ఉపాధి హామీ నిధులతో చేపట్టే పనుల కోసం ఆధిపత్య పోరు
ఎమ్మెల్యేల చేతికి గ్రామ సభల ఆమోదం జాబితాలు
ఏ పనులు ఎవరికి అప్పగించాలో తెలియక ఎమ్మెల్యేల మల్లగుల్లాలు
జిల్లాల్లో నిధులు తక్కువ.. పనుల ప్రతిపాదనలు ఎక్కువ
నేతలను సంతృప్తి పరిచే దారిలేక కాలయాపన చేస్తున్న ఎమ్మెల్యేలు
మేడిపల్లి కోటిరెడ్డి, సాక్షి ప్రతినిధి సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కేటగిరి నిధులతో చేపట్టే సిమెంట్ (సీసీ)రోడ్లు, సిమెంట్ మురుగు కాల్వల(సీసీ డ్రెయిన్లు)తో పాటు మట్టి, తారు రోడ్ల పనుల కోసం కూటమి నేతలు సిగపట్లు పట్టుకుంటున్నారు. ఏ పనులు ఏ పార్టీ నేతలకు చేపట్టాలి అనే విషయంలో ఆధిపత్య పోరాటం కొనసాగుతోంది. దీంతో 20 రోజులుగా ఎటూ తేలక అనుమతుల కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.
జిల్లాల్లో అందుబాటులో ఉన్న నిధులు పదుల కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే.. గ్రామాల నుంచి అందిన ప్రతిపాదనలు వందల కోట్ల రూపాయల మేర ఉండటంతో ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో పనుల మంజూరులో మూడు పారీ్టల నాయకులను ఎలా సంతృప్తి పరచాలో తెలియక ఎమ్మెల్యేలు పనుల జాబితాలను ఆమోదం కోసం పంపకుండా కాలయాపన చేస్తున్నారు. ఇక బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలున్న చోట కూడా పనులన్నీ తమకే కావాలంటూ టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు.
ఉపాధి పథకంలో కాంట్రాక్టర్లే ఉండరు
సాధారణంగా ఉపాధి హామీ నిధులతో చేపట్టే పనులకు, ఇతర అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియకు తేడా ఉంటుంది. కేంద్రం నిబంధన ప్రకారం.. ‘ఉపాధి’ నిధులతో మంజూరు చేస్తే, రోడ్ల పనులైనా కాంట్రాక్టర్ల వ్యవస్థ ఉండదు. సర్పంచ్‌ల ఆధ్వర్యంలో పంచాయతీ ద్వారా నిధులు చెల్లిస్తూ ఆయా పనులు చేపట్టాల్సి ఉంటుంది.
దీనికి తోడు జిల్లా ప్రాతిపదికన ఆర్థిక సంవత్సరంలో ఆయా జిల్లాల్లో కూలీల ద్వారా జరిగిన ఉపాధి పనుల ఆధారంగా 60–40 నిష్పత్తిన మెటీరియల్ కేటగిరి నిధులను లెక్కగట్టి, ఆ మేరకే మెటీరియల్ నిధులతో పనులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కూలీలతో సంబంధం ఉండని రోడ్ల పనులను సాధారణంగా మెటీరియల్ కేటగిరి« నిధుల నుంచి చేపడతారు. ఈ నిబంధనల మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం రూ. 4,500 కోట్ల మేర ఉపాధి మెటీరియల్ నిధులు అందుబాటులోకి వస్తాయి.
ఇప్పటికే ఖర్చు పెట్టిన నిధులు పోను, ఇంకా రూ. 1,980 కోట్లు అందుబాటులో ఉంటాయన్న అంచనాతో కొత్తగా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, మట్టి రోడ్ల పనులను గ్రామాల్లో కూటమి నాయకులకు నామినేషన్ పద్ధతిన మంజూరు చేసే కార్యక్రమం చేపట్టారు. ఇందుకోసం గత నెల 23న రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించారు.
గ్రామసభ ఆమోదం జాబితాలు ఎమ్మెల్యేల చేతికి..
గ్రామసభలో ఆమోదం పొందిన పనుల జాబితాలను ప్రభుత్వ పెద్దల సూచనతో జిల్లాల అధికారులు స్థానిక ఎమ్మెల్యేలకు అందజేశారు. గ్రామసభలో ఆమోదం పొందిన పనులలో ఎన్ని పనులను ఏ గ్రామానికి ఎంత మొత్తం మేర మంజూరు చేయాలి.. గ్రామానికి మంజూరు చేసిన పనులనూ ఏ పనిని గ్రామంలో ఎవరికి అప్పగించాలన్నది తుది ఆమోదం ఆయా ఎమ్మెల్యేలు తెలపనున్నారు.
నిధులు తక్కువ, ప్రతిపాదనలు ఎక్కువ..
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో విజయనగరం జిల్లాలో ఇంకా కేవలం రూ. 55 కోట్ల మేర మంజూరుకు అవకాశం ఉండగా.. ఆ జిల్లాలో దాదాపు రూ. 1,000 కోట్లకు పైబడి పనులను మంజూరు చేయాలంటూ అధికారులకు ప్రతిపాదించినట్టు సమాచారం. గుంటూరు జిల్లా మొత్తంలోనూ ప్రస్తుత ఏడాది కేవలం రూ. 10 కోట్ల మేర నిధుల వెసులుబాటు ఉంటుందని అధికారులు తేల్చగా.. తన నియోజకవర్గానికి దక్కే నిధులతో చేపట్టే పనులను టీడీపీ, జనసేన నాయకులకు ఎలా పంచాలో తెలియక తెనాలి ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ కాలయాపన చేస్తున్నట్టు సమాచారం.
గోదావరి జిల్లాల్లో ఒక్కో జిల్లాకు కేవలం రూ. 15 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య నిధులు అందుబాటులో ఉండగా.. టీడీపీ, జనసేన నేతల పోటీతో ఒక్కో నియోజకవర్గం నుంచే రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల మేర పనులకు ప్రతిపాదనలు ఎమ్మెల్యేలకు చేరుతున్నట్టు సమాచారం.
ఇక నిడదవోలు నియోజకవర్గంలో రూ. 11 కోట్లు పనులను స్థానిక నేతలకు కాకుండా ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ తన సొంత రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన నేతలకు పనులు అప్పగిస్తున్నట్లు తెలిసింది. అనకాపల్లి జిల్లాలో రూ. 120 కోట్ల వరకు నిధులు అందుబాటులో ఉండగా.. తమ నియోజకవర్గాలకే ఎక్కువ వాటా కావాలంటూ జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment