సాక్షి,హైదరాబాద్: కరోనా ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది. ఎక్కడెక్కడి నుంచో పొట్టచేతబట్టుకుని నగరాలకు వలసలు వచ్చి కాయకష్టం చేసుకుని బతికే శ్రమజీవులకు లాక్‌డౌన్ ఓ అశనిపాతంలా పరిణమించింది. కరోనా మహమ్మారితో ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది వలసకార్మికులు నగరాలు విడిచి స్వగ్రామాల బాటపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు భారీ డిమాండ్ ఏర్పడింది. మునుపెన్నడూ ఉపాధి పనులకు హాజరు కాని వారంతా కూలి పనులకు వెళ్తున్నారు. లాక్‌డౌన్ సమయంలోనూ ఉపాధి పనులకే అనుమతి ఉండటం వలసకార్మికులకు కలిసివచ్చినట్లైంది. దీంతో స్వస్థలాలకు వచ్చిన వీరికి ఉపాధి హామీ పనులు ఊరటనిచ్చాయి. మరోవైపు రోజు కూలి రేటును కేంద్ర ప్రభుత్వం రూ.237కు పెంచడం కూడా వారికి బాగా కలిసొచ్చింది.
జాబ్‌కార్డులకు పెరిగిన దరఖాస్తులు
లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడం, ఇల్లు గడిచే పరిస్థితి లేకపోవడం వంటి కారణాలతో కొత్త జాబ్ కార్డుల కోసం ఎగబడ్డారు. ఇటీవల ఏకంగా 2.96 లక్షల మంది పనికావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు నెలల కాలంలోనే ఈ స్థాయిలో కుటుంబాలు జాబ్‌కార్డులు పొందడం రికార్డు అని అధికారులు చెబుతున్నారు. గత మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా జాబ్ కార్డు కలిగిన కుటుంబాలు 51,40,663 ఉండగా, ఏప్రిల్, మే నెలల్లో ఆ సంఖ్య 52,42,769 కుటుంబాలకు చేరింది. దీంతో గత రెండు నెలల్లోనే కొత్తగా 1,02,106 కుటుంబాలు జాబ్ కార్డులు పొందారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 12,725 కుటుంబాలు(27,875 మంది), రంగారెడ్డి జిల్లాలో 11,788 కుటుంబాలు(25,635) జాబ్ కార్డులు పొందాయి. ఆ తర్వాత వికారాబాద్‌లో 14,776 మంది, కామారెడ్డిలో 14,596 మంది, సిద్దిపేటలో 14,099 మంది, నాగర్ కర్నూల్‌లో 11,357 మంది, జగిత్యాలలో 9,215 మంది, నిర్మల్‌లో 12,545 మంది కొత్తగా జాబ్ కార్డులు పొంది ఉపాధి పనులకు హాజరయ్యారు. కరోనా ప్రభావం ఇప్పట్లో తొలగిపోయే సంకేతాలు కనిపించకపోవడంతో మరికొన్నాళ్లలో మరిన్ని కొత్త జాబ్ కార్డులు జారీ చేసినా ఆశ్చర్యం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు.
సొంతూళ్లోనే కాయకష్టం
Published Wed, Jun 10 2020 5:22 AM | Last Updated on Wed, Jun 10 2020 5:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment