కృష్ణగిరి మండలం పోతుగల్ గ్రామానికి చెందిన సి.సుంకన్న 2013 నవంబర్ 14న మరణించాడు. అయితే..ఇతను 2018 ఏప్రిల్ నుంచి జూన్ 6వ తేదీ మధ్య 18 రోజుల పాటు ఉపాధి హామీ పనులు చేసినట్లు మస్టర్లలో నమోదు చేశారు. జాబ్ కార్డు నంబర్ 10029పై దొంగ మస్టర్లు నమోదు చేసి.. రూ.3,415 స్వాహా చేశారు.
కల్లూరు మండలం రేమడూరు పంచాయతీకి చెందిన ఎన్.సుంకన్న 2016 నవంబరు 14న మరణించాడు. ఇతను కూడా ఉపాధి పనులకు వచ్చినట్టు మస్టరు వేయడం గమనార్హం. జాబ్‌కార్డు నంబరు 10014తో 2018 మే 10 నుంచి 22వ తేదీ మధ్య 12 రోజుల పాటు పనులు చేసినట్లు చూపి.. రూ.2,580 డ్రా చేశారు. ఇలాంటి అక్రమాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి.
కర్నూలు(అగ్రికల్చర్): గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు, ‘ఉపాధి’ సిబ్బంది కుమ్మక్కై నిధులు కొల్లగొట్టారు. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి పరిశీలిస్తే.. 2018–19లోనే అక్రమాలు ఎక్కువగా జరిగాయి. టీడీపీ నేతలు, ‘ఉపాధి’ సిబ్బంది కలిసి ఏ అవకాశాన్నీ వదలకుండా నిధులు మింగేశారు. ఎప్పుడో మరణించిన వారు కూడా పనులు చేసినట్లు మస్టర్ వేసి.. నిధులు స్వాహా చేయడం అక్రమాలకు పరాకాష్ట. చివరకు ఉపాధి సిబ్బంది సైతం తమ పేర్లతోనే మస్టర్లు వేసుకుని నిధులు డ్రా చేసుకున్నారు.కృష్ణగిరి మండలం పందిర్లపల్లికి చెందిన డి.మధుసూదన్ ఫీల్డ్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలవారీగా వేతనం చెల్లిస్తారు. అయినప్పటికీ మధుసూదన్ జాబ్ కార్డు నంబరు 40278తో 2018 ఏప్రిల్ 2 నుంచి 2019 మే 18 మధ్య 51 రోజులు పనిచేసినట్లు దొంగ మస్టర్ సృష్టించుకుని రూ.10,403 స్వాహా చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి 29 మండలాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించడంతో పాటు ఓపెన్ ఫోరంలు కూడా పూర్తి చేశారు. ఈ మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద రూ.236కోట్లు ఖర్చు పెట్టగా.. ఇందులో రూ.20.70 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చారు. ఇందులోనూ బినామీ మస్టర్లతో రూ.1.19 కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించారు. కూలీలు రెక్కలు ముక్కలు చేసుకుని పని చేసినా రోజుకు రూ.70 నుంచి రూ.80 వరకు మాత్రమే వేతనం లభిస్తుండగా.. బినామీ మస్టరు వేసిన వారి పేరుతో మాత్రం రూ.150 నుంచి రూ.175 వరకు డ్రా చేయడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి పనులను పర్యవేక్షించాలి. కానీ వారే దొంగమస్టర్లు వేసుకుని నిధులు స్వాహా చేస్తున్నారు. జిల్లాలో ఇటువంటి వారు 30 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
డోన్‌లోనే ఎక్కువ....దొంగ మస్టర్లతో నిధులు కొల్లగొట్టిన సంఘటనలు డోన్ మండలంలోనే ఎక్కువగా ఉన్నాయి. అలాగే పాత చెక్‌డ్యామ్‌లకు రంగులు కొట్టి నిధులు స్వాహా చేశారు. నాలుగు చెక్‌డ్యామ్‌లు నిర్మించి ఎనిమిదింటికి డబ్బు తీసుకున్నారు. దొంగ మస్టర్లతో ఒక్క డోన్ మండలంలోనే రూ.22.71 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించారు. అలాగే కోడుమూరు మండలంలో రూ.11.64 లక్షలు, గోనెగండ్ల మండలంలో రూ.8.38 లక్షలు స్వాహా చేశారు. దాదాపు అన్ని మండలాల్లోనూ దొంగ మస్టర్ల బాగోతం వెలుగుచూస్తోంది.
చర్యలు చేపడుతున్నాం
దొంగ మస్టర్లతో నిధులు స్వాహా చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదు. మస్టర్ల నమోదులో అక్రమాల నివారిస్తాం. ఈ–మస్టరు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. – వెంకటసుబ్బయ్య, ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ
Comments
Please login to add a commentAdd a comment