పెళ్లకూరు, న్యూస్‌లైన్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ‘హామీ’ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి ఉన్న చోటే కూలీలకు పని కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల్లో ఒక పక్క కరువు విలయతాండవం చేస్తుంటే.. బతుకుతెరువు కోసం పల్లె జనం పరితపిస్తున్నారు. తాజాగా వ్యవసాయ పనులు ముగియడంతో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలు ఉన్నచోట పనిలేక వలసబాట పడుతున్నారు. ఉపాధి పనులు సక్రమంగా చేయించడం లేదని, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడం లేదని గతంలో కొందరు ఉపాధి క్షేత్ర సహాయకులను విధుల నుంచి తొలగించారు. అయితే స్థానిక ఉపాధి పథకం అధికారులు అత్యుత్సాహంతో తొలగించిన వారికే మళ్లీ పనులు అప్పగించి సీనియర్ మేట్‌లుగా నియమించడంతో ఈ దుస్థితి ఏర్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండలంలో మొత్తం 10,510 మందికి ఉపాధి జాబ్‌కార్డులు ఉన్నాయి. అయితే వీరిలో కనీసం వంద మందికి కూడా పూర్తిస్థాయిలో పని కల్పించకపోతున్నారు. 2014-15 ఏడాదికి మండలంలో ఉపాధి హామీ పథకం కింద రూ.5.45 కోట్లతో పనులు చేపట్టాలని అంచనాలు సిద్ధం చేశారు. ఈ మేరకు ఫిబ్రవరి నుంచి కూలీలకు ఉపాధి పనులు కల్పించాల్సి ఉంది. అయితే పెళ్లకూరు, రావులపాడు, పుల్లూరు, కొత్తూరు, కానూరు, పెన్నేపల్లి, చింతపూడి, తాళ్వాయిపాడు గ్రామాల్లో పనులు చేపట్టకపోవడం విశేషం. దీంతో రెక్కాడితేగానీ డొక్కాడని పలువురు రోజువారీ కూలీలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు.
సస్పెండైన ఫీల్డ్ అసిస్టెంట్‌లకే పనుల అప్పగింత
ఉపాధి కూలీలకు పని కల్పించకుండా సొంత పనులు చేసుకుంటూ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయని పలువురు ఉపాధి సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులు ఇటీవల సస్పెండ్ చేసిన విషయం విదితమే. అయితే వారి స్థానంలో సీనియర్ మేట్లను నియమించుకుని ఉపాధి పనులు నిర్వహించాల్సిన ఇక్కడి అధికారులు అత్యుత్సాహంతో తిరిగి తొలగించిన వారికే పనులు అప్పగించారు.
దీంతో అనకవోలు, చావాలి, కానూరు, కొత్తూరు, రావులపాడు, పెళ్లకూరు, పుల్లూరు, పెన్నేపల్లి, నందిమాల, చెన్నప్పనాయుడుపేట, రోసనూరు తదితర గ్రామాల్లో పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనకవోలు రూ.20 లక్షలు, సీఎన్‌పేట రూ.13 లక్షలు, చెంబేడు రూ.59 లక్షలు, పెళ్లకూరు రూ.37 లక్షలు ఇలా అన్నీ పంచాయతీల్లో సుమారు రూ.5.45 కోట్లకు పైగా పనులు చేయాలని అంచనాలు రూపొందించారు. అయితే ఉపాధి పనులు ని ర్వహించడంలో ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆశాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కూలీలకు ఉపాది పనులు కల్పించాలని కోరుతున్నారు.
ఐదేళ్లుగా ఉపాధి పనులు చూపడం లేదు
గ్రామంలో వ్యవసాయ సీజన్ ముగియగానే పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఉపాధి క్షేత్ర సహాయకులు లేకపోవడంతో ఐదేళ్లుగా ఉపాధి పనులు లేవు. కుటుం బంలో వృద్ధులను, పిల్లలను వదిలి పనుల కోసం వలస వెళుతున్నారు.
నటరాజన్, ఉపాధి కూలి, పెళ్లకూరు
క్షేత్ర సహాయకులను నియమించాలి
పలు గ్రామాల్లో క్షేత్ర సహాయకులు లేక పనులు జరగడం లేదు. కొన్ని చోట్ల తొలగించిన వారికే పనులు అప్పగించడంతో వారు సొంత పనులకు పరిమితమయ్యారు. జిల్లా అధికారులు స్పందించి కొత్తగా సిబ్బందిని నియమించాలి.
మోహన్, కూలీ
చర్యలు చేపడుతాం :
వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు చూపని సిబ్బందిని గుర్తించి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడుతాం. సొంత పనులు, ప్రైవేట్ పరిశ్రమల్లో విధులు నిర్వహిస్తూ, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వారిని గుర్తించి తొలగించి కొత్తవారిని నియమిస్తాం.
గౌతమి, ఉపాధి పీడీ
ఉపాధి కలే
Published Fri, May 23 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement