సాక్షి, హైదరాబాద్: ఉపాధి అవకాశాలపై కోవిడ్–19 చూపించిన ప్రతాపం అంతాఇంతా కాదు. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడింది. సంఘటితర రంగంలోని ప్రాధాన్యత కేటగిరీలు మొదలు అసంఘటిత రంగంలోని కార్మికుల వరకు అందరినీ రోడ్డున పడేసింది. తీవ్ర నష్టాలతో పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోగా.. చిన్నాచితకా సంస్థలు మూతబడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కోవిడ్–19 వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టి మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంటున్నా.. ఉపాధి అవకాశాలు మాత్రం ఆశించినంతగా పెరగడం లేదు. ప్రస్తుతం ప్రతి నలుగురు యువకుల్లో ఒకరు నిరుద్యోగిగా ఉన్నట్లు గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ పరిశీలన చెబుతోంది.
దేశవ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 30 సంవత్సరాలలోపు వయసున్న వారి ఉద్యోగ స్థితిని ఈ శాఖ పరిశీలించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఈ పరిశీలన జరిపింది. జాతీయ సగటు నిరుద్యోగిత రేటు 22.9 శాతంగా ఉందని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. తెలంగాణలో నిరుద్యోగిత రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా 24.3% ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోనే అత్యధికంగా జమ్మూ కశ్మీర్‌లో 44.1% నిరుద్యోగిత ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ (38.7%) ఉత్తరాఖండ్ (34.5%), ఒడిశా (32.5%), అసొం (32.2%) రాష్ట్రాలున్నాయి. అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ (7.7%), పశ్చిమ బెంగాల్ (14.0%), ఢిల్లీ(19.4%) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
నాలుగైదు నెలలు వేచి చూడాలి
మార్కెట్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంలో జరుగుతున్న జాప్యంతో కొత్తగా ఉపాధి అవకాశాలు పెరగలేదు. కొత్తవారికి ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండడంతో నిరుద్యోగం పెరిగినట్లు పరిశీలన చెబుతోంది. కరోనా అనంతరం ఇప్పుడిప్పుడే మార్కెట్ సాధారణ స్థితికి వస్తోంది. కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగాలంటే మరో నాలుగైదు నెలలు వేచి చూడాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మహిళలే బాధితులు
కరోనా లాక్‌డౌన్, ఆ తర్వాతి పరిస్థితులు మహిళలపై ఎక్కువ ప్రభావాన్ని చూపినట్లు పరిశీలన స్పష్టం చేస్తోంది. దేశంలో సగటు నిరుద్యోగిత రేటు 22.9 శాతంగా ఉండగా, ఇందులో పురుషుల నిరుద్యోగిత రేటు 20.9 శాతంగా, మహిళల నిరుద్యోగిత రేటు 29.5 శాతంగా ఉండటం గమనార్హం. లాక్‌డౌన్‌కు ముందు పురుషుల నిరుద్యోగిత రేటు 20.2 శాతం ఉండగా, మహిళల్లో 24.2 శాతం ఉంది. ఈ లెక్కన మహిళల్లో నిరుద్యోగిత ఏకంగా 5 శాతం పెరిగినట్లు పరిశీలన చెబుతోంది. లాక్‌డౌన్ అనంతర పరిస్థితుల ప్రభావంతో చాలా కంపెనీలు ఎక్కువగా మహిళా ఉద్యోగులను తొలగించగా.. కొత్తగా చేసిన నియామకాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కార్మిక వ్యవహారాల నిపుణులు ఒకరు సాక్షితో చెప్పారు.
ఇప్పుడిప్పుడే అవకాశాలు పెరుగుతున్నాయి
మార్కెట్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. దాదాపు అన్ని రంగాలు ఏడాదిన్నర పాటు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని తేరుకుంటున్నాయి. రెండు నెలలుగా కొత్తవారికి అవకాశాలు మొదలయ్యాయి. కోవిడ్–19 వ్యాప్తి పెరగకుండా ఉంటే వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఇప్పటికైతే సీనియర్లకు డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారిలో ఎక్కువ మంది ఇతర కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్లే ఉంటున్నారు. ఐటీ సెక్టార్‌లో ఏడాదికి పైబడి ఖాళీగా ఉన్న అనుభవజ్ఞుడికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు.
– వైదేహి రెడ్డి వడిసెల, హెచ్‌ఆర్ సీనియర్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment