సాక్షి, విశాఖపట్నం : రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర తప్పనిసరి చేయాలని దక్షిణాది రాష్ట్రాల రైతు ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు కోరారు. వ్యవసాయం లాభసాటి కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని.. సేద్యానికి ‘ఉపాధి’ పనులను అనుసంధానం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదని, రైతాంగాన్ని ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత కేంద్రానిదేనని వారు స్పష్టంచేశారు.
2024–25 మార్కెటింగ్ సీజన్‌లో రబీ పంటలకు ధరలు నిర్ణయించేందుకు.. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశం శుక్రవారం విశాఖపట్నంలోని జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, లక్షద్వీప్‌ల నుంచి కూడా రైతులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నిపుణులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.
మద్దతు, గిట్టుబాటు ధరల మధ్య వ్యత్యాసాన్ని సరిచేయాలి : నాగిరెడ్డి
ఏపీ వ్యవసాయ మిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని వృత్తిగా నమ్ముకున్న రైతులు పంటలకు గిట్టుబాటు ధరరాక నష్టాల పాలవుతున్నారని, ఉత్పత్తి వ్యయానికనుగుణంగా కనీస మద్దతు, గిట్టుబాటు ధరల మధ్య వ్యత్యాసాన్ని సరిచేసి తగిన ధర లభించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరారు. కనీస మద్దతు ధరను తప్పనిసరి (మ్యాండేటరీ) చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా ఉన్న ఉద్యాన పంటల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటూ దేశంలో నంబర్–1గా నిలిచారన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్బీకేల ద్వారా రైతులకు అనేకరకాల సేవలందిస్తున్నామని, పంట కాలానికి సాగుకు ఉపయోగపడేలా కేంద్ర సాయం రూ.6 వేలతో కలిపి ఏటా రూ.13,500 ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు.
ఇంకా పెట్టుబడి సాయం, రైతులకు బీమా, ఉచిత పంటల బీమా వర్తింపజేస్తున్నామని, ధరల స్థిరీకరణ నిధితో పాటు విపత్తుల వేళ ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. రాయలసీమకు చెందిన రైతు వంగల సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. ఎంఎస్‌పీని తప్పనిసరి చేయాలని చాన్నాళ్లుగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొమ్ముశనగలను ప్రజాపంపిణీ వ్యవస్థలో చేర్చాలని కోరారు.
కేంద్రానికి నివేదిస్తాం..
రైతులు, రైతు ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని, పంటలకు తగిన మద్దతు ధర ఇవ్వాలని సిఫార్సు చేస్తామని సీఏసీపీ చైర్మన్ ప్రొఫెసర్ విజయపాల్‌శర్మ తెలిపారు. చిరుధాన్యాలు పండించే రైతుకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. సాధారణ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లేలా రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలని ఆయన సూచించారు.
రైతుల సంక్షేమానికి ఏపీ పెద్దపీట
మరోవైపు.. ఏపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తమిళనాడు రైతు పళని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యానశాఖ డైరెక్టర్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయడం ద్వారా కూలీల భారం తగ్గి రైతు నిలబడే వీలుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment