధి పథకంలో కాంట్రాక్టర్లే ఉండరు సాధారణంగా ఉపాధి హామీ నిధులతో చేపట్టే పనులకు, ఇతర అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియకు తేడా ఉంటుంది. కేంద్రం నిబంధన ప్రకారం.. ‘ఉపాధి’ నిధులతో మంజూరు చేస్తే, రోడ్ల పనులైనా కాంట్రాక్టర్ల వ్యవస్థ ఉండదు. సర్పంచ్ల ఆధ్వర్యంలో పంచాయతీ ద్వారా నిధులు చెల్లిస్తూ ఆయా పనులు చేపట్టాల్సి ఉంటుంది. దీనికి తోడు జిల్లా ప్రాతిపదికన ఆర్థిక సంవత్సరంలో ఆయా జిల్లాల్లో కూలీల ద్వారా జరిగిన ఉపాధి పనుల ఆధారంగా 60–40 నిష్పత్తిన మెటీరియల్ కేటగిరి నిధులను లెక్కగట్టి, ఆ మేరకే మెటీరియల్ నిధులతో పనులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కూలీలతో సంబంధం ఉండని రోడ్ల పనులను సాధారణంగా మెటీరియల్ కేటగిరి« నిధుల నుంచి చేపడతారు. ఈ నిబంధనల మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం రూ. 4,500 కోట్ల మేర ఉపాధి మెటీరియల్ నిధులు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఖర్చు పెట్టిన నిధులు పోను, ఇంకా రూ. 1,980 కోట్లు అందుబాటులో ఉంటాయన్న అంచనాతో కొత్తగా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, మట్టి రోడ్ల పనులను గ్రామాల్లో కూటమి నాయకులకు నామినేషన్ పద్ధతిన మంజూరు చేసే కార్యక్రమం చేపట్టారు. ఇందుకోసం గత నెల 23న రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించారు.గ్రామసభ ఆమోదం జాబితాలు ఎమ్మెల్యేల చేతికి.. గ్రామసభలో ఆమోదం పొందిన పనుల జాబితాలను ప్రభుత్వ పెద్దల సూచనతో జిల్లాల అధికారులు స్థానిక ఎమ్మెల్యేలకు అందజేశారు. గ్రామసభలో ఆమోదం పొందిన పనులలో ఎన్ని పనులను ఏ గ్రామానికి ఎంత మొత్తం మేర మంజూరు చేయాలి.. గ్రామానికి మంజూరు చేసిన పనులనూ ఏ పనిని గ్రామంలో ఎవరికి అప్పగించాలన్నది తుది ఆమోదం ఆయా ఎమ్మెల్యేలు తెలపనున్నారు. నిధులు తక్కువ, ప్రతిపాదనలు ఎక్కువ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో విజయనగరం జిల్లాలో ఇంకా కేవలం రూ. 55 కోట్ల మేర మంజూరుకు అవకాశం ఉండగా.. ఆ జిల్లాలో దాదాపు రూ. 1,000 కోట్లకు పైబడి పనులను మంజూరు చేయాలంటూ అధికారులకు ప్రతిపాదించినట్టు సమాచారం. గుంటూరు జిల్లా మొత్తంలోనూ ప్రస్తుత ఏడాది కేవలం రూ. 10 కోట్ల మేర నిధుల వెసులుబాటు ఉంటుందని అధికారులు తేల్చగా.. తన నియోజకవర్గానికి దక్కే నిధులతో చేపట్టే పనులను టీడీపీ, జనసేన నాయకులకు ఎలా పంచాలో తెలియక తెనాలి ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ కాలయాపన చేస్తున్నట్టు సమాచారం. గోదావరి జిల్లాల్లో ఒక్కో జిల్లాకు కేవలం రూ. 15 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య నిధులు అందుబాటులో ఉండగా.. టీడీపీ, జనసేన నేతల పోటీతో ఒక్కో నియోజకవర్గం నుంచే రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల మేర పనులకు ప్రతిపాదనలు ఎమ్మెల్యేలకు చేరుతున్నట్టు సమాచారం. ఇక నిడదవోలు నియోజకవర్గంలో రూ. 11 కోట్లు పనులను స్థానిక నేతలకు కాకుండా ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ తన సొంత రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన నేతలకు పనులు అప్పగిస్తున్నట్లు తెలిసింది. అనకాపల్లి జిల్లాలో రూ. 120 కోట్ల వరకు నిధులు అందుబాటులో ఉండగా.. తమ నియోజకవర్గాలకే ఎక్కువ వాటా కావాలంటూ జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. -
రేయ్ ఇటురారా?
గూడూరు రూరల్: ‘ఒరేయ్.. ఇటు రారా. ఏందిరా ఇది.. ఇంత అవినీతి ఎప్పుడైనా జరిగిందా.. ఎందుకిలా చేస్తున్నార్రా.. ఒరేయ్ మీకు అర్థం కావడం లేదురా..’ ఇదీ మంగళవారం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జరిగిన సమాజిక బహిరంగ సభావేదికలో ఉపాధి సిబ్బందినుద్దేసించి పీడీ శ్రీనివాసప్రసాద్ అన్న మాటలు. తమ తోటి సిబ్బందితో మర్యాదగా మసులుకోవాల్సిన ఆయన ఏకవచనంతో పిలుస్తూ అవమానాలకు గురిచేస్తుండడంపై పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులమనే గౌరవం కూడా లేకుండా రారా..పోరా.. అని సంబోధించడం ఏంటని ప్రశి్నస్తున్నారు. ఎంతకాదన్నా తాముకూడా సహోద్యోగులమేకదా అని చెబుతున్నారు. ఎలాగంటే అలా మాట్లాడడం సరికాదని హితవు పలుకుతున్నారు. కాగా వివిధ గ్రామాలకు సంబంధించిన నలుగురు క్షేత్ర సహాయకులతోపాటు ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను తొలగిస్తున్నట్టు పీడీ పేర్కొన్నారు. వీరి నుంచి రూ.6.77 లక్షల రికవరీకి ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో మంగళపూరు, రామలింగాపురం, వెడిచెర్ల, కొండాగుంట గ్రామాల క్షేత్రసహాయకులు ఉన్నారని చెప్పారు. అలాగే విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించని ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏపీడీ వరప్రసాద్, ఏపీఓ పెంచలయ్య, పలువురు టెక్నికల్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
విజయపథంలో అక్క చెల్లెమ్మలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయి. వీటిని సద్వినియోగించుకుంటూ అక్కచెల్లెమ్మలు వారి కాళ్లపై వారు నిలదొక్కుకోవడమే కాకుండా, మరికొందరికి ఉపాధి కూడా చూపిస్తున్నారు. ఇదే క్రమంలో పొదుపు సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా కూడా రూపుదిద్దుకుంటున్నారు. పొదుపు సంఘాల మహిళలు రాష్ట్ర ప్రథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలనూ సద్వినియోగం చేసుకొంటున్నారు. ఇలా పొదుపు సంఘాల మహిళలను హయ్యర్ ఆర్డర్ ఎంటర్ప్రెన్యూర్ (ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలు)గా తీర్చిదిద్దడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2021 – 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య 1,126 మంది పేద పొదుపు సంఘాల మహిళలు ఉన్నత స్థాయి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. వారు కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంతో పాటు పెద్ద సంఖ్యలో తోటి మహిళలకు ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. వీరు ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్నారు. ధాన్యాలు, చిరు ధాన్యాలతో కూడిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులు, నూనె, బెల్లం తయారీ, పిండిమర, పచ్చళ్ళు, కారం పొడులు తదితర యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. వీరి వివరాలు, విజయగాథలతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) “ఆంధ్రప్రదేశ్ కొత్త తరం మహిళా పారిశ్రామికవేత్తలు’ పేరుతో తెలుగు, ఇంగ్లిష్,, హిందీ భాషల్లో ఓ పుస్తకాన్ని ప్రచురించింది. శుక్రవారం ఈ పుస్తకాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్యి బి. రాజశేఖర్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్ అహ్మద్, ఆర్.వై.ఎస్.ఎస్ సీఈవో విజయ్ కుమార్ ఆవిష్కరించారు. గ్రామాల్లో మహిళా శక్తిని, గ్రామీణాభివృద్ధి రెండూ విదదీయరానివని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ చెప్పారు. పేదరికంలో నివసిస్తున్న గ్రామీణ నిరక్ష్యరాస్యులైన సామాన్య మహిళలు తగిన ప్రేరణతో మార్పును తేగలరనే నమ్మకంతోనే సెర్ప్ సంస్థ ప్రారంభమైందని తెలిపారు. మహిళలు నూతన శిఖరాలను అధిరోహించే క్రమం, వారు సాధించిన విజయాలు, ఆర్థికంగా ఎదుగుతున్న వైనాన్ని ఈ పుస్తకంలో ప్రచురించినట్టు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తెలిపారు. -
కనీస మద్దతు ధర తప్పనిసరి చేయాలి
సాక్షి, విశాఖపట్నం : రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర తప్పనిసరి చేయాలని దక్షిణాది రాష్ట్రాల రైతు ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు కోరారు. వ్యవసాయం లాభసాటి కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని.. సేద్యానికి ‘ఉపాధి’ పనులను అనుసంధానం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదని, రైతాంగాన్ని ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత కేంద్రానిదేనని వారు స్పష్టంచేశారు. 2024–25 మార్కెటింగ్ సీజన్లో రబీ పంటలకు ధరలు నిర్ణయించేందుకు.. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశం శుక్రవారం విశాఖపట్నంలోని జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, లక్షద్వీప్‌ల నుంచి కూడా రైతులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నిపుణులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. మద్దతు, గిట్టుబాటు ధరల మధ్య వ్యత్యాసాన్ని సరిచేయాలి : నాగిరెడ్డి ఏపీ వ్యవసాయ మిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని వృత్తిగా నమ్ముకున్న రైతులు పంటలకు గిట్టుబాటు ధరరాక నష్టాల పాలవుతున్నారని, ఉత్పత్తి వ్యయానికనుగుణంగా కనీస మద్దతు, గిట్టుబాటు ధరల మధ్య వ్యత్యాసాన్ని సరిచేసి తగిన ధర లభించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరారు. కనీస మద్దతు ధరను తప్పనిసరి (మ్యాండేటరీ) చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా ఉన్న ఉద్యాన పంటల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటూ దేశంలో నంబర్–1గా నిలిచారన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్బీకేల ద్వారా రైతులకు అనేకరకాల సేవలందిస్తున్నామని, పంట కాలానికి సాగుకు ఉపయోగపడేలా కేంద్ర సాయం రూ.6 వేలతో కలిపి ఏటా రూ.13,500 ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు. ఇంకా పెట్టుబడి సాయం, రైతులకు బీమా, ఉచిత పంటల బీమా వర్తింపజేస్తున్నామని, ధరల స్థిరీకరణ నిధితో పాటు విపత్తుల వేళ ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. రాయలసీమకు చెందిన రైతు వంగల సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. ఎంఎస్పీని తప్పనిసరి చేయాలని చాన్నాళ్లుగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొమ్ముశనగలను ప్రజాపంపిణీ వ్యవస్థలో చేర్చాలని కోరారు. కేంద్రానికి నివేదిస్తాం.. రైతులు, రైతు ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని, పంటలకు తగిన మద్దతు ధర ఇవ్వాలని సిఫార్సు చేస్తామని సీఏసీపీ చైర్మన్ ప్రొఫెసర్ విజయపాల్‌శర్మ తెలిపారు. చిరుధాన్యాలు పండించే రైతుకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. సాధారణ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లేలా రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలని ఆయన సూచించారు. రైతుల సంక్షేమానికి ఏపీ పెద్దపీట మరోవైపు.. ఏపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తమిళనాడు రైతు పళని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యానశాఖ డైరెక్టర్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయడం ద్వారా కూలీల భారం తగ్గి రైతు నిలబడే వీలుంటుందన్నారు. -
AP: రోజూ జిల్లాకో లక్ష మందికి ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సీజను ముగుస్తుండటంతో పేదలు పనుల్లేక వలస పోయే పరిస్థితి లేకుండా ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అందుకు అనుగుణంగా ఉపాధి హామీ పథకం ద్వారా రోజూ ప్రతి జిల్లాలో లక్ష మందికి పనులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మార్చి నెలాఖరుకి కనీసం ఐదు కోట్ల పని దినాల పాటైనా పేదలకు పనులు కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గత ఐదేళ్లుగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది కూడా పేదలకు సొంత గ్రామాల్లో పనుల కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున పను22ళ కల్పనపై గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ రోజూ జిల్లా అధికారులతో సమీక్ష చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పనుల గుర్తింపుపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే రూ. 4,022 కోట్ల మేర ఉపాధి పనులు గత వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించిన పనులతో కలిసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి) ఇప్పటివరకు 19.07 కోట్ల పనిదినాల పాటు ప్రభుత్వం పనులు కల్పించింది. 43.08 లక్షల కుటుంబాలకు చెందిన 76.08 లక్షల మంది వారి సొంత గ్రామాల్లోనే పనులు చేసుకొని ఇప్పటికే రూ. 4,022 కోట్లు లబ్ధి పొందారు. వీరిలో దాదాపు 34 శాతం ఎస్సీ, ఎస్టీలే. ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన దాదాపు 70 రోజుల్లో కనీసం ఐదు కోట్లు పనిదినాలు పని కల్పించాలని, మొత్తంగా ఈ ఏడాది 24 కోట్ల పనిదినాలు కల్పించాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. పని దినాల కేటాయింపులు పెంచిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఏడాది మూడో విడత పని దినాల కేటాయింపులు పెంచింది. ఈ ఆర్థిక ఏడాదికి మొదట రాష్ట్రానికి 14 కోట్ల పనిదినాలు మాత్రమే కేటాయించిన కేంద్రం.. గతంలో ఒక విడత మరో ఐదు కోట్ల పని దినాలకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం 19 కోట్ల పనిదినాలు కేటాయింపులు చేసింది. ఆ లక్ష్యం కూడా ఇప్పటికే పూర్తవడంతో మంగవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, రాష్ట్ర అధికారుల వర్చువల్ సమావేశంలో మరో 1.20 కోట్ల పని దినాను కేటాయించింది. దీనితో పాటు వచ్చే రెండు నెలల్లో అవసరం ఉన్న మేరకు మరిన్ని పని దినాల కేటాయింపులు పెంచేందుకు సిద్ధమంటూ కేంద్ర అధికారులు రాష్ట్రానికి స్పష్టమైన హామీ ఇచ్చినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వెల్లడించారు. -
ప్రతి నలుగురిలో ఒకరికి పనిలేదు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధి అవకాశాలపై కోవిడ్–19 చూపించిన ప్రతాపం అంతాఇంతా కాదు. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడింది. సంఘటితర రంగంలోని ప్రాధాన్యత కేటగిరీలు మొదలు అసంఘటిత రంగంలోని కార్మికుల వరకు అందరినీ రోడ్డున పడేసింది. తీవ్ర నష్టాలతో పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోగా.. చిన్నాచితకా సంస్థలు మూతబడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కోవిడ్–19 వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టి మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంటున్నా.. ఉపాధి అవకాశాలు మాత్రం ఆశించినంతగా పెరగడం లేదు. ప్రస్తుతం ప్రతి నలుగురు యువకుల్లో ఒకరు నిరుద్యోగిగా ఉన్నట్లు గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ పరిశీలన చెబుతోంది. దేశవ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 30 సంవత్సరాలలోపు వయసున్న వారి ఉద్యోగ స్థితిని ఈ శాఖ పరిశీలించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఈ పరిశీలన జరిపింది. జాతీయ సగటు నిరుద్యోగిత రేటు 22.9 శాతంగా ఉందని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. తెలంగాణలో నిరుద్యోగిత రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా 24.3% ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోనే అత్యధికంగా జమ్మూ కశ్మీర్లో 44.1% నిరుద్యోగిత ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ (38.7%) ఉత్తరాఖండ్ (34.5%), ఒడిశా (32.5%), అసొం (32.2%) రాష్ట్రాలున్నాయి. అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ (7.7%), పశ్చిమ బెంగాల్ (14.0%), ఢిల్లీ(19.4%) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగైదు నెలలు వేచి చూడాలి మార్కెట్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంలో జరుగుతున్న జాప్యంతో కొత్తగా ఉపాధి అవకాశాలు పెరగలేదు. కొత్తవారికి ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండడంతో నిరుద్యోగం పెరిగినట్లు పరిశీలన చెబుతోంది. కరోనా అనంతరం ఇప్పుడిప్పుడే మార్కెట్ సాధారణ స్థితికి వస్తోంది. కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగాలంటే మరో నాలుగైదు నెలలు వేచి చూడాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళలే బాధితులు కరోనా లాక్డౌన్, ఆ తర్వాతి పరిస్థితులు మహిళలపై ఎక్కువ ప్రభావాన్ని చూపినట్లు పరిశీలన స్పష్టం చేస్తోంది. దేశంలో సగటు నిరుద్యోగిత రేటు 22.9 శాతంగా ఉండగా, ఇందులో పురుషుల నిరుద్యోగిత రేటు 20.9 శాతంగా, మహిళల నిరుద్యోగిత రేటు 29.5 శాతంగా ఉండటం గమనార్హం. లాక్‌డౌన్‌కు ముందు పురుషుల నిరుద్యోగిత రేటు 20.2 శాతం ఉండగా, మహిళల్లో 24.2 శాతం ఉంది. ఈ లెక్కన మహిళల్లో నిరుద్యోగిత ఏకంగా 5 శాతం పెరిగినట్లు పరిశీలన చెబుతోంది. లాక్డౌన్ అనంతర పరిస్థితుల ప్రభావంతో చాలా కంపెనీలు ఎక్కువగా మహిళా ఉద్యోగులను తొలగించగా.. కొత్తగా చేసిన నియామకాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కార్మిక వ్యవహారాల నిపుణులు ఒకరు సాక్షితో చెప్పారు. ఇప్పుడిప్పుడే అవకాశాలు పెరుగుతున్నాయి మార్కెట్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. దాదాపు అన్ని రంగాలు ఏడాదిన్నర పాటు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని తేరుకుంటున్నాయి. రెండు నెలలుగా కొత్తవారికి అవకాశాలు మొదలయ్యాయి. కోవిడ్–19 వ్యాప్తి పెరగకుండా ఉంటే వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఇప్పటికైతే సీనియర్లకు డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారిలో ఎక్కువ మంది ఇతర కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్లే ఉంటున్నారు. ఐటీ సెక్టార్లో ఏడాదికి పైబడి ఖాళీగా ఉన్న అనుభవజ్ఞుడికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. – వైదేహి రెడ్డి వడిసెల, హెచ్ఆర్ సీనియర్ మేనేజర్ -
సొంతూళ్లోనే కాయకష్టం
సాక్షి,హైదరాబాద్: కరోనా ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది. ఎక్కడెక్కడి నుంచో పొట్టచేతబట్టుకుని నగరాలకు వలసలు వచ్చి కాయకష్టం చేసుకుని బతికే శ్రమజీవులకు లాక్డౌన్ ఓ అశనిపాతంలా పరిణమించింది. కరోనా మహమ్మారితో ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది వలసకార్మికులు నగరాలు విడిచి స్వగ్రామాల బాటపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు భారీ డిమాండ్ ఏర్పడింది. మునుపెన్నడూ ఉపాధి పనులకు హాజరు కాని వారంతా కూలి పనులకు వెళ్తున్నారు. లాక్డౌన్ సమయంలోనూ ఉపాధి పనులకే అనుమతి ఉండటం వలసకార్మికులకు కలిసివచ్చినట్లైంది. దీంతో స్వస్థలాలకు వచ్చిన వీరికి ఉపాధి హామీ పనులు ఊరటనిచ్చాయి. మరోవైపు రోజు కూలి రేటును కేంద్ర ప్రభుత్వం రూ.237కు పెంచడం కూడా వారికి బాగా కలిసొచ్చింది. జాబ్‌కార్డులకు పెరిగిన దరఖాస్తులు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడం, ఇల్లు గడిచే పరిస్థితి లేకపోవడం వంటి కారణాలతో కొత్త జాబ్ కార్డుల కోసం ఎగబడ్డారు. ఇటీవల ఏకంగా 2.96 లక్షల మంది పనికావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు నెలల కాలంలోనే ఈ స్థాయిలో కుటుంబాలు జాబ్‌కార్డులు పొందడం రికార్డు అని అధికారులు చెబుతున్నారు. గత మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా జాబ్ కార్డు కలిగిన కుటుంబాలు 51,40,663 ఉండగా, ఏప్రిల్, మే నెలల్లో ఆ సంఖ్య 52,42,769 కుటుంబాలకు చేరింది. దీంతో గత రెండు నెలల్లోనే కొత్తగా 1,02,106 కుటుంబాలు జాబ్ కార్డులు పొందారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 12,725 కుటుంబాలు(27,875 మంది), రంగారెడ్డి జిల్లాలో 11,788 కుటుంబాలు(25,635) జాబ్ కార్డులు పొందాయి. ఆ తర్వాత వికారాబాద్‌లో 14,776 మంది, కామారెడ్డిలో 14,596 మంది, సిద్దిపేటలో 14,099 మంది, నాగర్ కర్నూల్లో 11,357 మంది, జగిత్యాలలో 9,215 మంది, నిర్మల్‌లో 12,545 మంది కొత్తగా జాబ్ కార్డులు పొంది ఉపాధి పనులకు హాజరయ్యారు. కరోనా ప్రభావం ఇప్పట్లో తొలగిపోయే సంకేతాలు కనిపించకపోవడంతో మరికొన్నాళ్లలో మరిన్ని కొత్త జాబ్ కార్డులు జారీ చేసినా ఆశ్చర్యం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. -
‘ఉపాధి హామీ’లో వింత వైఖరి
కృష్ణగిరి మండలం పోతుగల్ గ్రామానికి చెందిన సి.సుంకన్న 2013 నవంబర్ 14న మరణించాడు. అయితే..ఇతను 2018 ఏప్రిల్ నుంచి జూన్ 6వ తేదీ మధ్య 18 రోజుల పాటు ఉపాధి హామీ పనులు చేసినట్లు మస్టర్లలో నమోదు చేశారు. జాబ్ కార్డు నంబర్ 10029పై దొంగ మస్టర్లు నమోదు చేసి.. రూ.3,415 స్వాహా చేశారు. కల్లూరు మండలం రేమడూరు పంచాయతీకి చెందిన ఎన్.సుంకన్న 2016 నవంబరు 14న మరణించాడు. ఇతను కూడా ఉపాధి పనులకు వచ్చినట్టు మస్టరు వేయడం గమనార్హం. జాబ్‌కార్డు నంబరు 10014తో 2018 మే 10 నుంచి 22వ తేదీ మధ్య 12 రోజుల పాటు పనులు చేసినట్లు చూపి.. రూ.2,580 డ్రా చేశారు. ఇలాంటి అక్రమాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి. కర్నూలు(అగ్రికల్చర్): గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు, ‘ఉపాధి’ సిబ్బంది కుమ్మక్కై నిధులు కొల్లగొట్టారు. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి పరిశీలిస్తే.. 2018–19లోనే అక్రమాలు ఎక్కువగా జరిగాయి. టీడీపీ నేతలు, ‘ఉపాధి’ సిబ్బంది కలిసి ఏ అవకాశాన్నీ వదలకుండా నిధులు మింగేశారు. ఎప్పుడో మరణించిన వారు కూడా పనులు చేసినట్లు మస్టర్ వేసి.. నిధులు స్వాహా చేయడం అక్రమాలకు పరాకాష్ట. చివరకు ఉపాధి సిబ్బంది సైతం తమ పేర్లతోనే మస్టర్లు వేసుకుని నిధులు డ్రా చేసుకున్నారు.కృష్ణగిరి మండలం పందిర్లపల్లికి చెందిన డి.మధుసూదన్ ఫీల్డ్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలవారీగా వేతనం చెల్లిస్తారు. అయినప్పటికీ మధుసూదన్ జాబ్ కార్డు నంబరు 40278తో 2018 ఏప్రిల్ 2 నుంచి 2019 మే 18 మధ్య 51 రోజులు పనిచేసినట్లు దొంగ మస్టర్ సృష్టించుకుని రూ.10,403 స్వాహా చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి 29 మండలాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించడంతో పాటు ఓపెన్ ఫోరంలు కూడా పూర్తి చేశారు. ఈ మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద రూ.236కోట్లు ఖర్చు పెట్టగా.. ఇందులో రూ.20.70 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చారు. ఇందులోనూ బినామీ మస్టర్లతో రూ.1.19 కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించారు. కూలీలు రెక్కలు ముక్కలు చేసుకుని పని చేసినా రోజుకు రూ.70 నుంచి రూ.80 వరకు మాత్రమే వేతనం లభిస్తుండగా.. బినామీ మస్టరు వేసిన వారి పేరుతో మాత్రం రూ.150 నుంచి రూ.175 వరకు డ్రా చేయడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి పనులను పర్యవేక్షించాలి. కానీ వారే దొంగమస్టర్లు వేసుకుని నిధులు స్వాహా చేస్తున్నారు. జిల్లాలో ఇటువంటి వారు 30 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. డోన్‌లోనే ఎక్కువ....దొంగ మస్టర్లతో నిధులు కొల్లగొట్టిన సంఘటనలు డోన్ మండలంలోనే ఎక్కువగా ఉన్నాయి. అలాగే పాత చెక్‌డ్యామ్‌లకు రంగులు కొట్టి నిధులు స్వాహా చేశారు. నాలుగు చెక్‌డ్యామ్‌లు నిర్మించి ఎనిమిదింటికి డబ్బు తీసుకున్నారు. దొంగ మస్టర్లతో ఒక్క డోన్ మండలంలోనే రూ.22.71 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించారు. అలాగే కోడుమూరు మండలంలో రూ.11.64 లక్షలు, గోనెగండ్ల మండలంలో రూ.8.38 లక్షలు స్వాహా చేశారు. దాదాపు అన్ని మండలాల్లోనూ దొంగ మస్టర్ల బాగోతం వెలుగుచూస్తోంది. చర్యలు చేపడుతున్నాం దొంగ మస్టర్లతో నిధులు స్వాహా చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదు. మస్టర్ల నమోదులో అక్రమాల నివారిస్తాం. ఈ–మస్టరు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. – వెంకటసుబ్బయ్య, ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ -
కాలిపోతున్న ‘ఉపాధి’ కూలీ
డక్కిలి: జిల్లాలోని 46 మండలాల్లో 939 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 33, 428 గ్రూపుల్లో 5.87,125 మందికి జాబ్‌కార్డులు జారీ చేయగా ఇందులో 5,34,513 మంది కూలీలు ఉన్నారు. వీరిలో రోజుకు లక్ష మందికి ఉపాధి పనులు కల్పించాల్సి ఉంటే.. 70 వేలు నుంచి 80 వేలు మంది మాత్రమే కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద పనిచేస్తున్న ప్రదేశాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాల జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతోన్నాయి. కొద్ది రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కారణంగా కూలీలు ఎండలో పనిచేసేందుకు జంకుతున్నారు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40–46 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూలీలు పనిచేసే చోట మెడికల్ కిట్లతో పాటు దాహం తీర్చడానికి మంచి నీరు, మజ్జిగను సరఫరా చేయాల్చి ఉంది. విధిగా టెంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా..అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. డక్కిలి మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో 2 వేల మందికి పైగా కూలీలు పని చేస్తున్నారు. ఇక్కడ అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా లేకపోవడం చూస్తే కూలీలపై అధికారులకు ఉన్న భద్రత అద్దం పడుతుంది. పనుల వద్ద వసతులు లేకపోవడం, ఎండ తీవ్రత, సకా లంలో బిల్లులు రాకపోవడంతో కూలీల హాజరు రోజు రోజుకు తగ్గుతుంది. కనిపించని మెడికల్ కిట్లు విధిలేని పరిస్థితుల్లో ఎండలోనే పనిచేస్తున్న ఉపాధి కూలీలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఉదయం 7 నుంచి సూర్యుడి ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉపాధి కూలీలుకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాల్చి ఉన్నా.. ఎక్కడ కూడా కనిపంచడం లేదు. కొన్ని ప్రాంతాల్లో రెండేళ్ల క్రితం అందజేసిన మెడికల్ బాక్స్‌లనే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. వీటిలో ఒక్క అయోడిన్ మినహ అన్నీ కాలం చెల్లడంతో ప్రథమ చికిత్స బాక్స్‌లను మూలన పడేశారు. ఈ పరిస్థితుల్లో వడదెబ్బ తగిలితే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పగటి ఉష్ణోగ్రత భారీగా పెరుగుతోంది. ఎండ తీవ్రతతో ప్రజలు కాలు బయట పెట్టేందుకూ జంకే పరిస్థితి. అత్యవసరమైతే తప్ప..బయటకు రావద్దని జిల్లా అధికారులే హెచ్చరికలు చేస్తున్నారు. కానీ ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలు ఎండకు కాలిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం పనులు చేపట్టే చోట ఎండాకాలంలో నీడ, మంచినీళ్లు, మజ్జిగ వంటి ఉపశమన చర్యలతో పాటు మెడికల్ కిట్లు కూడా అందుబాటులో ఉంచాల్సి ఉంది. అధికారులు పని ప్రాంతంలో ఎలాంటి వసతి కల్పించకపోవడంతో కూలీలు చుక్కలు చూడాల్చి వస్తుంది. -
పని కావాలా నాయనా!
కడప సిటీ: జిల్లాలో ఉపాధి పనుల లక్ష్యం నెరవేరేందుకు అధికారులు తలమునకలు అవుతున్నారు. 2018 మార్చి నాటికి పనిదినాలు పూర్తిచేయాల్సి ఉంది. కాని ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో శ్రమిస్తేనే అది సాధ్యమౌతుంది. లేకపోతే లక్ష్యం నెరవేరక అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. ప్రస్తుతం సగటున 35000ల పనిదినాలు రోజుకు జిల్లాలో నమోదవుతున్నాయి. ఈ లెక్కన పనిదినాలు కొనసాగితే లక్ష్యం నెరవేరడం కష్టమే. రోజుకు సగటున 52,000 పనిదినాలు కల్పిస్తేనే లక్ష్యం నెరవేరేందుకు అవకాశం ఉంటుంది. 50రోజులు–22 లక్షల పనిదినాలు 2017–18 ఆర్థిక సంవత్సరంలోఉపాధి హామీ పథకం కింద 1.24 కోట్ల పని దినాలు కల్పించాలని నిర్దేశించారు. ప్రస్తుతం 1.24కోట్లకు గాను 1.02 కోట్ల పనిదినాలు ఇప్పటివరకు కూలీలకు కల్పించారు. అయితే ప్రస్తుతం సగటున రోజుకు 35000 ల పనిదినాలు జిల్లాలోని 50 మండలాల్లో నమోదవుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన పనిదినాలు ఇలానే కొనసాగితే లక్ష్యం పూర్తికాదు మంజూరైన నిధులు కూడా నిరుపయోగం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే కనీసం సగటున రోజుకు 52000లు పనిదినాలు కల్పించగలిగితేనే సాధ్య పడుతుంది. ఇంతమందికి పని కల్పించాలంటే క్షేత్రస్థాయిలో భారీగా కసరత్తు చేస్తేనే సాధ్యమౌతుంది. ఉన్నతాధికారులు తరచుగా మండలాల్లోని ఎంపీడీఓలతోను, ఏపీఓలతోను సమావేశాలు నిర్వహించి ఒక ప్రణాళికను తయారుచేసి తగు సూచనలు చేస్తే లక్ష్యం నెరవేరేందుకు సులభతరంగా ఉంటుంది. నిధులు రూ.473 కోట్లు 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి పనులకు జిల్లాకు రూ.473 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందులో కూలీలకు రూ.25.62కోట్లు, మెటీరియల్‌కు రూ.18.20 కోట్లు కేటాయించారు. మిగతా మొత్తాన్ని ఉపాధి పనుల్లోని వివిధ పనులకు కేటాయించారు. ఈ మొత్తం లక్ష్యం నెరవేరాలంటే ఇంకా 22లక్షల పనిదినాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. రోజుకు లక్ష పనిదినాలు కల్పిస్తాం: ఈ ఏడాది 1.24కోట్ల పనిదినాలు కల్పిం చాల్సి ఉంది. ఇప్పటివరకు 1.02 కోట్ల పనిదినాలు కల్పించాం. ఇంకా 22లక్షల పనిదినాలు మార్చి చివరి నాటికి కల్పిం చాల్సి ఉంది. ప్రస్తుతం సగటున రోజుకు 35000ల మంది కూలీలు జిల్లాలోని 50 మండలాల్లో పనిచేస్తున్నారు. ఇప్పటి నుండి రోజుకు లక్షమంది పనిచేసేలా చర్యలు తీసుకుంటాం.టార్గెట్ పూర్తి చేస్తాం. వై.హరిహరనాథ్, డ్వామా పీడీ మండలాలు: 50 2017–18 ఆర్థిక సంవత్సరానికి నిధులు:రూ. 473 కోట్లు ఇంతవరకు పెట్టిన ఖర్చు : రూ.257 కోట్లు కల్పించాల్సిన ఉపాధి కూలీ పనిదినాలు: రూ.1.24 కోట్లు ఇంతవరకు కల్పించిన పని దినాలు –రూ.1.02 కోట్లు ఇంకా చేయవల్సిన పనిదినాలు –రూ. 22లక్షలు -
వలస కుటుంబంలో తీరని విషాదం
పెద్దకడబూరు: ఉపాధి కోసం వలసెళ్లిన ఆ దంపతులు కన్న కొడుకును పోగొట్టుకున్నారు. తేనెటీగలు దాడి చేయడంతో వారి నాలుగేళ్ల కుమారుడు మృత్యువాత పడ్డాడు. దీంతో వారు పుట్టెడు దుఃఖంతో స్వగ్రామానికి తిరిగొచ్చారు. వివరాలిలా ఉన్నాయి. చిన్నకడబూరు గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి వ్యవసాయ కూలీ. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో నాలుగు రోజుల క్రితం భార్య ఈరమ్మ, నాలుగేళ్ల కుమారుడు ఆనంద్‌ను తీసుకుని మహారాష్ట్రకు వలస వెళ్లాడు. మంగళవారం అక్కడ ఓ పొలంలో ఆనంద్‌ను చెట్టు కింద వదలి భార్యాభర్త పనుల్లో నిమగ్నమయ్యారు. ఆనంద్‌తో పాటు అక్కడ ఒక పాప ఉండగా.. ఇద్దరూ ఆడుకుంటున్నారు. ఇంతలోనే తేనెటీగలు వచ్చి దాడి చేశాయి. పాప పారిపోగా.. చిన్నారి ఆనంద్ శరీరం మొత్తం తేనెటీగలు కుట్టేశాయి. తల్లిదండ్రులు అక్కడికి చేరుకొనేలోపే నోటినుంచి నురుగు వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నారి మృతదేహన్ని తీసుకొని తల్లిదండ్రులు బుధవారం స్వగ్రామం వచ్చి.. ఖననం చేశారు. కాగా.. వీరు వారం రోజుల క్రితం గ్రామ దేవరను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు. దేవర ముగిసిన తర్వాత ఊళ్లో ఉపాధి లేకపోవడంతో మహారాష్ట్రకు వలసెళ్లారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. -
అవే సమస్యల ని‘వేదన’!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: వ్యవసాయానికి సాగునీరు నుంచి గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు వరకూ.. ఉపాధి కల్పన నుంచి పరిశ్రమల స్థాపన వరకూ.. పింఛను నుంచి రేషన్‌కార్డు వరకూ ఇలా ప్రతి అంశంలోనూ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ల కాలంలో చేసిందేమైనా ఉందా? అంటే ప్రజలు మాత్రం పెదవి విరుస్తున్నారు. ముఖ్యమంత్రే సిక్కోలు జిల్లాలో పది సార్లు పర్యటించినా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు మాత్రం గుదిబండలా అలాగే ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనేక హామీలు ఇచ్చినా అవేవీ కార్యరూపం దాల్చ లేదు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే గురువారం నుంచి రెండ్రోజుల పాటు ఆయన జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర రాజధానిలో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దీనికి జిల్లా కలెక్టరు కె.ధనంజయరెడ్డి కూడా హాజరవుతున్నారు. జిల్లాలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల సహా వ్యవసాయ, వ్యవసాయానుబంధ, పారిశ్రామిక, సేవా రంగాల తీరుపై నివేదికను సమర్పించనున్నారు. జిల్లా కలెక్టరు నివేదిక ప్రకారం జిల్లా గత ఆర్థిక సంవత్సరం (2016–17)లో వ్యవసాయ రంగం 12.8 శాతం, పారిశ్రామిక రంగం 9.28 శాతం, సేవారంగంలో 10.10 శాతం వృద్ధి సాధించింది. కానీ ఇదంతా నివేదికలో చూపించడానికే తప్ప ఆచరణలో ఆ స్థాయి వృద్ధి కనిపించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా తలసరి ఆదాయం రూ.94,118 మాత్రమే. కానీ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,22,376 ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 14.44 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టరు ధనంజయ్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. తొలిరోజు వ్యవసాయం, వ్యవసాయాధార పరిశ్రమల పరిస్థితి, సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపుల అవసరంపై కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించనున్నట్లు తెలిపారు. జీడిపప్పు పరిశ్రమలో అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతులకు బదులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫుడ్‌ప్రాసెసింగ్ విధానాన్ని పరిచయం చేయాల్సి ఉందన్నారు. మేజర్, మైనర్ ఇరిగేషన్లో పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించనున్నట్లు చెప్పారు. ఉద్దానం సహా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించడానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ప్రస్తావించనున్నట్లు తెలిపారు. కొవ్వాడ అణుపార్కు, భావనపాడు పోర్టు భూసేకరణకు సంబంధించిన వివాదాలను కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. శ్రీకాకుళంలోని ఏకైక ప్రభుత్వ బోధనాసుపత్రి రిమ్స్‌లో ఎంబీబీఎస్ సీట్లు వంద నుంచి 150కి పెంపు, అలాగే పీజీ వైద్య విద్య సీట్ల పెంపునకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన విషయమై ప్రస్తావించనున్నట్లు చెప్పారు. ఉద్దానంలోని కిడ్నీ రోగులకు ఉచితంగా మందుల సరఫరా ప్రతిపాదనను కూడా సాధ్యమైనంత సత్వరమే ఆచరణలోకి తీసుకొచ్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొస్తామన్నారు. -
ఉపాధి కలే
పెళ్లకూరు, న్యూస్‌లైన్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ‘హామీ’ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి ఉన్న చోటే కూలీలకు పని కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల్లో ఒక పక్క కరువు విలయతాండవం చేస్తుంటే.. బతుకుతెరువు కోసం పల్లె జనం పరితపిస్తున్నారు. తాజాగా వ్యవసాయ పనులు ముగియడంతో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలు ఉన్నచోట పనిలేక వలసబాట పడుతున్నారు. ఉపాధి పనులు సక్రమంగా చేయించడం లేదని, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడం లేదని గతంలో కొందరు ఉపాధి క్షేత్ర సహాయకులను విధుల నుంచి తొలగించారు. అయితే స్థానిక ఉపాధి పథకం అధికారులు అత్యుత్సాహంతో తొలగించిన వారికే మళ్లీ పనులు అప్పగించి సీనియర్ మేట్లుగా నియమించడంతో ఈ దుస్థితి ఏర్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో మొత్తం 10,510 మందికి ఉపాధి జాబ్‌కార్డులు ఉన్నాయి. అయితే వీరిలో కనీసం వంద మందికి కూడా పూర్తిస్థాయిలో పని కల్పించకపోతున్నారు. 2014-15 ఏడాదికి మండలంలో ఉపాధి హామీ పథకం కింద రూ.5.45 కోట్లతో పనులు చేపట్టాలని అంచనాలు సిద్ధం చేశారు. ఈ మేరకు ఫిబ్రవరి నుంచి కూలీలకు ఉపాధి పనులు కల్పించాల్సి ఉంది. అయితే పెళ్లకూరు, రావులపాడు, పుల్లూరు, కొత్తూరు, కానూరు, పెన్నేపల్లి, చింతపూడి, తాళ్వాయిపాడు గ్రామాల్లో పనులు చేపట్టకపోవడం విశేషం. దీంతో రెక్కాడితేగానీ డొక్కాడని పలువురు రోజువారీ కూలీలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు. సస్పెండైన ఫీల్డ్ అసిస్టెంట్లకే పనుల అప్పగింత ఉపాధి కూలీలకు పని కల్పించకుండా సొంత పనులు చేసుకుంటూ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయని పలువురు ఉపాధి సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులు ఇటీవల సస్పెండ్ చేసిన విషయం విదితమే. అయితే వారి స్థానంలో సీనియర్ మేట్లను నియమించుకుని ఉపాధి పనులు నిర్వహించాల్సిన ఇక్కడి అధికారులు అత్యుత్సాహంతో తిరిగి తొలగించిన వారికే పనులు అప్పగించారు. దీంతో అనకవోలు, చావాలి, కానూరు, కొత్తూరు, రావులపాడు, పెళ్లకూరు, పుల్లూరు, పెన్నేపల్లి, నందిమాల, చెన్నప్పనాయుడుపేట, రోసనూరు తదితర గ్రామాల్లో పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనకవోలు రూ.20 లక్షలు, సీఎన్‌పేట రూ.13 లక్షలు, చెంబేడు రూ.59 లక్షలు, పెళ్లకూరు రూ.37 లక్షలు ఇలా అన్నీ పంచాయతీల్లో సుమారు రూ.5.45 కోట్లకు పైగా పనులు చేయాలని అంచనాలు రూపొందించారు. అయితే ఉపాధి పనులు ని ర్వహించడంలో ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆశాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కూలీలకు ఉపాది పనులు కల్పించాలని కోరుతున్నారు. ఐదేళ్లుగా ఉపాధి పనులు చూపడం లేదు గ్రామంలో వ్యవసాయ సీజన్ ముగియగానే పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఉపాధి క్షేత్ర సహాయకులు లేకపోవడంతో ఐదేళ్లుగా ఉపాధి పనులు లేవు. కుటుం బంలో వృద్ధులను, పిల్లలను వదిలి పనుల కోసం వలస వెళుతున్నారు. నటరాజన్, ఉపాధి కూలి, పెళ్లకూరు క్షేత్ర సహాయకులను నియమించాలి పలు గ్రామాల్లో క్షేత్ర సహాయకులు లేక పనులు జరగడం లేదు. కొన్ని చోట్ల తొలగించిన వారికే పనులు అప్పగించడంతో వారు సొంత పనులకు పరిమితమయ్యారు. జిల్లా అధికారులు స్పందించి కొత్తగా సిబ్బందిని నియమించాలి. మోహన్, కూలీ చర్యలు చేపడుతాం : వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు చూపని సిబ్బందిని గుర్తించి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడుతాం. సొంత పనులు, ప్రైవేట్ పరిశ్రమల్లో విధులు నిర్వహిస్తూ, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వారిని గుర్తించి తొలగించి కొత్తవారిని నియమిస్తాం. గౌతమి, ఉపాధి పీడీ